ఉదయం కలిసుంటామంటారు. సందెవేళ పొత్తు పొసగదంటారు.
బూర్జువాల వల్లే దేశం నాశనమంటారు... వాళ్లకు ప్రాణం పోసి మరీ బతికిస్తారు.
జగన్ దేశాన్ని దోచుకున్నాడని నారాయణ బల్లగుద్దుతాడు. ఎన్నికలప్పటికి జగన్‌తో పొత్తుల గురించి ఆలోచిస్తామంటాడు రాఘవులు. మతతత్వ పార్టీని ఓడించేందుకు పరకాలలో కాంగ్రెస్‌కైనా, టీఆర్ఎస్‌కైనా మద్దతిస్తానంటాడు నారాయణ.. సామాజిక వర్గాల గొడవెందుకని మళ్లీ రాఘవులే పగ్గాలు అప్పజెబుదామంటుంది రాష్ట్రమహా సభ. ఎంత వర్ణించినా ఈవీవీ సత్యనారాయణ, రేలంగి సినిమాలను మించిన హాస్య కథలతో నిండిన ఈ అరువు సిద్ధాంత కర్తల మాటలు ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఒకప్పుడు ప్రాణాలకు తెగించి మరీ విద్యుత్ ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలున్న పార్టీలవి.. ఇప్పుడు చిన్ని ధర్నా చేయడానికి కూడా కార్యకర్తలు కరువైన పార్టీలు కూడా అవే... పొత్తుల కో్సం.. రాష్ట్రంలో గెలిచే ఒకట్రెండు సీట్ల కోసం నిత్యం బూర్జువాల చంకలు దొరుకుతాయోమే అని.. పొత్తుల కోసం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను విడతలవారీగా విడాకులు తీసుకుంటూ.. కాపురం చేస్తున్న ఈ పార్టీల వైఖరికి జనం నవ్వుకుంటున్నారు. అయినా నాకేటి సిగ్గన్న చందంగా వ్యవహరిస్తుంటే.. బూర్జువా పార్టీలు గుడిని గుళ్లో లింగాన్ని దోచుకునే పనిలో బిజీగా ఉన్నాయి. మిగిలిన మావోయిస్టులను కూడా తుడిచేసే ప్రయత్నం చేస్తుంది కేంద్రప్రభుత్వం. వీళ్లు సొదర కమ్యునిస్టులమని చెప్పుకుంటూ.. పార్టీ నిర్వహణ కోసం నిత్యం పెట్టుబడి దారుల గుమ్మాల ముందు పడిగాపులు పడుతున్నారు. కొత్త పార్టీ వస్తే వాళ్ల బలా బలాలను అంచనా వేసి పొత్తుకు పిలుస్తారేమో అని ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ప్రజలకు ఈ పార్టీలంటే ఏవగింపు కలిగింది.
