ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Friday, November 18, 2011

వీరికి... ఆ (సెక్స్) కొన్ని క్షణాలు .. నరకం...



అక్కడ ద్వారాలు బార్లా తెరిచే వుంటాయి. మూసిన తలుపులు మచ్చుకైనా కనిపించవు. తమ శరీరాల్ని ఛిద్రం చేసే మానవహింసాకాండని నగుమోములతో స్వాగతాలు పలికే అమ్మలుంటారక్కడ. అమ్మచాటు బిడ్డలూ ఉంటారక్కడ . కానీ తల్లి కొంగు చాటున కాదు, తెరచాటునే వారిస్థానం. తాను ఉండాల్సిన అమ్మ ఒడిలో మాత్రం ఓ మానవ మృగం, తెరచాటున పసిమనసులను భయం, అవమానం తెరలు తెరలుగా కమ్మేస్తుంది. తెరవెనుక అమ్మనీలినీడలు పసిమనసులను కలచివేస్తుంటాయి. చీకటి నీడల దృశ్యాలు చిన్నారుల మనసులను ఛిద్రం చేస్తుంటాయి. అమ్మ తనువు వుండై ఒకరికి పండవుతుంటే...ఆ అమ్మే తను శవమై మరొకరికి వశమౌతూ రక్తపు ముద్దగా మారుతున్న వేళ ప్రపంచం పచ్చి మోసంగా సమాజం ఒఠ్ఠి దగాలా కొద్ది కొద్దిగా అర్థమవుతుంది ఆ పసిమొగ్గలకు..
ఆ సామాజిక వికృత ప్రక్రియకు బలయ్యే వారే అంగడి బొమ్మలు. ఈ పసివారి అమ్మలు. ఎదిగే వయసుతో, ఎదిగీ ఎదగని మనసులతో ఏమౌతామో తెలియని అయోమయంతో చేయనితప్పుుకి శిక్షని అనుభవిస్తున్నారు వారి బిడ్డలు. కులం పేరుతో కొందరు, సాంప్రదాయం పేరుతో మరికొందరు. మోసపోయి కొందరు, సమాజమే వెలివేసి మరికొందరు. కుటుంబమే హింసించి ఇంకొందరు. ఆడపిల్లగా పుట్టినందుకే అమ్ముడుపోయి మరికొందరు. ఇలా కారణాలేవైనా అందరూ ఒకే చోటికి చేరుకుంటారు. అందరూ తమ శరీరాలకు తామే వెలకట్టుకుంటారు. తమ జీవితాలకు తామే ముగింపురాసుకుంటారు. అది దుబాయ్‌ అయినా, ముంబాయి అయినా దేశరాజధాని ఢిల్లీ అయినా నగరమేదైనా నరకమొక్కటే. నాలుగు చిల్లర డబ్బులు శవంపై చల్లినట్టు ఆమె శరీరంపై చల్లి ఆమె సర్వహక్కులూ లూఠీ చేస్తాడు మగవాడు. ఒకసారి ఆ చీకట్లోకి ప్రవేశిస్తే ఇక బయటపడే ప్రశ్నే ఉండదు. వారి జీవితాలు ఆ చీకట్లో తెల్లారిపోవాల్సిందే. చీకట్లో వారి దేహాలు ఛిద్రమవ్వాల్సిందే.
శరీరం తూట్లుగా మారేలోపే నాలుగు రూపాయిలు మిగుల్చుకోవాలి. పాతికేళ‌్ళు పైబడితే ధర తగ్గుతుంది. పసి మొగ్గల శరీరాలకు పైకం ఎక్కువొస్తుంది. అప్పుడే ఆ తల్లుల కోసం వచ్చే విటుల చూపులు పరిసరాలను పరికిస్తాయి. ఏ పసిబిడ్డైనా ఫరవాలేదు. ఆడపిల్లయితే చాలనుకుంటాయి ఆ మానవ మృగాలు. మదపుటేనుగులబారిన పడకుండా తలుపురెక్కలకు తమ శరీరాలను వేళ్ళాడదీసి విటుల దృష్టిని మళ్ళిస్తూ పసిబిడ్డలను కాపాడుకొనే తల్లులు కొన్నిసార్లు వారి ప్రాణాలనే ఫణంగా పెడతారు.
బైట్ : తలి్ల బైట్. ఈమె పైన రాసినకొన్ని విషయాలు చెపుతుంది.
వాయిస్ : మూడు పదులు దాటాయంటే వారి బతుకు దుర్భరం. పుట్టిన బిడ్డల పోషణ భారంగా తయారవుతుంది. ఓ పక్క అనారోగ్యం కుంగదీస్తుంది. అప్పటికే సమాజం అసహ్యపు చూపులు, చేష్టలు సమాజంలో గౌరవప్రదమైన జీవితం అందని ద్రాక్షగా మారుతుంది. పసిబిడ్డల పొట్టనింపుకోవడమే గగనంగా తయారవుతుంది. ఛీత్కారానికి చిరునామాగా మారిని సమాజం వెలివేస్తుంది. వీరికి పొలాల్లోనో, ఫ్యాక్టరీల్లోనో కూలిపనిసైతం దొరకదు. వీరి జీవితాలు అస్పశ్యంగా తయారవుతాయి.
చెక్కిళ్ళపై ముద్దాడి గుండెలకు హత్తుకోవాల్సిన అమ్మ ఎంతకీ రాదు. ఏడ్చి ఏడ్చి ఏ మూలో అర్ధాకలితో పడుకుంటే అర్ధరాత్రి దాటాక అమ్మ రాకాసి చెరవీడినట్టు...కారుమబ్బులను చీల్చుకొని జాబిల్లి వచ్చినట్టు అమ్మ వస్తుంది. కానీ శరీరంలోని సత్తువంతా లాగేసి, శరీరాన్ని, మనసునీ సిగరేట్‌ ముక్కంత హీనంగా పీల్చి పడేసిన మరో రాకాసి పంజా అమ్మను తిరిగితిరిగి ఆవహిస్తుంది . ఒకటారెండా...రోజుకి ఆరు రాకాసి ఆకారాలు అమ్మను మాంసపు ముద్దలుగా మంచానికి వేళ్ళాడదీస్తుంటాయి. ఎందుకమ్మా ఈ నరకమని ప్రశ్నించలేని చిన్నారుల ప్రశ్నార్థకపు చూపులకు అమ్మకంటికొసల్లోని కన్నీరే సమాధానం చెపుతుంది.

