ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, September 17, 2011

'ఆ చల్లని సముద్రగర్భం/దాచినబడబానల మెంతో?

జనం పిలుపులోని ఈ ''అభ్యుదయగీతం'' 1977 ముద్రణలో ప్రచురించబడిన ఖండికలలో కొంత మార్పులతో పాడుకోవడం జరుగుతున్నది. 1977 ముద్రణకు జనం పాడుకోవడానికి గల భేదము క్రింది విధంగా వుంది: 1977 ముద్రణలోని తొలి ఖండిక పల్లవిగా పాడుతున్నప్పటికి తొలి ఖండికలోని ''ఆ చల్లని... బడబానల మెంతో?'' యథాతథంగా పాడుతూ ''ఆ నల్లని.... భానువులెందరో?''లోని ''భానువులెందరో?''కు బదులుగా ''భాస్కరు లెందరో?'' అని పాడు కోవడం కనిపిస్తుంది.రెండవ ఖండికలో ''భూగోళం... కూలిన సురగోళాలెన్నో?''లోని ''కూలిన''కు బదులుగా ''రాలిన'' అని మార్చిపాడుతూ, ఇక ''ఈ మానవ... పరిణామాలెన్నో?'' యథాతథంగా పాడుకోవడం కనిపిస్తున్నది.
డాక్టర్‌ దాశరథి కృష్ణమాచార్యులు ''అగ్నిధార'' మలిముద్రణ (1963)లో ''పురాస్మృతులు'' పేరుతో రాయబడిన కృతజ్ఞతా వాక్కులలో ''నా అచ్చైన పుస్తకాలలో మొట్టమొదటిది అగ్నిధార సాహితీమేఖల 1949లో అచ్చైంది'' (దాశరథి కవిత 1.11.1977 ముద్రణలో పురాస్మృతులు, 1వ పేజీ) అని చెప్పుకొన్నారు. అయితే నేడు తొలి ముద్రణ అగ్నిధార ప్రతి లభించడం లేదు. కాని-
1954 జూలై 19 ''కృష్ణాపత్రిక'' సంచిక (10 వ పేజీ)లో పరిచయం శీర్షిక కింద ''మన తెలంగాణా కవిమిత్రులు-దాశరథి'' అనే వ్యాసంలో బి. రామరాజుగారు ''దాశరథి ప్రతి రచనా సజీవమైనది. అతని కఠిన ముఖాంతరమున విశాల నీరదానీకము వచ్చి దాగి దయనీయముగా విలపించగా అసంఖ్యాకముగా ఖటికాలు తస్ఫుట పద్య జాలములు వాకలు వాకలై గుండెలు పొంగిపోవగా అలుగులు వారును. అట్టి అలుగును బంధించి తెచ్చి మీకు చూపించడానికి నాకు శక్తి చాలుతుందా? ఈ పృచ్ఛాగీతం చూడండి'' అంటూ ఈ కింది పృచ్ఛాగీతాన్ని ఉటంకించారు:
''ఆ చల్లని సముద్రగర్భం దాచిన/ బడబానలమెంతో?/ ఆ నల్లని ఆకాశంలో కానరాని/భానువు లెందరో?/ భూగోళం పుట్టుకకోసం కూలిన/ సురగోళా లెన్నో?/ నరమానవ రూపంకోసం జరిగిన/ పరిణామాలెన్నో?/ ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన/నరకంఠాలెన్నో?/ శ్రమజీవుల పచ్చినెత్తురులు త్రాగని/ ధనవంతులెందరో?/ అణగారిన అగ్నిపర్వతం కనిపెంచిన/ ''లావా'' ఎంతో?/ ఆకలితో చచ్చేపేదల శోకంలో/ కోపం ఎంతో?/ పసిపాపల నిదుర కనులలో ముసిరిన/ భ'వితవ్యం ఎంతో?
గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని/ కావ్యాలెన్నో?''
