Thursday, September 22, 2011
క్రిస్టల్ స్కల్ గొప్పతనం
ఈ విశాల ప్రపంచంలో నిశీధి రహస్యాలెన్నో తరాల తరబడి ఛేదించకుండా అలా సుప్తావస్థలోనే మగ్గిపోతున్నాయి. ప్రపంచ చరిత్రలో వేల సంవత్సరాలుగా కొన్ని వింతలు వింతలుగానే మిగిలి పోయాయి. ఆధునిక నాగరికత ప్రారంభం కాక ముందే అత్యంత సూక్ష్మ సాంకేతిక వ్యవస్థలు అభివృద్ది చెంది సమసి పోయాయన్న వాదనలకు అంత బలం లేకున్నా.. 85 సంవత్సరాల క్రితం ఈ భూమి పై వెలుగులోకి వచ్చిన క్రిస్టల్ స్కల్స్ ఓ అపూర్వ ఘట్టానికి తెరలేపినయి. ప్రాచీన సమాజం వాడిన సాంకేతిక పరిజ్ఞానం కింద మన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏ పాటిదో తెలుస్తోంది.. ఇంతకీ ఏంటా క్రిస్టల్ స్కల్స్..వాటి ప్రత్యేకత ఏంటి..
***************************************************************
అది చూడ్డానికి గాజు నిర్మితమైన ఉండే కపాలం.. కానీ గాజు కాదు.. దాన్ని తయారు చేయడం అంత తేలిక కూడా కాదు.. నిజానికి మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్న క్రిస్టల్ స్కల్ చాలా సామాన్యమైనదిగా కనిపిస్తుంది.. ఫ్యాన్సీ షాపులో దొరికే గాజు వస్తువుల్లా కనిపించే ఈ క్రిస్టల్ స్కల్స్ వేల సంవత్సరాల క్రితం అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడ్డాయి.
ఈ భూమి అద్భుత రహస్యాలను ముద్రించుకున్న గ్రంధం.. వేలాది సంవత్సరాలుగా చరిత్ర పుటల్లో.. భూమి పొరల్లో తనకు తాను.. మూల చరిత్రలను, పాద ముద్రలను రాసుకున్న విశాల పత్రం.. మనిషి తన జీవిత కాలంలో కేవలం వంద సంవత్సరాల ప్రపంచాన్ని మాత్రమే చూడ గలడు. తనకు ముందు ఏం జరిగిందో చూడాలంటే సాధ్యం కాదు. ఇప్పుడంటే విజువల్స్ రికార్డ్ చేయడం సాధ్యమవుతుందిగానీ రెండు వందల సంవత్సరాలకు ముందు పూర్తిగా అంధకార యుగం.. రెండు వందల సంవత్సరాల క్రితానికి నేటికి ఈ భూమి పై ఊహాతీత మార్పులు జరిగాయి. అటువంటిది వేల సంవత్సరాలలో ఈ భూమి పై ఎన్ని మార్పులు జరిగి ఉండాలి.. ఈ భూమి ఖండఖండాలుగా విడిపోయి. తిరిగి ప్రాంతాలుగా విభజింప బడినట్టు పరిశోధనల్లో రుజువయింది.. అవును. ఆ ఖండ చలనాల్లో ఎన్నో ఆనవాళ్లు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. . ఎన్నో అతీత శక్తులు వెలుగు చూడకుండా భూమి పొరల్లో కలిసిపోయాయి.. అలా మానవ చరిత్రలో కొంతకాలం వెలుగు వెలిగి నిశీధిలో కలిసిపోయి.. తిరిగి గత 85 సంవత్సరాల క్రితం వెలుగు చూసి పరిశోధకులకు సవాలుగా నిలిచిందే క్రిస్టల్ స్కల్