ఎవడి కిరీతకానికో చేదుజ్ఞాపకంగా ఈ లోకంలోకొచ్చిన ఈ పిల్లలను ఈ రొంపిలోకి దించడానికి ఏ తల్లి హృదయం అంగీకరించదు. తనలాంటి అవమానకరమైన జీవితం. తన బిడ్డలకు రాకూడదనుకుంటుంది. ఊరికి దూరంగా, తమ గాలైనా సోకని చోట భద్రంగా ఉంచాలనుకుంటుంది. నాలుగక్షరం ముక్కలొస్తే ఈ నరకానికి తన బిడ్డలను దూరంగా ఉంచొచ్చనుకుంటుంది. కానీ వీరి పేరు చెబితే పిల్లలకు స్కూల్ అడ్మిషన్ సైతం దొరకనిపరిస్థితి. ఇక వీరి బిడ్డలకు చదువుకునే అవకాశాలు మృగ్యమవుతాయి. తమ పిల్లలను చదివించుకోవాలనే ఆశ వున్నా నాగరికం ముసుగులో బతుకుతున్న అనాగరిక మనుషుల మధ్య పిల్లల హక్కులు హరించివేయబడతాయి. అనుక్షణం అవమానాలతో, హేళనలతో పిల్లల బ్రతుకు నరకప్రాయం అవుతుంది. పిల్లలు బడికి దూరంగా నిరక్షరాస్యులుగా ఇంటివద్దే ఉండిపోతారు. అంతేకాదు దారుణ దృశ్యాలను దిగమింగలేక, ఎవ్వరికీ చెప్పుకోలేక, ఏం చెయ్యాలో అర్థమవ్వక మానసికంగా కృంగిపోతారు.
తండ్రి పేరైనా తెలియకుండా ఈ భూమిపైకొచ్చిన ఈ పసిడిడ్డలకు జీవితం దినదినగండంగా మారుతుంది. ఈ రొంపిలోంచి వారి పిల్లలను కాపాడుకోవడం వీరి తల్లులకు పెద్ద సవాల్‌గా మారుతుంది. ముద్దులొలికే చిన్నారులు ఎదిగేకొద్దీ ఈ సమాజంపై ఏహ్యాభావాన్ని పెంచుకుంటారు. తల్లి పరిస్థితికి కారణాలను వెతుక్కుంటారు. తమకి నాన్నెందుకు లేడో అర్ధం చేసుకునే లోపు రోగాలతో రొప్పులతో కన్నతల్లి కూడా కనుమరుగవుతుంది. ఇక ఈ చిన్నారులకు నా అన్నవాళ‌్ళే కరువవుతారు. చీకటిసామ్రాజ్యానికి మహారాణులైన ఆ తల్లుల బిడ్డలు చివరకు చిల్లిగవ్వకు కొరగాని వారిగా మిగిలిపోతారు.

