Friday, September 23, 2011
అంతరిక్షం నుంచి దూసుకొస్తున్న మృత్యు శకలాలు
సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం మొత్తం ప్రపంచం వణికిపోయింది.. అంతరిక్షం నుంచి నిప్పులు కక్కుకుంటూ ఈ ప్రపంచాన్ని అగ్నిగుండంగా మర్చడానికి ఓ మృత్యుశకలం దూసుకొస్తుందని భయపడింది.. ఆ మృత్యుశకలం పేరే స్కైలాబ్.. అంతరిక్ష ప్రయోగశాల.. ప్రపంచమొత్తాన్ని అగ్నిమారుస్తుందనుకున్న ఆ అగ్నివర్షం సముద్రం లో కురిసింది.. మళ్లీ ముప్పై ఏళ్ల తరువాత అదే భయం.. ఈ రోజు ఉదయం ఆర్స్ నేలను తాకే వరకు అదే ఆందోళన.. ఏ క్షణాన ముంపు ముంచుకొస్తుందని భయం.. ఇలా భయపడాలంటే కొన్ని వేల సార్లు భయపడాలి.. ఎందుకంటే అంతరిక్షం నిండా ఉపగ్రహాలే.. ఏదో ఓరోజు ఇవన్నీ భూమిమీద రాలాల్సినవే.. అంతరిక్ష ప్రమాదాల పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ..
ఒక పక్క ఈ విశాల విశ్వంలో స్వైర విహారం చేస్తున్న గ్రహశకలాలు ఎప్పుడు భూమిని ఢీ కొంటాయోనని మానవాళి భయపడుతోంది.. అపోసిస్ లాంటి భారీ శకలం భూమిని ఢీకొని ప్రళయాన్ని సృష్టిస్తుందని వణికుతోంది.. గ్రహ శకలాల నుంచి శాస్త్రవేత్తలు విశ్వమానవులు కాపాడగలరో లేదో గానీ.. వీళ్ళే మృత్యు శకలాలను మానవుడి నెత్తి పై సిద్ధంగా ఉంచుతున్నారు. ఇప్పుడు భూమి చుట్టూ వందల సంఖ్యలో ఉపగ్రహాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఉపగ్రహాలన్నీ ఏదో ఒకరోజు కూలిపోవలసిందే.. ఆకాశం నుంచి కూలిపోయే ప్రతి ఉపగ్రహానికీ ఇలా భయపడాల్సిందేనా.. అసలీ దుస్థితి ఎందుకొచ్చింది. అంతరిక్షంలో అసలేం జరుగుతోంది.
భూమికి ఒకప్పుడు చంద్రుడు ఒక్కడే ఉపగ్రహం.. అంటే భూమి చుట్టూ తిరిగే వాటిని భూమికి ఉపగ్రహాలంటారు. కానీ ఇప్పుడు భూమికి సుమారు 8 వేల ఉపగ్రహాలు తయారయ్యాయి. 1957లో రష్యా తొలిసారిగా ఉపగ్రహాన్ని ప్రయోగించినపుడు అదో చిరకాల స్వప్న సాకారం. అప్పటి వరకు ఉపగ్రహం అనేది ఒక కాల్పనిక సాంకేతిక పరిజ్ఞానం. అది సాధ్యమయ్యేదా అని నిరాశ చెందిన శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. కానీ మారుతున్న కాలాన్ని బట్టి... పెరిగిన సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి ఉపగ్రహమనేది ఇప్పుడొక చిన్న విషయంగా మారింది.. ట్రైనింగ్ లో ఉన్న యువ శాస్త్రవేత్తలు కూడా అవలీలగా ఉపగ్రహాలను తయారు చేసేంత స్థాయికి ఎదిగారు... కాని వచ్చిన చిక్కాల్లా అంతరిక్షంలో ప్రయోగించిన ఉపగ్రహాలు కాలం చెల్లాక అలాగే వదిలేస్తున్నారు. దీంతో అంతరిక్షం చెత్తబుట్టలా మారింది.. మరికొన్ని ఉపగ్రహాలు.. భూమ్యాకర్షణకులోనై భూమి వైపు దూపుకొస్తున్నాయి. ఈ శకలాలు కొన్ని భూ వాతావరణంలో చేరీ చేరకముందే భూ వాతావరణ ఘర్షణకు లోనై మాడిమసవుతాయి. వేగంగా దూసుకొచ్చే ఆ శకలాలు కొన్ని మండుకుంటూ భూమి ఉపరితలాన్ని తాకుతాయి. అప్పుడే పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఈ ముప్పు శాస్త్రవేత్తలకు తెలిసిందే అయినా.. పట్టీ పట్టనట్టు ఉంటున్నారు. ప్రపంచదేశాలన్నిటి నడుమ అవగాహన లేకపోవడం వల్ల ఈ నిర్లక్ష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది.
ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి ప్రతిదేశం ఆసక్తి చూపుతుండటంతో అంతరిక్షంలో తిరగాడే మానవ నిర్మిత వస్తువుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. నిర్ణీత కాలవ్యవధిదాకా పనిచేసి ఆ తరువాత మూలనపడ్డ శాటిలైట్స్, వాటి శకలాలు కూడా అంతరిక్షంలో తిరగుతూనే ఉన్నాయి. ఇలాంటివి సుమారు ఎనిమిదివేలదాకా ఉంటాయని అంచనా. ఇవి కాకుండా రాకెట్ ముక్కలు, స్పెష్ మిషెన్ లోని భాగాలు కూడా సొంత కక్ష్యల్లో తిరగుతున్నాయి. వీటిలో కొన్ని టన్నులకొద్దీ బరువున్నవి కాగా, మరికొన్ని కేవలం పది పౌండ్లు బరువున్నయి కూడా ఉన్నాయి. అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న వస్తువుల్లో కేవలం ఏడు శాతం మాత్రమే సాంకేతికంగా ఉపయోగపడుతున్నాయి.. మిగతావన్నీ అంతరిక్ష శిథిలాలే. వీటి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతుండటంతోనే సమస్య వచ్చిపడింది. 1957 నుంచి ఇప్పటివరకు 4,600ల ఉపగ్రహ ప్రయోగాలు జరిగాయి. మన భూమి చుట్టూ సుమారు ఎనిమిది వేల కృత్రిమ ఉపగ్రహాలు సంచరిస్తున్నాయి. వీటి సంఖ్య రాబోయే కాలంలో మరింత పెరగుతాయి.
అంతరిక్ష చెత్తలో 22 శాతం కాలం చెల్లిన ఉపగ్రహాల వల్ల ఏర్పడిందే. ఇది ఇంకా పెరిగితే ఉపగ్రహాలు ప్రమాదాల బారిన పడటం ఖాయం. రోడ్డు ప్రమాదలంత కామన్ గా అంతరిక్ష ప్రమాదాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. స్పేస్ ఆర్బిట్ లోకి ఉపగ్రహాన్ని పంపి సంబరపడిపోయే రోజులకు స్వస్తి పలకాలి. అంతరిక్షంలో పని లేకుండా తిరగే వేలాది శకలాల నుంచి ఉపగ్రహాలను రక్షించుకోవడం ఇప్పుడో పెద్ద సమస్య. అందుకే, సంపన్నదేశాలు... అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్తను తొలగించేపనిలో పడ్డాయి. అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్తను తొలగించడంకోసం ఇప్పటికే అనేక మార్గాలను అన్వేషించారు. అయితే పూర్తిగా తొలగించడం మాత్రం ఒక పెద్ద సవాలే. అంతరిక్షంలో శకలాల సంఖ్య పెరిగిపోతుంటే, రాబోయేది గడ్డుకాలమే. అంతరిక్షంలో తిరగాడే చెత్త పదార్ధాలను ముందుగా గుర్తించి వాటిని భూ వాతావరణంలోకి చేర్చి కాల్చేయాలి. కానీ అది అంత సులువైన పనికాదు. భారీ శకలాల నుంచి చిన్నాచితకా డెబ్రీస్ వేలాదిగా భూమిచుట్టూ తిరగుతున్నాయి. పైగా `స్పేస్ జంక్' ని తొలగించాలంటే అన్ని దేశాల మధ్య అవగాహన ఉండాలి. కలిసికట్టుగా కార్యక్రమం చేపట్టగలగాలి. గ్లోబల్ వార్మింగ్ విషయంలోనే అంటీముట్టనట్టున్న దేశాలు అంతరిక్ష చెత్త గురించి పట్టించుకుంటాయని ఆశించడం అత్యాశే అయినా అవసరమైన ఆశ.