ఈ ప్రపంచం ఒకప్పుడు అవిభాజ్యంగా ఉందని.. భూమి సముద్రం అనే రెండు ఖండాలుగా ఉండేవని ఖండ చలన సిద్ధాంతం చెబుతోంది. భూమి పొరల్లో వచ్చిన మార్పుల వల్ల భూగోళం పై ఉన్న భూభాగం ఖండఖండాలుగా విడిపోయింది. భూమి ఇలా ఖండాలుగా విడిపోయేటపుడు ఎన్నో ప్రాంతాలు సముద్రగర్భంలో కలిసిపోయాయి.. ఎన్నో ప్రాంతాలు జలగర్భం నుంచి పైకి వచ్చి కొత్త ప్రాంతాలుగా విలసిల్లాయిని శిలాజ పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో దీవులు సముద్ర గర్భంలో దాగిన భూబాగమే.. అందుకే పరిశోధకుల తవ్వకాల్లో వీటిలో సముద్ర జీవుల శిలాజాలు లభిస్తున్నాయి. అంతేకాదు భూమి పై నాగరికత విలసిల్లిన ప్రాంతాలు ఖండ చలనంలో విడిపోయి కనుమరుగయి పోయాయి. అలా కనుమరుగయి పోయిన నగరమే.. అట్లాంటిస్.. యస్.. అట్లాంటిస్ నగరం ఒకప్పుడు ప్రపంచ చరిత్రలో అధునికత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్న నగరంగా చెబుతారు.. అయితే ఇక్కడ నివసించిన వారికి కొన్ని అతీత శక్తులున్నాయని.. వారికున్న శక్తులతో అద్భుతాలు సృష్టించగలిగేవారని ప్రచారంలో ఉంది. అయితే ఆ అట్లాంటిస్ నగరమనేది వాస్తవానికి ఎక్కడ ఉందనేది ఇతిమిద్దంగా తెలియదు. అయితే ఈ నగరం ఉత్తర.. దక్షణ అమెరికాల మద్యబాగంలో ఉండి ఉండేదన్న వాదనలున్నాయి. ప్లేటో తన రచనల్లో అట్లాంటిస్ నగరం గురించి ప్రస్తావించాడు. తన పూర్వికులు చెప్పిన విషయాల ప్రకారం అట్లాంటిస్ వంటి నగరాలు అత్యంత అభివృద్ది చెందిన నాగరికతను కలిగి ఉన్నాయని.. అక్కడ ఆధునిక సాంకేతిక విజ్ఞానం దొరికే అవకాశం ఉందని ఉదహరించాడు. అయితే కాలగర్భంలో ఆ నగరం సముద్రం పాలయిందని.. భూకంపాలు, సునామీ వంటి ఉత్పాతాల వల్ల నగరం మునిగిపోయిందనే వాదన ఉంది. కొందరు మాత్రం అట్లాంటిస్ అనేది కేవలం కట్టు కథ అని కొట్టిపారేశారు. మరికొందరు మెక్సికో నగరపు సానువుల్లో అట్లాంటిస్ ఉందని వాదించారు. ఏది ఏమైనప్పటికీ అట్లాంటిస్ నగరం ఉందా లేదా.. ఉంటే దాని గర్భంలో ఏమైనా ఆధునిక శాస్త్ర పరిజ్ఞాన ఆనవాళ్లు దొరుకుతాయా అనే అన్వేషణకు బయలుదేరాడు ఒక పరిశోధకుడు.
ప్రపంచానికి ఈ అట్లాంటిస్ నగరం ఆనవాళ్లు చూపించాలనే తపనతో ఒక పరిశోధకుడు బయలు దేరాడు.. అతడే మిచల్ హెడ్జెస్.. భూగోళ చరిత్రలో అద్భుతాలు సృష్టించిన ఓ అసమాన్య నగరపు ఆనవాళ్లను అన్వేషించుకుంటూ వెళ్లిన మిచల్ హెడ్జెస్ కు అంతుబట్టని ఎన్నో అద్భుతాలు ఎదురయ్యాయి.. యావత్ ప్రపంచం నివ్వెరపోయే అద్భుతాలెన్ో తారసపడ్డాయి.. ఆ అద్భుతాల్లో ఒకటి క్రిస్టల్ స్కల్ .. కనీసం మానవుడు ఊహించడానికి కూడా సాహసం చేయని ఒక అపురూప నిర్మాణం.. దాని వయసును కూడా నిర్ధారించడానికి అలివికాని పదార్ధంతో చేయబడ్డ ఒక మానవాతీత పరికరం.. వేలాది సంవత్సరాల కిందటి నిర్మాణం చెక్కుచెదరకుండా తన ప్రాభవాన్ని కోల్పోకుండా లభించిన ఓ మిస్టీరియస్ ఆబ్జెక్ట్ .. క్రిస్టల్ స్కల్..