ఆర్థికపరిస్థితి, పూటగడవని పరిస్ధితిలో ఈ రొంపిలోకి దిగామని చెపుతున్న ఈ అంగడి బొమ్మలు ....తమ బిడ్డలకూ ఈ దుస్ధితి తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ఈ వృత్తిలోంచి బయటకు రమ్మనే హక్కు ఎవ్వరికీ లేదంటారు ఆ తల్లులు. ఆదుకొని , ఆదరించి...పునరావాసం కల్పించి, మంచి జీవితీన్ని మాకందించలేని ప్రభుత్వాలు మా వృత్తినెందుకు వదులుకొమ్మంటారని తల్లు ప్రశ్నిస్తున్నారు. స్త్రీల శరీరాలు వ్యాపారాలైన చోట ఈ దారుణకృత్యానికి బలైన ...బలవుతున్న వీరు కాస్త కరుకుగానే కనిపిస్తారు. మొరటుగానే మాట్లాడుతారు. కానీ దానికి కారణం వారి గుండెలకు కాలం చేసిన గాయం. ...
ఏ ఆపన్న హస్తమో వారి బిడ్డలను కనికరించి కాపాడితే వారికి ఈ సభ్యసమాజంనుంచి సవాలక్ష సవాళ‌్ళు ఎదురవుతాయి, ఎవడో తెలియని నాన్న కోసం సవాలక్ష ప్రశ్నలు. అమ్మకు సైతం తెలియని సమాధానం ఈ చిన్నితల్లికెలా తెలుస్తుంది. కన్నీరింకిన చిన్నారుల కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఈసడించుకున్న వారు ఈటెల్లా పొడిచేస్తుంటారు. తనకు ఏమీ కాని నాన్నపేరుతో గుర్తింపడటమే వారు అవమానంగా భివిస్తారీపసివారు. నన్ను నన్నుగా గుర్తించేందుకు నాకు నాన్నే ఉండాల్సిన పనిలేదంటారు.
ఇంగ్లీషులో గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతున్న ఈ అమ్మాయి తల్లి ఓ జోగిని. సాంప్రదాయం పేరుతో ఇక్కడ లైంగిక హింస జరుగుతుంది. ఈమెకు తండ్రిఎవరో తెలియదు. ఇదే ప్రశ్నని తల్లినడిగితే తను చెప్పలేదు. బజార్లో మహారాజులా తిరుగుతున్న నాన్న అనేవాడిని తను గుర్తించే అవకాశం లేదు. అందుకే అవమానాల్ని దిగమింగి సమాజాన్ని చదవడం నేర్చుకుంది. తన కసినంతా చదువుపై కేంద్రీకరించింది, ఎనిమిది వరకు అర కొరగా ఇంగ్లీషు ముక్క రాకుండా చదివిన ఈ మె నగరంలోని ఓ ప్రముఖ కాలేజీలో చదువుతోంది. ఇప్పుడు ఇంటర్‌లో 79శాతం మార్కులతో పాసయ్యింది. ఛీదరించుకునే చేతులు చిన్న సాయాన్ని అందించగలిగితే వారు ఆకాశానికి నిచ్చెనెలేస్తారని నిరూపించింది.
తనువు పుండై చివరికి శవంగా మారుతున్న అమ్మ జీవితం ఈ బిడ్డలకు చాలా విషయాలు నేర్పించింది. అవమానాలతో అగౌరవంగా బ్రతకడం ఎంతటి నరకమో అనుభవించారు వీరంతా. చీకటికి కృంగి పోకుండా రేపటి వేకువకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సమాజాన్ని సవాల్‌గా స్వీకరిస్తున్నారు. ఓ పక్క సమాజంతో మరో పక్క చదువుతో యుద్ధం చేస్తున్నారు. గెలుపు ఇప్పటికిప్పుడే వీరికి సొంతమవ్వకపోవచ్చు . కాని రేపటి విజయం కోసం ఈ రోజు పరాభవాన్ని ఎదుర్కొంటూనే పోరాడుతామని చెబుతున్నారు. వీరి ఆత్మస్థైర్యం ముందు అన్నీ దిగదుడుపే.