ఉపగ్రహాలే అంతరిక్ష చెత్తగా మరాయానుకుంటే పొరపాటు. వ్యోమగాములు అంతరిక్షంలోకి చేరాక ఏ చిన్న వస్తువుని బయటకు విసిరేసినా అది స్పేస్ క్రాఫ్ట్ ను వెంటాడి వస్తుంది. అదే వస్తువును బలమైన శక్తితో విసిరితే ఆ వస్తువు వేరే కక్ష్య ను ఏర్పాటుచేసుకుని మళ్ళీ ఎక్కడోఓచోట అడ్డం తగులుతుంది. లేదా అలా విసిరివేయబడిన వస్తువు మరో శాటిలైట్ ని ఢీకొనే ప్రమాదమూలేకపోలేదు. అంటే స్పేస్ ట్రావెల్ అంత తేలిక కాదన్నమాట. ఏప్పుడో ఒకప్పుడు ఏ క్షణంలోనైనా వ్యర్ధ శకలాలు ఎదురుకావచ్చు. అవి స్పేస్ క్రాఫ్ట్ ని ఢీకొనక తప్పదు. 1996లో ఫ్రెంచ్ గూఢచారి ఉపగ్రహాన్ని సూట్ కేసంత సైజున్న ఓ శకలం ఢీకొంది. దీంతో ఆ ఉపగ్రహం దెబ్బతిన్నది. ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో అత్యంత సామాన్యమైనవిగా మారిపోతాయన్నదే ఇప్పుడు శాస్త్రవేత్తలందర్నీ పీడిస్తున్న భయం.
చాలాకాలం నుంచి వేలాదిగా అంతరిక్షనౌకలను ప్రయోగించారు. వాటిలో చాలా మటుకు పనిపూర్తయ్యాక విచ్ఛిన్నమయ్యాయి. అయితే వాటిలో కొన్ని భాగాలు ఇప్పటికీ స్పేస్ ఆర్బిట్స్ లో తిరగుతూనేఉన్నాయి. ఇలాంటి శకలాలను భూమికి మరింత దూరంగా నెట్టివేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. అయితే ఇందుకు అయ్యే ఖర్చును ఎవరు భరిస్తారన్నది అసలు ప్రశ్న. లేజర్ కిరణాలను ఉపయోగించడం ద్వారా కూడా అంతరిక్షంలోని చెత్తను తొలగించవచ్చని అంటున్నారు. కోట్లాది డాలర్లు ఖర్చుచేసి నిర్ణీతకక్ష్యలోకి పంపినా వాటి ఆయుష్షు ఎంతకాలమో శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. 2009 ఫిబ్రవరి నెలలో ఎవ్వరూ ఊహించని విధంగా అమెరికా, రష్యాదేశాలకు చెందిన ఉపగ్రహాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం కారణంగా అంతరిక్షంలో శకలాలు భారీగా వెదజల్లబడ్డాయి. వాటిలో చాలామటుకు సొంత కక్ష్యల్లో తిరగుతున్నాయి.
అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాలు భూమ్యాకర్షణ శక్తి పరిధిలోకి ఎలా వస్తాయి. గతంలో 30 సంవత్సరాలకు ముందు ప్రపంచ ప్రజానీకాన్ని స్కైలాబ్ ఎందుకంత భయపెట్టింది. ఎక్కడో అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలు మానవమనుగడకు ముప్పు తేవడం వెనక కారణాలేంటి.. వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే. గతంలో స్కైలాబ్ ప్రయోగం గురించి తెలుసుకోవాల్సిందే..
అవి సాంకేతిక వ్యవస్థను కొత్తగా కొత్తగా వాడుకుంటున్న రోజలు. అంతరిక్ష ప్రయోగం చేయడమంటే కత్తి మీద సాములాంటిది. అయినా శాస్త్రవేత్తలు ధైర్యం చేశారు. వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షానికి పంపారు. కానీ ఆ ఉపగ్రహంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అంతే ఉపగ్రహం వచ్చిన దారి తిరిగి మళ్లింది. అంటే తిరిగి భూమి మీద కూలడానికి సిద్ధమయింది. అది ఎక్కడ ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. కానీ గండం తప్పింది. స్కైలాబ్ సముద్రంలో కూలడంతో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు.
అంతరిక్ష విజ్ఞానానికి బలమైన పునాదులు పడుతున్న రోజులవి.. అప్పుడప్పుడే ఉపగ్రహ వ్యవస్థ ఊపందుకుంటోంది.. సూర్యుడి పై విశేశాలు, వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి 1979లో అంతరిక్ష ప్రయోగ శాలను ఏర్పాటు చేశారు. దాని పేరే స్కైలాబ్. ఈ స్కైలాబ్ ప్రయోగం వికటించింది.. సాంకేతిక సమస్యలు రావడంతో మళ్లీ భూమి పరిధిలోకి బయలు దేరింది.. శాస్త్రవేత్తలకు ఏంచేయాలో అర్ధంకాలేదు. ఒకపక్క కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన ప్రయోగం విఫలమయిందే బాధ.. మరో పక్క ఆ స్కైలాబ్ చేయబోయే వినాశ ఎలా తప్పించాలనే ఆలోచన. ఈ వార్త ప్రసార సాధనాల ద్వారా ప్రపంచం మొత్తాన్ని చేరింది. . స్కైలాబ్ భూమిని తాకితే మహోత్సాతం తప్పదని ప్రజలంతా నిద్రలేని రాత్రులు గడిపారు. కొందరైతే ఇవే ఆఖరు గడియలని చేయాల్సిన ఎంజాయ్ చేశారు. ప్రపంచం తుడిచి పెట్టుకు పోతున్నంత హడావుడి చేశారు. కానీ గండం గడిచింది.. స్కైలాబ్ వైపు మళ్లి.. సముద్రంలో కూలడంతో పెను ప్రమాదం తప్పింది.. ప్రమాదం తప్పడంతో శాస్త్రవేత్తలంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. అంతేకాదు కొందరు తమ పిల్లలకు స్కైలాబ్ అని పేర్లు పెట్టుకున్నారంటే. స్కైలాబ్ ప్రపంచ పౌరుల పై ఎంత ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటీకీ ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ప్రాంతాలలో స్కైలాబ్ లున్నారు.
చరిత్ర పునరావృతం అయింది.. శాస్త్రవేత్తల నిర్లక్షమో... సమస్య వచ్చినప్పుడు చూద్దాంలే అన్న దాటవేత దోరణి వల్ల.. మళ్లీ ముప్పై ఏళ్ల తరువాత అట్లాంటి ప్రమాదమే ప్రపంచాన్ని వణికించింది. స్కైలాబ్ ను గుర్తుకు తెచ్చింది. అయితే పెరిగిన సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం.. ఇప్పటికే చాలా టి.వి ఛానళ్లు ప్రపంచం తుడిచి పెట్టుకుపోతుందనే కట్టుకథలు నిత్యం ప్రసారం చేయడం.. అవేవీ జరగక పోవడం వల్ల ప్రజలు ఇదీ కూడా అట్లాంటి ఊహాజనిత ప్రమాదం గానే పరిగణించారు. అమెరికా, యూరప్ లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల ప్రజలు కాస్త ఆందోళన పడుడ్డా.. భారత్ దాని పరిధిలో ఉన్న ప్రజలు కనీసం దీని గురించి ఆలోచించడానికి కూడా సాహసించ లేదు.