ఇంతకీ క్రిస్టల్ స్కల్ గొప్పతనం ఏంటి.. మంచుముక్కలా ఉన్న ఈ క్రిస్టల్ స్కల్ కు అంత ప్రాధాన్యం ఎందుకొచ్చింది. గాజుకుప్పెలా.. పేపర్ వెయిట్ లా అలంకరణ కోసమే తయారు చేశారా అనుకున్నంత ఒక అందమైన నిర్మాణానికి పరిశోధకులు ఎందుకింత ప్రాధాన్యం కల్పించారు. ఈ క్రిస్టల్ స్కల్ లో పరిశోధకులకు కనిపించిన అద్భుతాలేంటి.. నిజంగా అద్భుతాలే జరిగితే వాటిద్వారా వాళ్లు నేర్చుకున్న పాఠాలేంటి.. క్రిస్టల్ స్కల్స్ మానవాళికి నేర్పిన కొత్త విషయాలేంటి..
ఇక్కడ మనకు గాజు ముద్దలా కనిపిస్తున్న ఈ క్రిస్టల్ స్కల్ మామూలు పుర్రె కాదు. ఏదో ఆనందం కోసం తయారు చేసుకున్న ఒక అపురూప పరికరం కాదు. అట్లాంటిస్ నగర ఆనవాళ్లను పరిశోధించాలని బయలుదేరిన మిచెల్ హెడ్జెస్ ఎన్నో దండకారణ్యాలు దాటుకుంటూ వెళ్లాడు. కానీ తనకు ఎక్కడా అట్లాంటిస్ ఆనవాళ్లు లభించలేదు. తనతో బాటు తన కుమార్తె అన్నాను కూడా వెంట తీసుకెళ్లి అడవుల్లో తిప్పాడు. మిచెల్లి హెడ్జెస్ కూతురు.. అన్నా కూడా చాలా తెలివైనది.. వయసులో చిన్నదైనా పరిశోధన మొత్తాన్ని ఆసక్తిగా తిలకించేది.. అట్లాంటిస్ నగరం సముద్ర గర్భంలో మునిగిపోయిందనుకున్న మిచెల్ నిరాశతో వెనుతిరగాలను కున్నాడు. కానీ ఆ రోజు సాయంత్రం ఓ అద్భుతం జరిగింది. తాము నివసిస్తున్న గుడారాలకు దగ్గరలో ఒక లోయలో ధగధగా వెలిగిపోతున్న గాజు పుర్రెను చూసింది అన్నా.. అంతే మరుక్షణమే ఆ ప్రాంతాన్ని తవ్వి ఆ పుర్రెను వెలికి తీసింది.. కేవలం క్రిస్టల్ కపాలం మాత్రమే అభించింది. మూడు నెలల తరువాత దవడ బాగం కూడా లభించింది.. ఆ కపాల బాగానికి సరిపోయి ఉండటంతో ఇది ఆ కపాలానిదేన్న నిర్ణయానికి వచ్చారు. కానీ మాయన్ నాగరికత విలసిల్లిందిగా చెప్పబడే ఆ ప్రాంతంలో ఆ క్రిస్టల్ స్కల్ ఎందుకుంది.. దీనికున్న మహిమలు ఏంటి.. మహిన్వితమైనదే అయితే ఇంతకాలం ఎందుకు మరుగున ఉన్నది ఇవన్నీ హెడ్జెస్ కు అర్దం కాని ప్రశ్నలు.. 1924 అట్లాంటిస్ శిథిలాల కోసం జరిపిన తవ్వకాల్లో వెలుగు చూసిన నిజాలు చాలాకాలం చీకట్లోనే మగ్గిపోయాయి.. తాను చూసిన నిజాలేవీ.. బయటి ప్రపంచంతో పంచుకోడానికి ఎందుకో మిచెల్ ఇష్టపడలేదు. క్రిస్టల్ స్కల్ కు సంబంధించిన విషయాలను బయటి ప్రపంచానికి తెలియజేస్తే వాటిని దుర్వినియోగం చేస్తారనే భయం కావచ్చు. లేదా దాన్ని తన నుంచి దూరం చేస్తారనే భయం కావచ్చు.. లేదా