ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, May 12, 2012

పార్లమెంట్‌కు అరవై ఏళ్లు.. సాధించింది సన్యాసం


అది 1952 మే13... భారత దేశంలో ఓ కొత్త శకం ఆరంభం.. ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న నేతలు ఇక్కడే కొలువు తీరారు... ప్రజలు ఏ విశ్వాసంతో తమను ఇక్కడకు పంపారో... ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొనే వేదిక ఇది. ఇప్పటిలా అప్పుడు ప్రత్యక్ష ప్రసారాలుగానీ.. బ్రేకింగ్ న్యూస్ కానీ లేవు. పార్లమెంట్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రాత్రి రేడియోలో వచ్చే వార్తల్లోనే.. అదీ సంపన్న వర్గాలకే సాధ్యం. అయినా మన నేతలు ప్రజలకేం కావాలో అవి చర్చించి మరీ సాధించుకునే వారు.. మైకులు విరిచేయడాలు.. వెల్‌లోకి దూసుకెళ్లడాలు... ప్లకార్డులు పట్టుకొని గోల చేయడాలు లేవు. ఏదైనా నిరసన తెలియజేయాల్సి వస్తే శాంతియుతంగా తెలపడం.. వాకౌట్ చేయడం.. అది కూడా చాలా అరుదగా జరిగే చర్య.. తొలినాళ్లలో పార్లమెంటు చాలా హుందాగా, పద్ధతిగా నడిచేది. పండిట్ నెహ్రూ, శాస్త్రీజి, ఆచార్య కృపలానీ, లాంటి నేతల సారధ్యంలో వాడి, వేడి చర్చలు సాగేవి. సభ అంటే ఎంతో గౌరవం వుండేది. నేతల ప్రసంగాలను అత్యంత శ్రద్ధగా వినేవారు. వాదనలన్నీ అంశాలపైనా, సమస్యలపైనా వుండేవి. అనవసర రచ్చలతో కాలయాపన ఉండేది కాదు.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బాగా అమలయ్యేది. సభ్యులు తమ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని తమ ప్రసంగాల్లో మాత్రమే చూపేవారు. తమ వ్యతిరేకతను, నిరసనలను హుందాగా ప్రకటించేవారు. కాల చక్రం గిర్రున తిరుగుతోంది.. ఆరు దశాబ్దాలు అవలీలగా గడిచిపోయాయి. పార్లమెంట్ అంటే ఫైటింగ్ స్టేజీగా మారిపోయింది. ఇప్పుడు కూడా ప్రజా సమస్యలే.. కాకుండే ప్రజల సొమ్ము ఎవరెంత కాజేశారు.. ప్రజాధనాన్ని ఏ ప్రభుత్వ హయాంలో ఎంత బొక్కేశారు.. గత ప్రభుత్వం చేసిన తప్పులేంటి.. ఇవే చర్చలు.. ప్రజలకు పనికొచ్చే చట్టాలకు జీరో అవరే గతి... ఎవరు పెద్దగా గళమెత్తి.. వీరోచితంగా ప్రవర్తిస్తే వారే పార్లమెంట్ హీరో.. ఎన్ని మైకులు విరగ్గొట్టి.. ఎన్ని సార్లు వెల్‌లోకి దూసుకెళితే ఆయనే ప్రజల పక్షాన అలుపెరగకుండా పోరాడుతున్నట్టు.. ప్రజా సమస్యల పై వీరు గొంతు చించుకుంటుంటే.. దాన్ని ప్రసార మాద్యమాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి గనుక... విపక్షాల పై దుమ్ము పోయడమే పనిగా పెట్టుకొని... దానికి పార్లమెంట్‌ను వేదికగా చేసుకుంటున్నారు. ప్రతి పక్షం, అధికార పక్షం బహిరంగ సమావేశాల్లో విమర్శలు చేసుకుంటాయి. కానీ ఎదురెదురుగా తిట్టుకునే వేదికగా పార్లమెంట్ మారింది. ఎన్నికల్లో పంచిన నోట్ల కట్టలను ప్రదర్శించే వేదిక కూడా పార్లమెంటే అయింది. ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు వేదికైన మన పార్లమెంటుకు షష్టి పూర్తి వేడుకలు జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు.. ఎన్ని సవరణలు.. ఎన్ని మలుపులు.. ఈ అరవైఏళ్ల పార్లమెంట్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లు.. పార్లమెంట్ అంటే మైకుల విరిచేసుకోవడం అనే కోణంలోనే చూడరాదు.. అది భారత పౌరుడి సగటు గళం స్పందనకు వేదిక.. ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధులు వారి సమస్యలను చర్చించి వారికో పరిష్కారాన్ని సాధించే వేదిక. ప్రభుత్వ పరమైన నిర్ణయాలు చట్టాలుగా మారే కేంద్రం. ఈ వేదిక ఎంతో ఉన్నతమైనది.. సామాన్యుడి గళం వినిపించే ఓ ప్లాట్ ఫామ్..అక్కడ చర్చలుంటాయి.. వాదోపవాదాలూ వుంటాయి.. ప్రజాసమస్యలపై అనేక కోణాల్లో చర్చలు జరుగుతాయి. ప్రభుత్వ పెద్దలకు సలహాలు, సూచనలు అందుతాయి. పార్లమెంట్ ఉభయ సభలూ రెండు కళ్ల లాంటివి.. కీలకమైన అంశాలపై చర్చలు జరిపి ఉభయ సభలు ఆమోదించాకే బిల్లు చట్ట రూపం తీసుకుంటుంది. పార్లమెంటు కొలువు దీరిన తొలినాళ్లలో చట్ట సభలను పవిత్ర దేవాలయంగా, సభాపతిని పూజారిగా భావించే వారని వృద్ధతరం నేతలంటున్నారు. పార్లమెంటు మొదలైన నాటి నుంచి నేటి వరకూ అందులో కొనసాగుతున్న వారిలో కొందరు ఇంకా వున్నారు. మణిపూర్ కు చెందిన రిషాంగ్ కీషింగ్ 1952లో ఆరంభంలో సభ్యుడిగా వున్నారు. ఇప్పటికీ ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక రేషమ్ లాల్ జంగ్డే అనే దళిత న్యాయవాది కూడా మొదటి లోక్ సభ సభ్యుడిగా వున్నారు. బిలాస్ పూర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక తొలి పార్లమెంటు సభ్యునిగా వున్న వారిలో మన తెలుగు వారు కూడా వున్నారు. పార్లమెంట్ షష్ఠి పూర్తి చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని... పార్లమెంటులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.. ఉదయం 11 గంటలకు ఉభయసభల సభ్యులు కొలువుదీరి.. మామూలు సమస్యలపై కాకుండా.. గత అరవయ్యేళ్లలో పార్లమెంటు ప్రస్థానం గురించి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గు రించి చర్చలు జరుగుతాయి. సాయంత్రం నాలుగున్నర దాకా ఈ ప్రత్యేక సెషన్ నడుస్తుంది. పార్లమెంటు సెంట్రల్‌హాలులో ఉభయసభల సభ్యులనూ ఉద్దేశించి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ప్రసంగిస్తారు. ప్రధాని మన్మోహన్ సింగ్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ తదితరులు కూడా ప్రసంగిస్తారు. పార్లమెంటు షష్టిపూర్తిని పురస్కరించుకుని రూ.5, 10 నాణేలను, పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఈ వేడుకల్లో అనాటి సభలో సభ్యులైన రిషాంగ్ కెయిషింగ్, రేషమ్‌లాల్ జంగ్డేలకు గౌరవ సత్కారం చేస్తారు.. ఈ సందర్భంగా వారిరువురూ అలనాటి సభ విశేషాల గురించి తన అనుభవాలనూ... జ్ఞాపకాలను వివరిస్తారు. రిషాంగ్.. 1952 సభలో సభ్యుడిగా ఉండి, ప్రస్తుతం మణిపూర్ నుంచి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మ ణిపూర్ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఘనత కూడా రి షాంగ్‌ సొంతం. రేషమ్‌లాల్ జంగ్డే ఒక దళిత న్యాయవాది. తొలిసభలో సభ్యుడైన ఆయన.. బిలాస్ పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే, మధ్యప్రదేశ్ అసెంబ్లీకి మూడుసార్లు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యా రు. పార్లమెంట్ అరవై సంవత్సరాల వేడుకలో పంచుకున్న అనుభవాలతోనైనా.. పార్లమెంట్‌లో హుందాతనం.. సభ్యులు ప్రవర్తించిన తీరు.. ప్రజా సమస్యల పై చిత్ర శుద్ధి లాంటి అంశాలు మన నేతలు గుర్తు చేసుకొంటే.. ఈ వేడుకలకు నిజమైన అర్ధం...

అమ్మను గుర్తుంచుకునేందుకు ఇదా పద్దతి..


మాతృదినోత్సవం ఎందుకు అమ్మను మర్చిపోతే కదా.. కన్నీళ్లలోనూ.. కలవరపాటులోనూ గుర్తొచ్చేది అమ్మేకదా.. ఆఖరుకు బూతులు తిట్టే వెదవల నోళ్లలో నానేది కూడా తొలుత అమ్మ పదమే.. అందుకే మర్చిపోలేని అమ్మను గుర్తు చేసుకునే మాతృదినోత్సవం గురించి మీరేమంటారు.

మాతృదేవోభవ... అమృతవర్షిణి అమ్మ.. మాతృదినోత్సవం (13 మే)


మాతృదేవోభవ... అమృతవర్షిణి అమ్మ.. మాతృదినోత్సవం (13 మే) అమ్మ... భాషకు అందని భావం... తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు....కనిపించే దైవం అమ్మ........ఆదిగురువు అమ్మే....అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది....ప్రపంచీకరణ మార్పుల వెల్లువలో కూడా అమ్మ బంధం చెక్కు చెదరలేదంటే అది అమ్మ ప్రేమలోని కమ్మదనానికి ఉన్న గొప్పతనమే...మదర్స్ డే సందర్భంగా ప్రేమామృతాన్ని కురిపించే మాతృమూర్తిపై హెచ్ యం టీవి అందిస్తోన్న ప్రత్యేక కథనం.... సృష్టికి మూలం అమ్మ.. సృష్టిలో క్షేత్రం అమ్మ... దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడట... కష్టం వచ్చినా కన్నీళ్లొచ్చినా గుర్తొచ్చేది అమ్మే.. అమ్మ ప్రేమ అమృతం లాంటిది.. మనుషులకే కాదు... జంతువులకు కూడా అమ్మంటే చెప్పలేని ప్రేమ.. విశ్వరహస్యాలను ఛేదించిన వాడైనా ఓ తల్లి కొడుకే.. అమ్మ చనుబాలను అమృతంలా సృష్టించి.. మమకారాన్ని కలగలిపిన.. మమతల కోవెలగా అమ్మ ఒడిని మలిచి మనకు అందించాడు దేవుడు. అందుకే ఓ కవి అవతార పురుషుడైనా అణువంతే పుడతాడని తెలిపాడు ఈ సృష్టిలో మరో విచిత్రం ఉంది.. ఒకరు జన్మ కారకులైతే.. మరొకరు ప్రగతి కారకులు.. బరువైన కాయను మోసి పుడమి తల్లి తల్లి పొత్తిళ్లలోని వదులుతుంది మొక్క... ఆ నేల పొత్తిళ్లలోంచి పుట్టిన మొక్కకు నేలతల్లే అమ్మ.. గూడు కట్టుకోలేని కోయిలమ్మకు కాకమ్మే అమ్మ... అందుకే కంటేనే అమ్మ కాదు.. కడుపు తీపితో పెంచిన ప్రతితల్లీ అమ్మే.. అమ్మలేని సాహిత్యం లేదు.. అమ్మలాలి పాటల్లోనే తొలి సరిగమలు పురుడు పోసుకుంటాయి. అమ్మ జోల పాటను మించిన పాట లేదు. అందుకే సంగీతం కూడా అమ్మకు దాసోహమే..
యాంత్రక యుగంలో ప్రీ బర్త్ స్కూల్స్ వచ్చినా.. ప్రీ స్కూల్ గార్డెన్స్ వచ్చినా.. అమ్మ ప్రేమ పదిలమే.. ఇంటర్నెట్ యుగంలో కూడా అమ్మతనంలో కమ్మదనాన్ని మరిచిపోలేదు. . ఎందుకంటే బ్లాగులు, సోషల్ నెట్‌వర్క్ సైట్లు, ఆన్‌లైన్ కవిత్వ, సాహిత్య వెబ్‌సైట్లలో అమ్మ కవిత్వానికే అగ్ర తాంబూలం... చాలా మంది తమ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ప్రొఫైల్ ఫోటోగా తల్లీ బిడ్డల ఫోటోలనే ఎంచుకంటారు. ఎంత ఎదిగినా తల్లి ముందు పిల్లాడే... వయసు పెరిగినా, మానసిక ఎదుగుదల లేని ఎందరో పిల్లలకు సేవలు చేస్తున్న తల్లుల కథలు వింటున్నాం... వివిధ ప్రమాదాల్లో, సంఘటనల్లో గాయపడ్డ పిల్లలను ఇరవైయ్యేళ్ళు ఉన్నా రెండేళ్ళ పిల్లల్లా సేవలు చేస్తున్న తల్లులను చూశాం... ఆమె చేసే సేవను పోలిక లేనిది... ఆ రుణం తీర్చుకోలేనిది. అమ్మ ప్రేమను గుర్తు చేసుకోడానికి ఓ రోజు పెట్టుకున్నారు పాశ్చాత్యులు. దానికి ముద్దుగా మదర్స్ డే అని పెట్టుకున్నారు. మాతృదినోత్సవం.. కానీ అమ్మ గుర్తుంచుకొనే రోజెందుకు. అమ్మను మర్చిపోతే కదా.. కష్టం వచ్చినా కన్నీళ్లొచ్చినా వచ్చే తొలి మాట అమ్మే కదా..