ఈ పృచ్ఛాగీతం పై రూపంలో (లైన్స్‌తో సహా) ఉటంకించబడింది. (మలిముద్రణ అలభ్యం).
అయితే, దాశరథిగారి ''దాశరథి కవిత'' ముద్రణ (1.11.1977)లో పేరు పెట్టుబడని ఓ గీతం (102, 103 పేజీలలో.) దానికి పేరుకు బదులుగా ప్రశ్నార్థకం (?) ఉన్నది. ఆ గీతం పైనచూపినట్లు రెండు రెండు పాదాలుగా కాక నాలుగు పాదాలుగల ఖండికలుగా ఈ క్రింది రూపంలో వుంది:
1. ''ఆ చల్లని సముద్ర గర్భం/దాచిన బడబానలమెంతో?
ఆ నల్లని ఆకాశంలో/కానరాని భానువులెందరో?
2. భూగోళం పుట్టుక కోసం/ కూలిన సురగోళాలెన్నో?
ఈ మానవ రూపంకోసం/ జరిగిన పరిణామాలెన్నో?
3. ఒక రాజును గెలిపించుటలో/ఒరిగిన నరకంరవాలెన్నో?
శ్రమజీవుల పచ్చినెత్తురులు/త్రాగని ధనవంతులెందరో?
4. అన్నార్తులు అనాధలుండని/ఆ నవయుగ మదెంత దూరమో?
కరవంటు కాటకమంటూ/కనిపించని కాలాలెప్పుడో?
5. అణగారిన అగ్నిపర్వతం/కనిపించిన ''లావా'' ఎంతో?
ఆకలితో చచ్చే పేదలు/శోకంలో కోపం ఎంతో?
6. పసిపాపల నిదుర కనులలో/ముసిరిన భవితవ్యం ఎంతో?
గాయపడిన కవి గుండెల్లో/రాయబడిన కావ్యాలెన్నో?
7. కులమతముల సుడిగుండాలకు/బలికాని పవిత్రులెందరో?
భారతావని బల పరాక్రమం/చెర వీడేదింకెన్నాళ్ళకో?''
అను ఈ ఏడు ఖండికలు వున్నాయి. అయితే, బి. రామరాజుగారు ఉటంకించిన గీతంలో కంటే ''దాశరథి కవిత'' (1977) ముద్రణలో ఎక్కువ ఖండికలు వున్నాయి. అవి 1977 ముద్రణలోని నాలుగవ ఖండిక ''అన్నార్తులు... మదెంత దూరమో/కరవంటూ.... కాలాలెప్పుడో?'' అలాగే ఏడవ ఖండిక ''కులమతముల... పవిత్రు లెందరో?/భారతావని... దింకెన్నా ళ్ళకో?'' పూర్తిగా నూతనమైనవి. ఈ నాలుగు పాదాలుగల రెండు ఖండికలు తొలి, మలి ముద్రణలో ఉండి ఉండకపోవచ్చు. తొలి ముద్రణలో ఉండివుంటే బి. రామరాజుగారు వదిలి వుండేవారు కాకపోవచ్చు. అయితే, మరో అనుమానం కూడా కలుగవచ్చు. అదేమిటంటే, ఈ పేరులేని గీతం తొలి ముద్రణలో ఉండి ఉండకపోవచ్చునేమో అని. కాని, అలాంటి అవకాశం లేనేలేదు. ఎందుకంటే, దాశరథిగారు మలిముద్రణలో ''పురాస్మృతులు''లో ''ఈ అగ్నిధారలో అన్ని ఖండికలు చాలావరకు నా జైలు జీవితంలోను, జైలునుంచి వెలువడిన కొత్తలోను రాసినవి'' అని చెప్పివున్నారు. దాశరథిగారిని 