ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Tuesday, March 27, 2012

దళిత గిరిజనుల నిధులు దొంగల పాలు.. ఉపసంఘం ఊరటనిచ్చేనా..?




ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికను ఎటువంటి అవకతవకలు లేకుండా అమలు చేయాలంటూ ప్రజాసంఘాలు, దళిత సంఘాలు చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం దిగొచ్చింది. ప్రణాళిక అమలుకు మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కిరణ్ కుమార్ రెడ్డ ిప్రకటించారు. ఇంతకూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై మంత్రి వర్గ ఉప సంఘం వేయాలని ప్రజా సంఘాలతో బాటు, దళిత సంఘాలు డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.. సబ్ ప్లాన్ నిధులు ఎలా పక్కదారి పడుతున్నాయి.. ముఖ్యమంత్రి తాజా ప్రకటన వల్ల ఎటువంటి ప్రయోజనం కలగబోతోంది.... వంటి విషయాల పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.
సొమ్మొకరిది.. సోకొకరిది
సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలని ఉప ప్రణాళికను రూపొందించింది. ఎస్సీ, ఎస్టీ లను అభివృద్ధి చేయాలన్న సదుద్దేశ్యంతో వారికి ప్రత్యేక నిధులు కేటాయింస్తూ... వారికి మాత్రమే ఖర్చు చేయాలని సంకల్పించి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ రూపొందించింది. కాలక్రమంలో ఈ సబ్ ప్లాన్ కు చెదలు పట్టింది. ఒకవైపు నిధుల కేటాయింపుల్లోనే నిర్లక్ష్యం రాజ్యమేలుతుంటే.. మరో వైపు కేటాయించిన నిధులు పక్కదారి పట్టడం మొదలయింది. ఈ పద్దతిని నిరసిస్తూ దళిత సంఘాలు ఎన్నో సార్లు ఆందోళన బాట పట్టాయి. అయినా ప్రభుత్వంలో కదలిక లేదు.. ఉత్తుత్తి హామీలతో సరిపుచ్చాయి. దీంతో నిధుల దుర్వినియోగం షరా మామూలైపోయింది. ఇదేంటని అడిగిన నాధుడు లేడు.
దళిత, గిరిజనుల జనాభా సంఖ్యకు తగ్గట్టుగా.. ఎస్సీలకు 16.2 శాతం నిధులు, ఎస్టీలకు 6.6 శాతం నిధుల్ని ప్రణాళిక బడ్జెట్ లో కేటాయించాలని సబ్ ప్లాన్ ఏర్పాటు చేసిన సందర్భంలో నిర‌్ణయించింది. ఎస్సీ ఎస్పీ పేరుతో 1979 సంవత్సరంలో ఈ ఉప ప్రణాళికను ఏర్పాటు చేసింది. దీని ద్వారా కేటాయించిన నిధులు దళిత, గిరిజనుల సామాజిక, ఆర్ధిక, విద్యా, వైద్య రంగాల్లో అభివృద్ధికి వినియోగిస్తారు. కానీ ఈ సబ్ ‌ప్లాన్ ఏర్పాటు చేసిన నాటి నుంచి నిధులను సక్రమంగా వినియోగించిన పాపాన పోలేదని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయం పై దళిత సంఘాలు ఎన్నోసార్లు ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశాయి.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం దామాషా ప్రకారంకేటాయించాల్సిన నిధులు కేటాయించక పోగా.. కేటాయించిన అరకొర నిధులను పక్కదారి పట్టిస్తున్నారంటూ కమిషన్ తప్పు బట్టింది. రాష్ట్రంలో 1992 నుంచి ఇతర శాఖల బాట పట్టిన నిధులు అక్షరాలా 13 వేల 200 కోట్లు... ఇప్పడు ఆ మొత్తం 20 వేల కోట్లకు పైకి చేరింది. ఈ విషయాన్ని లెక్కలతో సహా కాగితాల పై కుమ్మరించి ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం వాగ్ధానాలతోనే బుజ్జగిస్తోంది.
ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే నోడల్ వ్యవస్థ అమలులోకి రావాలి. కానీ రాష్ట్రంలో నోడల్ వ్యవస్థ ఇన్నాళ్లూ ఓ చిరకాల స్వప్నంగానే మిగిలింది. ఉత్తరప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో సాకారమైన నోడల్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు దుస్సాధ్యంగా మిగిలింది. దీంతో నిధులను ఇష్టమొచ్చిన శాఖలకు కేటాయించినా పట్టించుకునే నాథుడు లేడు. 2007లో ఎస్సీ ఎస్టీ లకు రెండు ఏజన్సీలు ఏర్పాటు చేసి రెండు నెలలకో మారు సమీక్ష చేస్తామన్న దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. తరువాత ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రోశయ్య కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. మిగిలిన నిధులను నోడల్ ఏజన్సీకి బదలాయించాలని ఆదేశించి చేతులు దులుపుకున్నారు. అయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.
ఎస్సీ ఎస్టీ ల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన సబ్ ప్లాన్ అపహాస్యం పాలవుతోంది.. దళిత గిరిజనులను ఉద్ధరించడానికి ఏర్పాటు చేసిన ఉప ప్రణాళికకు నిధులు కేటాయించడంలోనే నిర్లక్ష్యం తాండవిస్తుంది. దానికి తోడు కేటాయించిన అరకొర నిధుల విడుదలలో విపరీతమైన జాప్యం.. ఆఖరుకు కేటాయించిన నిధులను దళితులకు, గిరిజనులకు ఖర్చు పెట్టకుండా వేరే పనులకు ఖర్చు పెట్టి.. దళిత గిరిజన ఖాతాలో రాయడం షరా మామూలై పోయింది. దళిత, గిరిజనులకు అసలే సంబంధం లేని పులివెందుల అభివృద్ధి, హైదరాబాద్ రింగ్ రోడ్డు నిర్మాణం, హుస్సేన్ సాగర్ ఆధునికీకరణ వంటి పనులకు ఖర్చు పెట్టడం చూస్తే ప్రభుత్వాలకు దళిత గిరిజనుల అభివృద్ధి పట్ల ఉన్న చిత్త శుద్ది తేటతెల్లమవుతోంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని... ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాల సాక్షిగా ఉప ముఖ్యమంత్రే బహిరంగంగా ఒప్పుకున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మన పొరుగున ఉన్నా కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు ఎంత కేటాయిస్తారో ముందే ప్రకటిస్తారు. కానీ మన రాష్ట్రంలో కేటాయించిన నిధులు ఎన్నో తెలుసుకోవడమే కష్టంగా మారింది.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరు చేయకున్నా, నిధులు దారి మళ్లించినా, దానికి సహకరిస్తూ సంతకం చేసిన వారందరిపైనా చర్యలు తీసుకునే విధంగా సబ్‌ప్లాన్ నిధుల చట్టం రూపొందించాల్సి ఉందని నేతలు అభిప్రాయ పడుతున్నారు.. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం 750 కోట్ల రూపాయల సబ్ ప్లాన్ నిధులను కామన్‌వెల్త్ క్రీడలకు వెచ్చించిందని , హైదరాబాద్‌లోని రింగ్‌రోడ్, ట్యాంకు బండ్ ప్రక్షాళనకు కోట్ల రూపాయలు దారిమళ్లించారని బీజేపీ నేత కిషన్‌రెడ్డి చెప్పారు. దళితుల అభివృద్ధికి కేటాయించిన నిధులను కూడా సక్రమంగా ఖర్చు పెట్టకపోవడం బాధాకరమని బీవీ రాఘవులు అన్నారు.
మా సొమ్ములు మాకు ఖర్చు పెట్టండి ప్రభో అంటూ దళిత సంఘాలు రొడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చినందుకు ప్రభుత్వాలు పెద్దగా బాధ పడక పోగా ఇలా జరిగిన మాట వాస్తవమే అని శాసన సభ సాక్షిగా ఒప్పుకోవడాన్ని చూస్తుంటే ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి పై ప్రభుత్వాలకున్న చిత్త శుద్ధి కనిపిస్తోంది.
అవును జరిగిందేదో జరిగింది.. ఇక అలా జరగనివ్వమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సక్రమంగా అమలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని.. వారికి కేటాయించిన నిధులు జాప్యం లేకుండా విడుదల చేయడమే కాకుండా విడుదలయిన నిధులు వారికే ఖర్చు పెట్టేలా చర్యలు తీసుకుంటామని... దీనికోసం శాసన సభలో ప్రత్యేక చర్చ చేపడతామని సీఎం చెప్పే మాటలు కాస్త ఊరట కలిగించేవే అయినా.. అవి కార్యరూపం దాల్చిన రోజు సంపూర్ణ విజయం సాధించనట్టే..

