ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, December 31, 2011

కొత్త సంవత్సరం ఇంత అసహ్యంగా... అశ్లీలంగానా..

కొత్త సంవత్సరం ఇంత అసహ్యంగా... అశ్లీలంగానా..

డిసెంబర్ 31 ఆహా... పొద్దున్నే బండి డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్‌కు వస్తుంటే.. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. రోడ్ల పై అక్కడక్కడా పగిలిన సీసాలు నగ్నంగా కనిపిస్తున్నాయి. ఏ కసాయి వాడో వదిలిన కరుకు పెదవి ముద్రలను భరిస్తూ రోడ్డు పై కార్పోరేషన్ చెత్త లారీ కోసం ఎదురు చూస్తున్నాయి. అక్కడక్కడా కొత్త సంవత్సరం వచ్చిందని పొట్ట చింపుకున్న టపాసులు భారతదేశ పేదవాడి వస్త్రాల్లా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.. టీవీలన్నీ మారు మోగిపోతున్నాయి. కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయని. నేను కూడా ఓ వార్త రాయల్సివచ్చింది. అదీ ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు జరిగాయని రాశాను. దానికోసం ప్రియా ఓ ప్రియా చిత్రం నుంచి "కమ్మనికలలకు ఆహ్వానం.. హ్యాపీ న్యూఇయర్" అనే పాట కూడా తగిలించాను. ఇంతకీ కొత్త సంవత్సరం ఎంత ఘనం.. ఎంత వేడి వేడుకగా జరిగిందని వచ్చిన ఫీడ్ చూశాను. కేఫ్ టౌన్ నుంచి ఇండియా క్యాపిటల్ వరకు.. హైదరాబాద్ నుంచి కుశాయిగూడ వరకు సేమ్ హడావుడి. సేమ్ కల్చర్.. అర్ధనగ్నంగా నర్తించడం.. ఒంట్లో కొవ్వుపూసలను తరగలు తరగలుగా.. తరంగాలుగా కదిలించడం.. డిజిటల్ గిటారు నాదాలకు.. ప్యాడ్ ప్లేయర్ చేసే రొదలకు అనువుగా కాలు కదపడం.. మధ్యలో కాస్త ఓర చూపులు.. నడుమొంపుల నాట్యాలు.. పయోదర పీయూష మర్ధనాలు.. మధ్య మధ్యలో మద్యంలాంటి దాన్ని చుంబిస్తూ... ప్రియురాలిని మళ్లీ కొత్తగా హత్తుకుంటూ.. కొత్త ప్రేయసిలాంటి వ్యక్తికోసం వెతుక్కుంటూ.. రాత్రంతా వేడుకగా సాగింది.. కొత్త సంవత్సరం.. కానీ నాకెందుకో.. రోజూలాగే పొద్దు పొడిచిందనిపించింది.. భౌషా సూరీడికి కొత్త సంవత్సరం అని తెలిస్తే కొత్త కిరణాలు రాల్చేవాడేమో.. అర్ధనగ్నంగా ఉదయించేవాడేమో.. ఉదయం పూట పల్లెలో కోడి కూస్తూనే హ్యాపీ న్యూఇయర్ అని కూసేదేమో.. ఈ కుర్రకారు కారులో షికారు చేస్తూ అర్ధరాత్రి కారుకూతలు కూస్తూ.. హ్యాపీన్యూ ఇయర్ అంటే.. ఎవరికి హ్యాపీ.. ఎంతమందికి తెలుసు ఈ న్యూఇయర్ జిలుగులు నింపుతుందో.. వెలుగులు నింపుతుందో.. చీకట్లోకి దింపుతుందో.. కానీ ఒకటి తెలిసింది.. కొత్త సంవత్సరమంటే.. బహిరంగ అర్ధనగ్న నృత్యాలకు అధికార హోదా.. కండీషన్డ్ మద్యప్రియులకు ఆ రోజు ఫ్లెక్సిబిలిటీ.. కాస్త తిట్ల నుంచి వెసులుబాటు.. కానీ అదే మద్యం కొత్త సంవత్సరం రోజే విజయవాడ మైలవరంలో 14 మందికి పైగా పొట్టనపెట్టుకుంది.. అదే మద్యం హైదరాబాద్‌లో బైక్ పై వెళుతున్న నలుగురిని పొట్టన పెట్టుకుంది.1998లోనే కొత్త సంవత్సరం సందర్భంగా ఫుల్ బాటిల్ లాగిచ్చిన నాకు కొత్తగా జ్ఞానోదయం అయిందేమీ లేకున్నా.. ఎందుకో కొత్త సంవత్సరం అంటే ఇదేనా అనిపించింది. నా ఆరోతరగతిలో.. మీనా.. అట్ట బొమ్మను, రోజాపూల అట్ట బొమ్మను కత్తిరించి కవర్లోపెట్టి..దానివెనకాల హ్యాపీ న్యూయర్ అని అమ్మాయిలకు ఇచ్చే ప్రయత్నం చేయడం గుర్తుంది. వాళ్లు అదేదో లవ్ లెటర్ గా ఫీలయి.. మొహం ముందే చింపేయటం కూడా గుర్తుంది. దాన్ని ఇవ్వడానికి ఎంత కష్టపడేవాళ్లమో కూడా గుర్తుంది. కొత్త సంవత్సరమంటే తెల్లవారక ముందే లేచి ఇంటి ముందు సాన్పు జల్లి అమ్మ ముగ్గేస్తుంటే. రంగులతో హ్యపీ న్యూఇయర్ అని రంగులు దిద్ది.. ఊళ్లో అందరికంటే మన డిజైనే బాగుందని పొగుడుకోవడం గుర్తుంది. కొత్త సంవత్సరమంటే ఎక్జామ్స్ దగ్గరికొస్తున్నాయని మాస్టార్లు మందలించిన విషయం కూడా గుర్తే..

కానీ కొత్త సంవత్సరమంటే ఇంత అర్ధ నగ్నంగా.. ఓ దశ తరువాత పూర్తి నగ్నంగా.. మత్తుగా గమ్మత్తుగా ఉంటుందని అప్పుడు తెలియదు.. అసలు కొత్త సంవత్సరమంటే అదేనేమో.. ఎందుకంటే ఈ హైటెక్ వాళ్లు చేసేవన్నీ కొత్తగా ఏం లేవు.. కొత్తగా ఏమీ అనిపించవు.. ఎప్పుడూ చేసేవే.. రోజూ పబ్బుల్లో చేస్తున్నవే.. కాకుంటే ఇప్పుడు పిల్లల ముందే అధికారికంగా.. చేస్తున్నారు. తాగుతున్నారు. దమ్ము పీలుస్తున్నారు.. మత్తులో ఇంకేదేదో చేస్తున్నారు.. ఇవన్నీ రోడ్డు పై నుంచి నలుగురు పిల్లలు మాత్రం నిద్రగాచి చూస్తున్నారు. ఆ సంతోషాన్ని పంచుకోడానికి కాదు.. వాళ్లు వెళ్లిపోతే.. పడిపోయిన సీసాలను.. చెత్త కాయితాలను, ప్లాస్టిక్ బ్యాగులను ఏరుకుందామని.. ఆ ఒక్కరోజైనా కడుపు నింపుకుందామని.. కొత్త సంవత్సరం కదా.. వాళ్లు కూడా అర్ధ నగ్నంగానే ఉన్నారు.. ఫ్యాషన్ కోసం మాత్రం కాదు..

9 comments:

  1. బొందలపాటి గారి బ్లాగ్‌లో నేను వ్రాసిన వ్యాఖ్య ఇది:
    >>>>>
    ఒక అమ్మాయి నిక్కర్ వేసుకుని పబ్‌లకీ, డిస్కో థెక్‌లకీ వెళ్తే ఆమెకి బావ లేదా మరిది వరసైన అబ్బాయి అభ్యంతరం చెప్పడు. కానీ ఆమె పబ్‌లు, డిస్కో థెక్‌లలో తిరగడం వల్ల ఆమెకి పెళ్ళికి ముందే గర్భం వస్తే ఆ అబ్బాయి ఆమెని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? ఆమె తన బంధువుల అమ్మాయే అయినా ఆమెకి పెళ్ళికి ముందు గర్భం వస్తే ఆమెని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోడు. పబ్‌లూ, డిస్కోథెక్‌లూ ఎన్ని ఉన్నా శీలం, పాతివ్రత్యం లాంటి నమ్మకాలు పోవు.
    >>>>>
    ఒళ్ళు సఘం కనిపించే బట్టలు వేసుకుని డాన్స్ చేస్తూ అదే ఆధునికత అనుకునేవాళ్ళ కోసమే ఇది.

    ReplyDelete
  2. well said dear..

    appreciated...

    ReplyDelete
  3. హాపీ న్యూ ఇయర్.......
    http://sriramdavuluru.blogspot.com/2011/12/blog-post_23.html#comment-form

    ReplyDelete
  4. అయితే అయితివి గాని జనార్ధన్ మంచిగ షెప్పినవ్ గాని మంది వింటలేరు.

    ReplyDelete
  5. @అజ్ఞాతకు..@murthy మీ ఒక ఆలోచన బావుంది..@raf, thank u.@kaste phale,@vanaja vanamali, thanku.. మంది చెబితె వింటలేరు గాదు. మందిని వినేలా మన నాయకులు చేయలేదు. హాజరుతో పాస్ చేసి, సర్టిఫికెట్ ఇచ్చి పంపుతున్నారు. మనకు మనంగా ఆలోచిస్తే నాయకులకే నష్టం.. రోబో సినిమాలో ఆఖరుకు మ్యూజియంలో పెట్టిన రోబోను చిన్న పిల్ల అడుగుతుంది.. ఇక్కడ ఎందుకు పెట్టారు. అప్పుడు రోబో అనే ఆఖరు డైలాగ్..నేను ఆలోచించడం మొదలు పెట్టాను. అని ఇక్కడ జనం కూడా ఒక్క క్షణం ఆలోచించడం మొదలు పెడితే ఇక మార్పు ఎవరో తేవాల్సిన అవసరం లేదు.
    @ప్రవీణ్ శర్మగారు.. గర్భం రావడానికి శీలానికి లింక్ లేదని ముందు గుర్తించగలగాలి. ఇప్పటి అమ్మాయిలు పెళ్లి కాకముందు గర్భం తెచ్చుకొనే అమాయత్వంగా లేరు. ఇష్టపడ్డవాణ్ని చేసుకోవాలనుకున్నపుడే గర్భం ధరిస్తారు. అదే సాక్ష్యం కనుక. దీనిమీద పది పేజీలు రాయొచ్చు. ఎనీవే థాంక్యూ ఫర్ రెస్పాన్స్

    ReplyDelete
  6. మీకు విషయం తెలిసినట్టు లేదు. పెళ్ళికి ముందు గర్భం వస్తే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారని ఒక అమ్మాయి పెళ్ళికి ముందు కడుపు తెచ్చుకుంది. కానీ ఆమెని ప్రేమించినవాడే పెళ్ళికి ఒప్పుకోలేదు.

    ReplyDelete