Tuesday, March 27, 2012
దళిత గిరిజనుల నిధులు దొంగల పాలు.. ఉపసంఘం ఊరటనిచ్చేనా..?
ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికను ఎటువంటి అవకతవకలు లేకుండా అమలు చేయాలంటూ ప్రజాసంఘాలు, దళిత సంఘాలు చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం దిగొచ్చింది. ప్రణాళిక అమలుకు మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కిరణ్ కుమార్ రెడ్డ ిప్రకటించారు. ఇంతకూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై మంత్రి వర్గ ఉప సంఘం వేయాలని ప్రజా సంఘాలతో బాటు, దళిత సంఘాలు డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.. సబ్ ప్లాన్ నిధులు ఎలా పక్కదారి పడుతున్నాయి.. ముఖ్యమంత్రి తాజా ప్రకటన వల్ల ఎటువంటి ప్రయోజనం కలగబోతోంది.... వంటి విషయాల పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.
సొమ్మొకరిది.. సోకొకరిది
సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలని ఉప ప్రణాళికను రూపొందించింది. ఎస్సీ, ఎస్టీ లను అభివృద్ధి చేయాలన్న సదుద్దేశ్యంతో వారికి ప్రత్యేక నిధులు కేటాయింస్తూ... వారికి మాత్రమే ఖర్చు చేయాలని సంకల్పించి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ రూపొందించింది. కాలక్రమంలో ఈ సబ్ ప్లాన్ కు చెదలు పట్టింది. ఒకవైపు నిధుల కేటాయింపుల్లోనే నిర్లక్ష్యం రాజ్యమేలుతుంటే.. మరో వైపు కేటాయించిన నిధులు పక్కదారి పట్టడం మొదలయింది. ఈ పద్దతిని నిరసిస్తూ దళిత సంఘాలు ఎన్నో సార్లు ఆందోళన బాట పట్టాయి. అయినా ప్రభుత్వంలో కదలిక లేదు.. ఉత్తుత్తి హామీలతో సరిపుచ్చాయి. దీంతో నిధుల దుర్వినియోగం షరా మామూలైపోయింది. ఇదేంటని అడిగిన నాధుడు లేడు.
దళిత, గిరిజనుల జనాభా సంఖ్యకు తగ్గట్టుగా.. ఎస్సీలకు 16.2 శాతం నిధులు, ఎస్టీలకు 6.6 శాతం నిధుల్ని ప్రణాళిక బడ్జెట్ లో కేటాయించాలని సబ్ ప్లాన్ ఏర్పాటు చేసిన సందర్భంలో నిర‌్ణయించింది. ఎస్సీ ఎస్పీ పేరుతో 1979 సంవత్సరంలో ఈ ఉప ప్రణాళికను ఏర్పాటు చేసింది. దీని ద్వారా కేటాయించిన నిధులు దళిత, గిరిజనుల సామాజిక, ఆర్ధిక, విద్యా, వైద్య రంగాల్లో అభివృద్ధికి వినియోగిస్తారు. కానీ ఈ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసిన నాటి నుంచి నిధులను సక్రమంగా వినియోగించిన పాపాన పోలేదని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయం పై దళిత సంఘాలు ఎన్నోసార్లు ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశాయి.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం దామాషా ప్రకారంకేటాయించాల్సిన నిధులు కేటాయించక పోగా.. కేటాయించిన అరకొర నిధులను పక్కదారి పట్టిస్తున్నారంటూ కమిషన్ తప్పు బట్టింది. రాష్ట్రంలో 1992 నుంచి ఇతర శాఖల బాట పట్టిన నిధులు అక్షరాలా 13 వేల 200 కోట్లు... ఇప్పడు ఆ మొత్తం 20 వేల కోట్లకు పైకి చేరింది. ఈ విషయాన్ని లెక్కలతో సహా కాగితాల పై కుమ్మరించి ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం వాగ్ధానాలతోనే బుజ్జగిస్తోంది.
ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే నోడల్ వ్యవస్థ అమలులోకి రావాలి. కానీ రాష్ట్రంలో నోడల్ వ్యవస్థ ఇన్నాళ్లూ ఓ చిరకాల స్వప్నంగానే మిగిలింది. ఉత్తరప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో సాకారమైన నోడల్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు దుస్సాధ్యంగా మిగిలింది. దీంతో నిధులను ఇష్టమొచ్చిన శాఖలకు కేటాయించినా పట్టించుకునే నాథుడు లేడు. 2007లో ఎస్సీ ఎస్టీ లకు రెండు ఏజన్సీలు ఏర్పాటు చేసి రెండు నెలలకో మారు సమీక్ష చేస్తామన్న దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. తరువాత ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రోశయ్య కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. మిగిలిన నిధులను నోడల్ ఏజన్సీకి బదలాయించాలని ఆదేశించి చేతులు దులుపుకున్నారు. అయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.
ఎస్సీ ఎస్టీ ల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన సబ్ ప్లాన్ అపహాస్యం పాలవుతోంది.. దళిత గిరిజనులను ఉద్ధరించడానికి ఏర్పాటు చేసిన ఉప ప్రణాళికకు నిధులు కేటాయించడంలోనే నిర్లక్ష్యం తాండవిస్తుంది. దానికి తోడు కేటాయించిన అరకొర నిధుల విడుదలలో విపరీతమైన జాప్యం.. ఆఖరుకు కేటాయించిన నిధులను దళితులకు, గిరిజనులకు ఖర్చు పెట్టకుండా వేరే పనులకు ఖర్చు పెట్టి.. దళిత గిరిజన ఖాతాలో రాయడం షరా మామూలై పోయింది. దళిత, గిరిజనులకు అసలే సంబంధం లేని పులివెందుల అభివృద్ధి, హైదరాబాద్ రింగ్ రోడ్డు నిర్మాణం, హుస్సేన్ సాగర్ ఆధునికీకరణ వంటి పనులకు ఖర్చు పెట్టడం చూస్తే ప్రభుత్వాలకు దళిత గిరిజనుల అభివృద్ధి పట్ల ఉన్న చిత్త శుద్ది తేటతెల్లమవుతోంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని... ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాల సాక్షిగా ఉప ముఖ్యమంత్రే బహిరంగంగా ఒప్పుకున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మన పొరుగున ఉన్నా కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు ఎంత కేటాయిస్తారో ముందే ప్రకటిస్తారు. కానీ మన రాష్ట్రంలో కేటాయించిన నిధులు ఎన్నో తెలుసుకోవడమే కష్టంగా మారింది.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరు చేయకున్నా, నిధులు దారి మళ్లించినా, దానికి సహకరిస్తూ సంతకం చేసిన వారందరిపైనా చర్యలు తీసుకునే విధంగా సబ్‌ప్లాన్ నిధుల చట్టం రూపొందించాల్సి ఉందని నేతలు అభిప్రాయ పడుతున్నారు.. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం 750 కోట్ల రూపాయల సబ్ ప్లాన్ నిధులను కామన్‌వెల్త్ క్రీడలకు వెచ్చించిందని , హైదరాబాద్‌లోని రింగ్‌రోడ్, ట్యాంకు బండ్ ప్రక్షాళనకు కోట్ల రూపాయలు దారిమళ్లించారని బీజేపీ నేత కిషన్‌రెడ్డి చెప్పారు. దళితుల అభివృద్ధికి కేటాయించిన నిధులను కూడా సక్రమంగా ఖర్చు పెట్టకపోవడం బాధాకరమని బీవీ రాఘవులు అన్నారు.
మా సొమ్ములు మాకు ఖర్చు పెట్టండి ప్రభో అంటూ దళిత సంఘాలు రొడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చినందుకు ప్రభుత్వాలు పెద్దగా బాధ పడక పోగా ఇలా జరిగిన మాట వాస్తవమే అని శాసన సభ సాక్షిగా ఒప్పుకోవడాన్ని చూస్తుంటే ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి పై ప్రభుత్వాలకున్న చిత్త శుద్ధి కనిపిస్తోంది.
అవును జరిగిందేదో జరిగింది.. ఇక అలా జరగనివ్వమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సక్రమంగా అమలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని.. వారికి కేటాయించిన నిధులు జాప్యం లేకుండా విడుదల చేయడమే కాకుండా విడుదలయిన నిధులు వారికే ఖర్చు పెట్టేలా చర్యలు తీసుకుంటామని... దీనికోసం శాసన సభలో ప్రత్యేక చర్చ చేపడతామని సీఎం చెప్పే మాటలు కాస్త ఊరట కలిగించేవే అయినా.. అవి కార్యరూపం దాల్చిన రోజు సంపూర్ణ విజయం సాధించనట్టే..
Wednesday, March 21, 2012
గుండెలవిసేలా ఏడ్చినా... పోయిన బిడ్డ వస్తుందా.. ఈ పాపం ఎవరిది?
గుండెలవిసేలా ఏడ్చినా... పోయిన బిడ్డ వస్తుందా.. ఈ పాపం ఎవరిది?
ఆ బస్సు వారి పాలిట మృత్యు శకటం గా మారింది.. కళ్లముందు ఆడిపాడే విద్యార్ధులు కానరాని తీరాలకు చేరారు.. ఆ బిడ్డల తల్లి దండ్రుల శోకం తీరనిది.. గుండెలవిసేలా విలపిస్తున్న ఆ తల్లి దండ్రుల శోఖానికి అంతే లేదు. ఒక్కబస్సులో ప్రయాణిస్తున్న 50 మందిలో 14 మంది తల్లి దండ్రులకు గర్భశోకం కలిగింది.
పాపం పసివాళ్లు / ఈ పాపం ఎవరిది ?
రోజూ లాగే ఈ రోజూ వీడ్కోలు చెప్పి స్కూల్ బస్సెక్కారు.. కానీ అదే ఆ తల్లులకు.. బిడ్డలు చెప్పిన ఆఖరి వీడ్కోలవుతుందని తెలీదు. మురిపాలు కురిపించే చిన్నారులు.. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. తిరిగిరాని తీరాలకు చేరారు.. గుండె చెరువై కుమిలి పోతున్న ఆ తల్లి దండ్రులు ఈ పీడ కల నుంచి తేరుకోలేక పోతున్నారు.
వాగులో పడ్డ బస్సులో తమ పిల్లలు దొరుకుతారేమోనని వెదుకుతున్న ఆ తండ్రుల గుండెలు ఎంత తల్లడిల్లుతున్నాయో
ప్రమాదానికి కారణం ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయినందుకే బస్సు వాగులో పడిందని చెబుతున్నా... అదొక్కటే కారణమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చిన్నారులను పొట్టన బెట్టుకున్న పాపం ఎవరిది..
వాగు వద్ద ఉన్న బ్రిడ్జి ప్రమాదాలకు నిలయంగా మారిందా..?
చంద్రుగొండ మండలంలో ఉన్న రోడ్డు సింగిల్ రోడ్డు.. తుంగారం వాగు పై ఉన్న బ్రిడ్జి కూడా ప్రమాదాలకు నిలయం గా మారింది.. ఏ మాత్రం అలసత్వంగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలిసి పోవలసిందే.. ప్రమాదాలకు వంతెనలు కారణం అని తెలిసినా... బ్రిడ్జిల వద్ద పాటించాల్సిన జాగ్రత్తలు పాటించడం లేదు..
బస్సు కండీషన్ ఎలా ఉంది..?
ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం మార్గ దర్శకాలు సూచించింది.. కానీ చాలా పాఠశాలలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ఈ రోజు ప్రమాదానికి కారణమైన బస్సు కండీషన్ పై కూడా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
డ్రైవర్ నైపుణ్యం ఎంత ?
స్కూల్ బస్సు నడిపే డ్రైవర్‌కు ఎంతో నైపుణ్యం ఉండాలి. కానీ ఒక్కోసారి కొత్తగా డ్రైవింగ్ లోకి వచ్చిన వారిని కూడా స్కూల్ యాజమాన్యాలు డ్రైవర్లుగా నియమిస్తున్నాయి. ఎల్‌వీ రెడ్డి స్కూల్ బస్సు ప్రమాద సమయానికి బస్సు క్లీనర్ డ్రైవింగ్ చేసినట్టు తెలుస్తోంది. డ్రైవర్ తో బాటు క్లీనర్ క్షేమంగా ఈదుకుంటూ బయటపడ్డారు.