Friday, May 11, 2012

బ్లాక్ డే ఇప్పుడు గుర్తొచ్చిందా.. సాక్షికి జర్నలిస్టుల శాపం తగిలింది. జర్నలిస్టు నాయకులకు.. ఇప్పుడు మెలకువ వచ్చిందా..?


జర్నలిస్టు నాయకులకు.. ఇప్పుడు మెలకువ వచ్చిందా..? బ్లాక్ డే అంటూ సాక్షి పత్రిక పెద్ద అక్షరాలతో ఈ రోజు బేనర్ పెట్టుకుంది. వాస్తవానికి సాక్షికి ఈ రోజు బ్లాక్ డే కావచ్చు.. కానీ ఈ రాష్ట్ర్రంలో ఉన్న జర్నలిస్టులు వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే బ్లాక్ లిస్టులో చేరిపోయారు. చిన్న పత్రికలన్నీ చాలా వరకు కూడూ గుడ్డా లేకుండా రోడ్డున పడ్డాయి. రెండు రూపాయలకే చాటెడు చెత్త అందిస్తానని చెప్పుకొచ్చిన సాక్షికి ఈ రోజు బ్లాక్ డే కావచ్చు. కానీ వార్తా పత్రికలేమన్నా. భగవద్గీతలా.. ఖురానా.. బైబిలా వాటి అంత సత్య నిరత ఉందా... ? వార్తా పత్రికల్లో వార్త పడితే స్పందించాలా.. పత్రికలో అధికారుల అలసత్వం పై, అవినీతి పై వార్తలు రాస్తే చర్యలు తీసుకోవాలా...? అంటూ వ్యంగ్య బాణాలు విసిరిన పరమ మీడియా ద్వేషి వైయస్ రాజశేఖర్ రెడ్డి అనే విషయం ప్రతి జర్నలిస్టుకూ తెలుసు. చనిపోయి ఏ లోకంటో ఉన్నాడో గానీ.. బతికున్నపుడు చేసిన నిర్వాకం వల్ల పేద జర్నలిస్టులు చాలా మంది కూటికెల్లక కూలీ పడుతున్నారు. చిన్న పత్రికలైనా పెద్ద పత్రికలైనా.. వార్తలు రాసీ రాసీ విసుగు పుడుతుందే తప్ప ఏ ఒక్క అధికారిలో కదలిక లేదు. అతగాడి చెత్త వ్యూహం వల్ల రాష్ట్రంలో జవాబుదారీ తనంలోపించింది. అధికారులు అవినీతి పరులయ్యారు. బాహాటంగానే లంచాలు పుచ్చుకుంటున్నారు. ఎవరైనా విలేకరులు వివరణలు అడిగితే.. కావాలంటే ఫోటోలు తీసుకోండని వెకిలి నవ్వులు నవ్వుతున్నారు. ఎన్ని వార్తలు రాసినా అధికారులు పాత పద్దతిలోనే అంటే.. వార్తలు భగవద్గీతలు కావు కదా అని వైయస్ చెప్పాడని నెట్టుకొస్తున్నారు. సాక్షిలో వస్తేనే వార్త, సాక్షి చానల్‌లో ప్రసారమైందే సిసలైన వార్త.. ఇదీ వైయస్ రాజశేకర్ రెడ్డి సిద్ధాంతం. ఈ సిద్దాంతం వల్ల పత్రికలన్నీ మూసేసుకోవాలనే పన్నాగం పన్ని..రాష్ట్రంలో ఏ పత్రికకూ యాడ్స్ రాకుండా అడ్డుకున్నాడు. చిన్న పత్రికలైతే మరీ బిచ్చగాళ్లలా తిరిగినా.. కాళ్లరిగేలా తిరిగినా ఏ సమాచార అధికారీ ఒక్క యాడ్ ఇచ్చిన పాపాన పోలేదు. ఎవరికైనా కాళ్లొత్తే అలవాటు ఉంటే.. ఒకరిద్దరు బతకనేర్చి యాడ్స్ తెచ్చుకునేవారు. ఆత్మభిమానం ఉన్న వాళ్లంతా డీటీపీ ఆపరేటర్లుగానో.. డెస్ట్ ఎడిటర్లుగానో అవతారం ఎత్తారు. ఎప్పుడైతే సాక్షి తాకిడికి, వైయస్ చెత్త నిర్ణయాలకు పత్రికలు, జర్నలిస్టులు బలయ్యారో.. ఆ రోజే జర్నలిజానికి బ్లాక్ డే మొదలయింది.
ఈ రోజు సాక్షి పత్రికకు ఒక్కరోజు యాడ్స్ నిలిపేస్తే గొంతు చించుకుంటున్న సో కాల్డ్ జర్నలిస్టులు.. ఇంతకాలం ఇన్ని పత్రికల గోస తెలియదా... అమర్ లాంటి వ్యక్తి ఈ రోజు మీడియా ముండు నిలబడి అప్రజాస్వామికమని గొంతు చించుకుంటున్నాడే.. ఏపీ‍యూడబ్ల్యూజే అధ్యక్షుడయి కూడా ఏనాడన్నా చిన్న పత్రికల గోడు పట్టించుకున్నాడా.. తనకు లక్షలాధి రూపాయల జీతం ఇచ్చి... యాంకర్ గా ప్రసెంట్ చేసిన సాక్షి ఖాతాలు ఆగిపోగానే..యాడ్స్ ఆగిపోగానే..తన జీతం ఎక్కడ ఆగుతుందో అనో.. లేక జగన్ మెహర్‌బానీ కోసమో..జర్నలిస్టు విలువలు, పత్రికా స్వేచ్ఛ గుర్తొచ్చాయి. కలర్ పేపర్ మాయలో కనుమరుగయిపోయిన కరకు పత్రికల సాక్షిగా... జర్నలిస్టులు కన్నీళ్ల సాక్షిగా... ఎన్నో కుటుంబాల గోస తగిలి ఈ సాక్షి నాశనం కాక తప్పదు. పాలనా వ్యవస్థను పాడు చేసిన వ్యక్తికి పేదవారి శాపం తగలక మానదు. ఓ సోకాల్డ్ జర్నలిస్ట్ మేతావుల్లారా.. ఒక సాక్షికి యాడ్స్ ఆపినపుడు కాదు.. చిన్నపత్రికలు యాడ్స్, అక్రిడేషన్లు ఆపినపుడు కూడా మీ నోరు తెరవండి.. లేకుంటే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోండి.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.

రష్యాలో పుతినే రాజ్యాంగం.. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక.. అనైతికమట


రష్యాలో పుతినే రాజ్యాంగం.. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక.. అనైతికమట రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ప్రధానిగా ఉన్న పుతిన్ మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పుతిన్ రష్యా అధ్యక్షుడిగా పనిచేయడం ఇది మూడో సారి. పుతిన్‌ను అధ్యక్షుడిగా చేసేందుకు రష్యా రాజ్యాంగాన్ని కూడా మార్చారు. రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్‌ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు ఆయన నాలుగేళ్లపాటు దేశ ప్రధానిగా పనిచేశారు. సోమవారం దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. 2018 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. 2000-2008 సంవత్సరంలో ఆయన అధ్యక్షునిగా పని చేసి ఆ తర్వాత నాలుగేళ్లు ప్రధానిగా రష్యన్ రిపబ్లిక్‌కు సేవలు అందించారు.. రాజ్యాంగపరంగా ఒక వ్యక్తి వరుసగా రెండు సార్లు మించి అధ్యక్షునిగా పదవి చేపట్టకూడదు కనుక 2008లో బలవంతంగా ఆ పదవిని వీడారు. నాలుగేళ్ల అనంతరం తిరిగి అదే పదవికి ఎన్నికయ్యారు. రష్యా అధ్యక్షుడిగా ఇప్పటికే రెండు సార్లు విధులు నిర్వహించిన పుతిన్.. సమర్ధునిగా పేరు తెచ్చుకున్నారు. 2000 నుంచి 2008 వరకు రెండుసార్లు ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాలం రష్యాకు చాలా కీలకం. ఎందుకంటే, అప్పటికి దానికి స్థిరత్వం తెచ్చేవాళ్లు కావాలి. అందుకు పుతిన్‌ సరైనవ్యక్తి అని భావించారు. ఆయనకు అత్యంత ఎక్కువ పాపులారిటీ రావడానికి కారణం కూడా లేకపోలేదు.. తొంబైవ దశకంలో రష్యాలో ప్రజాస్వామ్యం దిశగా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దీనికి కారణం ఆయన నియంతృత్వ పాలనలోని సుస్థిరతే అని చెప్పుకోవచ్చు.దీనికి తోడు చమురు, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగిపోవడం.. రష్యా అతి పెద్ద విద్యుత్తు ఉత్పాదక దేశం కావడంతో సంపద పెరిగి, పరిస్థితి గణనీయంగా మార్పు వచ్చింది. మరోవైపు... ఆయన అధికారం చేజిక్కించుకున్న తీరు ... లిబరల్స్‌ నుంచి తీవ్ర విమర్శలకు గురైంది. రష్యన్లకు సేవ చేసే భాగ్యమే తన జీవితానికి పరమార్ధమంటూ.. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, కాపాడుతూ.. రష్యన్ల హక్కులను, స్వేచ్ఛను పరిరక్షిస్తానని పుతిన్‌ ప్రమాణం చేశారు. వ్లాదిమిర్ పుతిన్ 2000 సంవత్సరంలో తొలిసారిగా రష్యా అధ్యక్షపీఠాన్ని అధిష్టించారు.. ఆ తర్వాత నాలుగేళ్ళకు అంటే... 2008 వరకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఒకే వ్యక్తి మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు రష్యా రాజ్యాంగం అంగీకరించకపోవడంతో 2008 నుంచి ప్రధానమంత్రి పదవి అధిష్టించారు.. తనకు అత్యంత నమ్మకస్తుడైన దిమిత్రి మెద్వెదెవ్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి.. మళ్ళీ అధ్యక్షుడయ్యేందుకు, పదవీకాలాన్ని నాలుగేళ్ళ నుంచి ఆరేళ్ళకు పెంచుకోడానికి వీలుగా రాజ్యాంగాన్ని సవరించుకుని.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రష్యా అధ్యక్ష స్థానానికి తిరిగివచ్చారు. ఇప్పుడు 2018 వరకు రష్యాకు పుతినే అధ్యక్షుడు. అంతే కాదు.. మరోసారి అధ్యక్షపదవికి పోటీ చేసే అవకాశాన్ని కూడా చేతిలోపెట్టుకుని మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పూర్వపు సోవియట్‌ యూనియన్‌ అధ్యక్షుడు మిఖాయెల్‌ గోర్బచెవ్‌తో పాటు కొందరు ప్రతిపక్ష నేతలు కూడా హాజరయ్యారు. రష్యా అధ్యక్ష భవనంలోని గ్రాండ్‌ క్రెమ్లిన్‌ హాల్‌లో జరిగిన పుతిన్‌ ప్రమాణస్వీకారోత్సవానికి.. పూర్వపు సోవియట్‌ యూనియన్‌ అధ్యక్షుడు మిఖాయెల్‌ గోర్బచెవ్‌తో పాటు మూడు వేల మంది ఆహూతుల సమక్షంలో పుతిన్‌ ప్రమాణస్వీకారం చేశారు. అయితే పుతిన్ ప్రమాణ స్వీకారాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. ప్రమాణస్వీకర కార్యక్రమాన్ని కిరీటధారణ కార్యక్రమమని అభివర్ణించారు.. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అన్యాయంగా, అరాచక పద్ధతుల్లో పుతిన్ అధ్యక్షుడయ్యారని.. నైతికంగా ఆయనకు ప్రమాణస్వీకారం చేసే అర్హతేలేదని ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు ఆందోలన నిర్వహించారు.. ప్రమాణ స్వీకారం రోజున ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా మాస్కోలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ మాస్కోలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు పుతిన్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిషేధాజ్ఞలు ఉల్లంగించినందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష కార్యకర్తలను అరెస్టు చేశారు.

