ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, December 24, 2011

పీవీ నరసింహారావు జీవితంలో మరోకోణం



భారతదేశ ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి తెలుగు వ్యక్తి.. ఆ మాటకొస్తే మొట్టమొదటి దక్షణ భారతదేశ పౌరుడు కూడా ఆయనే.. ఆర్ధిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న భారత ఆర్ధిక వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి గాడిన పెట్టిన ఘనత ఆయన సొంత.. అపర చాణిక్యుడిగా.. రాజకీయభీష్ముడిగా పేరొందిన పీవీ నరసింహరావు వర్ధంతి .. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.. ఆటుపోట్లు.. ఇన్ని ఇబ్బందుల్లోనూ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడపగలిగిన మేథావికి దక్కాల్సిన గౌరవం దక్కిందా... అంతిమ గడియల్లో అవమానాలతో ప్రస్థానాన్ని ముగించాల్సి రావడం వెనుక కారణాలేంటి.. పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా హెచ్ఎంటీవీ అందిస్తున్నప్రత్యేక కథనం
ఏ వ్యక్తయితే దేశ ఆర్ధిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశాడో... ఆ వ్యక్తినే అవినీతి ఆరోపణలు వెంటాడాయి.. ఎవరైతే వివాదాల జోలికి వెళ్లకూడదని అనుకున్నారో ఆయన్నే జీవితాంతం వివాదాలు ముంచెత్తాయి... పీవీ నరసింహారావుకు ఇటు ముఖ్యమంత్రి పదవి, అటు ప్రధాని పదవి ముళ్లకిరీటంలా మారాయి... అపర చాణక్యుడిగా పేరొందిన పీవీకి ఇన్ని కష్టాలు ఎందుకెదురయ్యాయి. తెలుసుకునే ముందు అసలు పీవీ ప్రస్తానం ఎక్కణ్ణుంచి... ఎలా మొదలయిందో తెలుసుకుందాం..
పీవీ నరసింహారావు.. ప్రతి తెలుగు వ్యక్తి ఎప్పటికీ గుర్తుంచుకొనే రాజకీయ నాయకుడి పేరిది... ఇటు రాష్ట్ర రాజకీయల నుంచి అటు జాతీయ రాజకీయాల వరకు ఆకళింపు చేసుకొని అందరి మన్ననలు పొందిన బహుబాషా కోవిదుడు. భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి తెలుగువాడు., భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివీ.. రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతనికే సాధ్యమయింది.
కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. అందులో ఉద్దండులకు కొదవలేదు. అయినా పీవీ నరసింహరావునే ఈ పదవి ఎలా వరించింది. ఈయన మాత్రమే అప్పట్లో అర్హుడని అధిష్టానం భావించడం వెనుక కారణాలేంటి..
1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడప్పుడే చల్లారుతోంది. తెలంగాణ ప్రజలను బుజ్జగించాలంటే తెలంగాణ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలి. అప్పుడున్న ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న కర్తవ్యం. తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని పీవీ వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయన రాజకీయ నేపథ్యం ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి..
మఖ్యమంత్రి పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి మొదలయింది. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసాడు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది.
ముఖ్యమంత్రి పదవి ఆయనకు నిప్పుల కుంపటిలా మారింది.. పీఠం నుంచి దిగక తప్పని పరిస్థితి.. అన్నీ తానై నడిపిస్తున్న అధిష్టానం గీసిన గీత దాటలేక పదవిని వదులుకున్న విధేయతే.. ఆయన్ను ప్రధానిగా చేసింది.
ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన తరువాత పీవీ దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నంత పని చేశారు. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యలేదు. రాజీవ్ గాంధీ హత్య తరువాత ప్రత్యేక గ్రూపు లేని పీవీ ప్రధాని పదవికి ఆమోదయోగ్యుడుగా కనపించాడు. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబాలకు చెందని మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి. అవిశ్వాస తీర్మానాన్ని గట్టెక్కించడానికి అక్రమాలకు పాల్పడ్డారని, జెఎంఎం సభ్యులకు ముడుపుల చెల్లించారనే ఆరోపణలు చుట్టు ముట్టాయి. అన్నిటికన్నా బాబ్రీ మసీదు వివాదం ఆయన్ను జీవితాంతం వెంటాడింది. బాబ్రీ కూల్చివేతను అడ్డుకోలేక పోయారనేది ఆయన పై ఉన్న అతి పెద్ద అపవాదు.
జీవితాంతం రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ అని కలవరించి నిజాయితీ కోసం పలవరించిన నాయకుణ్ణి నిర్ధోషిగా నిలబెట్టారు. నమ్ముకున్న పార్టీ కూడా చిన్నచూపు చూసింది.. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులేంటి.... పీవీని వెంటాడిన వివాదాల్లో పీవీ పాత్ర ఎంత.. ఈ విషయాలు.. ఆయనతో సుదీర్ఘంగా పనిచేసిన ప్రధాని సలహాదారు పీవీఆర్కే ప్రసాద్, కేంద్ర న్యాయశాఖా మాజీ కార్యదర్శి సీవీరావు గారు.. హెచ్ఎంటీవీ చీఫ్ ఎడిటర్ తో ఓసందర్భంలో తమ మనసులో మాట పంచుకున్నారు. అసలేం జరిగిందో.. వాస్తవాలేంటో చెప్పారు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన అపర చాణుక్యుడికి, ఇటు రాష్ట్రంలోనూ.. అటు జాతీయపార్టీలోనూ చెప్పుకోదగ్గ గౌరవం లభించలేదనే మెజారిటీ ప్రజల అభిప్రాయం..

2 comments:

  1. PVN Rao participated in a by-election in Nandyal(Rayalaseema) to join the parliament. Rao won from Nandyal with a victory margin of a record 5 lakh (500,000) votes and his win was recorded in the Guinness Book Of World Records.

    ReplyDelete