ఖండనలతో సరి ...
స్కూల్ ప్రమాదాలు నిత్య కృత్యాలయ్యాయి... ప్రమాదాలు జరిగినపుడు ఖండనలు, సంతాపాలు.. ఎక్స్‌గ్రేషియాలు.. సంప్రదాయంగా మారాయి.. కానీ ప్రమాదాలు నివారించేందుకు తీసుకునే చర్యలు .. పాటించాల్సిన నిబంధనలు మాత్రం కాగితాలకే పరిమితమవుతున్నాయి. స్కూల్ బస్సుల కండీషన్ల పై కూడా రాజీ పడ్డ వారు పసివాళ్ల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా కాదు ఈ అధికారులు ప్రభుత్వం ఎప్పటికి స్పందిస్తుందో..
పసిప్రాణాలతో పరాచకం... గుండె చెరువై కుములుతున్న కన్న తల్లులు
పసిప్రాణాలతో పరాచకం... గుండె చెరువై కుములుతున్న కన్న తల్లులు
ఖమ్మం జిల్లా కొత్తగూడెం వద్ద స్కూల్ బస్సు కాలువలో పడి 14 మంది చనిపోవడంతో... స్కూల్ బస్సు ప్రమాదాల పై మరోసారి చర్చ మొదలయింది.. ప్రమాదాలు జరిగినపుడు ఖండనలు... సంతాపాలు... ఎక్స్ గ్రేషియాతో సరిపుచ్చే నేతలు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే స్కూల్ బస్సుల ప్రమాదాలు నిత్య కృత్యాలయ్యాయి. ప్రమాదాల్లో పసివాళ్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కంటిదీపాలు గాలిలో దీపాల్లా మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదాల పై ప్రత్యేక కథనం
స్కూల్ బస్సు బోల్తా.... విద్యార్ధుల మృతి... పలువురికి తీవ్ర గాయాలు.. స్కూల్ పై దాడి... ఈ వార్తలు నిత్య కృత్యంగా మారాయి. సరిగ్గా 20 రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లా గన్నవరంలో స్కూల్ బస్సు కాలువలోకి దూసుకెల్లి ఇద్దరు విద్యార్ధులు మృతి చెందారు. అప్పటికపుడు సంఘటన పై విచారణ చేయిస్తామని మంత్రి తోట నర్సింహం తెలిపారు. కానీ ఈ విచారం మరోచోట జరుగుతోంది. గన్నవరం ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యంతో బాటు .. కర్నాటక నుంచి కొనుగోలు చేసిన ఈ బస్సు కండీషన్ కూడా కారణమని తేలింది. పిల్లలను తీసుకెళ్లే బస్సు డ్రైవర్ సెల్ ఫోన్లో సంబాషిస్తూ కలువ కట్ట పై బస్సు నడపడంతో బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రత పెరిగితే మృతుల సంఖ్య 2 నుంచి 17 కు చేరేది.
మార్చి 7 న విస్సన్న పేటలో జరిరిన ఘటన స్కూల్ బస్సు కండీషన్ల నిర్లక్ష్యానికి మరో ఉదాహరణ. బస్సులో సీటు లేకపోవడంతో డ్రైవర్ వెనకాల కూర్చున్న శ్రీజ అనే ఆరేళ్ల బాలిక బస్సులోంచి జారిపడి డివైడర్ కు గుద్దుకొంది.. కింద పడ్డ బాలిక పై నుంచి వెనుక టైర్లు వెళ్లడంతో బాలిక అక్కడికక్కడే ముృతి చెందింది.
విజువల్స్ స్కూల్ కు వెళ్లే పిల్లల విజువల్స్
శ్రీకాళహస్తిలో సరస్వతీ మహాయాగానికి వెళ్లి వస్తున్న కండ్రిగకు చెందిన వికాస్ పాఠశాల విద్యార్ధులు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 7 తీవ్రంగా గాయపడ్డారు.లు 23 మంది విద్యార్ధులకు స్వల్ప గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కేవసం స్కూల్ బస్సు కండీషనే కారణమని తేలింది.
మల్లాపూర్‌లోని లార్డ్ టాలెంట్ హై స్కూల్ బస్సు విద్యుత్ స్థంబాన్ని ఢీకొని 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మిగతా విద్యార్ధులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ ప్రమాదానికి బస్సు కండీషన్ తో బాటు డ్రైవర్ మద్యం సేవించి నడపడమే కారణమని తేలింది.. చిన్నారుల క్షేమంగా ఇంటికి చేర్చాల్సిన డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి మద్యం సేవించి బస్సు నడపడంతో విద్యుత్ స్థంబాన్ని ఢీకొంది.. ప్రమాద స్థాయి దాటితే 11 మంది ప్రాణాలు గాలిలో కలిసేవి.
ఉయ్యూరు శ్రీనివాస పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు విజ్ఞాన యాత్రకని బయలుదేరారు. తాడేపల్లి గూడెం వద్దకు రాగానే వంతెనె ఫుట్ పాత్ ను ఢీకొని బోల్తా కొట్టింది. 20 మంది ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యారు. స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో వైద్యం చేసుకొని వెళ్లిపోయారు. బస్సులో విద్యార్ధులు ఉన్నా.. బస్సు కుడివైపు పడ్డా ఘోర ప్రమాదం జరిగేది. ప్రమాదానికి కారణం డ్రైవర్ నైపుణ్య రాహిత్యంతో పాటు... బస్సు కండీషన్లో లేకపోవడమని తేలింది.
స్కూల్ బస్సు ప్రమాదాలు నిత్య కృత్యం... కారణం ఒక్కటే.. స్కూల్ బస్సులకు పెద్ద పని ఉండదనే కారణంతో కాలం చెల్లిన బస్సులు కొనుగోలు చేయడం. వాటిని సరిగ్గా మెయింటెయిన్ చేయకపోవడం... ప్రభుత్వాధికారులు కాసులకు కక్కుర్తి పడి నిబంధనలను పట్టించుకోకపోవడం. చెకింగ్ చేయకుండానే వదిలేయడంతో ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ఈ ప్రమాదాలు తగ్గాలంటే ప్రభుత్వం మాత్రమే స్పందించాలని కోరుకునే కంటే.. విద్యార్ధులు ప్రొగ్రెస్ రిపోర్టు లాగానే స్కూల్ బస్సు నాణ్యతను... బస్సు డ్రైవర్ నైపుణ‌్యాన్ని తెలుసుకోవాలి.. నిబంధనలు పరిక్షించి యాజయాన్యాన్ని ప్రశ్నించాలి.. అప్పుడైనా కొంతలో కొంతైనా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది
Friday, March 16, 2012
సిరియాలో చిచ్చు - అధ్యక్షుణ్ని చంపే అగ్రరాజ్య కుట్ర
సిరియాలో గత 11 నెలలుగా సాగుతున్న హింసాకాండ మరింత పెట్రేగిపోతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆందోళన కారుల పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రజలు వందలాదిగా చనిపోతున్న అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మొండి వైఖరి అవలంబించడంతో మరింత పరిస్థితి క్లిష్టంగా తయారయింది. దీంతో అల్లర్లను అదుపు చేయడానికి ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగక తప్పని పరిస్థితి నెలకొంది.
సిరియాలో ప్రజాస్వామ్య పాలన కావాలంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలన పై తిరగబడ్డారు. దీంతో చేసేదేమీ లేక బసద్ ప్రభుత్వం ఆందోళనను అణచే ప్రయత్నం చేస్తోంది. గత 11 నెలలుగా సాగుతున్న ఈ మారణహోమం రోజు రోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు... వందల్లో చనిపోతున్నారు. కొన్ని వార్త సంస్థలు వేలల్లో ఉన్నాయని చెబుతున్నా.. సిరియా ప్రభుత్వం ఆ వార్తలను ఖండిస్తోంది. కావాలనే కొన్ని దేశాలు తమను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర పన్నారని అధ్యక్షుడు మీడియా ముందు వివరించాడు. తమ దేశంలో సాయుధులై సంచరిస్తున్న కిరాయి ఆందోళన కారుల పైనే చర్యలు తీసుకున్నాము తప్ప సామన్య ప్రజల జోలికి వెళ్లలేదని చెబుతున్నారు.
సిరియా అల్లర్ల వెనుక కుట్ర దాగి ఉందని ప్రపంచవ్యప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే లిబియా అధ్యక్షుడు గడాఫీని అంతమొందించిన తీరులోనే ఈ వ్యూహం సాగుతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అరబ్ దేశాల్లో ఈ తరహా వ్యవహారం అన్ని దేశాలకు పాకుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ట్యునీషియా, ఈజిప్ట్, యెమెన్ దేశాల్లో ఈ తరహా అధ్యక్ష పాలన పై వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ విషయం పై అంతర్జాతీయ దేశాల్లో చర్చ జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి దృష్టి తమ పై మళ్లి చర్యలకు ఉప క్రమించేందుకే ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని సిరియా ప్రభుత్వం పదేపదే చెబుతోంది. మరో వైపు ఇప్పటికే ఆ దేశంలో సుమారు 8 వేల మంది ఆందోళన కారులను సిరియా దళాలు నిర్ధాక్షిణ్యంగా చంపాయనే వార్తలు వస్తున్నాయి.
జనవరిలో ఫ్రాన్సుకి చెందిన 100 మంది ప్రత్యేక బలగాలను అరెస్టు చేసినట్లు సిరియా ప్రకటించింది. 13 మంది ఫ్రాన్సు గూఢచార సైనికాధికారులను ఈ మార్చి నెలలోనే సిరియా ప్రభుత్వం అరెస్టు చేసినట్లుగా టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది.. వీరిని విడుదల చేయడానికి సిరియా ప్రభుత్వం ఓ వైపు చర్చలు జరుపుతూ కూడా ఫ్రాన్సు ప్రభుత్వం తమ సైనికులు సిరియాలో ఉన్నారని అంగీకరించడానికి తిరస్కరించింది. తమ దేశంలో కిరాయి తిరుగుబాటుదారులు ఉన్నట్లు సిరియా పదే పదే చెబుతోంది.. హోమ్స్ పట్నంలో 120 మంది ఫ్రెంచి బలగాలు పట్టుబడ్డాయని సిరియా ప్రభుత్వం మార్చి 1 న వెల్లడించింది. మరోవైపు కిరాయి గూండాల చేతిలో బలయిన సిరియా దళాలను కూడా తిరుగుబాటు దారుల కింద లెక్కిస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వార్తలేవీ వరల్డ్ మీడియా అంతగా బయటకు పొక్కనివ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అరబ్ దేశాలను అణిచే కుట్రలో భాగంగా సంపన్న దేశాలు చేస్తున్న కుట్రకు సామాన్య ప్రజలు బలవుతున్నారని అరబ్బులు ఆవేదన చెందుతున్నారు.
అయితే ఇదంతా చినికి చినికి గాలి వానలా మార్చి ఏదో ఒక రోజు అంతర్జాతీయ భద్రతా దళాలు సిరియాను చుట్టు ముట్టి అధ్యక్షుణ్ని మట్టుబెట్టే వ్యూహంలో భాగంగానే ఇదంతా అగ్రరాజ్యం చేస్తోందని అరబ్బులు వాదిస్తున్నారు.
నకిలీ ఉత్పత్తుల పై చైనా సూపర్ డెసిషన్... ఇండియాలో ఎప్పుడు చేస్తారో ?
ఎక్కడైనా.. ఎవరైనా సరే ఒక ప్రొడక్ట్‌కు మంచి గిరాకీ తగిలిందా... వెంటనే దానికి దగ్గర పేరుతో గానీ... అదే పేరు పలికే విధంగా కానీ ఉత్పత్తులు పుట్టుకొస్తాయి. ఈ జాడ్యం ఒక్క ఇండియాకే కాదు.. ప్రపంచంలో అన్ని దేశాల్లో చౌకబారు వ్యాపారులకూ ఈ రోగం ఉంది. దీంతో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన అసలు బ్రాండెడ్ వ్యాపారులు చాప చుట్టేస్తుంటే.. తక్కువ ఖర్చుతో నాణ్యత లేని ఉత్పత్తులు తయారు చేసే వారు మాత్రం కోట్లు గడిస్తున్నారు. అందుకే చైనా ఈ నకిలీలల నాటకాలకు తెరదించింది.. మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చైనా వినియోగ దారులకు ఒక వరాన్నిచ్చింది. ఇంతకీ చైనా ప్రభుత్వం ఏం చేసిందో చూస్తే మన దేశంలోనూ అలా చేస్తే ఎంతబావుంటుందో అని పిస్తుంది.
