ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Monday, May 7, 2012

విజృంభిస్తున్న మావోలు... విస్తరిస్తున్న వసంత మేఘం


విజృంభిస్తున్న మావోలు విస్తరిస్తున్న వసంత మేఘం ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లలో వీరంగం ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న నక్సల్స్ కేంద్రం చెలగాటం రాష్ట్రాలకు ప్రాణ సంకటం విచ్చల విడిగా గిరిజనులను అరెస్ట్ చేయడమే కారణం దేశంలో మావోయిస్టులు బలపడుతున్నారు. కేంద్రం అనుసరించే విధానాలు... ఏజన్సీలో తవ్వకాలు గిరిజనుల మనుగడకు ముప్పుగా మారాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో తమ మనుగడ కెోసం గిరిజనులు మావోయిస్టుల మార్గాన్ని అనుసరిస్తున్నారు. మావోయిస్టుల్లో గిరిజనులే ఎక్కువగా ఉన్నారనేది బహిరంగ రహస్యం. ఏజన్సీ ప్రాంతంలో గిరిజనులు మావోయిస్టులకు సహకరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున గిరిజనులను అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు. వాస్తవానికి గిరిజనుల సహకరించడం కాదు.. గిరిజనులే మావోయిస్టులన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిపోతోంది. తమ మనుగడకు ముప్పు వాటిల్లే నిర్ణయాలు తీసుకొని దాన్ని వ్యతిరేకించిన వారిని మావోయిస్టులుగా చిత్రీకరించడంతో.. ఇదే అదనుగా మావోయిస్టులు తమ భావజాలాన్ని, సమస్యకు పరిష్కారాన్ని గిరిజనులకు వివరిస్తున్నారు. పోరాడితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందిని చెప్పడంతో గిరిజనులు ఆ దిశగా మొగ్గు చూపుతున్నారు. తరువాత వారే దళపతులుగా మారి తమ వర్గాన్ని అందులో చేర్చుకొని బలపడుతున్నారు. వాస్తవానికి ఛత్తీస్‌గడ‌, ఒరిస్సా రాష్ట్రాల్లో గిరిజనులకు ఇంతకు మించిన మార్గం లేదు. ఎందుకంటే దండకారణ్యంలో అపారమైన ఖనిజ వనరులున్నాయి. వీటి పై కేంద్ర ప్రభుత్వం కన్నుపడింది. ప్రభుత్వం కన్ను అనేదానికంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల కన్ను పడింది. ఎలాగైనా అధికారంలో ఉన్నపుడే వాటిని స్వాహా చేయాలనేది పన్నాగం.. అందుకోసం అధికారం అడ్డం పెట్టుకొని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులను రూపు మాపేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. నల్లమల అడవిని జల్లెడ పట్టాడు. దాదాపు మావోయిస్టు పార్టీ రాష్ట్రంలో అంతరించిపోయిందనే పరిస్థితికి తెచ్చాడు. అందుకే తనకు ఎదురు లేని నిర‌్ణయాలు తీసుకొని రాష్ట్రం మొత్తాన్ని తన తనయుడి జగన్ కు కట్టబెట్టాడు. మరోవైపు ఓబుళాపురం గనులను పూర్తిగా కొడుక్కి, కొడుకు లాంటి గాలి జనార్ధన్ రెడ్డికి అప్పజెప్పాడు. మావోయిస్టులు బలంగా ఉంటే ఈ దోపిడి సాద్యమయ్యే పని కాదు. ఏదో ఒక సందర్భంలో ఎదరుతిరిగే వారు. ఇప్పుడు శ్రీకాకుంళంలో కూడా ప్రభుత్వానికి తమ భూములను కబళించొద్దంటూ ప్రజలే ఎదురు తిరగుతున్న పరిస్థితి వచ్చింది. విప్లవ పోరాటాలకు పుట్టినిల్లయిన శ్రీకాకుళంలో మళ్లీ మావోయిస్టు దళాలను పెంచి పోషించే పరిస్థితి ప్రభుత్వమే కొని తెచ్చుకుంటుంది. ఎక్కడైతే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందో.. ఆ విధానాలు తమ మనుగడకే ముప్పు వాటిల్లేలా చేస్తాయని ప్రజలు భావించినపుడు.. ప్రాణత్యాగానికి మించిని మార్గం లేదని భావించినపుడు.. తెగిస్తారు. ఆ తెగింపే ప్రజలను నిషిద్ద వామపక్ష ఉద్యమాల వైపు మళ్లిస్తుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా మావోయిస్టు పార్టీ బలపడుతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాయి. దండకారణ్యం మీదుగా నల్లమలలోకి మెల్లగా విస్తరిస్తున్నాయని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటు ఛత్తీస్‌గఢ్, భద్రాచలం సరిహద్దుల్లో, ఒరిస్సా, శ్రీకాకుళం బెల్టులో మావోయిస్టుల కదలికలు చురుకుగా సాగుతున్నాయి. రిక్రూట్ మెంట్ వైపు కూడా గిరిజనులతో బాటు మైదాన