Monday, May 7, 2012

ప్రగతిశీల ఉద్యమ యోధుడు... రాలిన మొదుగు మొగ్గ... జార్జిరెడ్డి ఎవరు?


ప్రగతిశీల ఉద్యమ యోధుడు రాలిన మొగ్గలు జార్జిరెడ్డి ఎవరు? ఉస్మానియా క్యాంపస్‌లో హత్యకు గురైన యువకుడు. అదీ 40 ఏళ్ల కిందట. కాని నేటికీ అతడి ప్రగతిశీల ఉద్యమ పాదముద్రలు చైతన్యస్ఫోరకంగా మెరుస్తూ కనిపిస్తున్నాయి. కాలం ఒక రోడ్డురోలర్. ఆ కాలచక్రం కింద నలిగి ఎవరైనా నామరూపాల్లేకుండా పోవాల్సిందే! అణచివేయలేనంత అపారమైన ప్రతిభ ఉంటేనే- చరిత్రపుటల్లో చోటు దక్కుతుంది. నాలుగు దశాబ్దాలయినా ఇంకా జార్జి సిద్ధాంతపరంగా ఉద్యమాల రూపంలో బతికి ఉన్నాడంటే సామాన్య విషయం కాదు. జార్జిరెడ్డి కేవలం ఓ ఉద్యమ భావజాల యువనేత మాత్రమే కాడు; ‘ఇజం’ ఏదైనా, పోరుబాట ఎలాంటిదైనా, నాయకుడెవరైనా- అనుసరించదగ్గ నాయకత్వ వ్యక్తిత్వం ఉన్నవాడు. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి సరిగ్గా ఏడునెలల ముందు జన్మించాడు జార్జి- 1947 జనవరి 15న. లీలా వర్గీస్, రఘునాథరెడ్డి దంపతులకు నాల్గవ సంతానం! పుట్టింది కేరళలోని పాలక్కాడ్. తల్లి మలయాళీ. ఉపాధ్యాయురాలు. తండ్రిది చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం రొంపిచర్ల గ్రామం. ఆయన ఉద్యోగరీత్యా అనేక ఊర్లు తిరిగేవారు. జార్జిరెడ్డి అన్నయ్య కారల్‌రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్. చిన్నప్పటినుంచి జార్జిరెడ్డి పుస్తకాల పురుగు. చదువులో ఫస్ట్. నిజాం కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి ఆపై ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో చేరాడు. అప్పటికే సాంఘిక చైతన్యంతో సమకాలీన సమాజంలోని విషాదాల్ని- ఒకరు మరొకర్ని దోపిడీ చేసే వర్గదృక్కోణాన్ని అవలోకనం చేసుకుంటూ ఉన్నాడు. వామపక్షతత్వ అంశాల్ని, మార్క్సిస్ట్ ఆలోచనల్ని నీలం రామచంద్రయ్య మాస్టారి దగ్గర మరింత తెలుసుకున్నాడు జార్జిరెడ్డి. జార్జి ఆలోచనలు పదును తేలాయి. తాను పుట్టింది తన కోసం కాదని పీడిత తాడిత లోకం కోసమని తెలిసొచ్చింది. ఎమ్మెస్సీలో ఉండగా విద్యార్థుల సమస్యల్ని అర్థం చేసుకోవడం, వాటికై పోరాడటం సహజంగానే జరిగిపోయేది. ఓసారి క్యాంపస్‌లో చిన్న గొడవ జరగడంతో జార్జిరెడ్డిని ఏడాదిపాటు క్లాసులకు రాకుండా నిషేధం విధిస్తూ ‘రస్టికేట్’ చేశారు ప్రిన్సిపాల్. మరొకరెవరైనా అయితే - క్లాసులకు వెళ్లలేని ఆ ఏడాదిపాటూ అల్లరిచిల్లరగా తిరిగేవారేమో, నిరాశతో గడిపేవారేమో! కాని జార్జిరెడ్డికి ఆ సంవత్సరం బంగారంలాంటి కాలం. ఆ ఒక్క ఏడాదిలో ఎన్ని పుస్తకాలు చదివాడో అంతులేదు. అప్పటికే ఘనీభవించిన జ్ఞానమూలమైన పుస్తకమంటే పిచ్చిప్రాణం జార్జికి. తన సబ్జెక్టులయిన భౌతిక, గణిత శాస్త్ర ప్రాథమిక సూత్రాల్ని మరింత అధ్యయనం చేశాడు. మార్కోవ్ గణితశాస్త్ర పాఠ్యపుస్తకాల లెక్కల్ని ఆమూలాగ్రం సాల్వ్ చేసేవాడు. అంతేకాదు, చుట్టూ ఎప్పుడూ పది పదిహేనుమంది విద్యార్థులు. వారికి ఆయా గణితశాస్త్ర సమస్యల్ని ఇట్టే విడమరచి చెప్పేవాడు. బెర్క్‌లీ ఫిజిక్స్ పుస్తకంపై సవివరమైన నోట్స్ తయారు చేసుకున్నాడు. నోమ్ చామ్స్కీ, ‘ఎట్ వార్ విత్ ఆసియా’, ఫ్రెడరిక్ హెగెల్ ‘సైన్స్ ఆఫ్ లాజిక్’, జేమ్స్ జాల్ ‘ది అనార్కిస్ట్’, అలెక్స్ హేలీ ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కమ్ ఎక్స్’, రెజిదిబ్రె ‘రివల్యూషన్ ఇన్ రివల్యూషన్’, ఫ్రాంజ్ ఫెనన్ ‘రెచ్‌డ్ ఆఫ్ ది ఎర్త్’ లాంటి అనేకానేక పుస్తకాల్ని అధ్యయనం చేశాడు. పాతికేళ్లు కూడా లేని ఒక కుర్రాడు అన్నేసి గంటలపాటు ఇన్నేసి పుస్తకాలు చదవడం ఆశ్చర్యకరమైన విషయం. లాటిన్ అమెరికా దేశాల్లో ప్రజల విముక్తి కోసం విప్లవ సాయుధ గెరిల్లా పోరాటం సాగించిన చే గువేరా - జార్జిని అమితంగా ఆకర్షించాడు. చే రచించిన ‘గెరిల్లా వార్‌ఫేర్’, ‘ఆన్ రివల్యూషన్’. ‘వెన్ సెరిమోస్, ‘బొవీలియన్ డైరీ’ లాంటి గ్రంథాలు జార్జిని విశేషంగా ప్రభావితం చేశాయి. అంతేకాదు, ట్రాట్స్కీ, ప్లేటో, సిగ్మండ్ ఫ్రాయిడ్ రచనల్ని సైతం అక్షరమక్షరమూ ఔపోసన పట్టాడు జార్జిరెడ్డి. మార్క్సిజాన్ని, ఆ తత్త్వంతో మానవ సమాజ పరిణామాన్ని, పీడన సాగే విధానాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాడు. ఏడాది అజ్ఞాతవాసం లాంటి ‘రస్టికేషన్’ ముగిసింది. ఎమ్మెస్సీ పరీక్షలు జరిగాయి. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాడు. గోల్డ్‌మెడల్ పొందాడు. ఓ పక్క సబ్జెక్ట్, మరోపక్క గ్రంథపఠనం- అసలైన విద్యను అందుకున్నాడన్నమాట. విస్తృత అధ్యయనం వల్ల జార్జిరెడ్డిలో మార్క్సిస్టు సైద్ధాంతిక విశ్వాసాలు, విప్లవభావాలు, స్పష్టమైన రూపు కట్టాయి. శాస్త్రీయ సోషలిస్ట్ సిద్ధాంతాల అన్వేషణ అతనిలో ప్రారంభమైంది. ఆంధ్రదేశంలోనే కాదు, దేశంలోనూ, ప్రపంచంలోనూ 1960 దశకంలో జరిగిన అనేకానేక పరిణామాలు జార్జిలోని ప్రశ్నించే తత్వాన్ని తట్టిలేపాయి. ఆలోచనను మరింత చురకత్తిని చేశాయి. 1967 నాటి పశ్చిమబెంగాల్ నక్సల్బరీ పోరాటం, తెలంగాణలోని అశాంతి, నిరుద్యోగం, శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటం, వియత్నాం యుద్ధం... అన్నీ జార్జిరెడ్డిని అవ్యక్తపుటూహలతో కుదిపేసేవి. 1968 మేలో ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డిగిలె ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మంది కార్మికులు ఏకమై చేసిన విద్యార్థి ఉద్యమం కావచ్చు; దక్షిణాఫ్రికాలో సొవెటో ప్రాంతంలో చెలరేగిన విద్యార్థి ఉద్యమం కావచ్చు; వర్ణవివక్షకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన పోరాటం కావచ్చు; అమెరికాలో 1966లో ఆఫ్రో అమెరికన్ విప్లవ వామపక్షవాదులు తీసుకొచ్చిన బ్లాక్ పాంథర్స్ ఉద్యమం కావచ్చు; అమెరికా సామ్రాజ్యవాదంపై ఎక్కుపెట్టిన వియత్నాం ప్రజాపోరాటాలు కావచ్చు... అన్నీ జార్జిరెడ్డిపై తీవ్ర ప్రభావం చూపాయి. ఒక మార్క్స్, ఒక హెగెల్, ఒక చేగువేరా, ఒక మిఖాయిల్ బుకునిన్ అందించిన దార్శనికతతో ఆయా విప్లవ పోరాటాల్ని సశాస్త్రీయ హేతువాద దృష్టితో అవలోకనం చేసుకున్నాడు. ప్రపంచమేమిటో, బలవంతులు బలహీనులను దోపిడీ చేసే ప్రక్రియ ఏమిటో, లోకపుటన్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలూ, దౌర్జన్యాలూ ఏమిటో అర్థమైంది జార్జిరెడ్డికి. వెరసి ఒక ఆకర్షణీయమైన, ఆదర్శనీయమైన వ్యక్తిత్వం సంతరించుకుంది జార్జిలో! దరిమిలా జార్జిరెడ్డి క్యాంపస్‌లో ఓ ‘హీరో’అయ్యాడు. అయిదడుగుల ఆరంగుళాల ఎత్తు, గోధుమవన్నె రంగు, కొద్దిగా గడ్డం, సన్నటిమీసం, దృఢకాయం, ఎడమపాపిట, పొట్టిచేతులతో కూడిన బుష్‌షర్ట్‌తో అప్పుడప్పుడు; ఆపై వెడల్పాటి జేబులు, పొడుగు చేతుల ఆలివ్‌గ్రీన్ చొక్కా, కాటన్ జీన్స్‌తో నడుస్తుంటే జార్జిరెడ్డి ఆత్మవిశ్వాసం నడుస్తున్నట్లుగా ఉండేది. చెదరని చిరునవ్వు, కాంతిపుంజాల్లా కళ్లు, రోజూ గంటపాటు జిమ్‌లో బస్కీలు, గుంజీలు, బ్యాక్ బెండింగ్, పొత్తికడుపు వ్యాయామాలు, మల్లయుద్ధం ప్రాక్టీస్ చేసేవాడు. స్వతహాగా జార్జి బాక్సర్, బ్లేడ్ ఫైటర్. అడిగినవారికీ అడగనివారికీ సహాయం చేసేవాడు జార్జిరెడ్డి. ఫీజులు, మెస్సులు, పుస్తకాలు, అణచివేతలు, అవమానాలు, దుఃఖాలు, ఆత్మన్యూనతలు... ఇలా విద్యార్థుల్లో ఎలాంటి కష్టాలున్నా వెంటనే హాజరయ్యేవాడు. క్యాంపస్ వాతావరణంపై అనవసర పట్టు సాధించాలని ప్రయత్నించే స్వార్థపు శక్తులతో పోరాడేవాడు. ఆ క్రమంలో అనేకసార్లు భౌతికంగా దాడులు జరిగాయి జార్జిపై. అందుకే ఎప్పుడూ తనతోపాటు ఆరంగుళాల కత్తి సిద్ధంగా ఉండేది. ఇదంతా ఒక ఎత్తు, విద్యార్థులలో సాంఘిక స్పృహ, ప్రగతిశీల భావాల్ని పెంచేందుకు జార్జి చేసిన కృషి ఒకటీ ఒక ఎత్తు. సైన్స్ కాలేజీకి, ఆస్ట్రానమీ డిపార్ట్‌మెంటుకీ ఆనుకొని ఉన్న క్యాంటీన్ వారందరికీ అడ్డా. క్యాంటీన్‌ని ఆనుకుని ఉన్న వేపచెట్టు, దానికింద నాలుగైదు బండరాళ్లు, వాటిపై కూచొని కబురులు... రాత్రిళ్లు, అందునా వర్షం కురుస్తున్న రాత్రిళ్లు, వెన్నెల రాత్రిళ్లు... నలభై ఏభై మంది చుట్టూ... మధ్యలో జార్జి... అంతగా రాని తెలుగులో, హైదరాబాదీ హిందీలో, చక్కటి ఇంగ్లిష్‌లో జార్జిరెడ్డి ప్రసంగాల్లాంటి ప్రసారాలు... బండక్యాంటీన్ దగ్గర.. స్పష్టమైన మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథంతో పాలస్తీనా సమస్య, గ్వాటెమాలా సంఘటనలు, ఫోకోసిద్ధాంతం, గెరిల్లా పోరాటం, ఆఫ్రికా ప్రజల విముక్తి ఉద్యమాలు.. ఇలా ఎన్నెన్ని అంశాలపై జార్జిరెడ్డి ఉపన్యాస ధార సాగేదో అంతులేదు. కేవలం భావజాలమే కాదు, ఆచరణ కూడా జార్జిరెడ్డిలో కనిపించే తత్త్వం. స్లిప్పర్లే వేసుకునేవాడు. బట్టలు ఎక్కువ ఉండేవి కావు. రెండే రెండు జతలు. కొనుక్కోలేక కాదు. కొనుక్కోవడానికి ఆస్కారం లేని లక్షలాది పేదల్లా తానూ బతకాలని! ఒక పూటే తినేవాడు. ఆకలితో మలమల్లాడుతున్న నిర్భాగ్య అన్నార్తుల ఆకలి కేకలేంటో తానూ అనుభవించాలని! కాగితమ్మీద రాస్తే... మొత్తమంతా ఎక్కడా ఖాళీలేకుండా రాసేవాడు. దేన్నయినా మితంగా, పొదుపుగా ఉపయోగించేవాడు. నిర్లక్ష్యం, అహంకారం అతగాడికి తెలీవ్. ఎప్పుడూ సిటీబస్సుల్లోనే తిరిగేవాడు.
అతని మాటల్లో తీవ్రత, నిజాయతీ, స్పష్టత ఉండేవి. తనకు వచ్చే స్కాలర్‌షిప్ డబ్బుల్ని ఏ ఆధారం లేని ఓ బాల్యమిత్రుడికి వ్యాపారం పెట్టుకోమని ఇచ్చేశాడు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృష్టిని, విషయ పరిజ్ఞానాన్ని పెంచేందుకు అనేకానేక సెమినార్లు నిర్వహించాడు. రిక్షా కార్మికులతో కలసి భోజనం చేసేవాడు. అయితే అదే సమయంలో క్యాంపస్‌లోని సమస్యలపై పోరాడేవాడు. ఫలితంగా శత్రువులు పెరిగారు. సోషలిస్టు భావాల్ని, ఆద ర్శాల్ని వ్యాప్తి చెయ్యాలన్న లక్ష్యంతో స్టడీసర్కిల్‌ను ఏర్పాటు చేశాడు. జార్జిరెడ్డి అప్రతిహతంగా సాగిస్తున్న ఉద్యమబాటను నిరోధించాలన్న కుట్రతో 1972 ఫిబ్రవరిలో జార్జిపై డీడీ కాలనీలోని అతని ఇంటి సమీపంలో దాడి జరిగింది. గాయాలపాలయ్యాడు. ఒంటరిగా తిరగడం మంచిది కాదని మిత్రులు సూచించారు. ‘చావు అంత తేలికగా తన దగ్గరకు రాదని’ నవ్వుతూ అనేవాడు. అలా అన్న వారానికే- ఏప్రిల్ 14న సాయంత్రం ఇంజినీరింగ్ కాలేజీ భవనం దగ్గర ప్రత్యర్థుల చేతిలో హతుడయ్యాడు. తాను మరణించి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి పునాది అయ్యాడు. విద్యార్థి నాయకుడు- జ్ఞానం, ప్రేమ, మానవతల విషయంలో ఎలా ఉండాలో నేర్పాడు. తాను పుట్టిపెరిగిన సహజ జీవన స్థితినుంచి పేదల జీవిత స్థితికి మారాలనుకున్న తత్త్వం జార్జిలో విశేషమైంది. జీవన విధానాన్ని కింది వర్గాలకు అనుగుణంగా మార్చుకునే డీ క్లాసిఫై తత్త్వమే - జార్జిని అమరుణ్ని చేసింది. అతడు బతికుంటే.. ఇండియన్ చే గువేరా అయి ఉండేవాడు. సందేహం లేదు.

