ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Sunday, May 6, 2012

కసాయి కళాశాలలు పీడిస్తున్న ప్రైవేట్ విద్యాలయాలు


కసాయి కళాశాలలు పీడిస్తున్న ప్రైవేట్ విద్యాలయాలు అనుమతులు లేని కళాశాలల్లో విద్య ఓ మిద్య సౌకర్యాలన్నీ బ్రోచర్లలోనే... ఆచరణలో అయోమయం విద్యార్ధినిల పై లైంగిక వేధింపులు... చెబితే పరువు నష్టం కలెక్టర్ మాట పెడచెవిన పెట్టి పాత బస్సులు తిప్పే యాజమాన్యం షిఫ్టింగ్ పర్మిషన్ లేకున్నా.. అందమైన అద్దె భవనాల్లో నిర్వహణ ఓపెన్ స్టడీ పేరుతో ఓపెన్ గా దోపిడీ అందమైన విద్యార్దినులను మోడళ్లుగా చూపే కాలేజీ హోర్డింగ్‌లు ఆ కాలేజీకి అన్ని మార్కుల రావడం వెనుక అసలు రహస్యం స్టూడెంట్స్ ఏటీఎం కార్డులన్నీ కళాశాల యాజమాన్యాల చేతుల్లోనే.. అవి భావి భారత పౌరులను తీర్చి దిద్దాల్సిన విద్యాలయాలు. మార్గదర్శులుగా మెలగాల్సిన ఉపాధ్యాయులు.. కానీ అవి వ్యాపార కేంద్రాలు గా మారాయి. తమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా వర్ధిల్లాలంటే.. ఎంతటి ఘాతుకానికైనా వెనకాడట్లేదీ అభినవ గురువులు. గతంలో పాఠాలు చెప్పే వారే గురువులు.. వారే ఖాళీ సమయాల్లో ప్రైవేట్ పాఠాలు చెప్పేవారు. కానీ విద్యా, వైద్య రంగాల్లో వృత్తికి సంబంధం లేని వారు పెట్టు బడులు పెట్టి.. దీన్ని వ్యాపారంగా మార్చడం మొదలు పెట్టారో .. ఆనాటి నుంచి చదువు కోవడం కాస్తా చదువు కొనడం గా మారింది. విద్యా వ్యవస్థలోకి చీడపురుగులు చొరబడ్డాయి. తులసి వనంలోకి గంజాయి మొక్కలు కలుపు మొక్కల్లా చేరడమేగాక మొత్తం గంజాయి వనమే అనే భ్రమను కల్పిస్తున్నాయి. ఈ కాలేజీల్లో కొన్ని అసలు నిబంధనలు పాటించడం లేదు కదా అలాంటి ఉన్నాయనే ఊసుకూడా ఎత్తడం లేదు. కొన్ని కాలేజీలకు పర్మిషనే లేదు. పర్మిషన్ ఉన్న కాలేజీలు కాగితాల్లోనే సౌకర్యాలను చూపిస్తున్నాయి. వాస్తవానికి కళాశాలలు కోళ్లగూడు కొంపల్లో నడుపుతున్నారు. అడ్మిషన్లప్పుడు ఇచ్చే బ్రోచర్లలో రంగు రంగుల భవనాలు, సకల సౌకర్యాలున్న హాస్టళ్లు కనిపిస్తాయి. కానీ క్లాసులు ప్రారంభమైన నాలుగు రోజుల తరువాత చూస్తే.. ప్రభుత్వ హాస్టళ్లు వంద శాతం నయమనిపించేలా ఉంటాయి. ఇక అప్పుడే కౌమార దశలో అడుగు పెడుతున్న అమ్మాయిల పై వీరు చేయని ప్రయోగాలు లేవు. డిగ్రీ చదివిన వాళ్లను ట్యూటర్లుగా నియమించడంతో.. ట్యూటర్లకు వీళ్లు ప్రయోగ శాలలు. వాళ్ల పైత్యానికి విద్యార్ధినీ విద్యార్ధులు బలవుతున్నారు. పాఠాలు చదివించడం పేరుతో విపరీతంగా కొట్టడం.. అవమాన పరచడం.. హింసించడం ఒకటేమిటి.. కొన్ని ప్రైవేట్ కళాశాలలు నరకానికి నకళ్లుగా మారుతున్నాయి. అందుకే చాలా కాలేజీల్లో విద్యార్ధినులు చేరిన కొన్ని రోజులకే చదువు మానేస్తున్నారు... ఇంకొందరు ఆగడాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొని మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. కొన్ని కళాశాలలకు అసలు పర్మిషన్లే లేవు. కొన్నింటిని ఆర్భాటంగా అద్దాల మేడల్లో చూపించి.. నాల్రోజులు పూర్తయి అడ్మిషన్లు పూర్తికాగానే.. గొడ్ల కొట్టం లాంటి గోడౌన్లకు మార్చాలంటూ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసి .. అనుమతులు రాక ముందే కాలేజీలను మార్చేస్తున్నారు. ఇదేమిటని అడిగే నాధుడు లేదు. అధికారులు మామూళ్ల మత్తులో ఆ నిబంధనలు ఉన్న సంగతే మర్చిపోతున్నారు.