అమ్మని అంగడి సరుకుగా మార్చిన సమాజాన్ని ఒకే ప్రశ్నవేస్తారీ చిన్నారులు. తమ జీవితాలకు పుచీనివ్వని నాన్నెవరని అడగొద్దని ఇంట్లో , బళ్ళో, బజారులో ఎక్కడైనా జన్మనిచ్చిన అమ్మపేరుని మరవద్దని కోరుతున్నారు.................
ఇటువంటి కుటుంబాల్లోని ఎదిగే పిల్లలపై మానసిక వత్తిడి అధికంగా ఉందంటున్నారు డాక్టర్లు. పురుషుల ప్రవర్తనతో వారిపైన వారికే అసహ్యం కలిగి పిల్లలు మానసిక వ్యాధులకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు. అంతే కాదు. బలవంతంగానో, మోసపూరితంగానో ఈ వృత్తిలోకి దిగిన వారు ఒక సారి వారి శరీరంపై జరిగే హింసతో హడలిపోయి ఆత్మహత్యలకు సైతం వెనకాడరంటున్నారు. అంతే కాదు ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న తల్లులకు పిల్లలు పుడితే వారి పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది.
మహిళలే కాదు రాష్ట్రంలో ఈ రాక్షసమానవహింసకు బలవుతున్న వారిలో పదినుంచి 18 ఏళ్ళ మధ్య వారు 25శాతం మంది ఈ రొంపిలోకి దిగుతున్నారు. మిస్సింగ్‌ కేసులుగా మిగిలిపోతున్న బాలికల ఆచూకీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోతోంది. పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్‌ కేసుల్లో అత్యధిక భాగం అమ్మాయిలే ఆక్రమిస్తున్నారంటే బాలికలు మాయమవడం వెనుక మర్మమేమిటో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ముంబాయ్ లోని రెడ్ లైట్ ఏరియాలో వున్న వారిలో 45 శాతం మంది కర్నాటక నుంచి వచ్చిన వారేనని ఓ సర్వేలో తేలింది. ధాకాలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 20 శాతం మంది వీధి బాలలు ఈ వృత్తిలోకి దిగుతున్నారు. వీళ్ళల్లో 20 ఏళ్ళు నిండకుండానే వివిధ కారణాలతో వీరు చనిపోతున్నారు.
చట్టంలోని లొసుగుల ఆసరాతో మగవాడు అతి తేలికగా తప్పు నుంచి తప్పించుకుంటాడు. మరి అదే అపరాధంతో జైలుకి వెళ్ళిన స్త్రీకి విముక్తి కలిగేదెలా? కేవలం పెనాల్టీతో తప్పుని కప్పిపెట్టుకొని పెద్దమనిషిగా కోర్టు నుంచి బయటపడ్డ మగవాడిని అత్యంత సహజంగా అంగీకరంచే సమాజం స్త్రీలను మాత్రం దోషిగా నిలబెడుతోంది. బాలికల పట్ల, స్త్రీల పట్ల అసమాన భావం, వివక్ష వెరసి వారి మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈ రొంపిలోకి దిగకుండా చూసేవిధంగా ప్రభుత్వ విధానాలు లేవు. ఈ వృత్తిలో వున్న వారిని అందులోంచి బయటపడేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అరకొరగానే ఉన్నాయి. ఈ నరకకూపంలోంచి పసిబిడ్డలను కాపాడేందుకు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలు కాదు కావాల్సింది. పసివారి జన్మహక్కైన జీవించే హక్కే కాదు, గౌరవంతో జీవించే హక్కు వారికి కల్పించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యతకావాలని కోరుకుందాం.