ప్రాంత ప్రజలు కూడా మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం ప్రజా సంపదను కార్పోరేట్ పెట్టుబడి దారుల చేతుల్లో పెట్టి ఉన్న ఐదేళ్లూ నాలుగు రాళ్లు సంపాదించుకోవాలన్న ప్రభుత్వ పెద్దల స్వార్ధమే... ఇటు గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తుంది. పచ్చిన పంట పొలాల్లో చిచ్చురేపి తమ ఉనికికే ప్రమాదం తెచ్చి నిలువ నీడ లేకుండా చేసే ప్రభుత్వాలను ఎదిరించకుండా ఎవరుంటారు. శ్రీకాకుంళం జిల్లాల్లో తమ ప్రాంతాలను కబళించ వద్దని నెలల తరబడి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టిచ్చుకున్న ప్రభుత్వ పెద్ద లేడు. అటువంటి సందర్బాలలో విప్లవ శక్తులు చెప్పే మాటలు ప్రజలకు సహజంగానే స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. యువకులు కూడా అవలీలగా వీరి నినాదాలకు ఆకర్షితులైతారు. తమ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం మొదలైన ఉద్యమం.. రాష్ట్రానికి, దేశానికి ఆ తరువాత అమరత్వానికి దారి తీస్తుంది. అనుకున్న లక్ష్యం చేరుతారో లేదో తెలియదు.. ఆశయం నెరవేరుతుందో తెలియదు.. రాజ్యాధికారమనే ఒక స్నప్నం నిజంగా సాకారమవుతుందో లేదో తెలియదు.. కానీ ప్రతిరోజూ అడవిని నమ్ముకున్న బిడ్డలు అడవి ఒడిలోనే అనాధల్లో తూటాల వేటుకు బలి అవుతున్నారు. పచ్చని ఇగుళ్ళ పొదలకు వెచ్చటి నెత్తురును తడుపుతున్నారు. వరుసగా సాగే నరమేథాన్ని ఆపేందుకు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మావోయిస్టులు గిరిజనులకు అండగా నిలిచారు. తమకు ఆసరాగా నిలిచిన గిరిజనులను అరెస్టులు చేసి జైళ్లలో హింసలు పెట్టడం, తమ వార్తలను ప్రచురించిన జర్నలిస్టులను కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేయడం మావోయిస్టులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ కోపం తోటే ఒరిస్సాలో.. ఇటలీ పర్యాటకులను, ఎమ్మెల్యే హికాకను కిడ్నాప్ చేసేదాకా చేరింది. అయితే ప్రజాకోర్టులోనే వారిని శిక్షిస్తామని మావోయిస్టులు చెప్పినప్పటికీ అరెస్టు చేసిన వ్యక్తులు పర్యాటకులు కావడంతో వారిని చంపడం సాధ్యం కాని పని.. వారిని చంపితే.. ప్రభుత్వం పర్యాటకులను రక్షించుకోలేక పోయిందనే అపప్రద తప్ప మావోయిస్టులు సాధించేదేమీ లేకపోగా.. దేశం చూడ్డానికి వచ్చిన విదేశీ పర్యాటకులను పొట్టన బెట్టుకున్నారన్న విమర్శలు వస్తాయి. ఇక హికాక గిరిజన ఎమ్మెల్యే. ఆయనకు ఏదైనా అపాయం తల పెడితే.. గిరిజనులు భయపడి తమకు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. దీనికి తోడు హికాకను కిడ్నాప్ చేసి కొంత కాలం తమ వద్ద ఉంచుకొంటే ప్రభుత్వ పెద్దల గుట్టు మట్లు తెలుసుకున్నట్టవుతుంది. దాంతో బాటు గిరిజన ఎమ్మెల్యేను విడిపించేందుకు ప్రభుత్వం ఏమేరకు చొరవ తీసుకుందో తెలిపేందుకు ఇదే సమయమని భావించారు మావోయిస్టులు. వాళ్ల వ్యూహం సఫలమైంది. ప్రభుత్వం హికాక విడుదల పై సరిగ్గా స్పందించకపోవడంతో అది మావోయిస్టులకు కలిసి వచ్చింది. గిరిజనుల పట్ల ప్రభుత్వానికి ఉన్న దమన నీతిని ఎండగట్టారు. దీన్నే ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్‌ను కిడ్నాప్ చేయడం... అరెస్టై జైళ్లోలో మగ్గుతున్న మావోయిస్టు సానుభూతి పరులను విడుదల చేయాలంటూ డిమాండ్ చేయడం.. గిరిజనులకు మరింత బలాన్నిచ్చినట్టయింది. దీనికి తోడు మావోయిస్టుల పై విశ్వాసం పెరగడానికి హేతువయింది. పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామన్న మావోయిస్టు పార్టీ తమ కోసం ఎంతటి త్యాగాల కైనా సిద్ధంగా ఉందనేందుకు ఇదే తార్కాణమని వారు భావించారు. ఇదే అదనుగా.. ఇదే విజయోత్సాహంతో తమ పాత కారిడార్‌లో తిరిగి పుంజుకునేందుకు మావోయిస్టులు పావులు కదుపుతున్నారు. మావోయిస్టులు విజృంభిస్తే.. మందు పాతరలు మళ్లీ సందడి చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే జరిగితే వసంత మేఘం గర్జించి రుధిర వర్షం కురవక మానదు.