1948లో వరంగల్‌ జైలు నుండి నిజామాబాద్‌ జైలులోకి మార్చారు. తరువాత హైదరాబాద్‌ (చంచల్గూడా) జైలుకి మార్చారు. అయితే, అగ్నిధార 1949/ఆగస్టు నెలలో ముద్రించారు. పైవిషయాలనుబట్టి ''పృచ్ఛాగీతం'' (?) జైలులో వుండగానో, జైలు నుండి విడుదలైన తరువాతనో వ్రాయబడి తొలి ముద్రణలో చేరివున్నట్లుగానే చెప్పవచ్చును. ఇక ఖండికలోని మార్పులు పరిశీలించినట్లయితే, బి. రామరాజుగారి వ్యాసంలో ''నరమానవ రూపం... పరిణామాలెన్నో?'' అన్న ఖండిక ఉటంకించగా, 1977 ముద్రణ రెండవ ఖండికలో ''ఈ మానవ రూపం... పరిణామాలెన్నో?'' అని వుంది. నాలుగవ ఖండికగా-
''అన్నార్తులు అనాధలుండని/ఆ నవయుగ మదెంత దూరమో? కరవంటు కాటకమంటూ/కనుపించని కాలాలెప్పుడో?''ను చేర్చడం కనిపిస్తున్నది. అంతేకాక, ఏడవ ఖండికగా-
''కులమతముల సుడిగుండాలకు/బలిగాని పవిత్రులెందరో?
భారతావని బలపరాక్రమం/చెర వీడేదింకెన్నాళ్ళకో?''ను కూడా కొత్తగా చేర్చినట్లు విశదమవుతుంది. అయితే, పై విషయాల మార్పులనుబట్టి తొలిముద్రణలోని పృచ్ఛాగీతం (?) మార్చబడి ఉండవచ్చును. (సరిపోల్చడానికి, తొలి- మలి ముద్రణ ''అగ్నిధార'' ప్రతులు అలభ్యం.) ఈ పృచ్ఛాగీతం (?) జనవ్యవహారంలో ''అభ్యుదయగీతం'' పేరుతో (ఏడు ఖండికలు) పిలవబడుచున్నది. జనం నాలుకలపై, గాయకుల గొంతులలో ఓలలాడుతున్నది. అయితే, ఈ ఏడు ఖండికలలో తొలి ఖండికను పల్లవిగాను, మిగతా ఆరు ఖండికలను చరణాలుగాను పాడుకోవడం జరుగుతున్నది.
జనం పిలుపులోని ఈ ''అభ్యుదయగీతం'' 1977 ముద్రణలో ప్రచురించబడిన ఖండికలలో కొంత మార్పులతో పాడుకోవడం జరుగుతున్నది. 1977 ముద్రణకు జనం పాడుకోవడానికి గల భేదము క్రింది విధంగా వుంది: 1977 ముద్రణలోని తొలి ఖండిక పల్లవిగా పాడుతున్నప్పటికి తొలి ఖండికలోని ''ఆ చల్లని... బడబానల మెంతో?'' యథాతథంగా పాడుతూ ''ఆ నల్లని.... భానువులెందరో?''లోని ''భానువులెందరో?''కు బదులుగా ''భాస్కరు లెందరో?'' అని పాడు కోవడం కనిపిస్తుంది.
రెండవ ఖండికలో ''భూగోళం... కూలిన సురగోళాలెన్నో?''లోని ''కూలిన''కు బదులుగా ''రాలిన'' అని మార్చిపాడుతూ, ఇక ''ఈ మానవ... పరిణామాలెన్నో?'' యథాతథంగా పాడుకోవడం కనిపిస్తున్నది.
