ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, September 7, 2011

హర్కత్ ఉల్ జీహాద్ అల్ ఇస్లామీ... (హుజీ) రక్త చరిత్ర



పట్టపగలు ఢిల్లీ హైకోర్టు వద్ద కారు బాంబును పేల్చింది తమ సంస్థ సభ్యులేనని హర్కత్‌ ఉల్‌ జిహాద్‌ అల్‌ ఇస్లామీ (హుజీ) సంస్థ దేశంలోని పత్రికలు, న్యూస్‌ చానల్స్‌ కార్యాలయాలకు ఫ్యాక్స్‌లో పంపిన లేఖలో ప్రకటించింది.పాకిస్తాన్‌ కి చెందిన ఈ సంస్థ సభ్యులు బంగ్లాదేశ్‌ ద్వారా మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సంస్థకు మన దేశంలోని అన్ని నగరాల్లో స్లీపర్‌ సెల్స్‌ ఉన్నాయి. స్థానికులు ఇచ్చే ఆశ్రయం, అందించే సహాయ సహకారాలోతేనే ఈ సంస్థ తన కార్యకలాపాలను నిరాటంకంగా సాగిస్తోంది. హుజీ ఎప్పుడు పుట్టిందో ఖచ్చితమైన సమాచారం ఏదీ లేకపోయినప్పటికీ, సోవియట్‌ ఆఫ్ఘన్‌ యుద్ధ సమయంలో ఈ సంస్థ ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థకు ఖ్వాజీ సైఫుల్లా అఖ్తర్‌, ఆయన అనుచరులు మౌలానా ఇర్షాద్‌ అహ్మద్‌,మౌలానా అబ్దుస్‌ సమద్‌ సియాల్‌లు పునాదులు వేశారు.వీరంతా పాక్‌లోని కరాచీకి చెందిన వారు. అప్పట్లో ఈ సంస్థను జామియాత్‌ అన్సరుల్‌ ఆఫ్ఘనీన్‌ అనే పేరుతో పిలిచేవారు. ఆఫ్ఘన్‌ యుద్ధానంతరం అది హుజీగా పేరు మార్చుకుంది.భారత్‌లోని జమ్ము కాశ్మీర్‌ లోని ముస్లింలు జరిపే పవిత్ర యుద్ధానికి (జిహాద్‌కి) మద్దతు ఇవ్వడం ప్రధాన లక్ష్యంగా ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
1989లో ఆఫ్ఘన్‌ నుంచి సోవియట్‌ దళాలు ఉపసంహరణ తరువాత పాకిస్తాన్‌కే చెందిన మరో ఉగ్రవాద సంస్థ హర్కత్‌ ఉల్‌ ముజాహిద్దీన్‌తో కలిసి కార్యకలాపాలను ముమ్మరం చేసింది. జమ్ము,కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించేందుకు హర్కత్‌ ఉల్‌ అన్సార్‌ అనే సంస్థను ఇవి ప్రారంభించాయి. ఈ సంస్థను 1997లోనే అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.కొన్ని ప్రాంతాల్లో ఈ సంస్థ హర్కత్‌ ఉల్‌ ముజాహిద్దీన్‌ పేరిట పని చేస్తూ వచ్చింది. బంగ్లాదేశ్‌ కేంద్రంగా హుజీ-బి ఏర్పడింది. హుజీ సంస్థ ఇస్లాంలో దేవబంద్‌ ఆలోచనా విధానానికి చెందిన తీవ్ర వాద సంస్థ. ఇస్లాం ధర్మ పరిరక్షణ కోసం పవిత్ర యుద్ధం సాగించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ నుంచి ఈ సంస్థ సభ్యులు ఉత్తేజాన్ని పొంది తమ కార్యకలాపాలను విస్తృతం చేశారు. భారత్‌లో హుజీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా నిమితులైన బషీర్‌ అహ్మద్‌ మీర్‌ 2008 జనవరి 25వ తేదీన జమ్ము కాశ్మీర్‌లోన దోడా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.అంతకుముందు సంవత్సరం అతడు ఉత్తర, ఆగ్నేయ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులకు పిలుపు ఇచ్చాడు. పర్యవసానంగానే రాజస్థాన్‌లోని ఆజ్మీర్‌ షరీఫ్‌పైనా,ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ బాంబు దాడులు జరిగాయి. అలాగే,హుజీ సంస్థకు చందిన షాహిద్‌ బిలాల్‌ అనే పాక్‌ జాతీయుడు కూడా భారత్‌లో పెక్కు దాడులను పురికొల్పాడు.2007 ఆగస్టు 30వ తేదీన కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో అతడు మరణించాడు.