ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, December 3, 2011

వెన్న ముద్దలు అలంకరిస్తేనే విన్నపాలకు వెన్నలా కరిగి పోయే హనుమంతుడిక్కడున్నాడు

\
వెన్న ముద్దలు అలంకరిస్తేనే విన్నపాలకు వెన్నలా కరిగి పోయే హనుమంతుడిక్కడున్నాడు
ఇప్పటివరకు వెన్నపాలు తాగి విన్నపాలు వినే కన్నయ్యనే చూశాం…కానీ వెన్నాభిషేకం చేసి విన్నవించుకుంటే చాలు ప్రసన్నమై కోరిన కోరికలు తీర్చే ప్రసన్నాంజనేయ స్వామిని నేటి తెలంగాణ ఆలయాల్లో చూద్దాం…
హైదరాబాద్ నగరంలోని దిల్ షుక్ నగర్ లో భక్తుల విశ్వాసాన్ని చొరగొన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత వుంది.హైందవ మతంలో ఆంజనేయున్ని సింధూరంతో అలంకరించి, గంగాజలంతో అభిషేకిస్తారు. కానీ ఈ ఆలయంలో స్వామి వారి ప్రతిమకు సింధూరంతో పాటు వెన్నను కూడా అలంకరిస్తారు. స్వామివారికి వెన్నను అలంకరిస్తే చాలు ఆయన మనస్సు వెన్నలా కరిగి తమ కష్టాలను తీరుస్తాడని భక్తుల విశ్వాసం.
దిల్ షుక్ నగర్ లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం 26 సంవత్సరాలుగా లక్షలాది మంది భక్తులచే పూజలందుకొని కోరిన కోర్కెలు తీర్చే …రామబంటు కొలువై ఉన్న కోవెల ఇది.. ఈ ఆంజనేయ స్వామి ఎన్నో మహిమలు చూపించాడని భక్తులు చెప్పుకుంటారు.. ఈ స్వామి వారి మహిమలు ఖండాంతరాలు వ్యాపించాయి.అందుకే ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిట లాడుతుంటుంది. నిత్యం దీపధూప నైవేధ్యాలతో వేద మంత్రోచ్చారణలతో అసలైన ఆధ్యాత్మిక వాతారణం వెల్లివిరుస్తుంది.
ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరడంతో ఆలయప్రాంగణంలోనే శివాలయాన్నీ, రాధాక్రిష్ణుడి ఆలయాన్ని నిర్మించారు.ఆంజనేయ స్వామి దుష్టశక్తుల నుండి రక్షిస్తాడు. కానీ గ్రహపీడల నుంచి రక్షణ పొందేందుకు ఇక్కడ స్వామి వారి సన్నిధి లొనే నవగ్రహాలు ప్రతిష్టించారు.. భక్తులు ఈ నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి నవ ధాన్యలు, నువ్వుల నూనె, పాలు, కొబ్బరి నీళ్ళతో అభిషేకించి పూజిస్తారు..
ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకోవడానికి ఆలయంలో అడుగు పెట్టకముందే మనకో అద్భుతం కనిపిస్తుంది.ఆలయ ముఖద్వారం ముందు భక్తులకు నేనున్నానని అభయమిచ్చే 36 అడుగుల ఎత్తు భారీ ఆంజనేయస్వామి విగ్రహం దర్శనమిస్తది. ఈ విగ్రహంలో శిల్పి అద్భుత నైపుణ్యం కనిపిస్తది.. పూర్వార్ధమున ఆంజనేయస్వామిగా పశ్చిమార్ధమున పరమేశ్వరునిగా దర్శనమిస్తడు..
