ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Thursday, September 8, 2011

గాలికి జైల్లో ఏ.సి గాలి...


బయటి ప్రపంచంలో రాజభోగాలు అనుభవించిన వారెవరైనా జైలుకెళితే చిప్పకూడు తినాల్సిందే అనుకుంటాం... అది రాజైనా రామలింగ రాజైనా... కారాగారంలో పడ్డారంటే కారంలేని పప్పుకూడు.. చాప నిద్ర తప్పదంటారు.. కానీ చంచల్ గూడ జైల్లో బెయిల్ కోసం ఎదురు చూస్తున్న రామలింగరాజు గానీ... తాజాగా చంచల్ గూడ జైలుకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి కూడా ఇవే కష్టాలు పడుతున్నాడా.. బంగారు పళ్లెంలో పంచభక్ష్య పరమాన్నం తిన్న వ్యక్తి ఉప్పుకారం లేని చిప్పకూడు తింటున్నాడంటే నమ్మాలా.. సాధారణ ఖైదీలాగే చూస్తున్నామంటున్న జైలు అధికారుల మాటల్లో నిజమెంత.. హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ..
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశం మనది.. పౌర హక్కులు.. చట్టాలు.. ఆదేశిక సూత్రాలు అందరికీ సమానమని చదువుకున్నాం.. కానీ దేశ సంపదను దోచుకున్న నేరగాళ్లకోచట్టం.. జేబుదొంగలకో చట్టం అని రుజువు చేస్తున్నారు మన అధికారులు.. కోటాను కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి ఇటు ప్రజలకు అటు ప్రభుత్వాన్ని మోసం చేసిన ఘనాపాటీలు జైల్లో కూడా రాజభోగాలు అనుభవిస్తున్నారు.
బళ్లారి గనుల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన గాలి జనార్దన్ రెడ్డిని ఒక సాధారణ ఖైదీగానే చూస్తున్నామంటున్న అధికారుల మాటలు నమ్మశక్యంగా లేవనిపిస్తోంది. ఎందుకంటే
గాలి జనార్దన్ రెడ్డి, సామాన్య కుటుంబంలో పుట్టినా కాలం కలిసి రావడంతో బంగారు జరీ పట్టుపంచె, స్వర్ణ సింహాసనం, పుష్పక విమానాల్లాంటి కార్లు, హెలికాప్టర్లు, హంసతూలికా తల్పం లేనిదే కునుకు తీయడు. రాయల విలాసాలకు ఏమాత్రం తీసిపోని ఈ రాయలసీమ వాసి సాధారణ ఖైదీలా జీవితం గడపడమంటే .. స్వర్గంలోంచి అమాంతంగా నరకంలోకి దూకడంమే.. ఒకవేళ కలిసిరాని కాలం.. విధి చేతిలో వింత నాటకమంటూ గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ వచ్చే వరకు కళ్లుమూసుకుందామనుకున్నా జైలు అధికారులు ఊరుకోరు. గాలి జనార్దన్ రెడ్డి లాంటి బంగారు బాతు దొరికాక సేవలు చేసుకొని కటాక్షం పొందకుంటే అంతకుమించిన దురదృష్టమేముంటుందని వారి బాధ.. మామూలుగా జైలుకొచ్చే విచారణ ఖైదీల జేబులు లూఠీ చేస్తారనే అవవాదు ఎలాగూ ఉంది.. సగం సిగరెట్ డబ్బాల నుంచి డిపాడిట్ డబ్బుల వరకూ వసూలు చేసిన సందర్భాలు కోకొల్లలు.. అటువంటిది విఐపి ఖైదీలు జైలు గుమ్మం తొక్కారంటే అధికారుల హడావుడి అంతా ఇంత కాదు.
