ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Sunday, May 6, 2012

లే అవుట్ లేకుండానే గేట్ కమ్యునిటీలు రెచ్చిపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు


సామాన్యుల నోళ్లలో మన్ను ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఒకవైపు తెలంగాణ వాదంతో రాష్ట్రం రావణ కాష్టంలా మండుతుంటే.. ఇటు ఆంధ్రా ప్రాంతానికి మూటా ముల్లె సర్ధుకునే జనం ఆంధ్రలో కుప్పలు తెప్పలుగా స్థలాలు కొంటున్నారు. దీంతో రేట్లు చుక్కల్లోకెక్కాయి. ఈ ప్రభావం ఆంధ్రా ప్రాంతానికి సరిహద్దున ఉన్న ఖమ్మం పై పడింది. అంతే కాదు ఇదే అదును చేసుకొని కొందరు స్వార్ధ పరులు సామన్య ప్రజలను నానా కష్టాలు పెడుతున్నారు. వాస్తవానికి ఖమ్మం రూరల్ అర్భన్‌లో సర్వేయర్లు చాలా బిజీగా ఉన్నారు. ఎవరైనా సర్వే కోసం గానీ, లాండ్ కన్వర్షన్ కోసం గానీ ఓఆర్‌సీ కోసం గానీ ధరఖాస్తు చేసుకుంటే సర్వేయర్ ల్యాండ్ మీద ల్యాండ్ అయ్యే సరికి ఆర్నేల్లు పట్టినా ఆశ్చర్యం లేదు. కానీ ఖమ్మం రూరల్, అర్బన్ మండలాల్లో ఇలా చెలకలు కొని అలా ప్లాట్లు చేస్తున్నారు. దీనికి తోడు గజం 7 నుంచి 8 వేలు అని చెప్పా హడావుడి చేస్తున్నారు. ఈ హడావుడి చూస్తే ఎకరం రెండున్నర కోట్ల పై చిలుకు పలుకుతోంది. దీంతో ఈ మధ్య భూములు అమ్ముకున్న రైతులు కుమిలి కుమిలి బాధ పడుతున్నారు. ఇంతకాలం దాచుకొని రేట్లు వచ్చే ముందు రియల్ ఎస్టేట్ రాకాసుల చేతుల్లో పెట్టి నిండా మునిగామని బాధపడుతున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రైతులను నిండా ముంచుతున్నారు. చేయిమార్చి లక్షల్లో లాభాలు కూడా గట్టే ఈ బ్రోకర్లు.. రైతులను మభ్యపెట్టి రియల్ వ్యాపారులకు కోట్లు కూడా బెట్టే మార్గాలు సుగమం చేస్తున్నారు. ఇక రెవిన్యూ అధికారుల తీరు ఇంకా విచిత్రంగా ఉంది. పేపర్లో ఫోటోతో పడితే తప్ప కదిలే పరిస్థితి లేదు. అది కూడా ఆయా పత్రికల రిపోర్టర్లు వివరణకోసం వెళ్లినప్పుడు.. అవునా.. అలాగా.. అయితే చర్యతీసుకుంటాం.. అంటూ నింపాదిగా కదులుతున్నారు. రియల్ ఎస్టేట్ వైట్ కాలర్ బ్రోకర్ల మాటల గారడీలకు కామన్ మ్యాన్ క న్నీళ్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ బిజినెస్ లో కోట్లు కూడగట్టేందుకు రాజకీయ ప్రత్యర్ధులు కూడా మిత్రులగా మారిపోతున్నారు. గేట్ కమ్యునిటీ పేరుతో రైతుల నోళ్లలో మన్ను ఒక ప్రాంతంలో లే అవుట్ తీశారంటే.. అందులో పార్కులు, ప్రభుత్వ స్థలం, పాఠశాల, ఇంకా ఇతర సౌకర్యాలను చూపించాలి.. కానీ ఇవేవీ లేకుండానే.. రెండెకరాల స్థలం కొని ప్లాట్లు చేసి కోట్లు కూడగడుతున్నారు. వీళ్ల వెంచర్ పక్కనున్న భూములను వీరికే అమ్మితే సరే సరి.. లేదా... వీరి వెంచర్ రోడ్డు ఫేసింగ్ ఉంటుంది కాబట్టి... రోడ్డు నుంచి భూముల్లోకి వెళ్లాలంటే.. వీళ్ల