అంతకు మించి వాటి గురించి ఆయనకు ఏదైనా అద్భుతం తెలిసి ఉండాలి.. కానీ ఇవేవీ చెప్పకుండానే.. తనకు తాను నిర్ణయించుకున్న నియమాల బంధీలో ఈ రహస్యాలను శాశ్వతంగా బందీ చేశాడు.. రోజుల తరబడి చేసిన పరిశోధనా ఫలితాలు బయటి ప్రపంచానికి అందకుండానే శాశ్వతంగా సమాధి అయ్యాయి. మిచెల్లీ హెడ్జెస్ రాసుకున్న పరిశోధనా పత్రాలు చాలా కాలం చిత్తు ప్రతుల్లా బుట్టదాఖలై హెడ్జెస్ లైబ్రరీలో ఓ పరిశోధనా హస్తం కోసం వేయి కళ్లతో ఎదురు చూశాయి.. మిచెల్ మరణానంతరం.. అన్నా క్రిస్టల్ స్కల్ గురించి లోకాలని వెలుగు చూపింది.. తన తండ్రితో బాటు తాను ఎలా అడవుల్లో గడిపిందో నోరు మెదిపింది.. తండ్రి బతికున్నంత కాలం మౌనంగా ఉన్న అన్నా.. తండ్రి మరణానంతరం తాను కనుగొన్న విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయకుంటే వ్యర్ధమనుకుందో ఏమో క్రిస్టల్ స్కల్ ను పట్టుకొని అన్ని ప్రాంతాలు తిరగి దాని గొప్పతనం గురించి పరిచయం చేసింది.. అంతే ప్రపంచ శాస్త్రవేత్తలు నివ్వెరపోయారు. క్రిస్టల్ స్కల్ గొప్పతనం.. దాని నిర్మాణ శైలి.. అందరినీ ఆకట్టుకుంది..
అన్నా చూపిన క్రిస్టల్ స్కల్ పూర్తిగా మానవుడి పుర్రెకు సారూప్యాన్ని కలిగి ఉంది.. అయితే దీని నిర్మాణానికి ఉపయోగించిన పదార్ధం అత్యంత కఠినమైన క్వార్ట్జ్ ఖనిజంతో తయారు చేయబడింది. క్వార్ట్జ్ ఖనిజాన్ని అంత నునుపుగా నగిశీలు దిద్దడం అంత సులువైన విషయం కాదు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందిన ఈ రోజుల్లో కూడా క్వార్ట్జ్ పదార్ధంతో అంత నైపుణ్యమైన శిల్పాన్ని చెక్కడం సాధ్యం కాదు. అసలు ఇది కేవలం భ్రమా లేక వాస్తవమా.. నిజంగా వేల సంవత్సరాల క్రితం దేనా లేక అన్నా ఏదైనా నాటకమాడుతోందా అని పరిశోధించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. దీంతో మరో కొత్త విషయం వెలుగు చూసింది. అన్నా చూపిన ఆ క్రిస్టల్ స్కల్ ఎప్పటిది.. అది నిజంగా త్రవ్వకాల్లో లభించిందేనా.. ఎన్నో లక్షల సంవత్సరాల కిందటి శిలాజాల వయసును గుర్తించ గలుగుతున్న శాస్త్రవేత్తలు ఈ క్రిస్టల్ స్కల్ వయసును ఎందుకు కనిపెట్టలేకపోయారు. ఇంతకీ ఈ క్రిస్టల్ స్కల్ గొప్పతనం ఏంటి.. కేవలం క్వార్ట్జ్ ఖనిజంతో అంతే అత్యంత కఠినమైన పదార్ధంతో నైపుణ్యంగా తీర్చిదిద్దడమే దీని ఘనతా లేక ఇంకా వేరే అద్భుతాలైమైనా ఉన్నాయా..