మనకు ఇష్టమైన వస్తువు తీసుకుందామని మార్కెట్‌కు వెళితే.. అసలు దొరకక పోగా.. అచ్చం అదే పేరుతో ఉన్న మరో ప్రొడక్ట్ కనిపిస్తుంది. పైగా అసలు దానికంటే రేటు రెండు రూపాయలు తక్కువే ఉంటుంది. . పోనీలే ఏదో ఒకటి అని ట్రై చేద్దామనుకుంటే మొదటికే మోసం వస్తుంది. అంతేకాదు ఆ ప్రొడక్ట్ పైన నమ్మకమే పోతుంది. ఆ మధ్య కాలంలో బాగా అమ్ముడవుతున్న సబ్బులు, నూనెలు, పరిమళ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలు కాపీ కొట్టడానికి పోటీ పడ్డాయి. ఇక గ్రామస్థాయిల్లో జరిగే సంతల్లో అయితే జాలీ పౌడర్ దగ్గర్నుంచి జాస్మిన్ పౌడర్ వరకు నకిలీ ప్రొడక్ట్ దొరుకుతాయి. ఇవి అసలు కంటే కాస్త ఎక్కువగానే తళతళలాడుతాయి. ఇటువంటి నకిలీ ఉత్పత్తుల వినియోగ దారులు నష్టపోవడమో.. లేక ఉత్పత్తులు అమ్ముడుపోక అసలు కంపెనీ మూత పడటమో జరుగుతుంది. ఈ జాడ్యం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కో ఇండియాకో పరిమితం కాదు.. ప్రపంచదేశాలన్నీ నకిలీ ఉత్పత్తుల బాధ పడుతున్నాయి. ఈ బెడద చైనాకు మరింత ఎక్కువ. వీటి వల్ల కార్పోరేట్ సంస్థలు కుదేలయ్యే పరిస్థితి ఎదురవడమే కాక.. ఎగుమతుల్లో కూడా నాణ్యత లేకపోవడంతో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దీంతో నకిలీ ఉత్పత్తుల పై చైనా శాశ్వత చర్యలు చేపట్టింది. అసలుకు నకిలీ కనిపిస్తే చాలు.. కనికరం లేకుండా కాల్చి పడేస్తున్నారు. మళ్లీ తిరిగి తీసుకోకుండా పూడ్చేస్తున్నారు. రిజిస్టర్ చేసేటపుడే పోలికలున్న పేరుకు అనుమతులు ఇవ్వకపోగా.. ఎవరైనా అక్రమంగా అటువంటి ఉత్పత్తులు తయారు చేసినా... ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి.. నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకొని చిత్తు చేస్తున్నారు. మొత్తం గా సుమారు 50 లక్షల విలువ చేసే ఉత్పత్తులను చిత్తు చేశారు.
ఇక్కడ కనిపిస్తున్న ఆయుర్వేద మందులు.. గృహోపకరణాలు.. అగ్నిమాపక యంత్రాలు... ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, వస్తువులన్నీ నకిలీవే... రోజు రోజుకూ పెరుగుతున్న ఈ నకిలీ ఉత్పత్తుల బెడదతో.... ఇటు వ్యాపారులు.. అటు సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలేదో నకిలీ ఏదో గుర్తించలేనంతగా తయారు చేసే పరాకష్ట దశకు చేరుకున్నారు నకిలీ వ్యాపారు. ఒక్కోసారి వెల తక్కువైన నకిలీ కంటే అసలు ఉత్పత్తులే నకిలీ ఉత్పత్తుల్లా వెలవెల బోతున్నాయి. కోటాను కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకొని.. భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టి తయారు చేసి బ్రాండెడ్ ముద్ర వేసుకున్న కంపెనీలు.. కుటీర పరిశ్రమగా పెట్టుకున్న నకిలీల బెడదతో... మూతబడుతున్నాయి. అందుకే ఇది భవిష్యత్ తరాలకు ఇటువంటి సమస్య రాకుండా చైనా జాగ్రత్త పడుతోంది. ఇక పై నకిలీ వస్తువులు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. అన్ని ప్రధాన పట్టణాల అధికారులకు నకిలీ ఉత్తత్తుల పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. చైనాప్రభుత్వ తీసుకున్న ఈ నిర‌్ణయం పట్ల సామాన్య పౌరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Thursday, March 15, 2012
నిప్పుల కుంపటి పై నిప్పన్ లు... వల్ల కాదని వణుకుతున్న జపనీయులు
నిప్పుల కుంపటి పై నిప్పన్ లు... వల్ల కాదని వణుకుతున్న జపనీయులు
జపాన్ పై ప్రకృతి పగ బట్టిందా... గతేడాది సునామీ మృత్యు ఘడియలను మర్చిపోక ముందే.. మరో ప్రమాద ఘంటిక మోగింది. ప్రతి రోజూ తొలి సూర్యోదయాన్ని చూసే ఈ నేల... అగ్ని శిఖలను కడుపులో దాచుకొని నిత్యం గడగడ వణుకుతోంది.. ఆ చల్లని సముద్ర గర్భంలో దాగిన బడబానలమేదో అప్పుడప్పుడు జడలు విప్పుకొని కడలిని కల్లోలం చేస్తుంది. ఈ కల్లోలం సముద్ర తీరం దాటి జపాన్ ప్రజల జీవితాలను తాకుతోంది..
సాంకేతిక పరిజ్ఞానం వినియోగించు కోవడంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన దేశం జపాన్. ఈ చిన్న దేశం నుంచి ఎన్నో రకాల నాణ్యమైన ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వస్తువులను తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది. కానీ ఇప్పుడీ దేశాన్ని ఓ పీడ కల వెంటాడుతోంది. జపాన్ దేశంలో అగ్ని పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. ఈ దేశాన్ని ఆవరించి ఉన్న సముద్ర గర్భంలో కూడా అగ్రి పర్వతాలు నిత్యం ఎగసి పడుతుంటాయి.. ఈ అగ్ని పర్వతాల సమయంలో భూ గర్భంలో ఫలకాల సర్ధుబాటుల వల్ల నిత్యం భూ కంపాలు సంభవిస్తున్నాయి.
సముద్రంలో పుట్టిన ఈ భూ కంపాల తాకిడికి సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడి తీరాన్ని దాటి భూమి పైకి ఎగబాకుతున్నాయి. దీంతో తీర ప్రాంతంలో ఉన్న పట్టణాలు జల ప్రళయంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. ఈ విలయ తాండవంలో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి
సరిగ్గా ఏడాది క్రితం... ఉన్నట్టుండి జపాన్ తీరానికి దూసుకొచ్చిన రాకాసి కెరటాలు వందలాది మందిని కబళించాయి. సముద్రంలో ఉన్న నావలన్నీ అల్లకల్లోలమయ్యాయి.. సమద్ర తీరంలో ఉన్న పట్టణాలన్నీ జలమయమయ్యాయి. ఈ కెరటాల దారిలో ఏది ఉన్న అది నేల మట్టం అయింది ఎన్నో బ్రిడ్జిలు.. వాహనాలు, భవంతులు, వృక్షాలు, జంతువులు.. ఇదీ అదీ అనే తేడా లేకుండా కెరటాల దారిలో ఏది వస్తే దాన్ని తమ ప్రవాహంలో కలుపుకున్నాయి. విలువైన వాహనాలు, వస్తువులు ఎన్నో నీళ్ల పాలయి, పనికి రాని వస్తువులుగా మారిపోయాయి. అణు కర్మాగారాల్లో నీరు జొరబడి రేడియో వికిరణాలు విడుదలవుతాయని అందరూ భయపడ్డారు. ఈ వికిరణాలు సముద్రం మార్గం గుండా పొరుగు దేశాల పై కూడా ప్రభావం చూపబోతున్నాయనే వదంతులు వ్యాపించాయి. సునామీ వేటుకు మృత్యువాత పడ్డవారు కాక బతికున్న వారు రేడియో ధార్మకత ప్రభావం వల్ల చర్మవ్యాధులతో నిత్య నరకం అనుభవించాలేమోనని గడగడ వణికారు. కానీ ఆ ప్రమాదం తృటిలో తప్పింది. అయినా జపాన్ లాంటి సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి సాధ్యమైనంత త్వరగా కోలుకుంది.
ఇప్పుడిప్పుడే జపాన్ ఆ పీడ కలల గుర్తుల నుంచి తేరుకుంటుంది.. ఆ విషాద ఛాయలను మర్చిపోయే ప్రయత్నం చేస్తోంది. సునామీ సుడిగుండంలో కోల్పోయిన తమ వారిని గుర్తు చేసుకొని... సముద్రజలానికి తమ కన్నీళ్లు జోడించి నివాళులర్పించారు. వీరి పుష్పగుచ్చాలు చూసి కడలి కెరటాలు గతాన్ని గుర్తు తెచ్చుకున్నాయోమో అన్నట్టు మళ్లీ కడలిగర్భం కంపించింది. అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ లో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.2 గా నమోదయింది. అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరిచిపోయిన భయం మళ్లీ గుబులు రేపింది. ఏడాది క్రితం చూసిన మృత్యు హేలను గుర్తు తెచ్చుకొని అప్రమత్తమయ్యారు. నిప్పల కుంపటి పై నిలుచున్న ఈ నిప్పన్ ల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని జపాన్ వాసులు భీతిల్లుతున్నారు. సునామీ రాకను ముందే గుర్తించి అధికారులు చెబుతున్నా ఏమరుపాటున ఏ రోజైనా కడలి గుప్పిట్లో కలిసిపోవలి వస్తుందేమో నని హడలిపోతున్నారు.
Wednesday, March 14, 2012
రైల్వే మంత్రి దినేశ్‌కు మమతా బెనర్జీకి ఎందుకు చెడింది..?
దినేశ్ త్రివేది... ఇప్పుడీ పేరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దినేశ్ త్రివేది అంటే రైల్వే మినిస్టర్ గానే తెలుసు. పార్లమెంట్ లో ఆయన మార్కు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టగానే మమత ఒక్కసారి కస్సుమంది. దీంతో జాతి యావత్తూ ఒక్కసారి దినేశ్ వైపు చూశారు. సొంత పార్టీ మంత్రి పై మమత బహిరంగంగా విమర్శలు చేయడం వెనుక మతలబు ఏంటనేది భేతాళ ప్రశ్న. దినేశ్ త్రివేది దీదీకి కొరకరాని కొయ్యగా మారారన్నవార్తల్లో నిజమెంత... ఇంతకీ త్రివేది ప్రస్థానమేంటి...
ఇప్పుడు రైల్వే శాఖ మంత్రిగా ఉన్న దినేశ్ త్రివేదికి... మొదటి నుంచి భిన్నమైన వ్యక్తిగానే పేరుంది.. పశ్చిమ బెంగాల్,, బరాక్‌పూర్ నియోజక వర్గం నుంచిప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్రివేది వివిధ రకాల పదవుల్లో కొనసాగారు. 1974లో ఎంబీఏ పూర్తి చేసి చికాగోలో డిటెక్స్ కంపెనీలో ఉద్యోగం చేశారు. తరువాత ఉద్యోగానికిరాజీనామా చేసి సొంత వ్యాపారంలోకి దిగారు. దీంతో బాటు వినియోగదారుల రక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా కోర్టుల్లో ఎన్నో పిటీషన్లు వేసేవారు. సమాచార హక్కు చట్టం రూపుదాల్చడం వెనుకు దినేశ్ త్రివేది పిటీషన్లు కూడా ఊతమిచ్చాయి.