Wednesday, March 21, 2012

గుండెలవిసేలా ఏడ్చినా... పోయిన బిడ్డ వస్తుందా.. ఈ పాపం ఎవరిది?


గుండెలవిసేలా ఏడ్చినా... పోయిన బిడ్డ వస్తుందా.. ఈ పాపం ఎవరిది?
ఆ బస్సు వారి పాలిట మృత్యు శకటం గా మారింది.. కళ్లముందు ఆడిపాడే విద్యార్ధులు కానరాని తీరాలకు చేరారు.. ఆ బిడ్డల తల్లి దండ్రుల శోకం తీరనిది.. గుండెలవిసేలా విలపిస్తున్న ఆ తల్లి దండ్రుల శోఖానికి అంతే లేదు. ఒక్కబస్సులో ప్రయాణిస్తున్న 50 మందిలో 14 మంది తల్లి దండ్రులకు గర్భశోకం కలిగింది.
పాపం పసివాళ్లు / ఈ పాపం ఎవరిది ?
రోజూ లాగే ఈ రోజూ వీడ్కోలు చెప్పి స్కూల్ బస్సెక్కారు.. కానీ అదే ఆ తల్లులకు.. బిడ్డలు చెప్పిన ఆఖరి వీడ్కోలవుతుందని తెలీదు. మురిపాలు కురిపించే చిన్నారులు.. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. తిరిగిరాని తీరాలకు చేరారు.. గుండె చెరువై కుమిలి పోతున్న ఆ తల్లి దండ్రులు ఈ పీడ కల నుంచి తేరుకోలేక పోతున్నారు.
వాగులో పడ్డ బస్సులో తమ పిల్లలు దొరుకుతారేమోనని వెదుకుతున్న ఆ తండ్రుల గుండెలు ఎంత తల్లడిల్లుతున్నాయో
ప్రమాదానికి కారణం ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయినందుకే బస్సు వాగులో పడిందని చెబుతున్నా... అదొక్కటే కారణమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చిన్నారులను పొట్టన బెట్టుకున్న పాపం ఎవరిది..
వాగు వద్ద ఉన్న బ్రిడ్జి ప్రమాదాలకు నిలయంగా మారిందా..?
చంద్రుగొండ మండలంలో ఉన్న రోడ్డు సింగిల్ రోడ్డు.. తుంగారం వాగు పై ఉన్న బ్రిడ్జి కూడా ప్రమాదాలకు నిలయం గా మారింది.. ఏ మాత్రం అలసత్వంగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలిసి పోవలసిందే.. ప్రమాదాలకు వంతెనలు కారణం అని తెలిసినా... బ్రిడ్జిల వద్ద పాటించాల్సిన జాగ్రత్తలు పాటించడం లేదు..
బస్సు కండీషన్ ఎలా ఉంది..?
ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం మార్గ దర్శకాలు సూచించింది.. కానీ చాలా పాఠశాలలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ఈ రోజు ప్రమాదానికి కారణమైన బస్సు కండీషన్ పై కూడా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
డ్రైవర్ నైపుణ్యం ఎంత ?
స్కూల్ బస్సు నడిపే డ్రైవర్‌కు ఎంతో నైపుణ్యం ఉండాలి. కానీ ఒక్కోసారి కొత్తగా డ్రైవింగ్ లోకి వచ్చిన వారిని కూడా స్కూల్ యాజమాన్యాలు డ్రైవర్లుగా నియమిస్తున్నాయి. ఎల్‌వీ రెడ్డి స్కూల్ బస్సు ప్రమాద సమయానికి బస్సు క్లీనర్ డ్రైవింగ్ చేసినట్టు తెలుస్తోంది. డ్రైవర్ తో బాటు క్లీనర్ క్షేమంగా ఈదుకుంటూ బయటపడ్డారు.
ఖండనలతో సరి ...
స్కూల్ ప్రమాదాలు నిత్య కృత్యాలయ్యాయి... ప్రమాదాలు జరిగినపుడు ఖండనలు, సంతాపాలు.. ఎక్స్‌గ్రేషియాలు.. సంప్రదాయంగా మారాయి.. కానీ ప్రమాదాలు నివారించేందుకు తీసుకునే చర్యలు .. పాటించాల్సిన నిబంధనలు మాత్రం కాగితాలకే పరిమితమవుతున్నాయి. స్కూల్ బస్సుల కండీషన్ల పై కూడా రాజీ పడ్డ వారు పసివాళ్ల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా కాదు ఈ అధికారులు ప్రభుత్వం ఎప్పటికి స్పందిస్తుందో..

