Friday, December 16, 2011
ఎక్సైజ్ అధికారుల అసలు బాగోతం ఇదేనని చాలా మందికి తెలియదు..
రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ అవినీతి పై ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అక్రమ ధనంతో బాటు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లిక్కర్ సిండికేట్ వ్యాపారులు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ముట్టజెపుతున్నారో స్పష్టంగా తెలిసింది. ఇప్పటికే కర్నూలు, గుంటూరు జిల్లాలో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో వీటికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. దీంతో ఎక్సైజ్ మాఫియా ఎంతగా అల్లుకుపోయిందో అర్ధమవుతోంది..
రాష్ట్రంలో ఎంత కరువొచ్చినా... ఎన్ని ఇబ్బందులు వచ్చినా మద్యం విక్రయాలు మాత్రం తగ్గవు. రాష్ట్రం మొత్తం బందులు నిర్వహించినా ఆల్కహాల్ ఆగిపోదు.. మందుబాబులు ఒకరోజు అన్నంలేకుండానైనా ఉండగలరేమో గానీ.. ఆల్కహాల్ గొంతుదిగనిదే నిద్రపట్టదు. ఈ బలహీనతను ఆసరా చేసుకొని రాష్ట్రంలో మద్యం దుకాణ దారులు రెచ్చిపోతున్నారు. సిండికేట్ అయి ఎమ్మర్పీ రేట్లను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. ఇదేమిటని అడిగిన వారిని షాపు ముందే బెదిరించి పంపుతున్నారు. ఎక్కువ మాట్లాడితే దుమ్ము దులిపి వదిలేస్తున్నారు. రాష్ట్రలో మద్యం మాఫియా అంతగా వేళ్లూనుకొని పోయింది.
ఎమ్మార్పీ రేట్లకంటే ఎక్కు వ ధరకు అమ్ముతున్నారని ఎక్సైజ్ అధికారులకు చెప్పినా ఫలితం శూన్యం.. ఎందుకంటే సిండికేట్లు ఎవరి స్థాయిని బట్టి వారికి నెలనెలా ముడుపులు కట్టి మరీ ఠంచనుగా అప్పజెపుతున్నారు. దీంతో మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులకు అనేక ఫిర్యాదులు అందటంతో రంగంలోకి దిగారు. ఈ దాడుల్లో విభ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. సిండికేట్లు ఎవరెవరికి ముట్టజెప్పుతున్నారో కూడా గుట్టు రట్టయింది.
ఏసీబీ దాడుల్లో కొందరు సిండికేట్ల నుంచి అభించిన అకౌంట్ల వివరాల ప్రకారం... నెలనెలా అందించే ముడుపుల జాబితా ఈ విధంగా ఉంది. స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీస్ వింగ్‌కు రెండువేలు, స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ వింగ్‌కు రెండువేలు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు 4 వేల రూపాయలు ముడుతున్నాయి. సబ్ డివిజనల్ స్క్వాడ్ ఎక్సైజ్ కు 3 వేల రూపాయలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు నాలుగు వేల రూాపాయలు, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌కు 10 వేల రూపాయలు ఇస్తే ఎక్సైజ్ డీసీకిమాత్రం 15వందల రూపాలు ముడుతున్నాయి. వీరితో బాటు లా అండ్ ఆర్డర్ ఎస్సైకు 5వేలు, సీఐకు 4వేలు, డీెఎస్పీకు 2వేల ఐదొందలు, నైటు బీట్ కానిస్టేబుళ్లకు 900, కొన్ని రకాల మీడియా ప్రతినిధులకు ఒక్కొక్కరికీ రెండు వేలు, ఎక్సైజ్ సీఐకు 12 వేలు, ఎక్సైజ్ ఎస్సైకు 8 వేలు, ఎక్సైజ్ పీఎస్‌లో మెన్‌కు 10వేలరూపాయలు.. వీరు కాక కొన్ని సంఘాలు.. ఇన్ని రకాల వ్యక్తులకు ముడుపుల రూపంలో ముల్లెలు అందుతున్నాయి. మొత్తంగా ఒక్కో బ్రాందీ షాపు నుంచి నెలకు 80 వేల రూపాయలు లంచాల రూపంలో అందుతున్నాయి. అందుకే ఎమ్మార్పీ రేట్లకు రెక్కలొచ్చి మద్యం రేట్లు చుక్కలనంటుతున్నాయి.
ఏసీబీ అధికారుల దాడుల్లో లభించిన ఈ లంచావతారాల లిస్టు చూసి అధికారులకు దిమ్మతిరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులుదాడులు చేస్తే.. పోలీసు శాఖలో, ఎక్సైజ్ శాఖలో ఉద్యోగులెవరు మిగిలుండే అవకాశం లేదని వ్యాపారులే అభిప్రాయపడుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
good info
ReplyDeleteఒక్క ఎక్సైజు శాఖ మాత్రమే కాదు దాదాపు అన్ని శాఖల పనితీరు అంతే
ReplyDelete