ఇక్కడ గంభీరంగా ప్రసన్నవదనంతొ అభయమిస్తున్న ఈ స్వామిని చూసిన వారికి త్రేతాయుగంలో సుందర కాండను సృష్టించిన వాయు పుత్రుడే ఇక్కడ శిలారూపంలో వెలిశాడనిపిస్తది. ఈ భారీ విగ్రహన్ని మలిచిన శిల్పుల చేతుల్లో ఏ విశ్వకర్మదాగి ఉన్నడో..అందుకే ఈ నిలువెత్తు విగ్రహం ఆ ఆజానుబావుడి అంశతో అలరారినట్టు వుంటది. స్వామి ప్రసన్నవదనంతో సజీవంగా ఉన్నాడా అనే భ్రమ కలిగిస్తది. ఇది స్వామి మహిమా లేక శిల్పచాతుర్యమా.. అని ఇక్కడికొచ్చిన భక్తులు చర్చించుకుంటరు. ముఖ ద్వారం గుండా ఆలయంలోకి నాలుగు అడుగులేసి వెనుదిరిగిన చూస్తే అదే విగ్రహానికి మరో వైపు పరమేశ్వరుడిగా దర్శన మిస్తడు. ఇది చూసే భక్తులు ఇంతకుముందు మనం చూసింది ఆంజనేయుణ్ణా , లేక పరమేశ్వరుడినా అనే సందిగ్థంలో పడుతరు.
ఈ ఆలయంలో ప్రతి అనువు ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగించేలా ఉంటుంది. రామ నామం శివనామం ఆంజనేయస్మరణ తప్ప ఇక్కడి వచ్చిన వారికి మరొద్యాసే ఉండదు.. మరో ఊసే ఎత్తరు.స్వామి వారిని దర్శిస్తే చాలు సకల పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం స్వామికి పూజ చేసి మంత్రించిన రక్షాబంఢన్ ని కట్టుకుంటే ఏ దుష్ట శక్తులు దరిచేరవని భక్తుల నమ్మకం.. అందుకే ఎంత బిజీగా ఉన్నా... ఆ కాసేపు స్వామి దర్శనం కోసం కేటాయిస్తారు. చల్లగా చూడమని వేడుకుంటారు.
ఇంతకీ ఈ ఆలయంలో ఆంజనేయునడికి అలంకారంగా వెన్ననే ఎందుకు పెడుతారు. దేశంలో ఏ ఆంజనేయుడికి చేయని విధంగా దిల్ షుక్ నగర్ లోని హనుమంతునికి వెన్న అలంకారం ఎందుకు చేస్తరంటే దీనికి ఒక కారణం వుంది.ఆ కారణం ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
లోకంలో ఓ కొత్త సంప్రదాయం కనిపిస్తుందంటే దాని వెనుక తప్పకుండా ఏదో ఒక చరిత్రదాగి ఉంటది. లేదా ఊహాజనిత విశ్వాసం గానీ, మరచిపోయిన మన సంస్కృతి ఆనవాళ్ళు గానీ దాగి ఉంటాయి. ఇక్కడ ఆంజనేయ స్వామికి వెన్నాలంకారానికి ఒక కారణం ఉంది. గతంలో ఒక భక్తుడు మంగళవారం మంగళప్రదమని భావించి వెన్నతో అలంకరించాడట.. అప్పుడు ఆ భక్తుడు కోరుకున్న కోరికలు నెరవేరాయి…. ఈ విషయం ఆనోట ఈ నోట ఆలయానికి వచ్చే భక్తులందరికీ తెలిసింది. అప్పటి నుండి నెలలో మొదటి మంగళవారం రోజున స్వామి వారికి వెన్నాలంకారం చేస్తూ వచ్చారు. అయితే ముందుగా స్వామి వారికి తమ మనసులో కోరికను విన్నవించుకుంటారు..తమను కష్టాలనుంచి గట్టెక్కిస్తే వెన్నాలంకారం చేయిస్తామని మొక్కుకుంటారు. అలా వేడుకున్న భక్తుల కోరికలు తీరడం తో స్వామి వారికి వెన్న అలంకారం చేసే భక్తుల సంఖ్య పెరిగింది. నెలలో మొదటి మంగళవారం రోజున ఈ వెన్నఅలంకారం చేసేవారు.. భక్తుల రద్దీ పెరగడంతో నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ అసౌకర్యాన్ని గుర్తించి ప్రతి మంగళవారం స్వామి వారికి వెన్న అలంకారం చేసే విధంగా వెసులుబాటు కల్పించారు. దీంతో ఒక్క నెలలోనే ఎక్కువ మంది భక్తులు వెన్నాలంకారం చేసి మొక్కు తీర్చుకుంటున్నారు. అయినా రోజు రోజుకీ వెన్నాలంకారం చేసే భక్తుల సంఖ్య పెరగడంతో ముందుగానే తమ పేర్లను నమోదు చేయించుకుంటారు. వరుస క్రమంలో స్వామివారికి వెన్నాలంకారము చేసుకుని తమ మొక్కుని తీర్చుకుంటారు. ఈ మొక్కును తీర్చు కోడానికి నెలల తరభడి వేచిచూడాల్సి వస్తుంది. ఈ ప్రసన్నాంజనేయ స్వామివారికి వెన్నాలంకారం చేయడం తమ జన్మ జన్మల పూర్వ ఫలంగా భావిస్తారు.