ప్రాణత్యాగాలకైనా వెరవని కార్యకర్తలు... నిర్బంధాలకు భయపడని శ్రేణులు. డబ్బు పంచకపోయినా ... సారాయి పోయకపోయినా... వాహనాలు సమకూర్చకపోయినా... చద్దులు చంకన బెట్టుకొని స్వచ్ఛందంగా ఒక్క పిలుపుకే లక్షలాదిగా తరలివచ్చే వామపక్ష భావజాలం కలిగిన ప్రజలు. తుపాకులు గర్జించినా... తూటాల వర్షం కురిసినా... పోలీసుల లాఠీలు శరీరాలపై నాట్యాలాడినా... అక్రమ నిర్బంధాలు కుటుంబాలకు దూరం చేసినా... ప్రత్యర్ధులు జరిపిన దాడులకు ఎర్ర సమాధులే సజీవసాక్ష్యంగా కనిపిస్తున్నా... అదరక, బెదరక గుండెనిబ్బరంతో త్యాగాలకు సిద్ధమయ్యే నాయకులు... ఒకే మాట, ఒకేబాటగా కదిలివచ్చే పల్లెలు... ఇవన్నీ... త్యాగాలే పునాదులుగా ఉభయ కమ్యూనిస్టులు భౌతికంగా పార్టీతో ఏర్పరుచుకున్న బంధానికి నిదర్శనాలు. కానీ మారుతున్న రాజకీయ సమీకరణాల్లో ఉభయ కమ్యూనిస్టులు (వామపక్షాలు) పావులుగా మారుతున్నాయి. సీట్ల పంపకాల కుళ్లు రాజకీయాల్లో అమరుల త్యాగాలు వృధాగా మిగిలిపోతోంది. అనుమానాల రోగంతో అన్నదమ్ముల్లా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తమ కండ్లను తామే పొడుచుకుంటున్నాయి. గూడు చెదిరిన పక్షుల్లా చెరోదారి చూసుకుంటున్నాయి. ఫలితంగా వామపక్ష భావజాలాన్ని నిలువెల్లా పుణికి పుచ్చుకున్న త్యాగాల ఖిల్లా ఖమ్మం జిల్లా ప్రజలకు ఆవేదనను మిగిలిస్తున్నాయి. ఎవరో ఇచ్చే సీట్ల కోసం వెంపర్లాడుతూ సొంతబలాన్ని మరిచిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి అన్నీ ఉండి అల్లుడు నోట్లో శని అన్న చందంగా మారింది. కాంగ్రెస్, టిడిపిల కన్నా జిల్లాలో బలంగా ఉన్న వామపక్ష పార్టీలు స్వయంకృతాపరాధంతో తమ కండ్లను తామే పొడుచుకుంటున్నాయి. రాష్ట్ర, కేంద్రస్థాయిల్లో రాజకీయ సమీకరణాల మాటెలా ఉన్నా, కమ్యూనిస్టుల ఖిల్లాగా ఉన్న ఖమ్మం జిల్లాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పల్లకిమోసే బోయలుగానే మారుతున్నారు. ఇరుపార్టీలు చేతులు కలిపితే చరిత్రను తిరగరాసే అవకాశం ఉన్నా, విడిపోయి సీట్ల కోసం ఇతర పార్టీల చుట్టూ వెంపర్లాడుతున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలపై ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేకుండా నిషేధం ఉన్న సమయంలో సైతం పిడిఎఫ్ పార్టీ తరుపున పోటీ చేయడం ద్వారా 1964 ముందు వరకు జిల్లాలో కమ్యూనిస్టులు తమ బలాన్ని చాటుకున్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో 1952-57 సంవత్సర కాలంలో, భద్రాచలం పార్లమెంట్ పరిధిలో 1952లో పిడిఎఫ్ అభ్యర్ధులు ఘనవిజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఖమ్మం నియోజకవర్గంలో 1952, 1957,1962, ఇల్లెందు నియోజకవర్గంలో 1952, 1957, 1962, మధిర నియోజకవర్గంలో 1952, కొత్తగూడెం నియోజకవర్గంలో 1962లో, భద్రాచలం నియోజకవర్గంలో 1957, 1962 ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్ధులు విజయం సాధించారు. అయితే 1964లో కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ, సిపిఎం పార్టీలుగా విడిపోయినప్పటికీ ఇరుపార్టీల నడుమ సుహృద్భావ వాతావరణమే ఉండటంతో ఎన్నికల్లో మాత్రం ఒకరికొకరు సహకరించుకోవడంతో ఫలితాలు ఆశాజనకంగానే వచ్చాయి. అయితే 1983వ సంవత్సరంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా వామపక్షాలు టిడిపితో దోస్తీ కట్టాయి. అప్పటికే జిల్లాలో ఉభయకమ్యూనిస్టులు ఖమ్మం, ఇల్లెందు, సుజాతనగర్, మధిర, భద్రాచలం, బూర్గంపాడు నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచే అవకాశాలున్నా, పొత్తుల పేరుతో త్యాగాల బాట పట్టాయి. అప్పటి నుండి ప్రారంభమైన కామ్రేడ్ల త్యాగాలు నానాటికీ తమ కండ్లను తామే పొడుచుకునే స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా 2004 శాసనసభ ఎన్నికల్లో టిడిపికి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌తో దోస్తీ కట్టడం ఆపార్టీ శ్రేణులను తీవ్ర ఆవేదన, ఆందోళనకు గురి చేసింది. అప్పటివరకు టిడిపి పల్లకి మోసిన వామపక్షాలకార్యకర్తలు 2004లో రాష్ట్రస్థాయిలో కుదిరిన పొత్తుల్లో భాగంగా టిడిపి పల్లకిని పడవేసి, కాంగ్రెస్ పల్లకికి భుజం కాయాల్సి వచ్చింది. 2009 ఎన్నికల్లో ఏర్పడిన మహాకూటమి పనికిరాని..పసలేని కూటమిగా మారింది. టీడీపీకి కొమ్ముకాసే కొమ్మలని ప్రజలు వీరిని పక్కనపెట్టారు. కాగా అటు టిడిపి, ఇటు కాంగ్రెస్ పార్టీలు కమ్యూనిస్టులను కరివేపాకు గానే చూస్తున్నారు. జిల్లాలో ఇరుపార్టీలు మనస్పర్ధలు వీడి కలిసి పనిచేసిన పక్షంలో మిగిలిన పార్టీల కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఇటీవల వరకు ఉన్నా, ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్, టిడిపిలతో పెట్టుకున్న పొత్తుల పాపాన్ని అనుభవించక తప్పనిపరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జిల్లాలో ఎదుటి పార్టీలకు సీట్లు కెటాయించ గలిగే స్థాయిలో ఉండాల్సిన వామపక్షాలు, ఉద్యమాలు కేవలం ఎన్నికల కోసమే అన్నట్లుగా సీట్ల కోసం ఎదుటి పార్టీల ఎదుట మోకరిల్లడం ఆ పార్టీల మనుగడను ప్రశ్నార్ధకం చేస్తుంది. పొత్తులు పెట్టుకొని ప్రధాన పార్టీల పల్లికీలు ఒక వైపు మోస్తూనే మరోవైపు ఉభయ కమ్యూనిస్టులు ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకోవడానికి కూడా వెనుకాడక పోతుండటంతో జిల్లాలో వామపక్ష ఐక్యతకు బీటలు వారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పొత్తుల పుణ్యమాని పార్టీ శ్రేణులను స్థభ్తతలో ఉంచడం కారణంగా తమతో పొత్తు పెట్టుకున్న పార్టీలలోకి ముఖ్యనాయకులు జారిపోతున్నారన్న విషయాన్ని ఇరుపార్టీలు పసిగట్టలేకపోతున్నాయి. ఇటు కాంగ్రెస్‌లో, అటు టిడిపిలో ప్రస్తుతం ఉన్న ముఖ్య నాయకుల్లో కమ్యూనిస్టు పార్టీల నుండి వచ్చిన వారే ఉండటం గమనించదగిన విషయం. ఈ నేపథ్యంలో నాయకుల పరిస్థితి ఎలా ఉన్నా, కార్యకర్తలను మాత్రం నిరాశానిస్పృహలు వెన్నాడుతున్నాయి. ఇప్పటికైనా వామపక్ష కమిటిల నేతలు జరిగిన లోటుపాట్లను సవరించుకొని చరిత్ర మిగిల్చిన గుణపాఠాలను నెమరువేసుకొని ఇరుపార్టీలు కలిసిపోని పక్షంలో మున్ముందు ఫలితాలు మరింత చేదుగా ఉంటాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. వామ పక్షాలు వామనావతారం ఎత్తుతాయి కానీ ముల్లోకాలను ఆక్రమించలేవు..
No comments:
Post a Comment