విజృంభిస్తున్న మావోలు... విస్తరిస్తున్న వసంత మేఘం


విజృంభిస్తున్న మావోలు విస్తరిస్తున్న వసంత మేఘం ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లలో వీరంగం ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న నక్సల్స్ కేంద్రం చెలగాటం రాష్ట్రాలకు ప్రాణ సంకటం విచ్చల విడిగా గిరిజనులను అరెస్ట్ చేయడమే కారణం దేశంలో మావోయిస్టులు బలపడుతున్నారు. కేంద్రం అనుసరించే విధానాలు... ఏజన్సీలో తవ్వకాలు గిరిజనుల మనుగడకు ముప్పుగా మారాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో తమ మనుగడ కెోసం గిరిజనులు మావోయిస్టుల మార్గాన్ని అనుసరిస్తున్నారు. మావోయిస్టుల్లో గిరిజనులే ఎక్కువగా ఉన్నారనేది బహిరంగ రహస్యం. ఏజన్సీ ప్రాంతంలో గిరిజనులు మావోయిస్టులకు సహకరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున గిరిజనులను అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు. వాస్తవానికి గిరిజనుల సహకరించడం కాదు.. గిరిజనులే మావోయిస్టులన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిపోతోంది. తమ మనుగడకు ముప్పు వాటిల్లే నిర్ణయాలు తీసుకొని దాన్ని వ్యతిరేకించిన వారిని మావోయిస్టులుగా చిత్రీకరించడంతో.. ఇదే అదనుగా మావోయిస్టులు తమ భావజాలాన్ని, సమస్యకు పరిష్కారాన్ని గిరిజనులకు వివరిస్తున్నారు. పోరాడితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందిని చెప్పడంతో గిరిజనులు ఆ దిశగా మొగ్గు చూపుతున్నారు. తరువాత వారే దళపతులుగా మారి తమ వర్గాన్ని అందులో చేర్చుకొని బలపడుతున్నారు. వాస్తవానికి ఛత్తీస్‌గడ‌, ఒరిస్సా రాష్ట్రాల్లో గిరిజనులకు ఇంతకు మించిన మార్గం లేదు. ఎందుకంటే దండకారణ్యంలో అపారమైన ఖనిజ వనరులున్నాయి. వీటి పై కేంద్ర ప్రభుత్వం కన్నుపడింది. ప్రభుత్వం కన్ను అనేదానికంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల కన్ను పడింది. ఎలాగైనా అధికారంలో ఉన్నపుడే వాటిని స్వాహా చేయాలనేది పన్నాగం.. అందుకోసం అధికారం అడ్డం పెట్టుకొని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులను రూపు మాపేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. నల్లమల అడవిని జల్లెడ పట్టాడు. దాదాపు మావోయిస్టు పార్టీ రాష్ట్రంలో అంతరించిపోయిందనే పరిస్థితికి తెచ్చాడు. అందుకే తనకు ఎదురు లేని నిర‌్ణయాలు తీసుకొని రాష్ట్రం మొత్తాన్ని తన తనయుడి జగన్ కు కట్టబెట్టాడు. మరోవైపు ఓబుళాపురం గనులను పూర్తిగా కొడుక్కి, కొడుకు లాంటి గాలి జనార్ధన్ రెడ్డికి అప్పజెప్పాడు. మావోయిస్టులు బలంగా ఉంటే ఈ దోపిడి సాద్యమయ్యే పని కాదు. ఏదో ఒక సందర్భంలో ఎదరుతిరిగే వారు. ఇప్పుడు శ్రీకాకుంళంలో కూడా ప్రభుత్వానికి తమ భూములను కబళించొద్దంటూ ప్రజలే ఎదురు తిరగుతున్న పరిస్థితి వచ్చింది. విప్లవ పోరాటాలకు పుట్టినిల్లయిన శ్రీకాకుళంలో మళ్లీ మావోయిస్టు దళాలను పెంచి పోషించే పరిస్థితి ప్రభుత్వమే కొని తెచ్చుకుంటుంది. ఎక్కడైతే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందో.. ఆ విధానాలు తమ మనుగడకే ముప్పు వాటిల్లేలా చేస్తాయని ప్రజలు భావించినపుడు.. ప్రాణత్యాగానికి మించిని మార్గం లేదని భావించినపుడు.. తెగిస్తారు. ఆ తెగింపే ప్రజలను నిషిద్ద వామపక్ష ఉద్యమాల వైపు మళ్లిస్తుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా మావోయిస్టు పార్టీ బలపడుతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాయి. దండకారణ్యం మీదుగా నల్లమలలోకి మెల్లగా విస్తరిస్తున్నాయని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటు ఛత్తీస్‌గఢ్, భద్రాచలం సరిహద్దుల్లో, ఒరిస్సా, శ్రీకాకుళం బెల్టులో మావోయిస్టుల కదలికలు చురుకుగా సాగుతున్నాయి. రిక్రూట్ మెంట్ వైపు కూడా గిరిజనులతో బాటు మైదాన ప్రాంత ప్రజలు కూడా మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం ప్రజా సంపదను కార్పోరేట్ పెట్టుబడి దారుల చేతుల్లో పెట్టి ఉన్న ఐదేళ్లూ నాలుగు రాళ్లు సంపాదించుకోవాలన్న ప్రభుత్వ పెద్దల స్వార్ధమే... ఇటు గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తుంది. పచ్చిన పంట పొలాల్లో చిచ్చురేపి తమ ఉనికికే ప్రమాదం తెచ్చి నిలువ నీడ లేకుండా చేసే ప్రభుత్వాలను ఎదిరించకుండా ఎవరుంటారు. శ్రీకాకుంళం జిల్లాల్లో తమ ప్రాంతాలను కబళించ వద్దని నెలల తరబడి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టిచ్చుకున్న ప్రభుత్వ పెద్ద లేడు. అటువంటి సందర్బాలలో విప్లవ శక్తులు చెప్పే మాటలు ప్రజలకు సహజంగానే స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. యువకులు కూడా అవలీలగా వీరి నినాదాలకు ఆకర్షితులైతారు. తమ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం మొదలైన ఉద్యమం.. రాష్ట్రానికి, దేశానికి ఆ తరువాత అమరత్వానికి దారి తీస్తుంది. అనుకున్న లక్ష్యం చేరుతారో లేదో తెలియదు.. ఆశయం నెరవేరుతుందో తెలియదు.. రాజ్యాధికారమనే ఒక స్నప్నం నిజంగా సాకారమవుతుందో లేదో తెలియదు.. కానీ ప్రతిరోజూ అడవిని నమ్ముకున్న బిడ్డలు అడవి ఒడిలోనే అనాధల్లో తూటాల వేటుకు బలి అవుతున్నారు. పచ్చని ఇగుళ్ళ పొదలకు వెచ్చటి నెత్తురును తడుపుతున్నారు. వరుసగా సాగే నరమేథాన్ని ఆపేందుకు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మావోయిస్టులు గిరిజనులకు అండగా నిలిచారు. తమకు ఆసరాగా నిలిచిన గిరిజనులను అరెస్టులు చేసి జైళ్లలో హింసలు పెట్టడం, తమ వార్తలను ప్రచురించిన జర్నలిస్టులను కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేయడం మావోయిస్టులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ కోపం తోటే ఒరిస్సాలో.. ఇటలీ పర్యాటకులను, ఎమ్మెల్యే హికాకను కిడ్నాప్ చేసేదాకా చేరింది. అయితే ప్రజాకోర్టులోనే వారిని శిక్షిస్తామని మావోయిస్టులు చెప్పినప్పటికీ అరెస్టు చేసిన వ్యక్తులు పర్యాటకులు కావడంతో వారిని చంపడం సాధ్యం కాని పని.. వారిని చంపితే.. ప్రభుత్వం పర్యాటకులను రక్షించుకోలేక పోయిందనే అపప్రద తప్ప మావోయిస్టులు సాధించేదేమీ లేకపోగా.. దేశం చూడ్డానికి వచ్చిన విదేశీ పర్యాటకులను పొట్టన బెట్టుకున్నారన్న విమర్శలు వస్తాయి. ఇక హికాక గిరిజన ఎమ్మెల్యే. ఆయనకు ఏదైనా అపాయం తల పెడితే.. గిరిజనులు భయపడి తమకు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. దీనికి తోడు హికాకను కిడ్నాప్ చేసి కొంత కాలం తమ వద్ద ఉంచుకొంటే ప్రభుత్వ పెద్దల గుట్టు మట్లు తెలుసుకున్నట్టవుతుంది. దాంతో బాటు గిరిజన ఎమ్మెల్యేను విడిపించేందుకు ప్రభుత్వం ఏమేరకు చొరవ తీసుకుందో తెలిపేందుకు ఇదే సమయమని భావించారు మావోయిస్టులు. వాళ్ల వ్యూహం సఫలమైంది. ప్రభుత్వం హికాక విడుదల పై సరిగ్గా స్పందించకపోవడంతో అది మావోయిస్టులకు కలిసి వచ్చింది. గిరిజనుల పట్ల ప్రభుత్వానికి ఉన్న దమన నీతిని ఎండగట్టారు. దీన్నే ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్‌ను కిడ్నాప్ చేయడం... అరెస్టై జైళ్లోలో మగ్గుతున్న మావోయిస్టు సానుభూతి పరులను విడుదల చేయాలంటూ డిమాండ్ చేయడం.. గిరిజనులకు మరింత బలాన్నిచ్చినట్టయింది. దీనికి తోడు మావోయిస్టుల పై విశ్వాసం పెరగడానికి హేతువయింది. పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామన్న మావోయిస్టు పార్టీ తమ కోసం ఎంతటి త్యాగాల కైనా సిద్ధంగా ఉందనేందుకు ఇదే తార్కాణమని వారు భావించారు. ఇదే అదనుగా.. ఇదే విజయోత్సాహంతో తమ పాత కారిడార్‌లో తిరిగి పుంజుకునేందుకు మావోయిస్టులు పావులు కదుపుతున్నారు. మావోయిస్టులు విజృంభిస్తే.. మందు పాతరలు మళ్లీ సందడి చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే జరిగితే వసంత మేఘం గర్జించి రుధిర వర్షం కురవక మానదు.