పసిప్రాణాలతో పరాచకం... గుండె చెరువై కుములుతున్న కన్న తల్లులు


పసిప్రాణాలతో పరాచకం... గుండె చెరువై కుములుతున్న కన్న తల్లులు
ఖమ్మం జిల్లా కొత్తగూడెం వద్ద స్కూల్ బస్సు కాలువలో పడి 14 మంది చనిపోవడంతో... స్కూల్ బస్సు ప్రమాదాల పై మరోసారి చర్చ మొదలయింది.. ప్రమాదాలు జరిగినపుడు ఖండనలు... సంతాపాలు... ఎక్స్ గ్రేషియాతో సరిపుచ్చే నేతలు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే స్కూల్ బస్సుల ప్రమాదాలు నిత్య కృత్యాలయ్యాయి. ప్రమాదాల్లో పసివాళ్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కంటిదీపాలు గాలిలో దీపాల్లా మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదాల పై ప్రత్యేక కథనం
స్కూల్ బస్సు బోల్తా.... విద్యార్ధుల మృతి... పలువురికి తీవ్ర గాయాలు.. స్కూల్ పై దాడి... ఈ వార్తలు నిత్య కృత్యంగా మారాయి. సరిగ్గా 20 రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లా గన్నవరంలో స్కూల్ బస్సు కాలువలోకి దూసుకెల్లి ఇద్దరు విద్యార్ధులు మృతి చెందారు. అప్పటికపుడు సంఘటన పై విచారణ చేయిస్తామని మంత్రి తోట నర్సింహం తెలిపారు. కానీ ఈ విచారం మరోచోట జరుగుతోంది. గన్నవరం ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యంతో బాటు .. కర్నాటక నుంచి కొనుగోలు చేసిన ఈ బస్సు కండీషన్ కూడా కారణమని తేలింది. పిల్లలను తీసుకెళ్లే బస్సు డ్రైవర్ సెల్ ఫోన్లో సంబాషిస్తూ కలువ కట్ట పై బస్సు నడపడంతో బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రత పెరిగితే మృతుల సంఖ్య 2 నుంచి 17 కు చేరేది.
మార్చి 7 న విస్సన్న పేటలో జరిరిన ఘటన స్కూల్ బస్సు కండీషన్ల నిర్లక్ష్యానికి మరో ఉదాహరణ. బస్సులో సీటు లేకపోవడంతో డ్రైవర్ వెనకాల కూర్చున్న శ్రీజ అనే ఆరేళ్ల బాలిక బస్సులోంచి జారిపడి డివైడర్ కు గుద్దుకొంది.. కింద పడ్డ బాలిక పై నుంచి వెనుక టైర్లు వెళ్లడంతో బాలిక అక్కడికక్కడే ముృతి చెందింది.
విజువల్స్ స్కూల్ కు వెళ్లే పిల్లల విజువల్స్
