ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Thursday, November 3, 2011

ఇది తెలంగాణ సాహిత్యమా.. దళిత, బీసీల సాహిత్యమా..?



ఇది తెలంగాణ సాహిత్యమా.. దళిత, బీసీల సాహిత్యమా..?
ఇప్పుడు తెలంగాణలో... ఉద్యమానికి ఊపిరి పోస్తున్న సాహిత్యానికి మూలాలు ఎక్కడివి...? పుట్లకు పుట్లుగా పుట్టుకొస్తున్న కవిత్వాలకు మూలవస్తువేది..? ఇప్పుడు సీమాంధ్ర పై కురిపిస్తున్న తిట్ల వర‌‌్షానికి పదప్రయోగాలన్నీ ఎక్కడ జరిగాయ..ి. ? ఇప్పుడు సాహిత్యలోకంలో వాడిగా వేడిగా జరుగుతున్న లోపాయికారి చర్చ ఇదే.. నిజానికి తెలంగాణ ఉద్యమం పుట్టకు ముందే ఈ సాహిత్యం ఉంది.. కానీ ఇప్పుడు దాని రూపం మార్చుకుంది.. వాక్యాంతాలు మారాయి.. అదే అవేదన... అదే కష్టం.. అవే కన్నీళ్లు.. అవే తిట్లు.. అవే శాపనార్ధాలు.. కానీ అవి దిశ మార్చుకున్నాయి.. అయితే ఇవి వీటి దిశమార్చుకునే అవసరం ఎందుకొచ్చింది.. ఎటునుంచి ఎటుమారాయి.. రూపం మార్చుకున్నా.. ఈ సాహిత్య లక్ష్యం ఒక్కటేనా.. ఈ విషయం తెలుసుకోవాలంటే... సింధూ నాగరికతను అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు... ఏ దక్కను నాగరికతనో తవ్వుకుంటూ పోవాల్సిన పని లేదు.. గత దశాబ్ద కాలంగా ఉదృతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని,, దానికి తోడుగా ఉండి శ్వాసనందిస్తున్న సాహిత్యాన్ని పరిశీలిస్తే అసలు విషయం అవగతమవుతుంది.. అవును మరి సమాజంలో ధనికుణ్ని- పేదవాడు, పెట్టుబడి దారుణ్ని- శ్రామికుడు, అగ్రవర్ణాల వారిని - నిమ్న వర్ణాల వారు... ఎదిరించి జయం సాధించినట్టు నిత్యం కలలు కంటూనే ఉంటారు. వీరి మధ్య వర్గపోరు తరాలుగా నడుస్తూనే ఉంది... అయితే ఇప్పటి వరకు వీరు సాధించామనుకున్న విజయాలు కాలక్రమంలో వచ్చాయా లేక పోరాటాల ద్వారా వచ్చాయా అన్న విషయంలో... మేథావుల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి కాబట్టి ఇప్పుడు నేను వాటి జోలికి పోదలుచుకోలేదు.. కానీ గత దశాబ్ద కాలంగా తెలంగాణ సాహిత్యం పేరుతో వస్తున్న వివిధ రకాల రచనలతో భావవ్యాప్తి గురించే నేను నాలుగు ముక్కలు అభిప్రాయంగా పంచుకోవాలనుకుంటున్నాను.. నేను తెలంగాణ టీవీ ఛానల్( టి.న్యూస్)లో ప్రోగ్రామిగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన అనుభవంతో చూసిన పరిశీలించిన కొన్ని విషయాలు.. వివిధ రకాల వ్యక్తుల అభిప్రాయాలను పంచుకున్నాకనే ఈ నాలుగు మాటలు రాయగలుగుతున్నాను.
వాస్తవానికి ఇప్పుడు తెలంగాణ సాహిత్యం పేరుతో వస్తున్న సాహిత్యానికి మూలాలన్నీ దళిత సాహిత్యంలోనే ఉన్నాయని మెజారిటీ మేథావులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. తరతరాలుగా అణచబడి.. వేసుకోడానికి చెప్పులు కూడా లేని దుస్థితి ఒకపక్క... ఉన్నా వేసుకోవడానికి స్వేచ్ఛలేని పరిస్థితి మరోపక్క... ఐణా చెప్పులు కుట్టే వృత్తినే నమ్ముకొని కాలం గడిపారు.. సహజంగానే ఆవేదనతోనే.. ఆక్రందనతోనో.. తన జాతిని అణిచిన వారిని, దానికి మూల కారణాలైన క్రమాన్ని ఆ వర్గాల నుంచి వచ్చిన రచయితలు తమ రచనల్లో దుమ్ములేపి దునుమాడారు.. అసలు ఉండో లేడో తెలియని మనువును... మునుం పెట్టి తిట్టారు.. దాన్ని వారసత్వంగా అనుభవిస్తున్న వారిని.. మనువుకు వారసులుగా కీర్తింప బడుతున్న ద్విజులను తమ సాహిత్యంలో శిలాశాసనాలు చెక్కారు.. ఎందుకంటే తమ వెనకబాటు తనానికి.. రెండు జన్మల ప్రముఖులు, వారిని పెంచి పోషించిన అగ్రవర్ణాల వారేనని వీరి గట్టి అభిప్రాయం.. ఇప్పటికీ వారి అభివృద్ధిని అడ్డుకునేది వారేనని బ్రాహ్మణులను తిట్టిపోసే వారు లేకపోలేదు.. గత దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో ఇక అగ్రవర్ణాలను ఆడిపోసుకోవడం తగ్గి అగ్రవర్ణాల స్థానంలో సీమాంధ్రులు చేరారు.. అవే తిట్లు.. అవే శాపనార్ధాలు... అయితే ఈ సారి కమ్యునిస్టు ఉద్యమ సాహిత్యం, దళిత సాహిత్యం కలిసి తెలంగాణ ఉద్యమ సాహిత్యంగా పురుడు పోసుకున్నాయి.. తెలంగాణ ధూంధాలలో పాడే పాటలన్నీ ఒకప్పుడు నిషిద్ధ కమ్యునిస్టు పార్టీలు పాడుకున్న పాటల బాణీలే.. సాహిత్యం కూడా తొంబై శాతం అదే.. ఉద్యమ రూపం ఏదైనా లక్ష్యం మాత్రం అదే.. రాజ్యాధికారం. విముక్తి కోసం పోరాటం.. అది ఏ రకమైన విముక్తి... విముక్తి తర్వాత ఎవరెవరికి ఏం ఒరుగుతుందనేది చరిత్రలో విముక్తి పొందిన వారినడిగితే చెప్తారు కానీ.. ఇప్పుడు వస్తున్న సమకాలీన రచనలల్లో అత్యధికం.. బి.