ఇంత మహిమ గల ఈ ఆలయం ఇన్ని లక్షల మంది భక్తుల విశ్వాసాన్ని పొందిన ఈ ప్రసన్నాంజనేయ స్వామి జయంతి వేడుకలు అంటే మాటలా.. ముక్కోటి దేవతలు ముంగిళ్ళలోకి వచ్చి వాలినట్టు... ఆ రోజున వాడ వాడ అంతా స్వామి నామ స్మరణతో సందడి చేస్తారు.
ఈ ఆలయంలో.. ప్రతి మంగళవారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నా ... దర్శించుకోక పోయినా హనుమాన్ జయంతి రోజున మాత్రం దర్శించుకోవాల్సిందే … హనుమాన్ జయంతి రోజున స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు.. సహస్ర కలశాభిషేకము చేస్తారు.. 108 మంది భక్తులకు ఒక్కొక్కరికీ ఒక్కో కలశాన్ని ఇచ్చి స్వామి వారి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రదక్షిణానంతరం ఆ జలంతో స్వామివారిని అభిషేకించిన వారికి ఉండే దృష్టి దోషాలు తొలుగుతాయని భక్తులు చెప్తారు.
ఈ ఆలయ నిర్మాణంలోనే ఒక విశిష్టత దాగివుంది. అలాగే విగ్రహ స్థాపనలో కూడా ఓ విశేషం ఉంది. అందుకే ఈ ఆలయానికి ఇంతటి ఘన కీర్తి వచ్చింది. ఇంతకీ ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలేంటి…

భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి గాంచిన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవాలంటే.. ఏడు ద్వారాలు దాటుకొని వెళ్ళాలి. ఆ ఆరు తలుపుల తరువాత ఏడో తలుపు తెరిస్తే గానీ అలివేలు మంగమ్మ తలపుల్లో ఉన్న ఆ ఏడుకొండల వాడి దర్శనం కలగదు.. అయితే ఆధ్యాత్మికతకు 7అంకెలకు అభినాభావ సంబంధం ఉండటం వల్లనే శ్రీ రంగంలో కూడా 7 ప్రాకారాలు నిర్మించిన్రు. అలాగే ఇక్కడ ఈ ప్రసన్నాంజనేయ స్వామిని చేరుకోవడానికి 7 మార్గాలున్నాయి. ఇది యాదృచ్ఛికమో.. కాకతాళియంగానో లేదా దైవ మహిమ వల్ల కలిగిందో కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడుకి, శ్రీ రంగ నాధుడికి వచ్చిన ఖ్యాతి ఈ ప్రసన్నాంజనేయునికి వచ్చింది.