క్రిస్టల్ స్కల్ ఎంత కఠినమైన పదార్ధంతో తయారు చేయబడిందో దీని వెనకున్న మర్మాన్ని కనుగొనడం కూడా అంతే కఠినంగా మారింది. ఎందుకంటే ఏ వస్తువుగానీ.. శిలాజం గానీ.. శిధిలంగానీ.. దొరికిన ఆనవాళ్లను బట్టి దాని వయసు కనుగొనాలంటే కచ్ఛితంగా ఆ బాగంలో కార్భన్ పదార్ధం ఉండి తీరాలి. ఆ కార్భన్ పదార్ధం కూడా ఉద్ఘారం చెందుతూ ఉంటే. కార్భన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా ఆ వస్తువు ఏ కాలం నాటిది. ఎన్ని వందల సంవత్సరాలనాటిదనే విషయం తేలికగా చెబుతారు. కానీ మనకు అభించిన ఈ క్రిస్టల్ స్కల్ పూర్తిగా క్వార్ట్‌జ్ ఖనిజంతో తయారవడం వల్ల దీనిలో లేశ మాత్రం కూడా కార్భన్ లేక పోవడం వల్ల దీని వయసును నిర్ధారించడం సాధ్య పడలేదు. వేల సంవత్సరాల క్రితం తయారు చేయబడ్డదైనా.. నాలుగు రోజుల క్రితం తయారుజేయబడ్డంత ఫ్రెష్ గా ఉండటం మరోప్రత్యేకత.. వీటన్నిటికీ మించి ఈ క్రిస్టల్ స్కల్స్ గురించి రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి.. కారణం అన్నా చూపిన క్రిస్టల్ డోమ్ లాంటివే మరికొన్ని వెలుగులోకి రావడం.. దాంతో బాటు.. క్రిస్టల్ స్కల్స్ ను ఫోటోలు తీసినపుడు రకరకాల ఇమేజెస్ రావడం. ఆశ్చర్యాన్ని గొలిపే అంశం.. దాంతో బాటు కొందరు పరిశోధకులు క్రిస్టల్ పుర్రెలకు యుగాంతానికి దగ్గర సంబంధం ఉందని చెప్పడంతో క్రిస్టల్ స్కల్స్ పై మరింత ఆసక్తి నెలకొంది.
క్రిస్టల్ స్కల్స్ కు యుగాంతానికి సంబంధం ఏంటి.. నిజంగా ఈ పుర్రెలకు అంత మహత్యం ఉందా. అసలు ఇన్నేళ్ల పరిశోధనలో క్రిస్టల్ స్కల్స్ లో మనిషి కనిపెట్టిన అద్భుత అంశం ఏంటి.. మిచెల్ క్రిస్ట్ల్ స్కల్ ను ప్రపంచానికి చూపించాక రకరకాల క్రిస్టల్ స్కల్స్ పుట్టుకొచ్చాయి. ఇవన్నీ నిజమైనవేనా.. లేక ఇందులో కూడా మాయగాళ్లు చేరి మానవాళిని తప్పుదోవ పట్టిస్తున్నారా..చూద్దాం..