త్రివేది 1980లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరినా తరువాత 1990లో జనతాదళ్ లో చేరారు. మమతా బెనర్జీ 1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించగానే టీఎమ్సీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ తొలి ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 1990 నుంచి2008 వరకు ఎగువ సభలో సభ్యులుగా ఉన్నారు. రాజ్యసభ వైస్ చైర్మన్ గా పనిచేశారు. 2009 ఎన్నికల్లో బరాక్‌పూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009 నుంచి వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో అన్నా హజారేకి మద్దతుగా మంత్రిపదవికి రాజీనామా చేయాలని
రైల్వే మంత్రిగా దినేశ్ త్రివేదికి తనకంటూ కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. రైల్వేలను పురాతన కాలపు పద్దతుల నుంచి తప్పించి ఆధునికీకరించాలనేది ఆయన అభిప్రాయం. రైల్వేలను ఆధునికీకరించ కుంటే ప్రమాదాలు నివారించలేమని ఆయన విశ్వాసం. కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రైల్వే చార్జీలు పెంచడానికి పూర్తి వ్యతిరేకమని చెబుతోంది. రైల్వేలను ఆధునికీకరించాలంటే కావలసిన నిధులను చార్జీల ధర పెంచడం ద్వారానే పొందాలని త్రివేది భావించారు. అందుకు అనుగుణంగానే పార్టీ నిర్ణయాన్ని పక్కన పెట్టి స్వల్పంగా రైల్వే చార్జీలు పెంచారు. త్రివేది తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీ అగ్రనేతకు ఆగ్రహాన్ని తెప్పించింది. మాటమాత్రం కూడా చెప్పకుండా చార్జీలు పెంచడం పట్ల భగ్గుమంది. మంత్రి చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి లేదా రాజీనామా చేయాలన్న వాదన తెరపైకి వచ్చింది. అయితే ఇది హైడ్రామానా.. లేక మమత మాటను త్రివేది పెడచెవిన పెట్టారన్న అన్న కోపమా అనే చర్చ సాగుతోంది.
Tuesday, March 13, 2012
తిరుమల వెంకటేశుడి తేజస్సులో అసలు రహస్యం ?
తిరుమల వెంకటేశుడి తేజస్సులో అసలు రహస్యం ?
తిరుమల వెంకన్నకి జరిగే సేవలు.. అవి చూడడానికి రెండు కళ్లు చాలవు.. ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు.. అందులోనూ సుప్రభాతం, అభిషేకం సేవలను జీవితంలో ఒక్కసారైనా చూసి తరించాలని ప్రతీ భక్తుడు తపన పడుతుంటాడు.. అలాంటి అభిషేక సేవలో వాడే అత్యంత ముఖ్యమైనది పునుగుపిల్లి తైలం... ఆ తైలం దొరకక మొన్నటి వరకూ టిటిడి నానా ఇబ్బందులు పడింది. పునుగు పిల్లులు అంతరించిపోవడమే అందుకు కారణం.. ఎలాగోలా స్వామి వారి సేవ కోసం వున్న పునుగు పిల్లులనే పరిరక్షించి కాపాడి సేవలను కొనసాగించాలనుకున్న టిటిడికి ఈసారి మరో ఇబ్బంది ఎదురైంది. శ్రీవారి అభిషేకానికి మరోసారి ఆటకం ఎదురవుతోంది. ఇంతకీ పునుగుపిల్లికి ఎందుకంత ప్రాధాన్యం...? దానికున్న విశిష్టత ఏంటి..? ఇప్పుడో స్పెషల్ రిపోర్ట్
ఆయన దివ్య మంగళ స్వరూపుడు.. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం.. వేకువజామునే ఆ శ్రీవారిని దర్శించుకుంటే అన్ని కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే సుప్రభాత సేవ చూడడానికి భక్త జనం పోటీ పడుతుంటారు.
కలియుగ ప్రత్యక్ష దైవం.. ఏడు కొండల వెంకన్న... ఆయనకు జరిగే సేవలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు.. వేకువ జామున... చిరు చీకట్లు అలుముకొని ఉండగా.. చలిగాలులు పులకింతలు రేపుతుంటే, పక్షుల కిలకిలారావాలు వీనుల విందు చేస్తుంటే, కౌసల్యా సుప్రజారామా అంటూ సుప్రభాతం పాడుతూ శ్రీవారికి మేలుకొలుపు పాడడం... అదో దివ్యానుభూతి.
ఈ సుప్రభాత సేవతోనే శ్రీవారి సేవలు మొదలవుతాయి.. తెల్లవారుజామున 3 గంటలకు బంగారు వాకిలి ద్వారాలు తెరవడంతో శ్రీవారి సేవలు ప్రారంభమవుతాయి.
జీయంగార్లు తెచ్చిన పాలు, చక్కెర, తాంబూలం పళ్లేలతో లోపలికి వెళ్లిన అర్చకులు శ్రీవారికి సుప్రభాత సేవ చేస్తారు.
ఇక ప్రతీ శుక్రవారం సుప్రభాత సేవ అనంతరం శ్రీవారికి అభిషేకం నిర్వహిస్తారు. పచ్చకర్పూరం, తులసి, గంధం, పసుపు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పునుగుపిల్లి తైలం, మరిన్ని సుగంధ పరిమళాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు.
పునుగుపిల్లి తైలంతో శ్రీవారికి అభిషేకం చేస్తే ఆయన శాంతిస్తారని, మనం చేసే తప్పుల్ని మన్నిస్తారని అర్చకులు చెబుతారు
అయితే ఈ మధ్య కాలంలో శేషాచలం అడవుల్లో పునుగు పిల్లులు కనుమరుగు కావడంతో తైలం కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి నెలకొంది. పునుగు పిల్లి తైలం కోసం టీటీడీ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.
వెతకబోయే తీగ కాలికి తగిలితే.. ఎదురు చూస్తున్న దేదో చేతికి అంది వస్తే.. టిటిడికి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. వున్నట్టుండి శేషాచలం కొండల్లో పునుగుపిల్లి ప్రత్యక్షమైంది. ఇంకేం.. టిటిడి అధికారుల్లో మళ్లీ కొత్త ఉత్సాహం..
అయితే ఆ ఉత్సాహం ఎంతో కాలం నిలవలేదు... ఇప్పుడు పునుగుపిల్లికి కొత్త ఆపద పొంచి ఉంది... పునుగుపిల్లిని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
అంతరించిపోతున్న జాబితాలో చేరిపోయిన పునుగుపిల్లి శేషాచలం అడవుల్లో దొరికిందన్న ఆనందం టీటీడీ అధికారులకు ఎంతో సేపు నిలవలేదు... కారణం పునుగు పిల్లిపై స్మగ్లర్ల కన్ను పడింది... అలిపిరి చెక్ పాయింట్ దగ్గర వాహనాలు తనఖి చేస్తుండగా ఓ అట్టపెట్టెలో పునుగుపిల్లి బయటపడింది... ఈ పునుగుపిల్లి గాయాలతో ఉండడంతో టీటీడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఈ పునుగుపిల్లిని ఎవరు, ఎందుకు తరలిస్తున్నారనే దానిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు.పునుగుపిల్లికి చికిత్స నిర్వహించి జూకి తరలించారు.
గత డిసెంబర్‌లో పునుగుపిల్లి తిరుమలలో ప్రత్యక్షం కావడంతో టీటీడీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఓ గద్ద దీనిని మోసుకొని నారాయణగిరి అడవుల్లో వదిలేసిందని అధికారులు చెబుతున్నారు.. దీని వయసు 30 రోజులలోపే ఉండవచ్చునని ఓ అంచనా. ఈ పునుగు పిల్లిని ఆడపిల్లగా గుర్తించారు..దీని తల్లి కూడా శేషాచలం అడవుల్లోనే ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంచనాకు వచ్చారు.. దీంతో ఈ సంతతిని అభివృద్ధి చేయవచ్చునని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో పునుగు పిల్లి ఉంది... షెడ్యూల్ 2 కింద పునుగు పిల్లిని కేంద్ర జూ ప్రాధికార సంస్థ గుర్తించింది... ఈ సంతతిని రక్షించుకోవాలని తిరుపతిలో ఎస్వీ జంతు ప్రదర్శన శాలలో మూడు పునుగుపిల్లులను అటవీ శాఖ పెంచుతోంది.. అంతేకాదు ఈ పిల్లుల సంతతిని పెంచడానికి టీటీడీ ప్రత్యేక ప్రాజెక్టుని చేపట్టింది.. దీనికోసం అయిదు కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించింది..
అసలు ఈ పునుగు పిల్లి నుంచి తైలం తీసే విధానంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఇనుపజల్లెడలోని ఓ గదిలో పునుగుపిల్లిని ఉంచుతారు... ఇనుప జల్లెడ గది పై భాగంలో రంధ్రం ఏర్పాటు చేస్తారు. రంధ్రం ద్వారా చందనపు కర్రను గదిలోకి నిలబెడతారు. ఈ పిల్లికి రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతీ పది రోజులకి ఒకసారి హావభావాలను ప్రదర్శిస్తూ చందనపు కర్రకు పిల్లి తన చర్మాన్ని రుద్దుతుంది. ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే పదార్థమే పునుగు తైలం.. ఈ తైలానికి సుగంధ పరిమళాలతో చూర్ణం చేసి మూలవిరాట్టుకు అభిషేకం చేస్తారు.
అసలు ఈ పునుగు తైలానికి ఉన్న విశిష్టత ఏంటి..? టీటీడీ ఈ తైలం కోసం ఎందుకంత ఆరాటపడుతోంది.. ఒక్క ప్రాణిని బతికించుకోవడానికి అయిదు కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది..?
తిరుమల వెంకన్నకు జరిగే సేవల్లో ప్రతీ శుక్రవారం జరిగే అభిషేకానికి ఎంతో ప్రాధాన్యత ఉంది... ప్రతీ భక్తుడు జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ సేవలో పాల్గొనాలని ఉవ్విళ్లూరుతాడు. తిరుమలేశుడికి వివిధ రకాలైన ఉత్సవాలు ఆరాధనలు నిర్వహించిన టీటీడీ మూల విరాట్టు తేజస్సు తగ్గకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే పునుగు పిల్లి తైలంతో అభిషేకం చేస్తోంది.. పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, చందనం, కస్తూరి పునుగు తైలం మిశ్రమాలను ఈ అభిషేకంలో వాడతారు. వీటితో పాటు యాలకులు, లవంగాలు వంటి ఔషధ గుణాలున్న వనస్పదులను వినియోగిస్తారు. అయితే వీటన్నింటిలో పునుగుతైలం విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. పునుగుపిల్లి తైలాన్ని చందనం కర్ర ద్వారా సేకరించి, దానిని నువ్వుల నూనెతో రంగరించి ఆ దేవదేవుడి అభిషేకానికి ముందు, తర్వాత శ్రీవారి దివ్య మంగళ దేహానికి తాపడం చేయడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా శ్రీవారి సాలగ్రామ రూపం తేజస్సు ిఇనుమడిస్తుందని ఆలయ అర్చకులు చెబుతున్నారు.
అంతే కాదు.. ఈ తైలంతో అభిషేకం చేస్తే శ్రీవారు శాంతిస్తారని ప్రజలకు సకల సౌభాగ్యాలు అందిస్తారని ఓ నమ్మకం... ఇంతటి విశిష్టత కలిగిన ఈ తైలానికి ఇప్పుడు మరో కొత్త కష్టం వచ్చి పడింది.
దేవుడు వరమిచ్చినా.. పూజారి అడ్డుతగిలినట్లుంది పునుగుపిల్లి తైలం సేకరణ.. మొన్నటి వరకూ పునుగు పిల్లులు దొరకకపోవడం ఓ సమస్య అయితే.. ఇప్పుడు వాటిని పెంచడానికి టిటిడికి అధికారమే లేదంటూ కొత్త ఆంక్షలు వెలుగు చూడటంతో టిటిడి అధికారులు బిక్కమొహం వేస్తున్నారు.
పునుగు పిల్లి తైలంతో స్వామి వారి శోభ మరింత ఇనుమడిస్తుంది.. యుగాలు గడుస్తున్నా.. కాలాలు మారుతున్నా స్వామి వారి దివ్య మంగళ విగ్రహం అదే కళతో, అదే తేజస్సుతో విరాజిల్లుతోంది. మూల విరాట్టులో దివ్య తేజస్సే కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. ఆ తేజస్సుకు కారణం పునుగు తైలమే..