ఏ పత్రిక వారైనా గుర్తు చేస్తే.. అవునా.. అయినా ఎవరు పాటిస్తున్నారండీ అంటూ మొటికెలు విరుస్తున్నారు. మరోవైపు కళాశాలలు పోటీ ప్రపంచాన్ని తట్టుకొని ఈ ప్రపంచంలో ఉన్న విద్యార్ధులంతా తమ కాలేజీల్లోనే చేరాలని దొంగ మార్కులు వేయించుకోవడం కోసం తెగబడుతున్నారు. దీనికోసం ఎంతకైనా తెగిస్తున్నారు. వందకు వంద మార్కులు వేయించడానికి ఏ గడ్డయినా కరుస్తున్నారు. గతంలో జవాబు పత్రం జిల్లాలు దాటిన సంఘటనలు వెలుగు చూశాయి. ఈ ఏడాది ఓ కళాశాల ఏకంగా మార్కులను కొనేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ( ఈ కళాశాలకు వచ్చిన మార్కుల పై పొలిటికల్ వార్ శోధనలో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని నిజాలు నిర్ధారణ కావలసి ఉంది. పూర్తి వివరాలు వచ్చే సంచికలో ప్రచురిస్తాము). తమ కళాశాలలో చదివే అమ్మాయిలు ఇంత బాగా చదువుతారు.. ఇన్ని మార్కులు వస్తాయని ప్రకటించుకోవడంలో తప్పు లేదేమో గానీ.. ఇంత అందంగా ఉంటారు.. ఆల్రెడీ ఉన్నారు. అని అందమైన అమ్మాయిల ఫోటోలు హోర్డింగ్ ల పై వేయడంలో అసలు రహస్యం అర్ధం చేసుకోలేనిది కాదు. మరోవైపు ఇదే అమ్మాయిలు చిన్న తప్పు చేస్తే నీ సంగతెవడికి తెలియదే.. అని పచ్చిబూతులు తిడుతున్నారు. కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో అమ్మాయిలను.. ఉంపుడుగత్తెల కంటే ఘోరంగా సంబోదిస్తున్నారు. ఈ విషయం చెప్పలేక.. చెబితే పరువు పోతుందనే భయం ఒక పక్క.. కళ్లు మూసుకుంటే రెండేళ్లు పూర్తవుతాయని ఓపికతో.. ఆ రెండు సంత్సరాలు కష్టాలన్నీ కడుపులో దాచుకుంటున్నారు. గతంలో ఇటువంటి కాలేజీల ఆకృత్యాలను పొలిటికల్ వార్ వెలుగులోకి తెచ్చి తగిన శాస్తి చేసిన సందర్భాలున్నాయి. పాఠకులకు ఇటువంటి కళాశాల గురించి తెలిస్తే..( పొలిటికల్ వార్ వద్ద లేని వివరాలు) తెలియజేయగలరు. సదరు కళాశాల పై బాధితుల తరుపున మేం పోరాడుతాం.. పాఠకుల కోర్టులో నిలదీసి వాస్తవాలు కక్కిద్దాం. విద్యార్ధులను ఫీజుల పిండుకొనే కామధేనువుల్లా చూసే సంప్రదాయాన్ని రూపు మాపి.. వాళ్ల ఏటీఎం కార్డులు వారికే ఇచ్చేలా కృషి చేసిన పొలిటికల్ వార్ ను గతంలో తల్లిదండ్రులు అభినందించారు. ఈ సంవత్సరం కూడా పొలిటికల్ వార్ కళాశాలల నిర్వహణ పై నిఘా పెట్టింది. విద్యార్ధుల పక్షాన నిల్చొని పోరాడేందుకు మా దృష్టికి వచ్చిన ప్రతి కథనాన్ని ప్రచురించి వారి తరుపునే పోరాడేందుకు సిద్ధమయ్యాం.. మీరూ మీ పట్టణంలో లేదా మండలంలో ఇటువంటి కళాశాలలు కనిపించినా.. ఫీజుల కోసం నిబంధనలను అతిక్రమించినా (ఎడిటర్ పొలిటికల్ వార్)కు కాల్ చేసి చెప్పండి.
మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9392324340. ఈ మహా యజ్ఞంలో మీరు పాలు పంచుకొని విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం.. బీ రెడీ.. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్.. వచ్చే సంచికలో ప్రై"వేటు కళాశాల అసలు రంగు కళాశాలల వారీగా రియల్ సీరియల్ ప్రచురించబోతున్నాం..

1 comment:

  1. మిద్య సౌకర్యాలన్నీ బ్రోచర్లలోనే...---excellent observation.it sums up the entire situation.well said.

    ReplyDelete