శ్రీకాళహస్తిలో సరస్వతీ మహాయాగానికి వెళ్లి వస్తున్న కండ్రిగకు చెందిన వికాస్ పాఠశాల విద్యార్ధులు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 7 తీవ్రంగా గాయపడ్డారు.లు 23 మంది విద్యార్ధులకు స్వల్ప గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కేవసం స్కూల్ బస్సు కండీషనే కారణమని తేలింది.
మల్లాపూర్‌లోని లార్డ్ టాలెంట్ హై స్కూల్ బస్సు విద్యుత్ స్థంబాన్ని ఢీకొని 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మిగతా విద్యార్ధులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ ప్రమాదానికి బస్సు కండీషన్ తో బాటు డ్రైవర్ మద్యం సేవించి నడపడమే కారణమని తేలింది.. చిన్నారుల క్షేమంగా ఇంటికి చేర్చాల్సిన డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి మద్యం సేవించి బస్సు నడపడంతో విద్యుత్ స్థంబాన్ని ఢీకొంది.. ప్రమాద స్థాయి దాటితే 11 మంది ప్రాణాలు గాలిలో కలిసేవి.
ఉయ్యూరు శ్రీనివాస పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు విజ్ఞాన యాత్రకని బయలుదేరారు. తాడేపల్లి గూడెం వద్దకు రాగానే వంతెనె ఫుట్ పాత్ ను ఢీకొని బోల్తా కొట్టింది. 20 మంది ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యారు. స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో వైద్యం చేసుకొని వెళ్లిపోయారు. బస్సులో విద్యార్ధులు ఉన్నా.. బస్సు కుడివైపు పడ్డా ఘోర ప్రమాదం జరిగేది. ప్రమాదానికి కారణం డ్రైవర్ నైపుణ్య రాహిత్యంతో పాటు... బస్సు కండీషన్లో లేకపోవడమని తేలింది.
స్కూల్ బస్సు ప్రమాదాలు నిత్య కృత్యం... కారణం ఒక్కటే.. స్కూల్ బస్సులకు పెద్ద పని ఉండదనే కారణంతో కాలం చెల్లిన బస్సులు కొనుగోలు చేయడం. వాటిని సరిగ్గా మెయింటెయిన్ చేయకపోవడం... ప్రభుత్వాధికారులు కాసులకు కక్కుర్తి పడి నిబంధనలను పట్టించుకోకపోవడం. చెకింగ్ చేయకుండానే వదిలేయడంతో ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ఈ ప్రమాదాలు తగ్గాలంటే ప్రభుత్వం మాత్రమే స్పందించాలని కోరుకునే కంటే.. విద్యార్ధులు ప్రొగ్రెస్ రిపోర్టు లాగానే స్కూల్ బస్సు నాణ్యతను... బస్సు డ్రైవర్ నైపుణ‌్యాన్ని తెలుసుకోవాలి.. నిబంధనలు పరిక్షించి యాజయాన్యాన్ని ప్రశ్నించాలి.. అప్పుడైనా కొంతలో కొంతైనా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది

Friday, March 16, 2012

సిరియాలో చిచ్చు - అధ్యక్షుణ్ని చంపే అగ్రరాజ్య కుట్ర



సిరియాలో గత 11 నెలలుగా సాగుతున్న హింసాకాండ మరింత పెట్రేగిపోతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆందోళన కారుల పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రజలు వందలాదిగా చనిపోతున్న అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ మొండి వైఖరి అవలంబించడంతో మరింత పరిస్థితి క్లిష్టంగా తయారయింది. దీంతో అల్లర్లను అదుపు చేయడానికి ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగక తప్పని పరిస్థితి నెలకొంది.
సిరియాలో ప్రజాస్వామ్య పాలన కావాలంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలన పై తిరగబడ్డారు. దీంతో చేసేదేమీ లేక బసద్ ప్రభుత్వం ఆందోళనను అణచే ప్రయత్నం చేస్తోంది. గత 11 నెలలుగా సాగుతున్న ఈ మారణహోమం రోజు రోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు... వందల్లో చనిపోతున్నారు. కొన్ని వార్త సంస్థలు వేలల్లో ఉన్నాయని చెబుతున్నా.. సిరియా ప్రభుత్వం ఆ వార్తలను ఖండిస్తోంది. కావాలనే కొన్ని దేశాలు తమను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర పన్నారని అధ్యక్షుడు మీడియా ముందు వివరించాడు. తమ దేశంలో సాయుధులై సంచరిస్తున్న కిరాయి ఆందోళన కారుల పైనే చర్యలు తీసుకున్నాము తప్ప సామన్య ప్రజల జోలికి వెళ్లలేదని చెబుతున్నారు.
సిరియా అల్లర్ల వెనుక కుట్ర దాగి ఉందని ప్రపంచవ్యప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే లిబియా అధ్యక్షుడు గడాఫీని అంతమొందించిన తీరులోనే ఈ వ్యూహం సాగుతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అరబ్ దేశాల్లో ఈ తరహా వ్యవహారం అన్ని దేశాలకు పాకుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ట్యునీషియా, ఈజిప్ట్, యెమెన్ దేశాల్లో ఈ తరహా అధ్యక్ష పాలన పై వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ విషయం పై అంతర్జాతీయ దేశాల్లో చర్చ జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి దృష్టి తమ పై మళ్లి చర్యలకు ఉప క్రమించేందుకే ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని సిరియా ప్రభుత్వం పదేపదే చెబుతోంది. మరో వైపు ఇప్పటికే ఆ దేశంలో సుమారు 8 వేల మంది ఆందోళన కారులను సిరియా దళాలు నిర్ధాక్షిణ్యంగా చంపాయనే వార్తలు వస్తున్నాయి.

జనవరిలో ఫ్రాన్సుకి చెందిన 100 మంది ప్రత్యేక బలగాలను అరెస్టు చేసినట్లు సిరియా ప్రకటించింది. 13 మంది ఫ్రాన్సు గూఢచార సైనికాధికారులను ఈ మార్చి నెలలోనే సిరియా ప్రభుత్వం అరెస్టు చేసినట్లుగా టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది.. వీరిని విడుదల చేయడానికి సిరియా ప్రభుత్వం ఓ వైపు చర్చలు జరుపుతూ కూడా ఫ్రాన్సు ప్రభుత్వం తమ సైనికులు సిరియాలో ఉన్నారని అంగీకరించడానికి తిరస్కరించింది. తమ దేశంలో కిరాయి తిరుగుబాటుదారులు ఉన్నట్లు సిరియా పదే పదే చెబుతోంది.. హోమ్స్ పట్నంలో 120 మంది ఫ్రెంచి బలగాలు పట్టుబడ్డాయని సిరియా ప్రభుత్వం మార్చి 1 న వెల్లడించింది. మరోవైపు కిరాయి గూండాల చేతిలో బలయిన సిరియా దళాలను కూడా తిరుగుబాటు దారుల కింద లెక్కిస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వార్తలేవీ వరల్డ్ మీడియా అంతగా బయటకు పొక్కనివ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అరబ్ దేశాలను అణిచే కుట్రలో భాగంగా సంపన్న దేశాలు చేస్తున్న కుట్రకు సామాన్య ప్రజలు బలవుతున్నారని అరబ్బులు ఆవేదన చెందుతున్నారు.
అయితే ఇదంతా చినికి చినికి గాలి వానలా మార్చి ఏదో ఒక రోజు అంతర్జాతీయ భద్రతా దళాలు సిరియాను చుట్టు ముట్టి అధ్యక్షుణ్ని మట్టుబెట్టే వ్యూహంలో భాగంగానే ఇదంతా అగ్రరాజ్యం చేస్తోందని అరబ్బులు వాదిస్తున్నారు.