ఈ క్రిస్టల్ స్కల్స్ నిర్మాణా శైలిని బట్టి చూస్తే ఇవి ఇప్పటికిపుడు తయారు చేసినంత ఫ్రెష్ గా ఉన్నాయి. వీటిని తయారు చేసిన టెక్నాలజీ కూడా అద్భుతంగా ఉంది. కానీ వీటి వయసు లెక్కించడానికి ఎటువంటి ఆధారాలు లేకపోవడం.. ఆర్గానిక్ సబ్టెన్సెస్ ఏదీ అందుబాటులో ఉండకపోవడం ఒక చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే యువ శాస్త్రవేత్తలు మాత్రం ఇవి కేవలం 150 నుంచి 200 సంవత్సరాల మద్యకాలంలో జర్మనీలో తయారు చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మానవ నిర్మితమై ఎంతటి నైపుణ్యం పనితీరుకైనా ఆ వస్తువు తప్పకుండా చాలా సన్నపాటి గీతలు ఉండి తీరుతాయని.. కానీ ఈ క్రిస్టల్ స్కల్ పై ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో పరిశీలించినా చిన్న గీత కూడా కనిపించక పోవడం వల్ల ఇది ఆధునిక పరికరాలతోనే తయారు చేశారనే వాదనకు తెరతీస్తున్నారు. అయితే పరిశోధకులకు కూడా అందని వాదన ఇదే.. వాస్తవానికి ఈ క్రిస్టల్ స్కల్స్ అనేవి మానవులు తయారు చేసినవి కాదు అనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ఎందుకంటే అట్లాంటిస్ నగరం.. మాయన్ నాగరికత విలసిల్లిన రోజుల్లో ఈ భూమి పైకి అతీత శక్తులుండే వారు సంచరించే వారని.. వారే ఈ క్రిస్టల్ స్కల్ లను బహుకరించారని ప్రచారం జరుగుతోంది. దేవలోకం నుంచి ఏలియన్స్ వంటి వారు భూలోక వాసులకు ఇచ్చిన బహుమానాలుగా భావిస్తున్నారు. మరో కథనం ప్రకారం భూమి పై ఇప్పటికి కూడా చిన్న, చిన్న క్షుద్ర పూజలకు పుర్రెలనే వాడుతారు. అలాగే ఆనాడు ఈ క్రిస్టల్ స్కల్స్ తో తంత్రాలు నిర్వహిచేవారని కూడా అర్ధం చేసుకుంటున్నారు. పుర్రె ఆకారాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారనే దాని పై పెద్దగా స్పష్టత లేకున్నా.. ఈ స్పటిక పుర్రె వెనుక పెద్ద కథే ఉంది. ఈ ప్రపంచం మొత్తం మీద 13 క్రిస్టల్ స్కల్స్ ఉన్నాయి. వీటిలో 12 పుర్రెలు వర్తులాకారంలో నిర్ధిష్టమైన దూరంలో అమర్చి.. మద్యలో వాటిలో మూలాధారమైన స్కల్ ను అమరిస్తే.. యుగాంత సమయంలో ఇవన్నీ ఒక్కచోటకు వచ్చి ఒక్కొక్క స్కల్ లో ఉన్న పవర్ ను షేర్ చేసుకొని అద్భుతాన్ని సృష్టిస్తాయనే కథనం ప్రచారంలో ఉంది. అందుకే ఈ క్రిస్టల్ స్కల్స్ కోసం తీవ్రంగా వెతుకులాట ప్రారంభించారు శాస్త్రవేత్తలు.. వారి అన్వేషణలో రకరకాల స్పటిక పుర్రెలు లభించాయి. మిచెట్ ప్రపంచానికి ఇచ్చిన పుర్రె కాకుండా మెక్సికో, మద్య అమెరికా, దక్షణ అమెరికాలలో రకరకాల క్రిస్టల్ స్కల్స్ లభ్యమయ్యాయి. వీటిల్లో అనేకం నకిలీలు పుట్టుకొచ్చాయి. తమను తాము ప్రచారం చేసుకోవడానికి వీటిలో కొన్నింటిని నకిలీలను పట్టుకొచ్చే నకిలీ పరిశోధకులు కూడా తయారయ్యారు. ప్రతి స్కల్ ను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే వాటిని మ్యూజియంలో భద్రపరిచేందుకు శాస్త్రవేత్తలు మొగ్గు చూపుతున్నారు.