మూడవ ఖండికలో ''ఒక రాజును.. కంఠాలెన్నో?''ను యథాతథంగా పాడుతూ, ''శ్రమజీవుల పచ్చినెత్తురులు త్రాగని ధనవంతులెందరో?''ను పూర్తిగా పరిహరించి, 1977 ముద్రణలోని ఏడవ ఖండికలోని తొలి రెండు పాదాలైన ''కులమతముల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో?''ను స్వీకరించారు. అంతేకాక, 1977 ముద్రణలోని ఏడవ ఖండికలోని చివరి రెండు పాదాలైన ''భారతావని బలపరాక్రమం చెరవీడేదింకెన్నాళ్ళకో?''ను గీతం నుండి పూర్తిగా పరిహరించారు.
నాలుగవ ఖండికగా 1977 ముద్రణలోని నాలుగవ ఖండికను పరిహరించి, జనవ్యవహారంలో నాలుగవ ఖండికగా-
''మానవ కళ్యాణం కోసం/ పణం ఒడ్డిన రక్తం ఎంతో?/ రణరక్కసి కరాళనృత్యం/ రాల్చిన పసి ప్రాణాలెన్నో?''/ అను కొత్త ఖండికను పాడుకోవడం కనిపిస్తుంది./ అయిదవ ఖండికగా 1977 ముద్రణలోని ఐదవ ఖండికను పూర్తిగా గీతం నుండి పరిహరించి, ఈ కింది ఖండిక పాడబడుచున్నది:/''కడుపు కోతతో అల్లాడిన/కన్నులలో విషాదమెంతో?/ఉన్మాదుల ఆకృత్యాలకు / దగ్ధమైన బ్రతుకులు ఎన్నో?''
అను ఈ నూతన ఖండికను స్వీకరించారు. అయితే, నాలుగవ, ఐదవ ఖండికలను ఎవరు ఎప్పుడు చేర్చారో ఇదమిద్ధంగా ఆధారాలు లభించడంలేదు. (అయితే, 1998-99లో వరంగల్‌ ఆర్‌ఇసిలో రామాయణంపై సదస్సు జరిగిన సందర్భంగా దాశరథి రంగాచార్యుల వారిని ''పృచ్ఛాగీతంలో (జనవ్యవహారంలో అభ్యుదయగీతం) చేర్చబడిన నూతన ఖండికలను దాశరథి కృష్ణమాచారిగారే 1977 ముద్రణ తరువాత చేర్చారా?'' అని అడుగ్గా, ''చేర్చివుండవచ్చును, గుర్తులేదు'' అన్నారు.)
ఆరవ ఖండికగా 1977 ముద్రణలోని ఆరవ ఖండిక పరిహరించబడి, 1977 ముద్రణలోని నాలుగవ ఖండిక పాడుకొనబడుచున్నది. వరగా ఏడవ ఖండిక. 1977 లోని ఏడవ ఖండికలోని తొలి రెండు పాదాలు, మూడవ ఖండికలో చివరి రెండు పాదాలుగా కనిపిస్తాయి. కాని, 7 వ ఖండికలోని చివరి రెండు పాదాలు మాత్రం గతం నుండి పరిహరించబడినవి. ఇక 7 వ ఖండికగా 1977 ముద్రణలోని 6 వ ఖండిక పాడుకొనబడుచున్నాయి.
పైన చెప్పుకొన్నటువంటి మార్పుల చేర్పులతో వున్న పృచ్ఛాగీతం. అగ్నిధార తొలి ముద్రణ అనంతరం 'కృష్ణాపత్రిక'లో పరిచయం శీర్షిక కింద ''మన తెలంగాణా కవిమిత్రులు - దాశరథి'' పేర బి. రామరాజుగారి వ్యాసంలో పది పాదాలుగాను, 1977వ ముద్రణలో ఏడు ఖండికలుగాను అగుపిస్తున్నది. అయితే, మలి ముద్రణలోని గీతమే 1.11.1977లో ముద్రితమైన ''దాశరథి కవిత''లో యధాతథంగా ముద్రితమైవుండవచ్చు. అందులో అగుపిస్తున్న ఏడు ఖండికలు జన వ్యవహారంలో కూడా ఏడు ఖండికలుగానే వున్నప్పటికీ మార్పుల అనంతరం ఈ పృచ్ఛాగీతం కింది రూపాన్ని సంతరించుకొన్నది:
1. ''ఆ చల్లని సముద్రగర్భం/దాచినబడబానల మెంతో?