2 comments:

  1. *ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా మావోయిస్టు పార్టీ బలపడుతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాయి.*
    మీకొక చిన్న ప్రశ్న. ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి హెచ్చరించాయన్న విషయం పత్రికలకు ఎలా తెలుస్తుందో చెప్పగలరా? ఈ వార్తని ప్రభుత్వం లీక్ చేస్తుందా? లేక ఇంటేలిజెన్స్ వారిని అడిగితే వారు వాళ్ల నివేదికలో ఉండే విషయాలను పేపర్ వారికి చెపుతారా?

    ReplyDelete
  2. రిపోర్టర్‌లు ప్రతి చోటా ఉంటారు. లీక్ చేసేవారు ప్రతి చోటా ఉంటారు. రివ్యూ సమావేశాల్లోనూ.. ఆఫ్ ది రికార్డింగ్ మాటల్లోనూ.. మంత్రులే రిపోర్టర్లతో చెబుతారు. ఒక దగ్గర ఇన్సిడెంట్ కాగానే.. అరె ఏపీలో కూడా పెరుగున్నట బై.. ఇంటిలిజెన్సోళ్లు చెప్తున్నా మన సీఎం పట్టించుకుంటలేడు. అని కామెంట్ చేశారు. సో మినిస్టర్లే చెబుతారు. పోలీసు అధికారులు కూడా ఏదో ఒక సందర్భంలో ప్రభుత్వానికి తెలియాలని రిపోర్టలర్ల చెవిలో వేస్తే.. వాటిని కథలు కథలుగా అల్లితే ప్రభుత్వం ముందే మేల్కొంటే ... వాళ్ల పని సులువు అవుతుంది మిత్రమా...

    ReplyDelete