సి, ఎస్సీల నుంచే వస్తున్నాయనేది ప్రధాన వాదన.. ఇటు అగ్రవర్ణాల వారు, కాస్తో కూస్తో లౌక్యం ఉన్న వారు వీటి జోలికి పోవడం లేదట.. ఇప్పటి వరకు తెలంగాణ పాటలు రాసిన వారిని గమనిద్దాం. ఈ పేర్లు కేవలం ఉదాహరణగా మాత్రమే తీసుకోగలరు. తెలంగాణ జాతీయ గీతంగా పాడుకుంటున్న * జయజయహే తెలంగాణ జననీ పాట రాసిన అందెశ్రీ దగ్గర్నుంచి, పల్లెపాటగాడు గోరటి వెంకన్న, జంగ్ సైరన్ జయరాజ్, ప్రజాయుద్ధనౌక గద్దర్, మిట్టపల్లి సురేందర్, కోదారి శ్రీను, రసమయి బాలకిషన్, నేర్నాల కిషోర్, వెంకన్న, నాగన్న, రవీంధర్, అమర్...లు నాకు సడెన్ గా గుర్తొచ్చిన కవిగాయకులు మాత్రమే.. ఇక గాయకుల విషయానికి వస్తే.. ముందు చెప్పిన వారు కాక, విమలక్క, సంధ్యక్క, స్వర్ణ, విజయక్క, రమాదేవి, పద్మావతి, గంగ, ప్రగతి, మధుప్రియ, సోమన్న, సాయిచంద్, పైలం సంతోష్, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే పేజీ చాలదు. రెగ్యులర్‌గా నాతో టచ్ లో ఉండే వాళ్ల పేర్లే గుర్తుకొచ్చిన వరకు ప్రస్తావించాను. వీళ్లు కాక గద్య రచయితలు, కవితలకే పరిమిత మైన వారు చాలా మందే ఉన్నారు. అయితే వీరందరిలో 95శాతానికి పైగా దళితులు, బీసీలే కావడం యాదృచ్ఛికమో.. కాకతాళీయమో కాదు.. వారికిది చారిత్రక వారసత్వంగానే వచ్చింది.. గతకాలపు సాహిత్యమే. పురాతన జానపద బాణీలే.. కాకుంటే వాటి దశ-దిశ మార్చుకున్నాయి. అయితే ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో కూడా మెజారిటీ సంఖ్య వీరిదే నన్న వాదన కూడా ఉంది. ఇక్కడ మరో ముఖ్య విషయం కూడా ప్రస్తావించాలి. తెలంగాణ బాషగా పరిగణించ బడుతున్న నేటి బాషను పొదివి పట్టుకొని దాచుకున్నది కూడా దళితులు, బీసీలేనన్న వాదన కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ బాష ఎక్కువగా కట్టెపొయ్యిని, కారం ముద్దను నమ్ముకున్న కడజాతి కడవల్లోనే తొణకుండా పదిలంగా ఉంది. వాళ్లు మాత్రమే తిరిగి బాషకు జీవం పోయగలిగారు. ఇప్పుడు తెలంగాణ బాషగా చెపుతున్న బాషలో చాలా బాష సంకరంగా మారిందే. హలాంతాలు మార్చినంతమాత్రాన మూలబాషను ముందుకు తేలేం.. నలిమెల భాస్కర్ కష్టపడి తెలంగాణ పదకోశాన్ని రూపొందించనైతే రూపొందించాడు కానీ వాటన్నిటీ ఇప్పుడు వాడుక బాషగా వ్యవహారికగా బాషగా మాట్లాడాలంటే మళ్లీ ప్రాక్టీస్ చేయక తప్పదేమో.. మరీ కొన్ని జిల్లాలకైతే ఇంకా ఇబ్బంది. ఖమ్మంలో మెజారిటీ ప్రాంతం, నల్లగొండలో చాలా ప్రాంతం, హైదరాబాద్, రంగారెడ్డి, జిల్లాల్లో అచ్చమైన తెలంగాణ బాష దొరకడం కరువే.. అయితే ఈ బాషను ఈ మాత్రమైనా నిలుపుకుంటూ వస్తుంది.. బహుజన కవిగాయక రచయితలేననేది మెజారిటీ సంఖ్యలో అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దొరల రాజ్యం వస్తుందని మంద కృష్ణ వ్యాఖ్యల వెనుక మర్మమేంటో తెలియదు కానీ.. తెలంగాణ సాహిత్యంలో మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుజనులే దొరలు.. ఇంతమంది కలం వీరులుండగా వచ్చిన దొరస్వామ్యం నిలబడుతుందా.. అనేది గుర్తుంచుకోవాలి.. అఖరుగా ఒక్కమాట.. అణిచి వేతను ఎదిరించే సాహిత్యమేదైనా దాని రూపాలన్నీ సారూప్యాలే.. భావసారూప్యం గల మేథావులు అర్ధం చేసుకోండి.. అపార్దం చేసుకున్న వారు నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పండి.