ఆ నల్లని ఆకాశంలో/కానరాని భాస్కరులెందరో?
2. భూగోళం పుటుyక కోసం/రాలిన సురగోళాలెన్నో?
ఈ మానవ రూపంకోసం/జరిగిన పరిణామాలెన్నో?
3. ఒక రాజును గెలిపించుటలో/ఒరిగిన నరకంఠాలెన్నో?
కులమతాల సుడిగుండాలకు/బలికాని పవిత్రులెందరో?
4. మానవ కళ్యాణం కోసం/పణం ఒడ్డిన రక్తం ఎంతో?
రణరక్కసి కరాళనృత్యం/రాల్చిన పసిప్రాణాలెన్నో?
5. కడుపుకోతతో అల్లాడిన/కన్నులలో విషాదమెంతో?
ఉన్మాదుల అకృత్యాలకు/దగ్ధమైన బ్రతుకులు ఎన్నో?
6. అన్నార్తులు అనాధలుండని/ఆ నవయుగమదెంత దూరమో?
కరవంటు కాటకమంటూ/కనిపించని కాలాలెపుడో?
7. పసిపాపల నిదుర కన్నులలో/ముసిరిన భవితవ్యం ఎంతో?
గాయపడిన కవి గుండెలలో/వ్రాయబడని కావ్యాలెన్నో?''
ఈ విధంగా జనంతో మమేకమైన ఈ గీతాన్ని సినీనటుడు, దర్శకుడు అయిన భానుచందర్‌గారు ''కామ్రేడ్‌'' అనే సినిమాలో (1995-96), జె.వి రాఘవులుగారి సంగీత సారథ్యంలో ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం గారిచే పాడించి, సెల్యూలాయిడ్‌ పైకి తీసుకొచ్చారు.
ఈ విధంగా సినిమాలోకి స్వీకరించబడిన ఈ గీతం జన వ్యవహారంలోని నాలుగవ ఖండికలో ''మానవ కళ్యాణం కోసం/పణం ఒడ్డిన రక్తం ఎంతో?''లోని ''పణం ఒడ్డిన''కు బదులుగా సినిమా పాటలోని రెండవ చరణంలో ''పణమొడ్డిన'' అని మార్చటం జరిగింది. అదే విధంగా జన వ్యవహారంలోని చివరి ఖండికలోని ''గాయపడిన కవి గుండెల్లో/వ్రాయబడని కావ్యాలెన్నో?'' లోని ''వ్రాయబడని''కి బదులుగా ''వ్రాయబడిన'' అన్న సవరణ కనిపిస్తుంది
దాశరథి కవి సంకలనంలో వచ్చి, జనం గుండెల్లో మారుమ్రోగుతూ, తదనంతరం సినిమారంగం చేత ఆకర్షించబడి, అక్కడా తన సత్తా నిరూపించుకొని నిలబడి ఎన్నో వసంతాలు పూర్తి చేసుకొని ఇప్పటికీ నేనున్నానంటున్న ఈ గీతం బి. రామరాజు గారన్నట్లు నాడు ''పృచ్ఛాగీతం'', నేడు ''అభ్యుదయగీతం.'' అయితే, శ్రీమతి విజయభారతిగారు వెలుగు పాటల సంకలనంలో ఐదవ ఖండికలో మూడవ పాదం ''ఉన్మాదుల అకృత్యాలకు'' పరిహరించి, కొత్తగా ''ధనవంతుల దుర్మార్గాలకు''అని కొత్త పాదం స్వీకరించడం కనిపిస్తున్నది. ఇంకా ఎన్ని మార్పులకు నోచుకోనుందో?

No comments:

Post a Comment