క్రిస్టల్ స్కల్ ఇప్పుడొక హాట్ టాపిక్ గా మారింది. క్రిస్టల్ స్కల్ పేరు మీద ఎన్నో డాక్యుమెంటరీలు, సినిమాలు వచ్చాయి. తాజాగా కొన్ని వీడియో గేములు కూడా క్రిస్టల్ స్కల్ పేరుతో వస్తున్నాయి. ఒక క్రిస్టల్ స్కల్ తోనే దానికి అంత క్రేజ్ వచ్చిందనుకుంటే పొరపాటు. మద్య అమెరికా, దక్షణ అమెరికా, ప్రాంతాలలో ఇంకా చాలా రకాల క్రిస్టల్ స్కల్స్ లభించడంతో ఇవన్నీ ఒక చోట పెడితే ఏమవుతుందోనన్న ఆసక్తి ఉంది. మిచెల్లీ హెడ్జెస్ కనిపెట్టిన క్రిస్టల్ స్కల్ తరువాత 1900 సంవత్సరంలో మరో పుర్రె కనుగొన్నారు. కురువింద రూపంలో ఉన్న ఈ పుర్రెను గ్వాటిమాలా, మెక్సీకో ప్రాంతంతో కనుగొన్నారు. దీన్ని ఓ మాయన్ పూజారి కనుగొన్నాడు. దీన్ని అమెథిస్ట్ స్కల్ గా పిలిచారు. దీన్ని కూడా క్వార్ట్‌జ్ తో తయారు చేసినప్పటికీ పర్పుల్ క్వార్ట్‌జ్ కావడం వల్ల మిగతా స్కల్స్ తో నిర్మాణ సారూప్యం ఉన్నా చూడ్డానికి కొంత వైరుధ్యంగా ఉంటుంది. దీని తరువాత మాక్స్ గా పిలవబడే టెక్సాస్ క్రిస్టల్ స్కల్స్ కూడా చాలా ప్రాధాన్యం వచ్చింది. వీటి తరువా ఇ. టి స్కల్ దొరికింది. ఇది మిస్ట్ లా. .పొగకమ్మిన క్రిస్టల్ లా.. లేత కొబ్బరి రంగులో ఉంటుంది. గ్వాటిమాలా, హోండోరస్ పరిధుల్లో రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ స్కల్ లభించింది. తరువాత హ్యాండ్ కర్వ్డ్ బ్రెజిలియన్ క్రిస్టల్ స్కల్ లభించింది. అట్లాంటియన్ క్రిస్టల్ స్కల్ అని మరో నాలుగు రకాల స్కల్స్ దొరికాయి. ఈ స్కల్స్ మొత్తం యుగాంతం లో తమ ప్రభావం చూపుతాయనే కథ ప్రచారంలో ఉంది. అయితే ఇంకా కొన్ని స్కల్స్ దొరకాలని.. కొందరు పరిశోధకులు చెబుతున్నారు. నిజంగా యుగాంతమప్పుడే వీటి ప్రభావం చూపేవైతే ఇవి ఎక్కడున్నా నేల మాళిగల్లో ఉన్నా ఒక చోటకు చేరి ఒక విపత్తునుంచి భూమిని కాపాడగలవని కొందరు గ్రీకు పురాణ గాథలు వల్లిస్తున్నారు. అలా మహా విపత్తు నుంచి భూమిని కాపాడేందుకే భులోకేతర శక్తులు వీటిని మన పూర్వికులకు బహుమతిగా ఇచ్చి ఉంటారనే పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది.
పాశ్చాత్య దేశాల్లో వినిపిస్తున్న కథనాలను బట్టి.. లాటిస్ అమెరికా, మద్య అమెరికా పౌరులతో మాయన్ లు కలిసిమెలిసి ఉండేవారని వినికిడి.. అయితే మాయన్ లకు భూలోకేతర శక్తులతో సంబంధాలున్నాయని కూడా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నవి. ఎందుకంటే ప్రపంచ నాగరికథల్లో మాయన్ల నాగరికత భిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా ప్రకృతి శక్తులతోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తయారు చేయగల సత్తా వారికే సొంతం. అంతే కాకుండా.. పర్యావరణ కాలుష్య రహిత సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించడంలో మాయన్ లు దిట్ట. అయితే వీరికి ఈ పరిజ్ఞానం పంచిపెట్టింది ఏలియన్స్ అనే అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. దీంతో బాటు అంతరించిపోయిన నాగరికతగా పిలవబడే.. అట్లాంటిస్ నాగరికుల ప్రోత్సాహంతోనైనా వీరు ఈ సాంకేతిక పరిజ్ఞానం సొంతమయిందనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనప్పటకీ.. క్రిస్టల్ స్కల్స్ ఓ మిస్టరీ గానే మిగిలిపోయాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికే సవాలుగా మిగిలిన క్రిస్టల్ స్కల్స్ గురించి త్వరలోనే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. ఈ పరిశోధనల్లో కొత్త విషయాలు తెలిస్తే రానున్న రోజుల్లో నానో టెక్నాలజికి మరింత ఉపయోగపడుతుందని ఆశిద్దాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment