ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Monday, May 7, 2012

అడవిలో అసలేం జరిగింది...? కలెక్టర్ విడుదలకు ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది.


మావోయిస్టులు ప్రభుత్వాధికారిని అంత తేలికగా వదిలేయడం వెనుక మతలబు ఏంటి? మధ్యవర్తులుగా వెళ్లడానికి మనీష్ కుంజం, ప్రశాంత్ భూషణ్ ఎందుకు నిరాకరించారు. మావోయిస్టులను రూపు మాపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు గుప్పించడం ... నిద్రపోతున్న పులిని లేపినట్లయింది. ప్రభుత్వం వరుసగా గిరిజనుల పై దాడులు, అరెస్టులు జరపడం మావోయిస్టులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో.. అటు ఒరిస్సాలో ఇటలీ పర్యాటకులను, ఎమ్మెల్యే హికాకను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఇటు చత్తీస్‌గఢ్‌లో సుకుమా జిల్లా కలెక్టర్‌ అలెక్స్ పాల్ మీనన్ ను గ్రామసభ నిర్వహిస్తుండగా కిడ్నాప్ చేశారు. ముఖ్యంగా కలెక్టర్ కిడ్నాప్ వ్యవహారం ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారింది. అలెక్స్ మీనన్ విడుదలకు ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేసింది. ఇటు ప్రభుత్వ మధ్య వర్తులు, అటు మావోయిస్టు మధ్యవర్తుల మధ్య సాగిన చర్చల్లో కలెక్టర్ విడులైతే అయ్యాడు. కానీ మావోయిస్టులు ఏం డిమాండ్ చేశారు.. అయితే డిమాండ్ చేసిన వాటిల్లో ప్రభుత్వం ఏఏ డిమాండ్లకు అంగీకరించిందనే విషయంలో కొన్ని అనుమానాలు పొంచి ఉన్నాయి. ఇంతకీ అడవిలో ఏం జరిగింది.. అనేది అందరి మెదళ్లనూ తొలుస్తున్న ప్రశ్న.. దీనికి పొలిటికల్ వార్ దగ్గరున్న సమాచారంతో బాటు హరగోపాల్ మీడియాకు తెలిపిన వివరాలు జోడించి అందిస్తున్నాం... అది ఏప్రిల్ 21.. 2012 చత్తీస్‌గఢ్, సుకుమా జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ మాజిపరా గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తుండగా... 15 మందితో కూడిన మావోయిస్టు దళం దాడి చేసింది. ఆయన అంగరక్షుల పై కాల్పులు జరిపి కలెక్టర్ ను కిడ్నాప్ చేసింది. ఇద్దరు అంగరక్షకులు మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందారు. అప్పటికే ఒరిస్సాలో ఎమ్మెల్యే హికాక విడుదల పై అనిశ్చితి కొనసాగుతోంది... ఎమ్మెల్యే విడుదలకు మావోయిస్టులు పెట్టిన షరతుల పై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇదే సందర్భంలో చత్తీస్‌గఢ్‌లో సుకుమా జిల్లా కలెక్టర్ కిడ్నాప్ రమణ్ సింగ్ ప్రభుత్వానికి సవాలుగా మారింది. కలెక్టర్ ఆరోగ్యం బాగాలేదు... ఆయనకు ఆస్తమా ఉంది.. ఆయన వద్ద రెండు రోజులకు మించి మందులు లేవు.. కాబట్టి సకాలంలో వైద్యం అందించి.. వెంటనే వదిలేయాల్సిందిగా కలెక్టర్ భార్య ఆశా మీనన్.. మావోయిస్టులకు పదే పదే విజ్ఞప్తి చేసింది. ఇటు ముఖ్యమంత్రి రమణ సింగ్ కూడా మానవతా దృక్పదంతో కలెక్టర్ ను వదిలేయాలని మావోయిస్టులను అభ్యర్ధించారు. తమ డిమాండ్లు నెరవేరిస్తేనే కలెక్టర్‌ను వదిలేస్తామని లేకుంటే కలెక్టర్ విషయాన్ని ప్రజాకోర్టులోనే నిర్ణయిస్తామని తేల్చి చెప్పారు. మావోయిస్టుల తరపున వారి డిమాండ్లను వివరిస్తూ... దండకారణ్యంలోని దక్షిణ బస్తర్ డివిజన్ మావోయిస్టు పార్టీ ప్రతినిధి విజయ్ మడకమ్ లేఖ విడుదల చేశారు. కిడ్నాపైన కలెక్టర్ ను విడుదల చేయాలంటే ఆపరేషన్ గ్రీన్ హంట్, కూంబింగ్ ను వెంటనే నిలిపివేయాలని..దండకారణ్యంలోని పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దంతెవాడ, రాయ్ పూర్, జగ్దల్ పూర్, కువాకోడ, ప్రాంతాల్లో మావోయిస్టులు, ఆదివాసీలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని... రాయ్ పూర్ జైల్లో బందీలుగా ఉన్న 8మంది ఆదివాసీలతోపాటు మరో 8మంది మావోయిస్టులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో కొందరు కార్యకర్తల పేర్లు కూడా స్పష్టంగా తెలిపారు. మడకమ్ గోపన్న అలియాస్ సత్యం రెడ్డి, నిర్మలక్క అలియాస్ విజయలక్ష్మి, జైపాల్ అలియాస్ చంద్రశేఖర్ రెడ్డి, మాలతి అలియాస్ శాంతి ప్రియారెడ్డి, మీనాచౌధరి, బీజాపూర్ జిల్లాకు చెందిన కొరసా సన్నీ, సుకుమ ా జిల్లాకు చెందిన మడకమ్ సన్నీ, పద్మలను విడుదల చేయాలని లేఖలో తెలిపారు. మరోవైపు జర్నలిస్టు అసిత్ కుమార్ సేన్ ను కూడా విడుదల చేసి అతనిపై ఉన్న కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండ్ల పై చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ముగ్గురు మధ్యవర్తుల పేర్లను మావోయిస్టు పార్టీ ఖరారు చేసింది. వీరిలో మాజీ ఐఏఎస్ అధికారి బీడీ శర్మ, ఆదివాసీ మహాసభ జాతీయ అధ్యక్షుడు మనీష్ కుంజం, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ భూషణ్ పేర్లను తెలిపింది. తమ అభ్యర్థనను మన్నించి చర్చలకు మధ్యవర్తులుగా రావాలని ఈ ముగ్గురినీ కోరింది. అంతేకాక తమ వద్ద బంధీగా ఉన్న కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ ఆరోగ్యం క్షీణించిందని మావోయిస్టుపార్టీ లేఖలో పేర్కొంది. మధ్యవర్తుల చేత మందులు పంపించాలని కూడా సూచించింది. దండకారణ్యంలోని తాడిమెట్ల అటవీప్రాంతంలో చర్చలు జరపాలని కోరింది. మావోయిస్టుల అభ్యర్ధనను మనీష్ కుంజం, ప్రశాంత్ భూషణ్‌లు సున్నితంగా తిరస్కరించారు. మరోవైపు మావోయిస్టులు 25వ తేదీని డెడ్ లైన్ గా నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం కాస్త ఇరకాటంలో పడింది. మావోలు ఒడిషా కలెక్టర్ హికాకాను ఇంకా విడిచిపెట్టక పోవడం, సుక్మా కలెక్టర్ వ్యవహారంలో మధ్యవర్తిత్వం విషయం చిక్కు ముడి పడడం, జైళ్లలో ఉన్నవారిని వదిలే పరిస్తితి లేకపోవడం.. చత్తీస్ గడ్ ప్రభుత్వాన్ని అయోమయంలో పడవేసింది. మావోయిస్టులతో చర్చలకు ప్రభుత్వం తరపున శ్రీయోగ్య మిశ్రా, నిర్మళాబూజ్ లు... మావోయిస్టుల తరపున బీడీశర్మ, ప్రొఫెసర్ హరగోపాల్ విడతల వారీ చర్చలు జరిపారు. ఆదివాసీలకు న్యాయం జరగాలనే ఉద్యేశ్యంతోనే తాము మధ్యవర్తిత్వానికి అంగీకరించామని వారు తెలిపారు. మరోవైపు కలెక్టర్ అలెక్స్ ను వెంటనే విడుదల చేయాలని మానవ హక్కుల సంఘం నేత డాక్టర్ బినాయక్ సేన్ కూడా మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టుల డిమాండ్లకు ప్రభుత్వం స్పందించింది. దీంతో కలెక్టర్ విడుదలకు మార్గం సుగమం అయింది. పదమూడు రోజుల అనంతరం కలెక్టర్ ను తాడిమెట్ల అడవుల్లో మధ్యవర్తులకు అప్పగించారు. గట్టి భద్రత మధ్య కలెక్టర్ ఇల్లు చేరుకున్నారు. కాగా కలెక్టర్ విడుదల కోసం ప్రభుత్వం మావోయిస్టులతో రహస్య అవగాహనకు వచ్చిందన్న వార్తలను ఇరుపక్షాలు ఖండించాయి. మీనన్ విడుదల కోసం ప్రభుత్వం మావోలతో ఎలాంటి రహస్య ఒప్పందం కుదుర్చుకోలేదని ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విలేఖరుల సమావేశంలో పాల్గొన్న మవోల మధ్యవర్తులు బి.డి.శర్మ, ప్రొఫెసర్ హరగోపాల్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ప్రభుత్వ తరఫున మధ్యవర్తుల్లో ఒకరైన ఎస్.కె.మిశ్రా కూడా ఈ అంశాన్ని నిర్ధారిస్తూ ఇరుపక్షాల మధ్య రహస్య అవగాహన లేదని స్పష్టం చేశారు. ఇరుపక్షాల మధ్యవర్తుల మధ్య ప్రజల సమక్షంలోనే చర్చలు జరిగాయని.. ఆ తర్వాతే కలెక్టర్‌న విడుదల చేయడం జరిగిందని తెలిపారు.
కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ విడులకు ముందే ఒరిస్తాలో ఎమ్మెల్యే హికాకను కూడా విడుదల చేయడంతో.. మావోయిస్టులు తాము గిరిజనుల సంక్షేమం కోసమే ఈ పని చేశామని వివరించారు. వర్గ ప్రయోజనాల కోసం చేసే పోరాటంలో కొందరు ఇబ్బంది పడక తప్పదని... గిరిజనుల హక్కులను కాపాడటం కోసమే తాము ఈ పోరాటం చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ప్రభుత్వం మావోయిస్టుల డిమాండ్లను నెరవేరుస్తానని ఒప్పుకుందా.. ఒప్పుకుంటే ఆ డిమాండ్లు ఏంటి.. ఈ విషయాలు మాత్రం అధికారికంగా చెప్పక పోవడమే అనుమానాలకు దారి తీసింది. మరోవైపు హరగోపాల్ మాత్రం అక్కడున్న ప్రతినిధుల మధ్య చర్చజరిగిందని చెబుతున్నారు. వాళ్లు 8 మందిని విడుదల చేయాలని మొదట చెప్పారని, తరువా 6 గురికి తగ్గారని చెప్పారు. అయితే ప్రభుత్వం ముగ్గురిని విడుదల చేస్తామని చెప్పింది. కొందరి పై కేసులు ఎత్తి వేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే మావోయిస్టులను అందరినీ విడుదల చేయడానికి ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో మావోయిస్టులు కూడా ఓ మెట్టు దిగారని తెలిపారు. అంతే తప్ప ఇందులో రహస్య ఒప్పందామీ లేవని చర్చల ప్రతినిధి ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. అయితే ప్రభుత్వాలు ఇచ్చిన మాట పై నిలబడతాయి అనడానికి రుజువులు లేవు. అందులోనే మావోయిస్టులకు ఇచ్చిన మాట పై ప్రభుత్వం నిలబడితే దాన్ని చేతగాని తనం కింద లెక్కగడుతారని.. చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులకు ఇచ్చిన మాటలు తప్పిన సందర్భాలున్నాయి. అయినా ప్రభుత్వాల పై నమ్మకం ఉంచుతూనే ఉంటారు. చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన వారిపై ఇరు పక్షాల నుంచి వత్తిళ్లు వస్తూనే ఉంటాయి. అందుకే మనీష్ కుంజం, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ భూషణ్ ‌లు చర్చలకు వెళ్లడానికి సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా మావోయిస్టుల చేతికి చిక్కిన వారిని క్షేమంగా విడుదల చేయడం పై హర్షం వ్యక్తమవుతోంది. మావోయిస్టులు కొంత వరకు హింసావాదాన్ని తగ్గించారనే ప్రచారం జరుగుతోంది.

No comments:

Post a Comment