ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, December 28, 2011

తుఫాన్‌లకు పేరెందుకు పెడతారో తెలుసా?

వికృత విలయాలకు అందమైన పేర్లు పెడుతుంటారు.. ఎందుకో తెలియదు గానీ... ఊర్లకు ఊర్లను ముంచెత్తిన తుపాన్ పేరు లైలా అన్నారు.. ప్రోఖ్రాన్ అణు పరీక్షలకు బుద్ద స్మైలింగ్ అన్నారు. ఇటువంటివి చరిత్రలో ఎన్నో.. ఎన్నెన్నో.. ఇప్పుడు కూడా చెన్నైకి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుపాన్ కు థేన్ అని పేరు పెట్టారు. అసలు ఇంతకీ తుఫాన్ లకు పేరెందుకు పెడతారు. ఈ తుపాన్ లకు పేర్లు పెట్టే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలయిందో చెబుతాను వినండి

సముద్ర తీర ప్రాంతాలకు తుఫానుల ముప్పు కొత్తేమి కాదు.. సముద్రంలో అప్పుడప్పుడు వాతావరణంలో తేడాల వల్ల ఏర్పడే అల్పపీడనం వాయుగుండంగా మారి.. సముద్ర గర్భంలోనే సుడులు తిరుగుతూ కదలడాన్ని తుఫాన్ అంటారు. ఇక- అడపాదడపా తుపాన్లు మనల్ని వెంటాడుతూనే వున్నా..తరచుగా వస్తున్న ఈ ఉత్పాతాలను గుర్తించి, రికార్డు చేయడానికి వీలుగా వాటికి పేర్లు పెట్టడం మొదలు పెట్టారు. హిందూ మహాసముద్ర ఉత్తర ప్రాంతం తుపానులకు బలవుతుండటంతో ఈ ప్రాంతాన్ని తాకే తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ మొదలు పెట్టింది. బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడే తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం 2004 నుంచి మొదలైంది. ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రంగా ఏర్పడిన ఐఎండి ఏడు దేశాలకు వాతావరణ హెచ్చరికలను పంపుతూ వుంటుంది. తుఫాను గుప్పిట చిక్కే బంగ్లా దేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, థాయిలాండ్, శ్రీలంక దేశాలు వీటికి పేర్లు పెడతాయి. ఈ దేశాలు పంపే పేర్లను ఆయా సభ్య దేశాల ముందు అక్షరాలను బట్టి ఒక జాబితాలా తయారు చేస్తారు. ఇప్పటి వరకూ తుఫాన్లకు 64 పేర్లు సిద్ధం చేయగా వాటిలో 22 పేర్లను వాడారు. అవి ఐలా, ఫైయాన్, లైలా, ఫెట్ లాంటి పేర్లన్నీ ఉత్తర హిందూ మహాసముద్ర పరిధిలోని దేశాలు సూచించినవే. ఇవే కాక నర్గీస్, బందు.. అనే పేర్లను శ్రీలంక సూచించింది. 2006లో వచ్చిన తుఫానుకు ఓగ్ని అని పేరు పెట్టారు. 2008లో వచ్చిన తుఫానుకు ఖైముక్ అని నామకరణం చేశారు. అదే ఏడాది నవంబర్ 29న బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడింది.. దానికి నిశా అని పేరు పెట్టారు. ఇక 2010 మే 21న ఆంధ్ర కోస్తా తీరాన్ని కల్లోలపరచిన తుఫాను పేరు లైలా.. ఈ పేరు పెట్టమని పాకిస్థాన్ మన వాతావరణ శాఖను కోరింది. అరేబియా సముద్రానికీ తుఫాను బెడద వుంది. కాకపోతే బంగాళాఖాతంతో పోల్చితే తక్కువ.. అక్కడ 2007లో వచ్చిన తుఫానుకు గోను అని పేరు పెట్టారు.. అమెరికాలో తుఫాన్లకు పేరు పెట్టే సంప్రదాయం ఎప్పటినుంచో వుంది. అమెరికాను అతలాకుతలం చేసిన కత్రినా తుఫాను బీభత్సం ఆదేశాన్ని ఇప్పటికీ వణికిస్తూనే వుంది.

1 comment:

  1. చాలా మంచి విషయాన్ని చెప్పారు.

    ReplyDelete