వెంచర్లోంచి వెళ్లాల్సిందే... వాస్తవానికి వెంచర్‌లో వేసిన రోడ్డు పై ప్రజలందరికీ హక్కు ఉంది.. కానీ గేట్ కమ్యునిటీ అనే దగుల్బాజీ ఫార్ములాను దృష్టిలో పెట్టుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీళ్లు రోడ్డుకు మూడు ప్లాట్ల వెడల్పు భూమిని కొనడం.. ఇక ఆ భూమి వెనకాల వారికి దారి లేకుండా చుట్టూ అక్రమంగా గోడ కట్టడంతో వెంచర్ ఆవలి వైపున్న రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇదేం న్యాయమని అడగేందుకు వెళ్లిన రైతులను బెదిరించి పంపిస్తున్నారు. వీరి ఆగడాలకు రాజకీయ నాయకులు కూడా వత్తాసు పలుకుతుండటంతో కంచే చేను మేసిన చందంగా తయారు కావడమే కాకుండా.. రైతుల చేలకు వీళ్లే దారిలేకుండా కంచె కొట్టినట్టవుతుంది. అసలు ఖమ్మం రూరల్ మండలం లాంటి ప్రాంతాల్లో గేట్ కమ్యునిటీకి ఎటువంటి నిబంధనలు పాటించాలి.. అటువంటి నిబంధనలు పాటిస్తున్నారా.. వీటికి అనుమతులు ఉన్నాయా.. వంటి విషయాలను పరిశీలించడానికి ప్రభుత్వ అధికారులకు మామూళ్లు అడ్డం వస్తున్నాయి. దీంతో అధికారులు కళ్లుండీ చూడలేని కబోదుల్లా మారుతున్నారు. రియల్ దందాతో బీడు పడుతున్న భూములు ఇప్పటి వరకు హైదరాబాద్ శివార్లలో ద్రాక్ష, ఇతర పంటలు పండే భూములన్నీ బీడు పడ్డాయి. రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది ఎకరాలు కొనుగోలు చేసి రకరకాల కారణాలతో వాటిని వెంచర్లు చేసి కొన్ని, చేయడానికి సిద్ధం చేసి కొన్ని బీడుభూములుగా వదిలేశారు. దీంతో పచ్చని పంట పండాల్సిన భూములన్నీ వట్టిపోయాయి. ముళ్ల కంచెలతో.. రాళ్లూ రప్పలు తేలి.. పచ్చిక కోల్పోయి ఎడారుల్లా దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాడ్యం ఖమ్మానికి సోకింది.. ఖమ్మం చుట్టూ సాగర్ నీరు పుణ్యమా అని పచ్చిన పైర్లతో కళకళ లాడేది. కానీ రియల్ ఎస్టేట్ పుణ్యమా అని ఈ పచ్చని పంట పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. వెంచర్లలో ఇళ్లు కట్టకపోగా.. పంటలు కూడా పండించకుండా బీడు భూములుగా మార్చేస్తున్నారు. దీంతో రైతులకు ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది. భూస్వాముల భూములను కనీసం కౌలు రైతులు పండించి వరి పండించే వారు. ఇప్పుడా భూస్వాములు భూమికి లక్షల్లో విలువ రావడంతో వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మి చేతులు దులుపుకుంటున్నారు. ఆ భూమి పై న్యాయ పరమైన వివాదాలు నానబెట్టి తరువాత ప్లాట్లు కొనుగోలు చేసిన వారిని కోర్టుల చుట్టూ తిప్పే దుస్సాహసానికి వ్యాపారులు శ్రీకారం చుడుతున్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే.. ఈ బాధితులతా రెవిన్యూ కార్యాలయాల ముందు టెంట్లు వేసే రోజులు ఎంతో దూరంలో లేవు..

No comments:

Post a Comment