ప్రపంచం యావత్తూ ఆయన ముందు మోకరిల్లి దర్శించి తరిస్తోంది. స్వామి వారి విగ్రహాన్ని ఎంత చూసినా తనివి తీరదు.. స్వామి వారి దివ్య మంగళ విగ్రహం చూసే భాగ్యం ఒక్క క్షణమే కలిగినా.. దూర తీరాలనుంచి ఆ ఒక్క క్షణం కోసమే భక్తులు తరలి వస్తారంటే విగ్రహంలో వున్న మహత్తు అలాంటిది..
గంటల తరబడి క్యూలో నిరీక్షించే భక్తులను ఓపికగా నిలబెట్టేది మూల విరాట్టులో కనపడే దివ్య తేజస్సే.. ఆ తేజస్సుకు మూల కారణమైన పునుగు తైలం సేకరణ సమస్య ఇప్పుడు కొత్త రూపు తీసుకుంది. పునుగు పిల్లుల పెంపకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టరాదని సెంట్రల్ జూ అథార్టీ తిరుపతి వన్యప్రాణి విభాగాన్ని ఆదేశించింది. ఫలితంగా ప్రతిశుక్రవారం స్వామి వారికి నిర్వహించే అభిషేకం సేవకు కొత్త కష్టం వచ్చిపడుతోంది. పునుగు తైలంతో నిర్వహించే సేవంటే శ్రీవారికి అత్యంత ఇష్టమని పురాణాల్లో వుంది. అందుకే అభిషేకం సేవ కోసం టిటిడి స్వయంగా పునుగు పిల్లులను పెంచేది. అయితే 2004లో టిటిడి బలవంతంగా వాటి నుంచి తైలాన్ని సేకరిస్తోందని జీవకారుణ్య సంస్థ సెంట్రల్ జూ అథార్టీకి ఫిర్యాదు చేయడంతో ఇక ఆ పిల్లుల పెంపకమే టిటిడి చేపట్టరాదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. తాజా ఆదేశాలతో కోట్లాది మంది విశ్వాసంతో ముడిపడిన ఓ పవిత్ర సేవకు కలిగే ఆటంకం ఎలా తొలగిపోతుంది? దీనిపై టిటిడి మళ్లీ కోర్టుకు వెళ్లి ఏమైనా ఆదేశాలు తెచ్చుకుంటుందా అన్నది తేలాలి..
Saturday, March 10, 2012
రాజకీయ పార్టీలకు పరీక్షలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సారాంశం ఏమిటి? ప్రజల తీర్సులోని ఆంతర్యం ఏమిటి? ఈ ఎన్నికల ఫలితాలు అవినీతికి ఆలవాలమైనందుకు మాయావతి సర్కార్ ను సాగనంపాయి. అదే కారణంతో కాంగ్రెస్ పార్టీకి పరువునష్టం కలిగించాయి. నికరమైన ప్రత్యామ్నాయంగా నిలిచిన సమాజ్ వాదీ పార్టీకి పట్టం కట్టాయి. అనిశ్చితికి ఆస్కారం లేకుండా, సంకీర్ణ కూటమికోసం బేరసారాలకూ, డబ్బుదస్కాలకూ ప్రమేయం లేకుండా ములాయం సింగ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ప్రసాదించాయి.
ఇవి పార్లమెంటు ఎన్నికలు కాకపోయినా 2014లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫెనల్స్ గా పరిశీలకులు పరిగణించారు. పంజాబ్ లో బాదల్ నాయకత్వంలోని అకాలీదళ్ పార్టీ పాలన కొనసాగాలనే ప్రజలు నిర్ణయించారు. కొండంత ఆశ్చర్యం కలిగించారు. బాదల్ బంధుప్రీతి, అవినీతి ఆరోపణల కంటే కాంగ్రెస్ పైన వచ్చిన ఆరోపణల ప్రభావం ఎక్కువ. అందుకే బాదల్ కు మరో సారి అవకాశం ఇచ్చారు ప్రజలు. గోవాలో అధికార మార్పిడి ఊహించిందే. మణిపూర్ లో కాంగ్రెస్ హ్యట్రిక్ కూడా అనుకున్నదే. అక్కడ ప్రతిపక్షం బలంగా లేదు. ఉత్తరాఖండ్ లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా గట్టిపోటీ ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్ మాత్రం చరిత్ర సష్టించింది. 1985 తర్వాత ఏ ఎన్నికలోనూ ఏ రాష్ట్రంలోనూ సమాజ్ వాదీ పార్టీ నమోదు చేసినంతటి భారీ విజయాన్ని మరో పార్టీ సాధించిన సందర్భం లేదు. రెండు యువకెరటాలు ఎన్నికల ప్రచారంలో ఉవ్వెత్తున ఎగిసినట్టు కనిపించాయి. ఒకటి మాత్రమే అట్టహాసంగా తీరం చేరింది. మరొకటి మధ్యలోనే మటుమాయం అయింది. ములాయం తనయుడు అఖిలేష్ సృష్టించిన కెరటం ఉత్తరప్రదేశ్ ని ముంచెత్తగా రాహుల్ కెరటం మధ్యలోనే విరిగి పడిపోయింది. ఇద్దరు యువనాయకులు పోటాపోటీగా ప్రచారం చేసిన ఎన్నికలో స్థానిక యువకుడు ప్రజల హదయాలను దోచుకున్నాడు. ఢిల్లీబాబుకి ప్రజలు జెల్లకొట్టారు. ఇది వర్తమాన రాజకీయాలను అర్థం చేసుకోవడానికీ, భవిష్యత్ పరిణామాలను అంచనా వేయడానికీ ఉపకరించే తీర్పు. ముఖ్యంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు గుణపాఠాలు నేర్చుకోవలసిన సందర్భం.
టూ జీ స్పెక్ట్రమ్ మొదలు వరుస కుంభకోణాలతో చిక్కుకున్న కాంగ్రెస్ ఘనవిజయాలు సాధిస్తుందని ఎవ్వరూ జోస్యం చెప్పడానికి సాహసించలేదు. కానీ ఉత్తర ప్రదేశ్ లో మాయావతి సర్కార్, పంజాబ్ లో బాదల్ పరివారం, ఉత్తరాఖండ్ లో ఖండూరీ ప్రభుత్వం బాగా బదనాం అయిన కారణంగా కాంగ్రెస్ కు ఎంతోకొంత లాభం జరుగుతుందని అనుకున్నారు. పంజాబ్ లో బాదల్ గెలుపు, ఉత్తరాఖండ్ లో అత్తెసరు మార్కులతో గట్టెక్కిన పరిస్థితి చూస్తే కాంగ్రెస్ కు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో రాహుల్ గాంధీ శక్తినంతా ఒడ్డి ఎన్నికల ప్రచారం చేసినా ప్రయోజనం లేకపోయింది. కుటుంబ స్థావరాలుగా పరిగణించిన అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గాలలో సైతం కాంగ్రెస్ ఆబోరు దక్కలేదు. కేంద్రమంత్రుల సుతులూ, సతులూ పరాజయం చెందారు. రాహుల్ ఆంతరంగిక మిత్రుడైన జతీన్ ప్రసాద పప్పులు కూడా ఉడకలేదు. ఉత్తరప్రదేశ్ లో వీచింది ఒక్క సమాజ్ వాదీ పార్టీ అనుకూల ప్రభంజనమే కాదు. కాంగ్రెస్ వ్యతిరేక పవనాలూ వీచాయి. మాయావతి ప్రతికూల ప్రభంజనం ఎట్లాగూ ఉంది. వెరసి ఎగసి పడిన ఉత్తుంగ తరంగంపైన సమాజ్ వాదీ పార్టీ ఎవ్వరికీ అందని ఎత్తుకు ఎదిగింది. కాంగ్రెస్ కు అవమానకరంగా, అగమ్యగోచరంగా, నిరాశాజనకంగా పరిస్థితులు పరిణమించాయి. ఈ దుస్థితి దాపురించడానికి దారితీసిన వాస్తవ కారణాలను తెలుసుకొని అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటేనే కాంగ్రెస్ భవిష్యత్ సంగ్రామాలలో యుద్ధం చేయగలదు, విజయాలు సాధించగలదు.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ఓటమికి తానే బాధ్యుడినంటూ రాహుల్ గాంధీ ఒప్పుకోవడం అతని పట్ల గౌరవం పెంచింది. కొన్ని మాసాలుగా మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన సోనియా కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కొన్ని గంటలు సహచరులతో సమాలోచనలు జరిపి మీడియాతో మాట్లాడటం ఈ ఎన్నికల ఫలితాలకు కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాముఖ్యం ఇచ్చిందనడానికి నిదర్శనం.
కాంగ్రెస్ ఓటమికి బహునాయకత్వం, సంస్థాగత దౌర్బల్యం ప్రధాన కారణాలుగా సోనియా గుర్తించారు. ఆమె గుర్తించని ముఖ్యమైన కారణం మరొకటి ఉంది. స్థానికంగా బలమైన నాయకుడు లేదా నాయకురాలు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి శాపంగా పరిణమించింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రేపు తమను ఎవరు పరిపాలిస్తారో ప్రజలకు తెలియకపోవడం, ప్రాంతీయ పార్టీలతో పోటీ పడి కుల,మత రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ తెగబడటం కూడా ఆ పార్టీకి నష్టం చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడటం, ముస్లింలను మెప్పించడానికి అనవసరమైన ప్రయత్నాలు చేయడం, అమలు చేయడం సాధ్యం కాని వాగ్దానాలు చేయడం కూడా బెడిసి కొట్టింది.
దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ప్రజలు ఆదరిస్తున్నారు. స్థానికంగా ప్రాబల్యం కలిగిన గట్టి నాయకులకే పట్టం కడుతున్నారు. ములాయం, మాయావతి, జయలలిత, కరుణానిధి, మమతాబెనర్జీ, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్, చంద్రబాబా నాయుడు వంటి నాయకులను ఎదిరించి నిలబడే కాంగ్రెస్ నాయకులు లేరు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం లేదు. యువతరం ప్రతినిధులూ ఉన్నారు. కానీ రాష్ట్రాలలో నాయకులు బలపడితే కేంద్రంలో మనుగడ కష్టమనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీని కొంత కాలంగా ప్రభావితం చేస్తూ వచ్చింది. నెహ్రూ హయాంలో రాష్ట్రాలలో బలమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రులూ, ఇతర నాయకులూ ఉండేవారు. నెహ్రూ మేరనగ సమానుడు కనుక ఆయనకు వారు గౌరవం ఇచ్చేవారు. వారిని చూసి నెహ్రూ భయపడే పరిస్థితులు లేవు. లాల్ బహద్దూర్ శాస్త్రి మరణం తర్వాత ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచీ పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రాంతీయ నాయకులు ఒక సిండికేటుగా ఏర్పడి ప్రధాని ఇందిరను కట్టడి చేయడానికి ప్రయత్నించిన తీరు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం కలిగించింది. ప్రధాని పదవిలో ఉన్న ఇందిర ఆత్మరక్షణకోసం సహచరులతోనే పోరాడవలసిన పరిస్థితులు ప్రాంతీయ నాయకులను అస్థిర పరిచే కార్యక్రమాలకు దారితీశాయి. పార్టీని చీల్చిన తర్వాత ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో స్థానికి నాయకలు బలపడకుండా జాగ్రత్తపడటం స్పష్టంగా కనిపించిన పరిణామం. ఒక నాయకుడిపైన మరో నాయకుడిని పోటీ పెట్టడం, ఎవ్వరినీ నమ్మకపోవడం, అసమ్మతిని అధిష్ఠానమే ప్రోత్సహించడం, అందరినీ అభద్రతాభావంలో పడి కొట్టుమిట్టాడే పరిస్థితులు కల్పించడం, మనుగడకోసం అధిష్ఠాన దేవతల కరుణాకటాక్ష వీక్షణాలకోసం హస్తిన చుట్టూ రాష్ట్ర స్థాయి నాయకులు ప్రదక్షిణలు చేయవలసిన అవసరం కల్పించడం తెలిసిందే. 1970లలో ప్రారంభమైన ఈ తంతు ఇప్పటికే యథావిధిగా కొనసాగుతోంది. దీనివల్ల పార్టీ అధేనేత చుట్టూ కొందరు నాయకులూ, సలహాదారులూ చేరి అసలు అధికారాలను వారే పరోక్షంగా చెలాయించడం, ముఖ్యమంత్రులను తమ చుట్టూ తిప్పించుకోవడం, వారి చేత కూడని పనులు కూడా చేయించుకోవడం మొదలయింది. నలుగురు ముఖ్యమంత్రుల కంటే పార్టీ అధిష్ఠానంలో పలుకుపడి కలిగిన ఒక కేంద్రనాయకుడు, ఆ రాష్ట్రాలను పర్యవేక్షించే నాయకుడు బలవంతుడైనాడు. అధిష్ఠానవర్గంలోని సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి పైరవీలు చేసే స్థాయికి రాష్ట్ర నాయకులు దిగజారారు. గులాంనబీ ఆజాద్ లాంటి ప్రజాబలం లేని నాయకులు అధిష్ఠానం ప్రాపకంతో రాష్ట్రాల భవిష్యత్తును శాసించే స్థాయికి ఎదిగారు. ఎదురు చెప్పకుండా, చెప్పినట్టు నడుచుకునే నాయకశ్రేణులను చూసి వారే తమ బలమంటూ భ్రమించే స్థితిలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఉంది. అంతర్గత కలహాలనూ, వైరుధ్యాలను పరిష్కరించడానికే అధిష్ఠానం శక్తియుక్తులు చాలకపోవడంతో పార్టీకీ, దేశానికి సరికొత్త దిశానిర్దేశం చేసే పరిస్థితులు కరువైనాయి. రాజశెఖరరెడ్డి వంటి స్థానిక నాయకులు బలపడి అధిష్ఠానవర్గానికే కొరుకుడు పడని సందర్భం వచ్చినప్పుడు ఇందిరాగాంధీ విధానమే సరైనదనీ, రాష్ట్రాలలో నాయకులను బలపడనిస్తే కేంద్రంలో కాంగ్రెస్ బలహీనపడుతుందనీ తీర్మానించే ధోరణి మళ్లీ ప్రబలుతోంది. వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పతనానికీ, ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికీ, ప్రాంతీయ పార్టీల నాయకులు బలోపేతం కావడానికి ఈ ధోరణే ప్రధాన కారణం.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రా నాయకురాలు రీటా బహుగుణ అనే వృద్ధ నాయకురాలు. రాహుల్ ఢిల్లీ నివాసి అనీ, ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న యువకుడనీ యూపీ ప్రజలకు తెలుసు. అందుకే యువకుడూ, స్థానికుడూ, ఉత్సాహవంతుడూ అయిన అఖిలేష్ నాయకత్వంలో కదిలారు. సమాజ్ వాదీ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ తరఫున అఖిలేష్ కు దీటైన యువనాయకుడు ఉండీ, స్థానిక నాయకత్వం బలంగా ఉండీ, పార్టీ కార్యకర్తలు రాష్ట్రం అంతటా చురుగ్గా యుద్ధానికి సంసిద్ధంగా ఉండి ఉంటే రాహుల్ ప్రచారం సార్థకమై ఉండేది. రాహుల్ సృష్టించిన కెరటాన్ని తీరం దాటించి ఓట్ల తుపానుగా మార్చే పరిస్థితులు ఉండేవి. అటువంటి పరిస్థితులు ఏర్పడాలంటే కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలో అభద్రతాభావం తొలగిపోవాలి. స్థానికి నాయకులకు స్వేచ్ఛ నివ్వాలి. వారిని బలపడనివ్వాలి.
భారతీయ జనతా పార్టీకి అదనపు సమస్యలు ఉన్నాయి. దేశాన్ని సమర్థంగా పరిపాలించిన వాజపేయి వారసత్వాన్ని ఆ పార్టీ మరించింది. అన్నివర్గాలనూ కలుపుకొని పోయే వాజపేయి తరహా రాజకీయాను భాజపా విస్మరించింది. ఆరెస్సెస్ జోక్యంతో లాల్ కృష్ణ అద్వానీ చురుకైన పాత్ర పోషించడం లేదు. చివరికి నరేంద్ర మోడీకి పగ్గాలు అప్పగించాలనే తీర్మానం చేసే అవకాశం కనిపిస్తున్నది. సంకోచం వదిలి ఏదో ఒక నిర్ణయం తీసుకొని నాయకత్వం గురించి స్పష్టమైన వైఖరి ప్రకటిస్తే, భాజపా గెలిస్తే ప్రధానమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారో ప్రకటిస్తే ప్రధాన ప్రతిపక్షానికి కొంత మేలు జరుగుతుంది. జాతీయ పార్టీలు స్వీయబలహీనతలను అధిగమించకపోతే, ఇల్లు చక్కదిద్దుకోపోతే ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి యూపీఏ, ఎన్ డీ ఏలకు ప్రత్యామ్నాయంగా సరి కొత్త సంకీర్ణం ఏర్పడే అవకాశం ఉంది. అదే జరిగితే 2014నాటి సార్వత్రిక ఎన్నికలు దేశ చరిత్రను మరో మలుపు తిప్పుతాయి. ఇది సంధికాలం. జాతి యావత్తుకూ పరీక్షా సమయం.
Monday, March 5, 2012
రైతులకు కామధేనువు దొరికింది...
భారత దేశ సంప్రదాయంలో గోవులకున్న విలువ అపారం...కానీ కాలం కలిసి రాక.. ఆవులు గోశాల నుంచి వధ శాలలకు వెళుతున్నాయి గానీ.... వాస్తవానికి సకల దేవత నిలయంగా గోమాతను పిలుస్తారు. గోవును దేవతగా పిలవడం... కామధేనుగా భావించడం అనేది అంతా కట్టుకథగా భావించారు. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం... నిత్య నూతనంగా వస్తున్న పరిశోధనలు గోవు నిజంగా కామధేనువే నని రుజువు చేస్తున్నాయి. గోవులు ఎలా కామధేనులయ్యాయి.. కేవలం పాలిచ్చినంత మాత్రాన గోవులు కామధేనువులా... లేక వయసు ఉడికి మాంసంగా మారినంత మాత్రాన కామధేనుగా మారిందా... ఇంకా ఏమైనా ఉపయోగాలున్నాయా.. కామధేనువు వెనుక దాగిన శతాబ్దాల కథేంటి..
గోవు.. భారతీయుల పాలిట కామధేనువు.. పూర్వం మహర్షులకు కావలసిన కోరికలు చిటికలో తీర్చే శక్తిగల కామధేనువు సంతతే ఈ గోవులు.. వందల మంది అథిధులకు కూడా కావలసిన పదార్ధాలను వండి వార్చడంలో కామధేనును మించిన శక్తిమంతురాలు లేదని పురాణ కథనం.. ఈ కామధేనువు వల్ల రుషుల్లో భేదాభిప్రాయాలు వచ్చాయి.. పూర్వం గో సంపద కోసం యుద్ధాలు కూడా జరిగాయి. దేశంలో పాడి ఎంతగా వర్ధిల్లితే... అంత సుభిక్షంగా ఉంటుందని పెద్దలు చెబుతారు. ఒకప్పుడు పాడి కోసమే ఆవులు కానీ.. ఇప్పుడు ఆవుల నుంచి పాలకు మించిన ఆదాయం ఇతర పదార్ధాల ద్వారా వస్తుందనే విషయం తెలుసుకున్న ఆధునిక శాస్త్రవేత్తలు గోవు నిజంగా కామధేనువేనని ఒప్పుకుంటున్నారు.
పురాతన కాలం నుంచీ భారతీయ సాంప్రదాయంలో పశు సంపదకున్న ప్రాధాన్యం అపరిమితం... గోవును దేవతగా పూజిస్తారు. ఆ మాటకొస్తే సకల దేవతా నిలయం గోమాత అని పురాణాల్లో చెబుతారు. రైతుకు జీవితకాలం నేస్తం గోవులే.. రైతు పొలం సాగు చేయడానికి పండిన పంట ఇంటికి చేర్చడానికి.. పంటకు బలవర్ధకమైన ఎరువు ఇవ్వడానికి... ఇంట్లో పాడి ఇవ్వడానికి రైతుకు చెక్కు చెదరని నేస్తం గోవు.. ఇంత లాభసాటి గోవుకు ఇప్పుడు నిరాదరణ ఎదురవుతోంది.. కాలం కలిసిరాకో... లేక రోజు రోజుకూ పెరుగుతున్న యాంత్రీకరణ విధానం.. రసాయన ఉత్పత్తుల ప్రభావం వల్ల ఆవు కనుమరుగవుతోంది... కానీ విదేశాల్లో ఆవుకున్న ప్రాధాన్యం తెలుసుకొని రోజు రోజుకూ ఆవులను పెంచే కార్యక్రమంతో బాటు.. వేలాది ఎకరాల్లో పంట పండించి కేవలం మేత కోసమే ఉపయోగిస్తున్నారు. ఎప్పుడో ప్రాచీన కాలంలో మన మహర్షులు తెలిపిన వాస్తవాలను ఇప్పుడు పాశ్చాత్యులు కనిపెట్టి పశుపోషణ పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. వారిని చూసి ఇప్పుడిప్పుడే కొందరు భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది...
మన దేశంలో ఎక్కువగా గేదె పాలనే ఆదరిస్తారు. మొదట్నుంచి ఎక్కువ వెన్న శాతం ఉన్న పాలు గనక గేదెలనే పాల పరిశ్రమకు ఉపయోగించేవారు. వాస్తవానికి రైతుల వద్ద ఉండే దేశవాళీ ఆవులు పాల ఉత్పత్తిలో అంత మెరుగేమీ కాదు. మహా అంటే అరలీటరు నుంచి లీటరు పాలిచ్చేవి.. బాగా బలం ఉన్న ఆవులు.. పాల సార ఉన్న ఆవులైతే లీటర్‌నర వరకు పాలిస్తే ఇంట్లో వరకు సరిపోయేవి. కానీ కొందరైతే అసలు ఆవు పాలు పల్చగా వెన్న శాతం తక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతో పాలను కోడెదూడలకే వదులుతారు. కానీ పాల ఉత్పత్తి కోసమే పుట్టిన జెర్సీ, హెచ్.ఎఫ్ వంటి ఆవులు పాల కడలిని కడుపులో దాచుకున్నట్టు ఉంటాయి. పుష్టిగా మేత వేసి దాణా పెడితే... కడవలు కడవలుగా పాలు ఇస్తాయి. ఒక్క ఆవు రోజుకు 20 నుంచి 25 లీటర్ల పాలిస్తుంది. కేవలం పాలు ఇవ్వడానికే పుట్టినట్టుండే ఈ ఆవుల వల్ల పాల ఉత్పత్తి మాత్రమే ఉపయోగం కాదు. ఇంకా చాలా లాభాలున్నాయి. ఒక్కసారి ఆ విషయాలు పరిశీలిస్తే.. ఆవు ఎలా కామధేనువో తెలుస్తుంది..
మంచి మేలుజాతి ఆవులను కొనుగోలు చేసి ఫారం గా పెట్టి వ్యాపార దృష్టితో చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.. ఎందుకంటే పాలు నిత్యావసర వస్తువు.. పెరుగుతున్న జనాభాకు తగిన ఉత్పత్తి జరగడం లేదు.. కాబట్టి పాలకు డిమాండ్ పెరుగుతోంది. చికెన్ వంటి వాటకి రేట్లల్లో హెచ్చు తగ్గులు ఉంటాయోమో గానీ... పాల ధర మాత్రం స్థిరంగా ఉంటుంది.. ఈ ఎపిసోడ్లో పాల ఉత్పత్తుల పై ప్రత్యేకంగా చర్చించదలుచుకోలేదు. ఎందుకంటే పాల ఉత్పత్తుల గురించిగానీ .. వాటి అవసరం గురించి గానీ పాలబుగ్గల పసివాడిని అడిగినా చెబుతారు. పాల డైరీలో ఎన్నో ఇతర లాభాలున్నాయి. కాబట్టే పాల డైరీ నిర్వహించడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. అందుకే ఆవు ఒక్కంటికి 40వేలు ఉండే ధర ఏకంగా 70వేలకు పెరిగింది. భవిష్యత్తులో ఇది లక్ష రూపాయలైనా ఆశ్చర్యం లేదని ఈ రంగంలో ఉన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక పది ఆవులతో ఫారం మొదలు పెడితే వచ్చే లాభాలు చూద్దాం..