అయితే, అతడు బతికే ఉన్నాడానీ, కరాచీ, ఢాకాల మధ్య తిరుగుతూ హుజీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. హైదరాబాద్‌కి చెందిన బిలాల్‌ 2002లో బంగ్లాదేశ్‌కి పారిపోయాడు. హైదరాబాద్‌కి చెందిన అనేక మంది యువకులను అతడు తమ సంస్థలో చేర్పించాడు.మక్కా మసీదు పేలుళ్ళకేసులో అతడి పేరు కూడా ప్రస్తావనకు వచ్చిందిత. అతడు 2002-03లో సౌదీ అరేబియా వెళ్ళి అక్కడ శిక్షణ పొందాడు.హైదరాబాద్‌లోని మూసారాం బాగ్‌కి చెందిన బిలాల్‌ 2005లో హైదరాబాద్‌ తిరిగి వచ్చాడు. గుజరాత్‌ హోం మంత్రి హరేన్‌ పాండ్య హత్యకేసులో నిందితులతో అతడికి సంబంధాలు ఉన్నాయి. అలాగే, ఈ సంస్థకు చెందిన ఇతర నాయకులకు భారత్‌లోని వివిధ నగరాల్లో ఆశ్రయం ఇచ్చే వారు ఉన్నారు. స్థానిక యువకులకు మంచి ఆదాయం ఆశ జూపి హుజీ సంస్థలోకి రిక్రూట్‌ చేయించడం వీరి కార్యకలాపాల్లో ముఖ్యమైనది.
20 దేశాలకు విస్తరణ
హుజీ సంస్థ కార్యకలాపాలు 20 పైగా దేశాలకు విస్తరించాయి. 2005లోనే ఈ సంస్థ కార్యకలాపాలు భారత్‌, చెచెన్యా, ఉజ్బెకిస్థాన్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, తజికిస్తాన్‌, ఇరాన్‌, మలేసియా, ఫిజీ, అమెరికా, ఇంగ్లాండ్‌లతో సహా 24 దేశాలకు విస్తరించినట్టు సమాచారం ఉంది. 2007 ఫిబ్రవరిలో జరిగిన సంర&°తా ఎక్స్‌ప్రెస్‌ పేలుడు సంఘటనలో కూడా హుజీ పాత్ర ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సంవత్సరం మే 25వతేదీన హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్‌లోనూ, కోఠీలోని గోకుల్‌ చాట్‌లోనూ సంభవించిన పేలుళ్ల వెనుక కూడా హుజీ హస్తం ఉంది. అలాగే, 2008 మే 13వ తేదీన జైపూర్‌లో వరుస పేలుళ్ళ సంఘటనతో కూడా హుజీకి ప్రమేయం ఉంది.2007 మే 18వ తేదీన హైదరాబాద్‌లోని మక్కా మసీదు పేలుళ్ళ కేసులో కూడా హుజీ పాత్ర ఉంది.2007 వారణాసి, ఫైజాబాద్‌, లక్నోలలో జరిగిన పేలుళ్లలో హుజీకి సంబంధాలు ఉన్నాయి. హుజీకి చెందిన స్లీపర్‌ సెల్స్‌ ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లతో సహా పెక్కు రాష్ట్రాల్లో పని చేస్తున్నాయి. పాకిస్తాన్‌ రహస్య గూఢచార సంస్థ ఐఎస్‌ఐతోనూ, తాలిబన్‌, అల్‌ ఖైదా వర్గాలతోనూ హుజీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే, పాక్‌ కేంద్రంగా పని చేసే లష్కర్‌ ఎ తోయిబా, జైష్‌ ఎ మహ్మద్‌ తదితర సంస్థలతో కూడా సంబంధాలు ఉన్నాయి. హుజీని అమెరికా విదేశాంగ శాఖ 2008 మార్చిలో ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.ఆ సంస్థకు వివిధ బ్యాంకుల్లోని ఖాతాల్లోని నిధులను స్తంభింపజేయాల్సి ఉంది. కానీ, ఎక్కడికక్కడ స్థానికుల సహాయంతో ఆ సంస్థ తన కార్యకలాపాలను నిరాఘాటంగా కొనసాగిస్తోంది.

No comments:

Post a Comment