అడవిలో అసలేం జరిగింది...? కలెక్టర్ విడుదలకు ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది.


మావోయిస్టులు ప్రభుత్వాధికారిని అంత తేలికగా వదిలేయడం వెనుక మతలబు ఏంటి? మధ్యవర్తులుగా వెళ్లడానికి మనీష్ కుంజం, ప్రశాంత్ భూషణ్ ఎందుకు నిరాకరించారు. మావోయిస్టులను రూపు మాపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు గుప్పించడం ... నిద్రపోతున్న పులిని లేపినట్లయింది. ప్రభుత్వం వరుసగా గిరిజనుల పై దాడులు, అరెస్టులు జరపడం మావోయిస్టులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో.. అటు ఒరిస్సాలో ఇటలీ పర్యాటకులను, ఎమ్మెల్యే హికాకను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఇటు చత్తీస్‌గఢ్‌లో సుకుమా జిల్లా కలెక్టర్‌ అలెక్స్ పాల్ మీనన్ ను గ్రామసభ నిర్వహిస్తుండగా కిడ్నాప్ చేశారు. ముఖ్యంగా కలెక్టర్ కిడ్నాప్ వ్యవహారం ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారింది. అలెక్స్ మీనన్ విడుదలకు ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేసింది. ఇటు ప్రభుత్వ మధ్య వర్తులు, అటు మావోయిస్టు మధ్యవర్తుల మధ్య సాగిన చర్చల్లో కలెక్టర్ విడులైతే అయ్యాడు. కానీ మావోయిస్టులు ఏం డిమాండ్ చేశారు.. అయితే డిమాండ్ చేసిన వాటిల్లో ప్రభుత్వం ఏఏ డిమాండ్లకు అంగీకరించిందనే విషయంలో కొన్ని అనుమానాలు పొంచి ఉన్నాయి. ఇంతకీ అడవిలో ఏం జరిగింది.. అనేది అందరి మెదళ్లనూ తొలుస్తున్న ప్రశ్న.. దీనికి పొలిటికల్ వార్ దగ్గరున్న సమాచారంతో బాటు హరగోపాల్ మీడియాకు తెలిపిన వివరాలు జోడించి అందిస్తున్నాం... అది ఏప్రిల్ 21.. 2012 చత్తీస్‌గఢ్, సుకుమా జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ మాజిపరా గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తుండగా... 15 మందితో కూడిన మావోయిస్టు దళం దాడి చేసింది. ఆయన అంగరక్షుల పై కాల్పులు జరిపి కలెక్టర్ ను కిడ్నాప్ చేసింది. ఇద్దరు అంగరక్షకులు మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందారు. అప్పటికే ఒరిస్సాలో ఎమ్మెల్యే హికాక విడుదల పై అనిశ్చితి కొనసాగుతోంది... ఎమ్మెల్యే విడుదలకు మావోయిస్టులు పెట్టిన షరతుల పై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇదే సందర్భంలో చత్తీస్‌గఢ్‌లో సుకుమా జిల్లా కలెక్టర్ కిడ్నాప్ రమణ్ సింగ్ ప్రభుత్వానికి సవాలుగా మారింది. కలెక్టర్ ఆరోగ్యం బాగాలేదు... ఆయనకు ఆస్తమా ఉంది.. ఆయన వద్ద రెండు రోజులకు మించి మందులు లేవు.. కాబట్టి సకాలంలో వైద్యం అందించి.. వెంటనే వదిలేయాల్సిందిగా కలెక్టర్ భార్య ఆశా మీనన్.. మావోయిస్టులకు పదే పదే విజ్ఞప్తి చేసింది. ఇటు ముఖ్యమంత్రి రమణ సింగ్ కూడా మానవతా దృక్పదంతో కలెక్టర్ ను వదిలేయాలని మావోయిస్టులను అభ్యర్ధించారు. తమ డిమాండ్లు నెరవేరిస్తేనే కలెక్టర్‌ను వదిలేస్తామని లేకుంటే కలెక్టర్ విషయాన్ని ప్రజాకోర్టులోనే నిర్ణయిస్తామని తేల్చి చెప్పారు. మావోయిస్టుల తరపున వారి డిమాండ్లను వివరిస్తూ... దండకారణ్యంలోని దక్షిణ బస్తర్ డివిజన్ మావోయిస్టు పార్టీ ప్రతినిధి విజయ్ మడకమ్ లేఖ విడుదల చేశారు. కిడ్నాపైన కలెక్టర్ ను విడుదల చేయాలంటే ఆపరేషన్ గ్రీన్ హంట్, కూంబింగ్ ను వెంటనే నిలిపివేయాలని..దండకారణ్యంలోని పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దంతెవాడ, రాయ్ పూర్, జగ్దల్ పూర్, కువాకోడ, ప్రాంతాల్లో మావోయిస్టులు, ఆదివాసీలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని... రాయ్ పూర్ జైల్లో బందీలుగా ఉన్న 8మంది ఆదివాసీలతోపాటు మరో 8మంది మావోయిస్టులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో కొందరు కార్యకర్తల పేర్లు కూడా స్పష్టంగా తెలిపారు. మడకమ్ గోపన్న అలియాస్ సత్యం రెడ్డి, నిర్మలక్క అలియాస్ విజయలక్ష్మి, జైపాల్ అలియాస్ చంద్రశేఖర్ రెడ్డి, మాలతి అలియాస్ శాంతి ప్రియారెడ్డి, మీనాచౌధరి, బీజాపూర్ జిల్లాకు చెందిన కొరసా సన్నీ, సుకుమ ా జిల్లాకు చెందిన మడకమ్ సన్నీ, పద్మలను విడుదల చేయాలని లేఖలో తెలిపారు. మరోవైపు జర్నలిస్టు అసిత్ కుమార్ సేన్ ను కూడా విడుదల చేసి అతనిపై ఉన్న కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండ్ల పై చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ముగ్గురు మధ్యవర్తుల పేర్లను మావోయిస్టు పార్టీ ఖరారు చేసింది. వీరిలో మాజీ ఐఏఎస్ అధికారి బీడీ శర్మ, ఆదివాసీ మహాసభ జాతీయ అధ్యక్షుడు మనీష్ కుంజం, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ భూషణ్ పేర్లను తెలిపింది. తమ అభ్యర్థనను మన్నించి చర్చలకు మధ్యవర్తులుగా రావాలని ఈ ముగ్గురినీ కోరింది. అంతేకాక తమ వద్ద బంధీగా ఉన్న కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ ఆరోగ్యం క్షీణించిందని మావోయిస్టుపార్టీ లేఖలో పేర్కొంది. మధ్యవర్తుల చేత మందులు పంపించాలని కూడా సూచించింది. దండకారణ్యంలోని తాడిమెట్ల అటవీప్రాంతంలో చర్చలు జరపాలని కోరింది. మావోయిస్టుల అభ్యర్ధనను మనీష్ కుంజం, ప్రశాంత్ భూషణ్‌లు సున్నితంగా తిరస్కరించారు. మరోవైపు మావోయిస్టులు 25వ తేదీని డెడ్ లైన్ గా నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం కాస్త ఇరకాటంలో పడింది. మావోలు ఒడిషా కలెక్టర్ హికాకాను ఇంకా విడిచిపెట్టక పోవడం, సుక్మా కలెక్టర్ వ్యవహారంలో మధ్యవర్తిత్వం విషయం చిక్కు ముడి పడడం, జైళ్లలో ఉన్నవారిని వదిలే పరిస్తితి లేకపోవడం.. చత్తీస్ గడ్ ప్రభుత్వాన్ని అయోమయంలో పడవేసింది. మావోయిస్టులతో చర్చలకు ప్రభుత్వం తరపున శ్రీయోగ్య మిశ్రా, నిర్మళాబూజ్ లు... మావోయిస్టుల తరపున బీడీశర్మ, ప్రొఫెసర్ హరగోపాల్ విడతల వారీ చర్చలు జరిపారు. ఆదివాసీలకు న్యాయం జరగాలనే ఉద్యేశ్యంతోనే తాము మధ్యవర్తిత్వానికి అంగీకరించామని వారు తెలిపారు. మరోవైపు కలెక్టర్ అలెక్స్ ను వెంటనే విడుదల చేయాలని మానవ హక్కుల సంఘం నేత డాక్టర్ బినాయక్ సేన్ కూడా మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టుల డిమాండ్లకు ప్రభుత్వం స్పందించింది. దీంతో కలెక్టర్ విడుదలకు మార్గం సుగమం అయింది. పదమూడు రోజుల అనంతరం కలెక్టర్ ను తాడిమెట్ల అడవుల్లో మధ్యవర్తులకు అప్పగించారు. గట్టి భద్రత మధ్య కలెక్టర్ ఇల్లు చేరుకున్నారు. కాగా కలెక్టర్ విడుదల కోసం ప్రభుత్వం మావోయిస్టులతో రహస్య అవగాహనకు వచ్చిందన్న వార్తలను ఇరుపక్షాలు ఖండించాయి. మీనన్ విడుదల కోసం ప్రభుత్వం మావోలతో ఎలాంటి రహస్య ఒప్పందం కుదుర్చుకోలేదని ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విలేఖరుల సమావేశంలో పాల్గొన్న మవోల మధ్యవర్తులు బి.డి.శర్మ, ప్రొఫెసర్ హరగోపాల్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ప్రభుత్వ తరఫున మధ్యవర్తుల్లో ఒకరైన ఎస్.కె.మిశ్రా కూడా ఈ అంశాన్ని నిర్ధారిస్తూ ఇరుపక్షాల మధ్య రహస్య అవగాహన లేదని స్పష్టం చేశారు. ఇరుపక్షాల మధ్యవర్తుల మధ్య ప్రజల సమక్షంలోనే చర్చలు జరిగాయని.. ఆ తర్వాతే కలెక్టర్‌న విడుదల చేయడం జరిగిందని తెలిపారు.
కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ విడులకు ముందే ఒరిస్తాలో ఎమ్మెల్యే హికాకను కూడా విడుదల చేయడంతో.. మావోయిస్టులు తాము గిరిజనుల సంక్షేమం కోసమే ఈ పని చేశామని వివరించారు. వర్గ ప్రయోజనాల కోసం చేసే పోరాటంలో కొందరు ఇబ్బంది పడక తప్పదని... గిరిజనుల హక్కులను కాపాడటం కోసమే తాము ఈ పోరాటం చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ప్రభుత్వం మావోయిస్టుల డిమాండ్లను నెరవేరుస్తానని ఒప్పుకుందా.. ఒప్పుకుంటే ఆ డిమాండ్లు ఏంటి.. ఈ విషయాలు మాత్రం అధికారికంగా చెప్పక పోవడమే అనుమానాలకు దారి తీసింది. మరోవైపు హరగోపాల్ మాత్రం అక్కడున్న ప్రతినిధుల మధ్య చర్చజరిగిందని చెబుతున్నారు. వాళ్లు 8 మందిని విడుదల చేయాలని మొదట చెప్పారని, తరువా 6 గురికి తగ్గారని చెప్పారు. అయితే ప్రభుత్వం ముగ్గురిని విడుదల చేస్తామని చెప్పింది. కొందరి పై కేసులు ఎత్తి వేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే మావోయిస్టులను అందరినీ విడుదల చేయడానికి ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో మావోయిస్టులు కూడా ఓ మెట్టు దిగారని తెలిపారు. అంతే తప్ప ఇందులో రహస్య ఒప్పందామీ లేవని చర్చల ప్రతినిధి ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. అయితే ప్రభుత్వాలు ఇచ్చిన మాట పై నిలబడతాయి అనడానికి రుజువులు లేవు. అందులోనే మావోయిస్టులకు ఇచ్చిన మాట పై ప్రభుత్వం నిలబడితే దాన్ని చేతగాని తనం కింద లెక్కగడుతారని.. చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులకు ఇచ్చిన మాటలు తప్పిన సందర్భాలున్నాయి. అయినా ప్రభుత్వాల పై నమ్మకం ఉంచుతూనే ఉంటారు. చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన వారిపై ఇరు పక్షాల నుంచి వత్తిళ్లు వస్తూనే ఉంటాయి. అందుకే మనీష్ కుంజం, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ భూషణ్ ‌లు చర్చలకు వెళ్లడానికి సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా మావోయిస్టుల చేతికి చిక్కిన వారిని క్షేమంగా విడుదల చేయడం పై హర్షం వ్యక్తమవుతోంది. మావోయిస్టులు కొంత వరకు హింసావాదాన్ని తగ్గించారనే ప్రచారం జరుగుతోంది.