నకిలీ ఉత్పత్తుల పై చైనా సూపర్ డెసిషన్... ఇండియాలో ఎప్పుడు చేస్తారో ?



ఎక్కడైనా.. ఎవరైనా సరే ఒక ప్రొడక్ట్‌కు మంచి గిరాకీ తగిలిందా... వెంటనే దానికి దగ్గర పేరుతో గానీ... అదే పేరు పలికే విధంగా కానీ ఉత్పత్తులు పుట్టుకొస్తాయి. ఈ జాడ్యం ఒక్క ఇండియాకే కాదు.. ప్రపంచంలో అన్ని దేశాల్లో చౌకబారు వ్యాపారులకూ ఈ రోగం ఉంది. దీంతో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన అసలు బ్రాండెడ్ వ్యాపారులు చాప చుట్టేస్తుంటే.. తక్కువ ఖర్చుతో నాణ్యత లేని ఉత్పత్తులు తయారు చేసే వారు మాత్రం కోట్లు గడిస్తున్నారు. అందుకే చైనా ఈ నకిలీలల నాటకాలకు తెరదించింది.. మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చైనా వినియోగ దారులకు ఒక వరాన్నిచ్చింది. ఇంతకీ చైనా ప్రభుత్వం ఏం చేసిందో చూస్తే మన దేశంలోనూ అలా చేస్తే ఎంతబావుంటుందో అని పిస్తుంది.
మనకు ఇష్టమైన వస్తువు తీసుకుందామని మార్కెట్‌కు వెళితే.. అసలు దొరకక పోగా.. అచ్చం అదే పేరుతో ఉన్న మరో ప్రొడక్ట్ కనిపిస్తుంది. పైగా అసలు దానికంటే రేటు రెండు రూపాయలు తక్కువే ఉంటుంది. . పోనీలే ఏదో ఒకటి అని ట్రై చేద్దామనుకుంటే మొదటికే మోసం వస్తుంది. అంతేకాదు ఆ ప్రొడక్ట్ పైన నమ్మకమే పోతుంది. ఆ మధ్య కాలంలో బాగా అమ్ముడవుతున్న సబ్బులు, నూనెలు, పరిమళ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలు కాపీ కొట్టడానికి పోటీ పడ్డాయి. ఇక గ్రామస్థాయిల్లో జరిగే సంతల్లో అయితే జాలీ పౌడర్ దగ్గర్నుంచి జాస్మిన్ పౌడర్ వరకు నకిలీ ప్రొడక్ట్ దొరుకుతాయి. ఇవి అసలు కంటే కాస్త ఎక్కువగానే తళతళలాడుతాయి. ఇటువంటి నకిలీ ఉత్పత్తుల వినియోగ దారులు నష్టపోవడమో.. లేక ఉత్పత్తులు అమ్ముడుపోక అసలు కంపెనీ మూత పడటమో జరుగుతుంది. ఈ జాడ్యం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కో ఇండియాకో పరిమితం కాదు.. ప్రపంచదేశాలన్నీ నకిలీ ఉత్పత్తుల బాధ పడుతున్నాయి. ఈ బెడద చైనాకు మరింత ఎక్కువ. వీటి వల్ల కార్పోరేట్ సంస్థలు కుదేలయ్యే పరిస్థితి ఎదురవడమే కాక.. ఎగుమతుల్లో కూడా నాణ్యత లేకపోవడంతో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దీంతో నకిలీ ఉత్పత్తుల పై చైనా శాశ్వత చర్యలు చేపట్టింది. అసలుకు నకిలీ కనిపిస్తే చాలు.. కనికరం లేకుండా కాల్చి పడేస్తున్నారు. మళ్లీ తిరిగి తీసుకోకుండా పూడ్చేస్తున్నారు. రిజిస్టర్ చేసేటపుడే పోలికలున్న పేరుకు అనుమతులు ఇవ్వకపోగా.. ఎవరైనా అక్రమంగా అటువంటి ఉత్పత్తులు తయారు చేసినా... ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి.. నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకొని చిత్తు చేస్తున్నారు. మొత్తం గా సుమారు 50 లక్షల విలువ చేసే ఉత్పత్తులను చిత్తు చేశారు.
ఇక్కడ కనిపిస్తున్న ఆయుర్వేద మందులు.. గృహోపకరణాలు.. అగ్నిమాపక యంత్రాలు... ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, వస్తువులన్నీ నకిలీవే... రోజు రోజుకూ పెరుగుతున్న ఈ నకిలీ ఉత్పత్తుల బెడదతో.... ఇటు వ్యాపారులు.. అటు సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలేదో నకిలీ ఏదో గుర్తించలేనంతగా తయారు చేసే పరాకష్ట దశకు చేరుకున్నారు నకిలీ వ్యాపారు. ఒక్కోసారి వెల తక్కువైన నకిలీ కంటే అసలు ఉత్పత్తులే నకిలీ ఉత్పత్తుల్లా వెలవెల బోతున్నాయి. కోటాను కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకొని.. భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టి తయారు చేసి బ్రాండెడ్ ముద్ర వేసుకున్న కంపెనీలు.. కుటీర పరిశ్రమగా పెట్టుకున్న నకిలీల బెడదతో... మూతబడుతున్నాయి. అందుకే ఇది భవిష్యత్ తరాలకు ఇటువంటి సమస్య రాకుండా చైనా జాగ్రత్త పడుతోంది. ఇక పై నకిలీ వస్తువులు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. అన్ని ప్రధాన పట్టణాల అధికారులకు నకిలీ ఉత్తత్తుల పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. చైనాప్రభుత్వ తీసుకున్న ఈ నిర‌్ణయం పట్ల సామాన్య పౌరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Thursday, March 15, 2012