ఈ స్వామి వారికి మరో విశేషం వుంది. హనుమంతుడు చిన్నప్పుడు ఉదయించే సూర్యుణ్ని చూసి... ఎర్రని పండుగా భావించి తినడానికి వెళ్తాడు. దీన్ని గమనించిన ఇంద్రుడు అడ్డుకొని వజ్రాయుధంతో శిక్షిస్తడు. ఆ దెబ్బకి ఆంజనేయుడి హనువు అనే దంతం విరగడం వలన హనుమంతునిగా కీర్తింపబడ్డాడు. ఆ తరువాత జరిగిన తప్పిదాన్ని గుర్తించిన దేవతలు హనుమంతుణ్ణి, వాయు దేవుణ్ణి తృప్తి పరిచి వరాలిస్తరు. అలా మొదలైన సూర్య హనుమంతుల బంధం ఈ ఆలయంలో అనుకోకుండానే గుర్తుకు తెస్థాయి. ఈ ప్రసన్నాంజనేయ స్వామి హృదయంలో కొలువైన సీతారామచంద్రులను సూర్యోదయపు తొలికిరణాలు తాకి స్వర్ణశోభితం చేస్తాయి. హనుమంతుని గుండెల్లో... ఆ ఆదిత్యుడు కొలువై ఉన్నాడని కళ్ళకు కట్టినట్టు రుజువు చేస్తాయి. అరస వల్లిలో సూర్యభగవానుని పాదాల చెంతనే కనిపించే ఈ సూర్యకిరణాలు.. ఈ ఆలయంలో ప్రసన్నాంజనేయ స్వామి గుండె గుడిపై ప్రకాశిస్తాయి. ఇది ఈ ఆలయానికున్న ఓ మహత్తర శక్తిగా భక్తులు చెప్పుకుంటారు.
ఈ ఆలయంలో ప్రతి పర్వదినాన్నీ... అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టిన వారికి సకల దేవతల దర్శనం కలుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రసన్నాంజనేయ స్వామితో పాటూ శివుణ్ణీ.. రాధాక్రిష్ణులను, నాగదేవతను, నవగ్రహాలను దర్శించుకుంటారు..
ఈ ఆలయంలో ప్రతి పర్వదినం నేత్ర పర్వమే.. ప్రతి పండుగ కన్నుల పండుగే ఆలయానికి చిన్నా పెద్దా తేడాలేకుండా అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు స్వామిని దర్శిస్తారు. ఆలయంలో శివునికి కార్తీక మాసంలో పూజలు జరుపుతారు. మహన్యాస పూర్వక రుద్రాభి షేకాలు, లక్షభిల్వార్చనలతో పూజిస్తారు. తొలి పొద్దువేళలో , మలి సంధ్య వేళలో కార్తీక దీపాలతో అలంకరిస్తారు. స్వామివారు యోగ నిద్ర నుంచి మేలుకోని కనిపిస్తడని కార్తీక పూరాణం చెబుతుంది. ఆ నమ్మకంతోనే భక్తులు శివార్చరనలు చేస్తారు.
ధనుర్మాసంలో ఇక్కడి రాధాక్రిష్ణ ఆలయంలో.. గోదా దేవికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు.. ఈ గోపాలుడికి ఆబాల గోపాలంగా వేడుకలు చేస్తారు..శ్రీ క్రిష్ణా అష్టోత్తర నామాలను గొదా శ్రీక్రిష్ణ కళ్యాణోత్సవమును అత్యంత వైభవోపేతంగా జరుపుతారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నవారికి కళ్యాణ గడియలు సమీపిస్తాయని ప్రతీతి..
ఈ ఆలయంలో ఎన్ని అలంకారాలు జరిగినా వెన్నాలంకారానికున్న ప్రాముఖ్యతే ఈ ఆలయానికి ఇంత పేరు తెచ్చిపెట్టింది. స్వామి వారికి వెన్నాలంకారం చేసిన తరువాత స్వామి వారి సన్నిదిలొ ఒక శ్లోకం చెప్పిస్తారు. ఈ శ్లొకానికి అర్ధమేమంటే నేను ఎక్కడికి వెళ్ళినా సధా నావెంటే వుంటూ నన్ను రక్షించమని అర్ధం..
ఇదీ దిల్‌సుఖ్‌నగర్ ప్రసన్నాంజనేయ స్వామి చరిత్ర

No comments:

Post a Comment