Sunday, May 6, 2012

లే అవుట్ లేకుండానే గేట్ కమ్యునిటీలు రెచ్చిపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు


సామాన్యుల నోళ్లలో మన్ను ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఒకవైపు తెలంగాణ వాదంతో రాష్ట్రం రావణ కాష్టంలా మండుతుంటే.. ఇటు ఆంధ్రా ప్రాంతానికి మూటా ముల్లె సర్ధుకునే జనం ఆంధ్రలో కుప్పలు తెప్పలుగా స్థలాలు కొంటున్నారు. దీంతో రేట్లు చుక్కల్లోకెక్కాయి. ఈ ప్రభావం ఆంధ్రా ప్రాంతానికి సరిహద్దున ఉన్న ఖమ్మం పై పడింది. అంతే కాదు ఇదే అదును చేసుకొని కొందరు స్వార్ధ పరులు సామన్య ప్రజలను నానా కష్టాలు పెడుతున్నారు. వాస్తవానికి ఖమ్మం రూరల్ అర్భన్‌లో సర్వేయర్లు చాలా బిజీగా ఉన్నారు. ఎవరైనా సర్వే కోసం గానీ, లాండ్ కన్వర్షన్ కోసం గానీ ఓఆర్‌సీ కోసం గానీ ధరఖాస్తు చేసుకుంటే సర్వేయర్ ల్యాండ్ మీద ల్యాండ్ అయ్యే సరికి ఆర్నేల్లు పట్టినా ఆశ్చర్యం లేదు. కానీ ఖమ్మం రూరల్, అర్బన్ మండలాల్లో ఇలా చెలకలు కొని అలా ప్లాట్లు చేస్తున్నారు. దీనికి తోడు గజం 7 నుంచి 8 వేలు అని చెప్పా హడావుడి చేస్తున్నారు. ఈ హడావుడి చూస్తే ఎకరం రెండున్నర కోట్ల పై చిలుకు పలుకుతోంది. దీంతో ఈ మధ్య భూములు అమ్ముకున్న రైతులు కుమిలి కుమిలి బాధ పడుతున్నారు. ఇంతకాలం దాచుకొని రేట్లు వచ్చే ముందు రియల్ ఎస్టేట్ రాకాసుల చేతుల్లో పెట్టి నిండా మునిగామని బాధపడుతున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రైతులను నిండా ముంచుతున్నారు. చేయిమార్చి లక్షల్లో లాభాలు కూడా గట్టే ఈ బ్రోకర్లు.. రైతులను మభ్యపెట్టి రియల్ వ్యాపారులకు కోట్లు కూడా బెట్టే మార్గాలు సుగమం చేస్తున్నారు. ఇక రెవిన్యూ అధికారుల తీరు ఇంకా విచిత్రంగా ఉంది. పేపర్లో ఫోటోతో పడితే తప్ప కదిలే పరిస్థితి లేదు. అది కూడా ఆయా పత్రికల రిపోర్టర్లు వివరణకోసం వెళ్లినప్పుడు.. అవునా.. అలాగా.. అయితే చర్యతీసుకుంటాం.. అంటూ నింపాదిగా కదులుతున్నారు. రియల్ ఎస్టేట్ వైట్ కాలర్ బ్రోకర్ల మాటల గారడీలకు కామన్ మ్యాన్ క న్నీళ్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ బిజినెస్ లో కోట్లు కూడగట్టేందుకు రాజకీయ ప్రత్యర్ధులు కూడా మిత్రులగా మారిపోతున్నారు. గేట్ కమ్యునిటీ పేరుతో రైతుల నోళ్లలో మన్ను ఒక ప్రాంతంలో లే అవుట్ తీశారంటే.. అందులో పార్కులు, ప్రభుత్వ స్థలం, పాఠశాల, ఇంకా ఇతర సౌకర్యాలను చూపించాలి.. కానీ ఇవేవీ లేకుండానే.. రెండెకరాల స్థలం కొని ప్లాట్లు చేసి కోట్లు కూడగడుతున్నారు. వీళ్ల వెంచర్ పక్కనున్న భూములను వీరికే అమ్మితే సరే సరి.. లేదా... వీరి వెంచర్ రోడ్డు ఫేసింగ్ ఉంటుంది కాబట్టి... రోడ్డు నుంచి భూముల్లోకి వెళ్లాలంటే.. వీళ్ల వెంచర్లోంచి వెళ్లాల్సిందే... వాస్తవానికి వెంచర్‌లో వేసిన రోడ్డు పై ప్రజలందరికీ హక్కు ఉంది.. కానీ గేట్ కమ్యునిటీ అనే దగుల్బాజీ ఫార్ములాను దృష్టిలో పెట్టుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీళ్లు రోడ్డుకు మూడు ప్లాట్ల వెడల్పు భూమిని కొనడం.. ఇక ఆ భూమి వెనకాల వారికి దారి లేకుండా చుట్టూ అక్రమంగా గోడ కట్టడంతో వెంచర్ ఆవలి వైపున్న రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇదేం న్యాయమని అడగేందుకు వెళ్లిన రైతులను బెదిరించి పంపిస్తున్నారు. వీరి ఆగడాలకు రాజకీయ నాయకులు కూడా వత్తాసు పలుకుతుండటంతో కంచే చేను మేసిన చందంగా తయారు కావడమే కాకుండా.. రైతుల చేలకు వీళ్లే దారిలేకుండా కంచె కొట్టినట్టవుతుంది. అసలు ఖమ్మం రూరల్ మండలం లాంటి ప్రాంతాల్లో గేట్ కమ్యునిటీకి ఎటువంటి నిబంధనలు పాటించాలి.. అటువంటి నిబంధనలు పాటిస్తున్నారా.. వీటికి అనుమతులు ఉన్నాయా.. వంటి విషయాలను పరిశీలించడానికి ప్రభుత్వ అధికారులకు మామూళ్లు అడ్డం వస్తున్నాయి. దీంతో అధికారులు కళ్లుండీ చూడలేని కబోదుల్లా మారుతున్నారు. రియల్ దందాతో బీడు పడుతున్న భూములు ఇప్పటి వరకు హైదరాబాద్ శివార్లలో ద్రాక్ష, ఇతర పంటలు పండే భూములన్నీ బీడు పడ్డాయి. రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది ఎకరాలు కొనుగోలు చేసి రకరకాల కారణాలతో వాటిని వెంచర్లు చేసి కొన్ని, చేయడానికి సిద్ధం చేసి కొన్ని బీడుభూములుగా వదిలేశారు. దీంతో పచ్చని పంట పండాల్సిన భూములన్నీ వట్టిపోయాయి. ముళ్ల కంచెలతో.. రాళ్లూ రప్పలు తేలి.. పచ్చిక కోల్పోయి ఎడారుల్లా దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాడ్యం ఖమ్మానికి సోకింది.. ఖమ్మం చుట్టూ సాగర్ నీరు పుణ్యమా అని పచ్చిన పైర్లతో కళకళ లాడేది. కానీ రియల్ ఎస్టేట్ పుణ్యమా అని ఈ పచ్చని పంట పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. వెంచర్లలో ఇళ్లు కట్టకపోగా.. పంటలు కూడా పండించకుండా బీడు భూములుగా మార్చేస్తున్నారు. దీంతో రైతులకు ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది. భూస్వాముల భూములను కనీసం కౌలు రైతులు పండించి వరి పండించే వారు. ఇప్పుడా భూస్వాములు భూమికి లక్షల్లో విలువ రావడంతో వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మి చేతులు దులుపుకుంటున్నారు. ఆ భూమి పై న్యాయ పరమైన వివాదాలు నానబెట్టి తరువాత ప్లాట్లు కొనుగోలు చేసిన వారిని కోర్టుల చుట్టూ తిప్పే దుస్సాహసానికి వ్యాపారులు శ్రీకారం చుడుతున్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే.. ఈ బాధితులతా రెవిన్యూ కార్యాలయాల ముందు టెంట్లు వేసే రోజులు ఎంతో దూరంలో లేవు..