పది ఆవులకు ఒక్కో ఆవుకు 20లీటర్ల చొప్పున లెక్క వేసుకున్నా సరాసరిన 200 లీటర్ల పాలు వస్తాయి. ఇది కొంచెం అటూ ఇటుగా ఉండొచ్చు... లీటర్‌కు వెన్న శాతాన్ని బట్టి 20 రూపాయలు ధర పలికినా.. 4 వేల రూపాయల ఆదాయం వస్తుంది.. రోజులకు నాలుగు వేల చొప్పున నెలకు లక్షా ఇరవై వేల ఆదాయం వస్తుంది. అయితే ఇందులో సగానికి పైగా ఖర్చులకే సరిపోతుంది. దాణా, గడ్డి, జీతాలు, వంటి బిల్లులకు సరిపోతుంది. ఒక్కోసారి పాల దిగుబడి తక్కువగా ఉండి,, శాస్త్రీయ పద్దతులు పాటించక పోతే అసలుకే మోసం వచ్చి.. ఆవులు రోగాల పాలై లాభం రాకపోగా నష్టాల పాలయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. వ్యాపార దృక్పదంతో పెట్టుకొని పెట్టుబడి పెట్టి దగ్గర ఉండి ప్రతీక్షణం చూసుకుంటే తప్ప డైరీలో ఉన్న లాభాలు ఆర్జించడం సాధ్యం కాదు. అయితే పాల సంగతి అలా ఉంటే గోవుల ద్వారా వచ్చే పేడ వల్ల లాభాలు చూద్దాం.. వాస్తవానికి ఈ విషయం చెప్పగానే చాలా మంది కాస్త ఇబ్బంది పడతారు. అసలు గోవులను, గేదెలను పెంచాలంటేనే పేడ తీయడానికి భయపడే సగం మంది వీటి జోలికి రారు... కానీ అసలు లాభం మొత్తం పేడ వల్లనే అన్న విషయం చాలా మందికి తెలియదు. పశువుల్లో ఎంత గడ్డి తింటాయో ఆ మేరకు పేడ వేస్తాయి. ఈ పేడలో సెల్యులోజ్ ను జీర్ణం చేసే బ్యాక్టీరియా ఉంటుంది. తరువాత అవాయు శ్వాసక్రియ జరిపి మీథేన్ వంటి ఇంధన వాయువులను వెలువరచే బ్యాక్టీరియా కూడా ఉంటుంది.. అందుకే ఈ గోవు పేడను ఉపయోగించి బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ ఉత్పత్తికి వినియోగిస్తారు. అయితే గోబర్ గ్యాస్ గురించి ప్రభుత్వం ప్రచారం చేసి చేసి విసిగి పోయింది. కానీ కొన్ని ప్రాంతాల్లోనే ఇది విజయం సాధించింది.. అయితే ఈ గ్యాస్ కేవలం ఇంటి వంటకే పరిమితంగా భావిస్తారు. కానీ ఇక్కడే మతలబు ఉంది.. ఒక డైరీ ఫాం నడపాలంటే దానికి కావలసిన విద్యుత్ అంతా ఇంతా కాదు.. పశువుల శాలకు కావలసిన నీటికి మోటార్ కోసం, రాత్రి వేళల్లో వెలుతురు కోసం, దాణా మిక్సర్ కోసం, గడ్డిని చిన్న ముక్కలుగా కత్తిరించే ఛాఫ్ కట్టర్ కోసం, పాలు పితికే యంత్రానికి, గడ్డికోసే యంత్రానికి.. వీటన్నిటికీ విద్యుత్ అవసరం.. ఇన్ని యంత్రాలకు విద్యుత్ కావాలంటే భారీగానే బిల్లు చెల్లించుకోవలసి వస్తుంది. కానీ కాస్త తెలివి ఉపయోగిస్తే ఈ భారం పూర్తిగా తగ్గించుకోవచ్చు. పేడ ద్వారా వచ్చే బయోగ్యాస్ ప్లాంట్ నిర్మించుకుంటే.. బయోగ్యాస్ తో ఎనిమిది గంటలు జనరేటర్ పనిచేస్తుంది. ఈ జనరేటర్ కు ఏ ఇంధన ఖర్చూ అవసరం లేదు. కేవలం పేడ కలిపి బయోగ్యాస్ ప్లాంట్ లో పోస్తే చాలు .. రోజు వారీ ఉత్పత్తయ్యే గ్యాస్ ద్వారా రోజూ ఎనిమిది గంటల విద్యుత్ ను అందిస్తుంది. ఈ విద్యుత్ వినియోగించుకునే అవసరం లేకుండా దాన్ని నిల్వ కూడా చేసుకోవచ్చు. ఇదే పెద్ద ఉపయోగం.. ఇక బయోగ్యాస్ నుంచి బయటకు వచ్చిన పేడ ఎండగానే మంచి ఎరువుగా మారుతుంది. అప్పటికే బ్యాక్టీరియా ద్వారా చర్యగావించ బడ్డ ఈ పేడ ఘాడత తగ్గి ఉంటుంది. ఈ పేడను వర్మి కంపోస్టుగా వాడొచ్చు. అంటే డైరీ ఫాంలోనే పక్కగా చిన్ని షెడ్లల్లో వర్మి కంపోస్టు తయారు చేయవచ్చు. దీనికోసం కూడా పెద్దగా ఖర్చు చేయవలసిందిగానీ... కష్ట పడవలసింది గానీ ఏమీ లేదు. షెడ్డులో నిర్ణీత పొడవు, వెడల్పుతో బెడ్డు తయారు చేసి అడుగున సిమెంట్ తో కాంక్రీట్ చేయాలి. ఈ బెడ్లల్లో బయోగ్యాస్ నుంచి వచ్చిన పేడను నింపి ఇందులో.. మొదటి సారి వర్మి కంపోస్టు ఎరువును చల్లాలి. ఆ ఎరువులో ఉన్న వానపాము గుడ్డు కొత్త పిల్లలను చేస్తాయి. వారం రోజుల్లో బెడ్డులో వేసిన పేడ మొత్తాన్ని ఎరువుగా మారుస్తుంది. ఎనిమిది రోజుల తరువాత పై ఎరువును సేకరించి మళ్లీ పైన బయోగ్యాస్ పేడను పరుచుకోవాలి. అడుగున ఉన్న వానపాములు తిరిగి ఈ పేడను కూడా వర్మి కంపోస్టుగా మారుస్తాయి. ఇది నిరంతర ప్రక్రియ. వర్మి కంపోస్టుకు ఇప్పుడు రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోంది. కొన్ని కంపెనీలు ముందుగానే ఆర్డిరిచ్చి మరీ కొనుగోలు చేస్తున్నాయి. కాబట్టి గోవు పేడ ఇటు వర్మి కంపోస్టుకు, అటు గ్యాస్ ఉత్పత్తికి, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగ పడుతుంది. వీటితో బాటు... మరో విచిత్ర ఉపయోగం ఉంది. ఇది కొందరికే సాధ్యం.. డైరీ ఫాంలలో గోవులను రెండు రోజలకోసారి శుభ్రం చేస్తారు. ఈ నీరు సహజంగా దగ్గరలో ఉన్న గడ్డి మళ్లలోకి మళ్లిస్తారు. కానీ ఈ నీటిని భావి లాంటి గోయి తవ్వి దాంట్లోకి మళ్లిస్తే మరింత ఉపయోగం ఉంటుంది. మామూలుగా చెరువుల్లో పెరిగే బురద మట్ట చేపలు.. ఆవు పేడ, గడ్డి తిని త్వరగా పెరుగుతాయి. మత్య పరిశ్రమ వారి వద్ద బురద మట్టల చేప పిల్లలను తీసుకొచ్చి ఈ బావుల్లో వదిలి.. పశువులను కడిగిన పేడ నీటిని ఈ బావుల్లోకి మళ్లిస్తే... చేపలు ఏపుగా పెరుగుతాయి. పేడ నీటితో బాటు దాణా వ్యర్ధాలను కూడా ఈ బావుల్లో వేస్తే చేపలు మరింత తొందరగా పెరుగుతాయి. ఎందుకంటే ఆవు పేడను ఆవరించే బ్యాక్టీరియా, పురుగులు చేపలకు సంవర్ధక ఆహారంగా పనిచేస్తుంది.
పశువుల పేడ దాటి పశుమూత్రం దగ్గరకు వస్తే చెప్పడానికి కాస్త అతిశయంగా ఉంటుంది. కానీ పశుమూత్రం ద్వారా చాలా లాభాలున్నాయని బయోకెమికల్ నిపుణులు పరిశోధనల్లో రుజువు చేయడమే కాక మార్కెట్లోకి ఉత్పత్తులను విడుదల చేశారు. గో మూత్రం పురాతన కాలం నుంచీ ఆయుర్వేద ఔషదంగా వాడుకుంటూ వస్తున్నారు. కొన్ని తెగల వారు గో మూత్రాన్ని రోజూ రెండు స్పూన్లు సేవించడం వారి మూర్ఖత్వంగా భావించారు చాలా మంది. కానీ ఆధునిక పరిశోధనల వల్ల వారి పూర్వీకులు వారికి అలా చేయమని ఎందుకు చెప్పారో తెలిసొచ్చింది. గో మూత్రంలో 24 రకాల ప్రాథమిక లవణాలున్నాయి. వీటిలో ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, కార్బనికామ్లం, పోటాష్,మరియు లాక్టోజ్ వంటి పదార్ధాలున్నాయి. ఇవన్నీ మొక్కలకు అత్యవసర పోషకాలు.. అంటే మొక్కల్లో వచ్చే సూక్ష్మ పోషక లోపాలకు ప్రధాన కారణాలైన కాల్షియం, పాస్ఫరస్, పొటాష్ వంటి ధాతువుల లోపాలను సవరించే దివ్యౌషదం గో మూత్రమని బయో కెమికల్ నిపుణులు రుజువు చేశారు. ఇది పంట పొలాలకే కాదు.. వ్యాపార పరంగా ఇంకా బాగా లాభాలిస్తోంది. గోమూత్రం నుంచి ఫినాల్, క్రిసాల్ ను ఉత్తత్తి చేస్తున్నారు. వీటి ధర అరలీటర్ కు 90 రూపాయల పై చిలుకే ఉంటుంది. అంటే గోవులు వదిలే మూత్రం కోసం డైరీ ఫాంలో ప్రత్యేక కాలువలు నిర్మిస్తారు. ఈ కాలువల్లోంచి వెళ్లిపోయే మూత్రం మామూలుగా మడుల్లోకి వెళ్లకుండా సిమెంట్ సంప్ నిర్మించుకొని అందులో పోగయ్యే విధంగా జాగ్రత్త తీసుకుంటే.. కొద్ది పాటి సాంకేతిక జ్ఞానాన్ని నేర్చుకుంటే డైరీ ఫాం నుంచే ఫినాల్ తయారు చేసి మార్కెట్లోకి వదలొచ్చు. ఫినాల్ తయారు చేయగా మిగిలిన మిశ్రమానికి వేపనూనె జోడించి పత్తి, మిర్చి, వంటి పంటలకు శిలీంద్ర నాశినిగా, సూక్షపోషకలోపాల నివారిణిగా పిచికారి చేయొచ్చు.
ఇప్పుడు చెప్పిన వన్నీ కాకమ్మ కథలు కావు... నిజ జీవితంలో వీటిని ఆచరించి లాభాలు పొందుతున్న రైతులు, వ్యాపారులు, ఈ రహస్యాలు చెప్పడానికే ఇష్టపడని వారు చాలా మందే ఉన్నారు. అంటే గోవుల పెంపకం ద్వారా.. పాలు, విద్యుత్, వంట చెరుకు, చేపల పెంపకం, వర్మి కంపోస్టు, ఫినాల్ తయారీ, మైక్రో మిక్స్ తయారీ.. ఇన్ని రకాల ప్రయోజనాలున్న పరిశ్రమ మరొక్కటి లేదేమో. వీటితో బాటు ఓపిక ఉండాలేగానీ.. చుట్టూ ఫెన్సింగ్ ఉంటే... ఆ పెరిగే గడ్డి మడుల్లో ఓ వంద గిరిరాజా కోళ్లు వదిలితే. ఏ మేతా, దాణా వేయకుండానే ఒక్కోక్కటీ గొర్రె పిల్లలంత ఎదుగుతాయి .. కానీ ఇవి ఆవులకు సంబంధం లేదు కావున వాటి ప్రస్తావన తీసుకురాలేదు. మనిషి అవసరానికి కావలసిన ఇన్ని రకాలు ఇచ్చిన ఆవును కామధేనువు అనడంలో అబద్దం ఏముంటుంది.. అందుకే ప్రభుత్వం కూడా పశుపోషణ పై దృష్టిసారించింది. అయితే సబ్సిడీల కోసం మాత్రమే కాకుండా.. వాటి పోషణ వల్ల వచ్చే లాభాల పై దృష్టి పెట్టి వ్యాపారాత్మకంగా చూస్తే గోవు కామధేనువే కాదు....... కామన్ ధేనువు కూడా...
Friday, March 2, 2012
వివాదంలో తెలంగాణ భవన్ - అంతా అధికారికమేనన్న టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ రోజుకొకరు మీడియా ముందుకు వస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందున ఆ భూమిని ప్రభుత్వ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న జగ్గారెడ్డి, నిన్న షబ్బీర్ అలి, నేడు కేసీఆర్ మేనల్లుడు ఉమేశ్ రావు... అందరిదీ ఒకటే మాట.. తెలంగాణ భవన్‌లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. ఇంతకీ తెలంగాణ భవన్ వివాదం వెనుక నేపథ్యం ఏంటి... హెచ్ఎంటీవీ అందించే ప్రత్యేక కథనం
తెలంగాణలో ఉప ఎన్నికల కాక ఎండాకాలపు వేడిని మించి సెగలు కక్కుతోంది... ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రత్యర్ధులు పరస్పరం విమర్శల వర్షం గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. . ఈ విమర్శలకు కారణాలేంటి? వివాదానికి మూలాలేంటి.. ఈ వివాదం ఎటు దారితీయబోతోంది....
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో నిబంధనలు ఉల్లంఘించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ రోజుకొకరు మీడియా ముందుకు వస్తున్నారు. మొన్న జగ్గారెడ్డి. నిన్న షబ్బీర్ అలీ. నేడు ఉమేశ్ రావు. అందరూ చెప్పేది ఒక్కటే మాట.. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ భవన్ ను వ్యాపార కేంద్రంగా మార్చారని.... నిబంధనలు ఉల్లంఘించినందును ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ టీఆర్ఎస్ భవన్ లో ఏం జరుగుతోంది..
తెలంగాణ రాష్ట్ర సమితి స్థలం ఎప్పుడు కేటాయించారు ?
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయమని చెబుతున్న టీఆరెస్....గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ... 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారలోకి వచ్చింది. తమ పార్టీ కార్యాలయ నిర్మాణం కోస స్థలం కేటాయించాల్సిందిగా టీఆర్‌ఎస్ అభ్యర్ధించింది. దీనికి స్పందించిన రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం భూమిని కేటాయించింది.
ఎంత భూమిని కేటాయించారు ?
కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి.... షేక్ పేట రెవిన్యూ పరిధిలో... రోడ్ నంబర్ 12 బంజరా హిల్స్‌లో గల ప్రభుత్వ స్థలంలో ఒక ఎకరం స్థలాన్ని కేటాయించారు. దీని కోసం నవంబర్ 27, 2004 తేదీన జీవో నంబర్ 966తో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఈ స్థలంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. ఈ స్థలాన్ని ఏ ఇతర కార్యక్రమాలకు అంటే వ్యాపార సంస్థలకు గానీ... నివాససముదాయంగా కానీ వాడకూడదు. స్థలం కేటాయించిన తేదీ నుంచి సంవత్సరం లోపే కార్యాలయ భవనాన్ని నిర్మించాలని తెలిపారు. ఈ నియమాల్లో దేన్ని ఉల్లంఘించినా అందులో ఉన్న భవన సముదాయాలతో పాటు అన్నీ వెనక్కు తీసుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన స్థలం రేటెంత ?
పార్టీ కార్యాలయం కోసం కేటాయించన ఈ స్థలానికి ప్రభుత్వ నామ మాత్రపు ధరను నిర్ణయించింది. అప్పట్లో ఆ ప్రాంతలో గజం కొన్ని వేల రూపాలకు పై చిలుకు ధర పలుకుతోంది. కానీ ప్రభుత్వం..గజం వంద రూపాయల ధరగా నిర్ణయించింది. అంటే మొత్తం 4840 గజాలకు గానూ.. నాలుగు లక్షల ఎనభై నాలుగు వేలకు ఈ స్థలాన్ని కొనుగలు చేసింది. స్థలం కేటాయించిన మరుక్షణం నుంచే భవన నిర్మాణానికి పునాదులు వేశారు. తెలంగాణ భవన్ పేరుతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు.
ఇప్పుడు దాని విలువ ఎంత ఉంటుంది ?
శ్రీమంతులు నివాసం ఉండే అత్యంత ఖరీదైన బంజారా హిల్స్ ప్రాంతంలో అతి తక్కువ ధరకే పొందిన ఈ స్థలం విలువే కోట్లలో ఉంటుంది. మరి ఆ స్థలంలో మైసూరు ప్యాలస్‌ను తలపిస్తూ నిర్మించిన భవనం గురించి ఇక మాట్లాడనక్కర్లేదు. ఇప్పుడు విమర్వలకు కేంద్రమైంది ఈ భవనమే...
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించడమే ఆలస్యం.. భవన నిర్మాణం చేపట్టింది. ప్రజా ప్రతినిధులకు గదులు, పార్టీలోని వివిధ విభాగాలకు కాన్ఫరెన్స్ హాల్స్, పార్కింగ్ అన్నీ నిర్మించారు. ఎనిమిది సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ తన కార్యకలాపాలన్నీ ఇక్కణ్నుంచే సాగిస్తోంది. అయితే ఎనమిదేళ్లుగా లేని వివాదం ఇప్పుడే ఎందుకొచ్చింది? అసలు వివాదమేంటి?
ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ భవన్ లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కానీ గత కొంత కాలంగా తెలంగాణ భవన్ ను వివాదాలు వెంటాడుతున్నాయి.
తెలంగాణ భవన్ పై నెలకొన్న వివాదం ఏంటి ?
తెలంగాణ భవన్‌ను పార్టీ కార్యకలాపాలతో బాటు వ్యాపార కార్యకాలాపాలు కూడా వాడుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించేటపుడు విధించిన నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ భవన్ లో ఒక టీవీ చానల్‌ను నిర్వహించడం వ్యాపారమే అని విమర్శకుల అభిప్రాయం...గతంలో ఇదే విషయం పై జగ్గారెడ్డి విమర్శలు చేశారు. తాజాగా షబ్బీర్ అలి కూడా అవే వ్యాఖ్యలు చేయడంతో బాటు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
ఇప్పడు తెరపై కేసీఆర్ కుటుంబీకులు కూడా వచ్చారు. స్వయానా కేసీఆర్ మేనల్లుడు ఉమేశ్ రావు తన మేనమామపై ఇదే విషయంపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. . ఉద్యమం పేరుతో తెలంగాణ భవన్ ను తన స్వార్థప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కార్యాలయాన్ని... ప్రైవేటు కార్యక్రమాలకు ఉపయోగించడాన్ని ఉమేశ్ తప్పుపట్టారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కోసం గజం వంద రూపాయలకు ఆ స్థలాన్ని కేటాయించారని... ఈ స్థలంలో కేవలం పార్టీ కార్యకలాపాలే నిర్వహించాలి తప్ప ఎటువంటి వ్యాపార కార్యకలాపాలకు గానీ, నివాస సముదాయలు గానీ నిర్మించకూడదన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నిబంధనలను ఉల్లంఘించి తెలంగాణ భవన్ లో టీవీ ఛానల్ ను నడుపుతున్నారన్నారు. ఈ ఛానల్లో ఆయన సామాజిక వర్గానికి చెందిన వారితో బాటు ఆయన కుటుంబ సభ్యులు భాగస్థులుగా ఉంటూ లాభాలార్జిస్తున్నారని తెలిపారు. దీంతో బాటు పార్టీ కార్యాలయం ట్రస్టీ సభ్యుల వివరాలు కూడా బయటపెట్టాలన్నారు.
నిబంధనలు ఉల్లంఘించి స్వార్ధ ప్రయోజనాలకు ప్రభుత్వ భూమిని వాడుకున్నందుకు గానీ ఆ భూమిని తిరిగి వెనక్కు తీసుకోవాలని ఉమేశ్ ప్రభుత్వాన్ని కోరారు.
ఈ వివాదానికి అసలు కారణం...టీవీ చానల్ నిర్వాహణేనా? లేక ఉపఎన్నికల సమయంలో టీఆరెస్‌ను ఇరుకున పెట్టేందుకు చేస్తన్నా రాజకీయ వ్యూహమా? ఏడాదిన్నరగా లేని అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి?
వివాదానికి కారణం ఏంటి ?
తెలంగాణా భవన్‌లో చానల్ ప్రారంభమై ఏడాదిన్నర కావొస్తోంది. ఈ చానెల్ అధికార కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారనేది పార్టీల అభిప్రాయం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆ చానల్‌ను తమపై దుష్‌ప్రచారం చేయడానికే ఉపయోగిస్తున్నారని మిగతా పార్టీలు భావిస్తున్నాయి. ...ఈ ప్రభావంతోనే గత ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని డి.శ్రీనివాస్ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.. దీనికి తోడు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రాంతంలో ఆ చానెల్ తమకు వ్యతిరేకంగా ప్రభావం చూపిస్తుందని మిగతా పార్టీలు భావిస్తున్నాయి. ఈ ప్రాంతలో గట్టి పట్టున్న టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకే ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారన్న వాదన ఉంది.
దీనికి టీఆర్ఎస్ ఏమంటోంది ?
తెలంగాణ భవన్ పై వస్తున్న వ్యాఖ్యల పై ఇప్పటి వరకు అధికారికంగా ఆ పార్టీ ముఖ్యులెవరూ వ్యాఖ్యానించనప్పటికీ.. ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఉద్యమ పార్టీలకు సహజంగానే సొంత పత్రికలుంటాయని దానిలో బాగంగానే.. సీపీఎం పార్టీ ప్రజాశక్తిని, సీపీఐ పార్టీ విశాలాంధ్రను, న్యూడెమోక్రసీ ప్రజాపంథ వంటి పత్రికలను పార్టీ కార్యాలయాల్లోనే నడిపిస్తున్నాయని.. అందులో బాగంగానే టీఆర్ఎస్ పార్టీ ఓ చానల్ నడుపుతోందని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వివాదం ఎటు దారి తీస్తుంది ?
తెలంగాణ భవన్ పై నెలకొన్న వివాదం...తాత్కాలికమేనని, ఎన్నికల తరువాత ఎగిరిపోయేదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉప ఎన్నికల్లో తెలంగాణ పవనాలు వీస్తున్న తరుణంలో ఈ తెలంగాణ భవన్ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో.. దీని పై ఏఏ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలంటే మరి కొంత కాలం చూడాల్సిందే.. ఇదీ తెలంగాణ భవన్ వివాదం పై ప్రత్యేక కథనం.
ఉప ఎన్నికల్లో తెలంగాణ పవనాలు వీస్తున్న తరుణంలో ఈ తెలంగాణ భవన్ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో.. దీని పై ఏఏ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలంటే మరి కొంత కాలం చూడాల్సిందే..
Subscribe to:
Posts (Atom)