16 comments:

  1. well said.. vaari paristhitulaki..vishaadam gundeni kosesthundi. vaari jeevithaalu maaredeppudu!? maarpu daarilo nadusthunna vaarini abhinandhisthoo..cheyoota nivvadam manishi dharmam.

    ReplyDelete
  2. well said mitramaa.......prabhutvam lone kaka prajallo koodaa penu maarpu raavaali. Idi chinna samasya kaadu.. deeni venuka marenno saamajika konaalu unnaayi. meeru sprusinchina amsaalu annee sarainave....mee ee manchi rachana ku marosari abhinandanalu......

    ReplyDelete
  3. thank u for respond friends.. @వనజ వనమాలి and పిఆర్ తమిరి గారికి.. ప్రభుత్వ సహకారం అనేది పేదోళ్లకు కదు. పెద్దోళ్లకు మాత్రమే.. పేదోళ్ల పథకాలు కూడా పెద్దోళ్ల కోసమే.. మీటింగ్‌లో చెప్పే అంకెలేవీ పేదోళ్లను చేరవు. కాంట్రాక్టర్లను ఎమ్మెల్యేలకు ఇచ్చే సమాచారమే అది. ఇక వీరి బతుకులంటారా.. నాడు దేవదాసీలు.. నేడు ఇంగ్లీష్ లో అందంగా సెక్స్ వర్కర్లు.. ఆ వర్క్ లోకి దిగేటపుడే జాగ్రత్త పడాలి. దిగాక వెనక్కు తిరిగి చూడ్డానికి కూడా ఏమీ మిగలదు. చీకటి తప్ప. భవిష్యత్తు కూడా.. చీకటే..

    ReplyDelete
  4. you are right janardhan, govt is only for the one who are in high position, not for all..

    ReplyDelete
  5. evarikainaa inta chadive opiki vuntundaa????
    paigaa.. system pai..

    ReplyDelete
  6. జనార్ధన్ గారు..
    ఆర్టికల్ బాగా రాశారు.

    -స్వామి

    ReplyDelete
  7. @thanku u swami..@నమ్మలేని నిజాలు.. చదివించే సత్తా ఆర్టికిల్ కు ఉండాలి. దాంతో బాటు.. కొత్త విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఎదురుగా ఉన్నది పుస్తకమా.. మానిటరా అన్న విషయం మర్చిపోతాం.. any way thank u to respond to my article.

    ReplyDelete
  8. mitrama jai telangana.. article bagundi.. plz. sent to any news paper. chalamandi chadive avakasam vuntundi... thanks

    ReplyDelete
  9. బంగార్రాజు గారూ. థాంక్యూ.. మీ తులసీ ఛానల్ సంగతేంటి..? మిత్రమా ఇది పత్రికలకు పంపడం కాదు. నేను పనిచేసే టీవీ ఛానల్ హెచ్ఎంటీవీలోనే ప్లే అయింది..

    ReplyDelete
  10. అందం అంటే ఆడదాని బాహ్య సౌందర్యం అనుకునే ఈ సమాజం....,
    ఆడతనాన్ని అంగడి సరుకుగా మార్చిన ఈ మానవ మృగాలు ....
    నిజంగా సిగ్గు సిగ్గు... ఈ మానవ జన్మకి 'అమ్మ" ఆడది..
    డియర్ జనర్ధన్ గారు మీ ఆర్టికల్ చాలా బాగుంది.....!!!!!

    ReplyDelete
  11. అందం అంటే ఆడదాని బాహ్య సౌందర్యం అనుకునే ఈ సమాజం....,
    ఆడతనాన్ని అంగడి సరుకుగా మార్చిన ఈ మానవ మృగాలు ....
    నిజంగా సిగ్గు సిగ్గు... ఈ మానవ జన్మకి 'అమ్మ" ఆడది..
    డియర్ జనర్ధన్ గారు మీ ఆర్టికల్ చాలా బాగుంది.....!!!!!

    ReplyDelete