కసాయి కళాశాలలు పీడిస్తున్న ప్రైవేట్ విద్యాలయాలు


కసాయి కళాశాలలు పీడిస్తున్న ప్రైవేట్ విద్యాలయాలు అనుమతులు లేని కళాశాలల్లో విద్య ఓ మిద్య సౌకర్యాలన్నీ బ్రోచర్లలోనే... ఆచరణలో అయోమయం విద్యార్ధినిల పై లైంగిక వేధింపులు... చెబితే పరువు నష్టం కలెక్టర్ మాట పెడచెవిన పెట్టి పాత బస్సులు తిప్పే యాజమాన్యం షిఫ్టింగ్ పర్మిషన్ లేకున్నా.. అందమైన అద్దె భవనాల్లో నిర్వహణ ఓపెన్ స్టడీ పేరుతో ఓపెన్ గా దోపిడీ అందమైన విద్యార్దినులను మోడళ్లుగా చూపే కాలేజీ హోర్డింగ్‌లు ఆ కాలేజీకి అన్ని మార్కుల రావడం వెనుక అసలు రహస్యం స్టూడెంట్స్ ఏటీఎం కార్డులన్నీ కళాశాల యాజమాన్యాల చేతుల్లోనే.. అవి భావి భారత పౌరులను తీర్చి దిద్దాల్సిన విద్యాలయాలు. మార్గదర్శులుగా మెలగాల్సిన ఉపాధ్యాయులు.. కానీ అవి వ్యాపార కేంద్రాలు గా మారాయి. తమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా వర్ధిల్లాలంటే.. ఎంతటి ఘాతుకానికైనా వెనకాడట్లేదీ అభినవ గురువులు. గతంలో పాఠాలు చెప్పే వారే గురువులు.. వారే ఖాళీ సమయాల్లో ప్రైవేట్ పాఠాలు చెప్పేవారు. కానీ విద్యా, వైద్య రంగాల్లో వృత్తికి సంబంధం లేని వారు పెట్టు బడులు పెట్టి.. దీన్ని వ్యాపారంగా మార్చడం మొదలు పెట్టారో .. ఆనాటి నుంచి చదువు కోవడం కాస్తా చదువు కొనడం గా మారింది. విద్యా వ్యవస్థలోకి చీడపురుగులు చొరబడ్డాయి. తులసి వనంలోకి గంజాయి మొక్కలు కలుపు మొక్కల్లా చేరడమేగాక మొత్తం గంజాయి వనమే అనే భ్రమను కల్పిస్తున్నాయి. ఈ కాలేజీల్లో కొన్ని అసలు నిబంధనలు పాటించడం లేదు కదా అలాంటి ఉన్నాయనే ఊసుకూడా ఎత్తడం లేదు. కొన్ని కాలేజీలకు పర్మిషనే లేదు. పర్మిషన్ ఉన్న కాలేజీలు కాగితాల్లోనే సౌకర్యాలను చూపిస్తున్నాయి. వాస్తవానికి కళాశాలలు కోళ్లగూడు కొంపల్లో నడుపుతున్నారు. అడ్మిషన్లప్పుడు ఇచ్చే బ్రోచర్లలో రంగు రంగుల భవనాలు, సకల సౌకర్యాలున్న హాస్టళ్లు కనిపిస్తాయి. కానీ క్లాసులు ప్రారంభమైన నాలుగు రోజుల తరువాత చూస్తే.. ప్రభుత్వ హాస్టళ్లు వంద శాతం నయమనిపించేలా ఉంటాయి. ఇక అప్పుడే కౌమార దశలో అడుగు పెడుతున్న అమ్మాయిల పై వీరు చేయని ప్రయోగాలు లేవు. డిగ్రీ చదివిన వాళ్లను ట్యూటర్లుగా నియమించడంతో.. ట్యూటర్లకు వీళ్లు ప్రయోగ శాలలు. వాళ్ల పైత్యానికి విద్యార్ధినీ విద్యార్ధులు బలవుతున్నారు. పాఠాలు చదివించడం పేరుతో విపరీతంగా కొట్టడం.. అవమాన పరచడం.. హింసించడం ఒకటేమిటి.. కొన్ని ప్రైవేట్ కళాశాలలు నరకానికి నకళ్లుగా మారుతున్నాయి. అందుకే చాలా కాలేజీల్లో విద్యార్ధినులు చేరిన కొన్ని రోజులకే చదువు మానేస్తున్నారు... ఇంకొందరు ఆగడాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొని మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. కొన్ని కళాశాలలకు అసలు పర్మిషన్లే లేవు. కొన్నింటిని ఆర్భాటంగా అద్దాల మేడల్లో చూపించి.. నాల్రోజులు పూర్తయి అడ్మిషన్లు పూర్తికాగానే.. గొడ్ల కొట్టం లాంటి గోడౌన్లకు మార్చాలంటూ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసి .. అనుమతులు రాక ముందే కాలేజీలను మార్చేస్తున్నారు. ఇదేమిటని అడిగే నాధుడు లేదు. అధికారులు మామూళ్ల మత్తులో ఆ నిబంధనలు ఉన్న సంగతే మర్చిపోతున్నారు.
ఏ పత్రిక వారైనా గుర్తు చేస్తే.. అవునా.. అయినా ఎవరు పాటిస్తున్నారండీ అంటూ మొటికెలు విరుస్తున్నారు. మరోవైపు కళాశాలలు పోటీ ప్రపంచాన్ని తట్టుకొని ఈ ప్రపంచంలో ఉన్న విద్యార్ధులంతా తమ కాలేజీల్లోనే చేరాలని దొంగ మార్కులు వేయించుకోవడం కోసం తెగబడుతున్నారు. దీనికోసం ఎంతకైనా తెగిస్తున్నారు. వందకు వంద మార్కులు వేయించడానికి ఏ గడ్డయినా కరుస్తున్నారు. గతంలో జవాబు పత్రం జిల్లాలు దాటిన సంఘటనలు వెలుగు చూశాయి. ఈ ఏడాది ఓ కళాశాల ఏకంగా మార్కులను కొనేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ( ఈ కళాశాలకు వచ్చిన మార్కుల పై పొలిటికల్ వార్ శోధనలో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని నిజాలు నిర్ధారణ కావలసి ఉంది. పూర్తి వివరాలు వచ్చే సంచికలో ప్రచురిస్తాము). తమ కళాశాలలో చదివే అమ్మాయిలు ఇంత బాగా చదువుతారు.. ఇన్ని మార్కులు వస్తాయని ప్రకటించుకోవడంలో తప్పు లేదేమో గానీ.. ఇంత అందంగా ఉంటారు.. ఆల్రెడీ ఉన్నారు. అని అందమైన అమ్మాయిల ఫోటోలు హోర్డింగ్ ల పై వేయడంలో అసలు రహస్యం అర్ధం చేసుకోలేనిది కాదు. మరోవైపు ఇదే అమ్మాయిలు చిన్న తప్పు చేస్తే నీ సంగతెవడికి తెలియదే.. అని పచ్చిబూతులు తిడుతున్నారు. కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో అమ్మాయిలను.. ఉంపుడుగత్తెల కంటే ఘోరంగా సంబోదిస్తున్నారు. ఈ విషయం చెప్పలేక.. చెబితే పరువు పోతుందనే భయం ఒక పక్క.. కళ్లు మూసుకుంటే రెండేళ్లు పూర్తవుతాయని ఓపికతో.. ఆ రెండు సంత్సరాలు కష్టాలన్నీ కడుపులో దాచుకుంటున్నారు. గతంలో ఇటువంటి కాలేజీల ఆకృత్యాలను పొలిటికల్ వార్ వెలుగులోకి తెచ్చి తగిన శాస్తి చేసిన సందర్భాలున్నాయి. పాఠకులకు ఇటువంటి కళాశాల గురించి తెలిస్తే..( పొలిటికల్ వార్ వద్ద లేని వివరాలు) తెలియజేయగలరు. సదరు కళాశాల పై బాధితుల తరుపున మేం పోరాడుతాం.. పాఠకుల కోర్టులో నిలదీసి వాస్తవాలు కక్కిద్దాం. విద్యార్ధులను ఫీజుల పిండుకొనే కామధేనువుల్లా చూసే సంప్రదాయాన్ని రూపు మాపి.. వాళ్ల ఏటీఎం కార్డులు వారికే ఇచ్చేలా కృషి చేసిన పొలిటికల్ వార్ ను గతంలో తల్లిదండ్రులు అభినందించారు. ఈ సంవత్సరం కూడా పొలిటికల్ వార్ కళాశాలల నిర్వహణ పై నిఘా పెట్టింది. విద్యార్ధుల పక్షాన నిల్చొని పోరాడేందుకు మా దృష్టికి వచ్చిన ప్రతి కథనాన్ని ప్రచురించి వారి తరుపునే పోరాడేందుకు సిద్ధమయ్యాం.. మీరూ మీ పట్టణంలో లేదా మండలంలో ఇటువంటి కళాశాలలు కనిపించినా.. ఫీజుల కోసం నిబంధనలను అతిక్రమించినా (ఎడిటర్ పొలిటికల్ వార్)కు కాల్ చేసి చెప్పండి.
మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9392324340. ఈ మహా యజ్ఞంలో మీరు పాలు పంచుకొని విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం.. బీ రెడీ.. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్.. వచ్చే సంచికలో ప్రై"వేటు కళాశాల అసలు రంగు కళాశాలల వారీగా రియల్ సీరియల్ ప్రచురించబోతున్నాం..

పూటకో సిద్ధాంతం.. గంటకో రాద్ధాంతం.. బఫూన్లను వెక్కిరిస్తున్న అభినవ కమ్యునిస్టు నాయకులు


ఉదయం కలిసుంటామంటారు. సందెవేళ పొత్తు పొసగదంటారు. బూర్జువాల వల్లే దేశం నాశనమంటారు... వాళ్లకు ప్రాణం పోసి మరీ బతికిస్తారు. జగన్ దేశాన్ని దోచుకున్నాడని నారాయణ బల్లగుద్దుతాడు. ఎన్నికలప్పటికి జగన్‌తో పొత్తుల గురించి ఆలోచిస్తామంటాడు రాఘవులు. మతతత్వ పార్టీని ఓడించేందుకు పరకాలలో కాంగ్రెస్‌కైనా, టీఆర్ఎస్‌కైనా మద్దతిస్తానంటాడు నారాయణ.. సామాజిక వర్గాల గొడవెందుకని మళ్లీ రాఘవులే పగ్గాలు అప్పజెబుదామంటుంది రాష్ట్రమహా సభ. ఎంత వర్ణించినా ఈవీవీ సత్యనారాయణ, రేలంగి సినిమాలను మించిన హాస్య కథలతో నిండిన ఈ అరువు సిద్ధాంత కర్తల మాటలు ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఒకప్పుడు ప్రాణాలకు తెగించి మరీ విద్యుత్ ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలున్న పార్టీలవి.. ఇప్పుడు చిన్ని ధర్నా చేయడానికి కూడా కార్యకర్తలు కరువైన పార్టీలు కూడా అవే... పొత్తుల కో్సం.. రాష్ట్రంలో గెలిచే ఒకట్రెండు సీట్ల కోసం నిత్యం బూర్జువాల చంకలు దొరుకుతాయోమే అని.. పొత్తుల కోసం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను విడతలవారీగా విడాకులు తీసుకుంటూ.. కాపురం చేస్తున్న ఈ పార్టీల వైఖరికి జనం నవ్వుకుంటున్నారు. అయినా నాకేటి సిగ్గన్న చందంగా వ్యవహరిస్తుంటే.. బూర్జువా పార్టీలు గుడిని గుళ్లో లింగాన్ని దోచుకునే పనిలో బిజీగా ఉన్నాయి. మిగిలిన మావోయిస్టులను కూడా తుడిచేసే ప్రయత్నం చేస్తుంది కేంద్రప్రభుత్వం. వీళ్లు సొదర కమ్యునిస్టులమని చెప్పుకుంటూ.. పార్టీ నిర్వహణ కోసం నిత్యం పెట్టుబడి దారుల గుమ్మాల ముందు పడిగాపులు పడుతున్నారు. కొత్త పార్టీ వస్తే వాళ్ల బలా బలాలను అంచనా వేసి పొత్తుకు పిలుస్తారేమో అని ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ప్రజలకు ఈ పార్టీలంటే ఏవగింపు కలిగింది. ప్రాణత్యాగాలకైనా వెరవని కార్యకర్తలు... నిర్బంధాలకు భయపడని శ్రేణులు. డబ్బు పంచకపోయినా ... సారాయి పోయకపోయినా... వాహనాలు సమకూర్చకపోయినా... చద్దులు చంకన బెట్టుకొని స్వచ్ఛందంగా ఒక్క పిలుపుకే లక్షలాదిగా తరలివచ్చే వామపక్ష భావజాలం కలిగిన ప్రజలు. తుపాకులు గర్జించినా... తూటాల వర్షం కురిసినా... పోలీసుల లాఠీలు శరీరాలపై నాట్యాలాడినా... అక్రమ నిర్బంధాలు కుటుంబాలకు దూరం చేసినా... ప్రత్యర్ధులు జరిపిన దాడులకు ఎర్ర సమాధులే సజీవసాక్ష్యంగా కనిపిస్తున్నా... అదరక, బెదరక గుండెనిబ్బరంతో త్యాగాలకు సిద్ధమయ్యే నాయకులు... ఒకే మాట, ఒకేబాటగా కదిలివచ్చే పల్లెలు... ఇవన్నీ... త్యాగాలే పునాదులుగా ఉభయ కమ్యూనిస్టులు భౌతికంగా పార్టీతో ఏర్పరుచుకున్న బంధానికి నిదర్శనాలు. కానీ మారుతున్న రాజకీయ సమీకరణాల్లో ఉభయ కమ్యూనిస్టులు (వామపక్షాలు) పావులుగా మారుతున్నాయి. సీట్ల పంపకాల కుళ్లు రాజకీయాల్లో అమరుల త్యాగాలు వృధాగా మిగిలిపోతోంది. అనుమానాల రోగంతో అన్నదమ్ముల్లా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తమ కండ్లను తామే పొడుచుకుంటున్నాయి. గూడు చెదిరిన పక్షుల్లా చెరోదారి చూసుకుంటున్నాయి. ఫలితంగా వామపక్ష భావజాలాన్ని నిలువెల్లా పుణికి పుచ్చుకున్న త్యాగాల ఖిల్లా ఖమ్మం జిల్లా ప్రజలకు ఆవేదనను మిగిలిస్తున్నాయి. ఎవరో ఇచ్చే సీట్ల కోసం వెంపర్లాడుతూ సొంతబలాన్ని మరిచిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి అన్నీ ఉండి అల్లుడు నోట్లో శని అన్న చందంగా మారింది. కాంగ్రెస్‌, టిడిపిల కన్నా జిల్లాలో బలంగా ఉన్న వామపక్ష పార్టీలు స్వయంకృతాపరాధంతో తమ కండ్లను తామే పొడుచుకుంటున్నాయి. రాష్ట్ర, కేంద్రస్థాయిల్లో రాజకీయ సమీకరణాల మాటెలా ఉన్నా, కమ్యూనిస్టుల ఖిల్లాగా ఉన్న ఖమ్మం జిల్లాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పల్లకిమోసే బోయలుగానే మారుతున్నారు. ఇరుపార్టీలు చేతులు కలిపితే చరిత్రను తిరగరాసే అవకాశం ఉన్నా, విడిపోయి సీట్ల కోసం ఇతర పార్టీల చుట్టూ వెంపర్లాడుతున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలపై ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేకుండా నిషేధం ఉన్న సమయంలో సైతం పిడిఎఫ్‌ పార్టీ తరుపున పోటీ చేయడం ద్వారా 1964 ముందు వరకు జిల్లాలో కమ్యూనిస్టులు తమ బలాన్ని చాటుకున్నారు. ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గంలో 1952-57 సంవత్సర కాలంలో, భద్రాచలం పార్లమెంట్‌ పరిధిలో 1952లో పిడిఎఫ్‌ అభ్యర్ధులు ఘనవిజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఖమ్మం నియోజకవర్గంలో 1952, 1957,1962, ఇల్లెందు నియోజకవర్గంలో 1952, 1957, 1962, మధిర నియోజకవర్గంలో 1952, కొత్తగూడెం నియోజకవర్గంలో 1962లో, భద్రాచలం నియోజకవర్గంలో 1957, 1962 ఎన్నికల్లో పిడిఎఫ్‌ అభ్యర్ధులు విజయం సాధించారు. అయితే 1964లో కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ, సిపిఎం పార్టీలుగా విడిపోయినప్పటికీ ఇరుపార్టీల నడుమ సుహృద్భావ వాతావరణమే ఉండటంతో ఎన్నికల్లో మాత్రం ఒకరికొకరు సహకరించుకోవడంతో ఫలితాలు ఆశాజనకంగానే వచ్చాయి. అయితే 1983వ సంవత్సరంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా వామపక్షాలు టిడిపితో దోస్తీ కట్టాయి. అప్పటికే జిల్లాలో ఉభయకమ్యూనిస్టులు ఖమ్మం, ఇల్లెందు, సుజాతనగర్‌, మధిర, భద్రాచలం, బూర్గంపాడు నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచే అవకాశాలున్నా, పొత్తుల పేరుతో త్యాగాల బాట పట్టాయి. అప్పటి నుండి ప్రారంభమైన కామ్రేడ్ల త్యాగాలు నానాటికీ తమ కండ్లను తామే పొడుచుకునే స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా 2004 శాసనసభ ఎన్నికల్లో టిడిపికి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌తో దోస్తీ కట్టడం ఆపార్టీ శ్రేణులను తీవ్ర ఆవేదన, ఆందోళనకు గురి చేసింది. అప్పటివరకు టిడిపి పల్లకి మోసిన వామపక్షాలకార్యకర్తలు 2004లో రాష్ట్రస్థాయిలో కుదిరిన పొత్తుల్లో భాగంగా టిడిపి పల్లకిని పడవేసి, కాంగ్రెస్‌ పల్లకికి భుజం కాయాల్సి వచ్చింది. 2009 ఎన్నికల్లో ఏర్పడిన మహాకూటమి పనికిరాని..పసలేని కూటమిగా మారింది. టీడీపీకి కొమ్ముకాసే కొమ్మలని ప్రజలు వీరిని పక్కనపెట్టారు. కాగా అటు టిడిపి, ఇటు కాంగ్రెస్‌ పార్టీలు కమ్యూనిస్టులను కరివేపాకు గానే చూస్తున్నారు. జిల్లాలో ఇరుపార్టీలు మనస్పర్ధలు వీడి కలిసి పనిచేసిన పక్షంలో మిగిలిన పార్టీల కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఇటీవల వరకు ఉన్నా, ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్‌, టిడిపిలతో పెట్టుకున్న పొత్తుల పాపాన్ని అనుభవించక తప్పనిపరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జిల్లాలో ఎదుటి పార్టీలకు సీట్లు కెటాయించ గలిగే స్థాయిలో ఉండాల్సిన వామపక్షాలు, ఉద్యమాలు కేవలం ఎన్నికల కోసమే అన్నట్లుగా సీట్ల కోసం ఎదుటి పార్టీల ఎదుట మోకరిల్లడం ఆ పార్టీల మనుగడను ప్రశ్నార్ధకం చేస్తుంది. పొత్తులు పెట్టుకొని ప్రధాన పార్టీల పల్లికీలు ఒక వైపు మోస్తూనే మరోవైపు ఉభయ కమ్యూనిస్టులు ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకోవడానికి కూడా వెనుకాడక పోతుండటంతో జిల్లాలో వామపక్ష ఐక్యతకు బీటలు వారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పొత్తుల పుణ్యమాని పార్టీ శ్రేణులను స్థభ్తతలో ఉంచడం కారణంగా తమతో పొత్తు పెట్టుకున్న పార్టీలలోకి ముఖ్యనాయకులు జారిపోతున్నారన్న విషయాన్ని ఇరుపార్టీలు పసిగట్టలేకపోతున్నాయి. ఇటు కాంగ్రెస్‌లో, అటు టిడిపిలో ప్రస్తుతం ఉన్న ముఖ్య నాయకుల్లో కమ్యూనిస్టు పార్టీల నుండి వచ్చిన వారే ఉండటం గమనించదగిన విషయం. ఈ నేపథ్యంలో నాయకుల పరిస్థితి ఎలా ఉన్నా, కార్యకర్తలను మాత్రం నిరాశానిస్పృహలు వెన్నాడుతున్నాయి. ఇప్పటికైనా వామపక్ష కమిటిల నేతలు జరిగిన లోటుపాట్లను సవరించుకొని చరిత్ర మిగిల్చిన గుణపాఠాలను నెమరువేసుకొని ఇరుపార్టీలు కలిసిపోని పక్షంలో మున్ముందు ఫలితాలు మరింత చేదుగా ఉంటాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. వామ పక్షాలు వామనావతారం ఎత్తుతాయి కానీ ముల్లోకాలను ఆక్రమించలేవు..