3 comments:

  1. మీరు వ్రాసింది నూరు శాతం రైట్ సోదరా

    ReplyDelete
  2. అభిప్రాయాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు సాంబమూర్తి గారూ...

    ReplyDelete
  3. బాగుంది ..
    కాకుంటే ఎక్కడ దోపిడీ ఉంటుందో ..అక్కడ కళలు వర్దిల్లుతాయి ..విశ్వవ్యాప్తంగా ఒక జాతిని అత్యంత అమానవీయంగా చిత్రించిన చరిత్ర ఆదిపత్య సమాజానిది
    అది నల్లజాతివాల్లను హీనంగా చూసిన శ్వేత జాతీయులు కావచ్చు ద్రవిడులను , ఆర్యులు కావచ్చ్చు , దళితులను ,తూలనాడిన అగ్రవర్నాలను కావచ్చు
    ఇక్కడ సాహిత్యము ఎక్కువ బాగం దళితులూ రాసి ఉండో చ్చ్చు కాకుంటే అంతులేని ఆవేదనతో చేసిన వ్యక్తీకరణ అది
    ఇప్పుడు తెలంగాణా సాహిత్యము దాని దిశను మార్చుకుంది
    కాకుంటే ఇక్కడి వెనక బాటుకు సీమాంద్ర ..ఉన్న గుప్పెడు పెట్టుబడి దారులు మాత్రమె అది ఎక్కడయినా ఉంది ..అంతిమంగా సాహిత్యం ..అసమానతలు రూపుమాపేది గా ఉండాలి అదికార మార్పిడీ కోరేది గా ఉంటె ఇక్కడ వచ్చిన తెలంగాణా సాహిత్యం అంటా బూడిదలో పోసినట్టీ..

    ReplyDelete