ఆర్స్ ఉపగ్రహం ఎందుకు భూమి వైపు దూసుకొచ్చింది. అంతరిక్షంలో ఉన్న ప్రతీ గ్రహం ఏదో ఒకరోజు భూమి పరిధిలోకి రావలసిందేనా.. అలా అయితే చెత్త బుట్టలా మారిన అంతరిక్షం భూమి పై తన పగ తీర్చుకోబోతోందా.. ఇంతకీ ఇప్పుడు భూమిని తాకి ఆర్స్ ఉపగ్రహం ఎప్పటిది.. ఈ ఉపగ్రహం భూమి పై ఇంత హల్‌చల్ చేసే వరకు శాస్త్రవేత్తలేం చేస్తున్నారు.
నిప్పులు చిమ్ముతూ ఆర్స్ ఉపగ్రహం భూగోళం పై పేలిపోయింది.. 1991లో ప్రయోగించిన ఈ ఉపగ్రహం ఓజోన్ పొర అధ‌్యయనం కోసం ప్రయోగించారు. ఈ ఉపగ్రహం ఆరేళ్ళ క్రితమే అంతరిక్ష వ్యర్ధాల జాబితాలో చేరిపోయింది. మూడేళ్ల అవరసరాల కోసం అంతరిక్షంలోకి పంపిస యుఏఎస్ఆర్‌ను అగ్రరాజ్యం 15 ఏళ్లపాటు వినియోగించింది. ఇప్పుడది అదుపు తప్పి భూ వాతావరణం వైపుకు పయనిస్తోంది. ఆరున్నర టన్నుల బరువైన శాటిలైట్ శకలాల్లో చాలా వరకు.... భూ వాతావరణంలో ప్రవేశించగానే దగ్దమైపోతాయి ...మిగిలిన కొద్ది పాటి శకలాలు అంటే.. 532కిలోల బరువున్న ఉపగ్రహ శకలాలు భూగోళాన్ని ఢీకొన్నాయి.
ఈ సంఘటన నుంచి శాస్త్రవేత్తలు పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతరిక్షంలో భారీగా పేరుకు పోతున్న ఉపగ్రహాలను కాలం చెల్లగానే కాల్చేయాలి. లేజర్ కిరణాలతోనో.. లేదా ఇతర ఇంధనాలతోనే వీటని అంతరిక్షంలోనే మసి చేయాలి. వీటితో బాటు వ్యోమగాములు అంతరిక్షంలో వ్యర్ధ పదార్ధాలను విసరకూడదనే నియమం విధిగా పాటించాలి.
ఇక నుంచి ఏ ఉపగ్రహం,.. మానవాళికి విపత్తు కలిగించకుండా ఉండాలని క ోరుకుందాం.. అంతేకాదు అంతరిక్షం నుంచి మానవ ప్రయోగ వస్తువులేవీ భూమి పైకి దూసుకురావని ఆశిద్దాం.. భవిష్యత్తులోనైనా మన ప్రపంచ శాస్త్రవేత్తలు ఉపగ్రహాలను ప్రయోగించి వదిలేయకుండా.. చెత్త బుట్టలో ఉన్న ఉపగ్రహాలను అంతరిక్షలోనే బూడిద చేస్తారని ఆశిద్దాం..
Subscribe to:
Post Comments (Atom)
good and informative.
ReplyDeleteథాక్యూ............
ReplyDeletemeeru chipenthi nijaame nenumeetho matladoocha
ReplyDeletechaala bhaga chepaaru
ReplyDelete