Thursday, May 3, 2012

ప్రాణాలు తీస్తున్న....బ్రాందీ రాజ్యం..

ప్రాణాలు తీస్తున్న....బ్రాందీ రాజ్యం..
ఇరవై ఏళ్లకే అరవై ఏళ్ల వాళ్లలా మారుతున్న యువత నిత్యం మత్తులో మునికి చిత్తైతున్న జీవితం ఈ రాష్ట్రంలో మంచినీళ్లకు నిత్యం కరువు... ప్రతి సంవత్సరం పోటుగాళ్లమని చెప్పుకునే కుహనా రాజకీయ వేత్తలు.. కన్నీళ్లు తీరుస్తాం.. దాహం తీరుస్తామని.. ఆ ఎన్నికలపుడు గొంతులో కాసిన్ని మందు నీళ్లు పోసి ఓట్లు రాల్చుకుంటారు. కానీ ఆ ఒక్కరోజు మందుతాగి బృహన్నల గాళ్లకు ఓట్లేసిన ఓటరు కనీసం ఊహించలేడు.. మళ్లీ ఐదేళ్ల వరకు మన గుమ్మం వైపు తొంగి కూడా చూడడని. భవిష్యత్తులో మందు దొరుకుంతుందిగానీ మంచినీళ్లు దొరకవని.. అవును ఇప్పుడు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ఏ ఊళ్లో చూసినా సాయంత్రమైతే.. బెల్టు షాపులు తిరునాళ్లను మించిన హడావుడితో కనిపిస్తున్నాయి. మూతి మీద మీసం మొలవని నడమంత్రపు నాయాళ్లు.. బీర్లకు బీర్లు ఆబగా లాగించేస్తున్నారు. ఈ బీర్లు కూడా పచ్చి స్పిరిట్ లాగా కంపు కొడుతున్నా కూలింగ్ టచ్‌లో, మిర్చీ ఘాటులో ఆ విషయం పట్టించుకున్న మందుబాబు లేరు. గతంలో బీరంటే బార్లీ రసం కాబట్టి కాస్త ఆరోగ్యానికి పనికొస్తుందనే అపోహ ఉండేది. కానీ ఇప్పుడు కేవలం గ్యాస్ నింపిన స్పిరిట్ లా బీర్లు కంపుకొడుతున్నాయి. బ్రాండేదయినా సరే.. కాలేయం, లివర్, మూత్రపిండాలను రోజుకు కొంచెం కొరుక్కు తినేవే.. అసలు మన రాష్ట్రంలో అమ్మే మద్యానికి ఏదైనా కండీషన్లు ఉన్నాయా.. మద్యాన్ని ప్రమాణాల ప్రకారం తయారు చేస్తున్నారా అని చూసే నాధుడే లేదు.. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో బీర్ షాటేజీ వచ్చి కొత్త బీర్ కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయంటే.. రాష్ట్రంలో తాగుబోతుల సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో అర్ధ:ం చేసుకోవచ్చు.. మంచికీ.. చెడుకీ.. మధ్య వారధి మద్యమే.. ఏదన్నా సమస్యా.. లేదా ఎవర్నాన్నా దేనికైనా ఒప్పించాలా... లేదా ఎవణ్ణన్నా బెదిరించాలా.. వీటన్నిటికీ ఒకటే మందు.. అదే పెగ్గు నుంచి మగ్గుదాకా అంటే పీకలదాకా పోసే మందు.. ఇది ఉంటే చాలు.. కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు మాట వింటారని ఒక ప్రచారం.. అందుకే సాయంత్రమైతే చాలు మసక వెలుగులో.. లేత గొర్రె పిల్లల మాంసం నంజుకొని తింటూ సెటిల్ మెంట్లను చేసుకుంటూ హాయిగా కాలం గడుపుతున్నారు. తేడా వస్తే అదే మత్తులో ముంచి తీరిగిరాని లోకాలకు చేరుస్తున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. రాష్ట్రంలో ఏటా అధికారిక లెక్కల ప్రకారమే వేలాది మంది మద్యానికి బానిసై చనిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు రోడ్డు వెంట ఫూటుగా తాగి ఒంటి పై బట్టలు లేకుండా దుబ్బలో వ్యక్తి పడుకున్న దృశ్యం కనపడని ఊరు లేదు.. ఎందుకిలా....? హైటెక్ వేగంతో దూసుకుపోతున్నామని చెప్పుకుంటున్నాం.. ఆకాశానికి నిచ్చెన వేశామని జబ్బలు చరుచుకుంటున్నా.ం.. కానీ పాతాళానికి.. అదో:పాతాళానికి జారిపోతున్న విషయం గ్రహించడం లేదు. రాజకీయ నాయకులు తమ స్వార్ధం కోసం.. పదవిని కాపాడుకోసం.. తమ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం కోసం కనపడ్డ గడ్డల్లా కరుస్తున్నారు. గతంలో పల్లెల్లో పెద్దవాళ్లు మాత్రమే మద్యం సేవించేవాళ్లు.. అది కూడా కల్లు తాగి కడుపు నింపుకునే వాళ్లు.. ఏ కొద్ది మందో సారా తాగే వారు.. కానీ కాలక్రమంలో సారాను కల్లును తాగడం అలవాటు చేసుకున్నారు. గ్రామల్లో బీరు, బ్రాందీ, విస్కీ అంటే.. చాలా అరుదు.. ప్రాణమసుంటి చుట్టం వస్తే తప్ప.. నాటు కోడి కోసి విస్కీ సీసా తీసుకొని రారు.. విస్కీ గానీ బీరు గానీ తెచ్చారంటే.. చాలా గొప్పగా మర్యాద చేసినట్టు లెఖ్ఖ కానీ. ఇప్పుడు అది చాలా సింపుల్.. రోడ్డు మీద ఫ్రెండ్ కనిపిస్తే చాలు.. మాటలు కలిపి మద్యం షాపు వైపు నడుస్తున్నారు. ఊళ్లల్లో సాయంత్రమైతే. పన్నెండు సంవత్సరాలు దాటిని ప్రతి పిల్లవాడూ తాగుడు నేర్చాడు. సాయంత్రమైతే భవిష్యత్తు గురించి ఆలోచించకుడా తాగి ఊగుతున్నారు.. ఈజీ మనీ కోసం పన్నాగాలు పన్ని భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.. ఇవి ఎంత విజయవంతంగా జరిగితే ప్రభుత్వానికి అంత ఉపయోగం.. అందుకే మద్యం షాపుల ముందు 20సంవత్సరాల లోపు వారికి మద్యం అమ్మబడదు అన్న బోర్డైతే ఉంటుంది కానీ.. అక్కడ తాగే వారంతా 20 నిండని వారే.. భవిష్యత్తులోె పనికి రాని వారిగా మారడానికి మద్యం షాపులే పాఠశాలలుగా మారుతున్నాయి... కల్లును కాట్లో కలిపిన్రు.. ఎప్పుడైతే గ్రామాల్లో కమ్మని కల్లు కనుమరుగయి పోయిందో.. యువత మొత్తం... స్పిరిట్ మద్యానికి బానిసయిందో.. అప్పట్నుంచి రాష్ట్రానికి జాడ్యం పట్టుకుంది.. ఇప్పుడు మద్యం ద్వారా వస్తున్న ఆదాయం.. ఒకప్పుడు గ్రామాల్లో సగం ఆదాయం గౌడ్ల కుటుంబాలకు వచ్చి వారికి ఉపాధి దొరికేది.. కానీ గౌండ్ల కులస్థులు వారి కుల వృత్తి వంశపారంపర్యంగా వచ్చినదాన్ని 90 శాతం మంది వదిలేశారు. మరోవైపు ప్రభుత్వం.. రోడ్డు వెంట ఉన్న చెట్లను, కరెంట్ పోల్స్, హైపవర్ లైన్స్ సమీపంలో చెట్లను ఇలా రకరకాల కారణాలతో గ్రామాల్లో తాటి చెట్లు, ఈత చెట్లు కనిపించకుండా కుట్ర పన్నుతోంది.. దీంతో ఇటు వృత్తి వదిలిన గౌండ్లకు తోడు తాడిచెట్లు కూడా మాయమవడంతో.. కల్లు కనుమరుగయింది.. బీరుకంటే భీకరంగా పొంగే కల్లు కాంట్రాక్లర్ల చేతిలో పడి విలవిల్లాడుతోంది.. కల్లు కాంపౌండులల్లో తయారయ్యే మందు కల్లు చూసి కల్లంటేనే మామూలు జనం వణుకుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో అయినా జనం మారాలి.. ఈ జవాబుదారీ తనం లేని ప్రభుత్వాన్ని నిలదీయాలి.. అవసరమైతే పునాదులు కదిలేలా చేయాలని మేథావులు నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నారు.. కానీ మద్యం మత్తులో ఉన్న బాబులు ఈ మాట వింటారా.. గాంధీ జయంతి రోజు కూడా బారు షాపులు బార్లా తెరిచే ఈ రాష్ట్రంలో.. బాపూజీ బ్రాంధీ షాపు, గాంధీ వైన్స్ అని కనిపిస్తున్న మన రాష్ట్రంలో.. గాంధీ రాజ్యమెక్కడిది అంతా బ్రాందీ రాజ్యమే..