జైలు నిబంధనల ప్రకారం ఆరు దాటితే ఖైదీలు బ్యారక్ దాటకూడదు. ఆరు గంటలకే ఖైదీలందరినీ బ్యారక్ లలోకి పంపి తాళాలేస్తారు. అత్యవసరమైతే తప్ప తాళాలు తీయరు. మామూలు సమయంలో ఖైదీల ములాకత్‌కు వచ్చేవారు నిర్దేశించిన ప్రాంతంలోనే కలుస్తారు. బంధువులు ఇంట్లో తయారుచేసి తెచ్చే తినుబండారాలను అనుమతించరు. కేవలం పండ్లు, కవర్ చేసిన ప్యాకెట్ లను మాత్రమే అనుమతిస్తారు. ముఖ్యంగా కమ్యునికేషన్ సాధనలేవీ ఖైదీలకు అందుబాటులో ఉండవు.. బయటి ప్రపంచం గురించి తెలియాలంటే న్యూస్ పేపర్, కంబైన్డ్ టి.వి ... కానీ ఈ కండిషన్లన్నీ సాధారణ ఖైదీలకు మాత్రమే.. దేశ సంపదను దోచుకున్న వారికి.. ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన వారికి మాత్రం కాదని తెలుస్తోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం సత్యం కుంభకోణంలో జైలుకెళ్లిన రామలింగరాజును కూడా సాధారణ ఖైదీలాగా చూస్తున్నామని అప్పట్లో అధికారులు ప్రకటనలు గుప్పించారు.. కానీ జైలు గోడల మద్య జరుగుతున్న తంతు వేరని సమాచారం.. ప్రజాధనం దోచుకున్న కృషిబ్యాంక్ వెంకటేశ్వర్ రావు కూడా జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడని సమాచారం.. సత్యం రామలింగరాజు గానీ.. కృషి బ్యాంక్ వెంకటేశ్వర్ రావు గానీ.. ఎక్కువ సమయం జైలు సూపరింటెండెంట్ ఏ.సి గదిలోనే గడుపుతున్నట్టు సమాచారం.. ఎవరైనా బంధువులను కలవాలంటే.. సూపరింటెండెంట్ రూంలోకే పిలిపించుకొని మాట్లాడుతారని వినికిడి.. ఆఫీసుకు వచ్చినట్టే ఇంటి వద్ద వండిన ఆహారం వస్తుందని జైలు వర్గాలు బాహాటంగానే చెప్పుకుంటున్నాయి. ఇక వీరి చేతికి అలవాటు పడ్డ మొబైల్ ఫోన్ మోగని ఘడియంటూ ఉండదు. ఇప్పటి వరకు ఈ విఐపి ఖైదీలకు గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సహచరుడు శ్రీనివాస్ తోడయ్యారు... ఈ విఐపి విచారణ ఖైదీల కోసం సూపరింటెండెంట్ రూం కాస్తా ఏ.సి బ్యారక్ గా మారిందని చెప్పొచ్చు.
బ్యాంగ్

2 comments:

  1. మీదంతా సమాచారం, గాలి కబుర్లే కాని, నిర్ధిష్ట మైన వార్త లేదు. ఈలాంటి రూమర్స్ వ్యాప్తి చేయడం వలన మీకేం ప్రయొజనం.

    కాముధ

    ReplyDelete
  2. నిర్ధిష్ట సమాచారం లేకుండా ఎవరూ రాయరు.. ముఖ్యంగా జర్నలిస్టులు.. రుజువులు బయట పెట్టడం.. సోర్టును బయట పెట్టుకోవడం జర్నలిజం అనిపించుకోదు.. అయినా గాలి జనార్ధన్ రెడ్డికి నాకు గెట్టు పంచాయితీ గానీ.. ఆస్తి గొడవలు గానీ లేవు.. రామలింగ రాజు కంపెనీలో పనిచేసిన ఎంప్లాయిని కాదు.. కానీ కళ్లతో చూసి.. చెవులతో విన్న వాస్తవాలను కాదని, గాలి వార్తలని ప్రూవ్ చేయడం సరికాదేమో అని నా అభిప్రాయం.. థాంక్యూ ఫర్ కామెంట్

    ReplyDelete