నిప్పుల కుంపటి పై నిప్పన్ లు... వల్ల కాదని వణుకుతున్న జపనీయులు


నిప్పుల కుంపటి పై నిప్పన్ లు... వల్ల కాదని వణుకుతున్న జపనీయులు
జపాన్ పై ప్రకృతి పగ బట్టిందా... గతేడాది సునామీ మృత్యు ఘడియలను మర్చిపోక ముందే.. మరో ప్రమాద ఘంటిక మోగింది. ప్రతి రోజూ తొలి సూర్యోదయాన్ని చూసే ఈ నేల... అగ్ని శిఖలను కడుపులో దాచుకొని నిత్యం గడగడ వణుకుతోంది.. ఆ చల్లని సముద్ర గర్భంలో దాగిన బడబానలమేదో అప్పుడప్పుడు జడలు విప్పుకొని కడలిని కల్లోలం చేస్తుంది. ఈ కల్లోలం సముద్ర తీరం దాటి జపాన్ ప్రజల జీవితాలను తాకుతోంది..
సాంకేతిక పరిజ్ఞానం వినియోగించు కోవడంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన దేశం జపాన్. ఈ చిన్న దేశం నుంచి ఎన్నో రకాల నాణ్యమైన ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వస్తువులను తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది. కానీ ఇప్పుడీ దేశాన్ని ఓ పీడ కల వెంటాడుతోంది. జపాన్ దేశంలో అగ్ని పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. ఈ దేశాన్ని ఆవరించి ఉన్న సముద్ర గర్భంలో కూడా అగ్రి పర్వతాలు నిత్యం ఎగసి పడుతుంటాయి.. ఈ అగ్ని పర్వతాల సమయంలో భూ గర్భంలో ఫలకాల సర్ధుబాటుల వల్ల నిత్యం భూ కంపాలు సంభవిస్తున్నాయి.
సముద్రంలో పుట్టిన ఈ భూ కంపాల తాకిడికి సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడి తీరాన్ని దాటి భూమి పైకి ఎగబాకుతున్నాయి. దీంతో తీర ప్రాంతంలో ఉన్న పట్టణాలు జల ప్రళయంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. ఈ విలయ తాండవంలో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి
సరిగ్గా ఏడాది క్రితం... ఉన్నట్టుండి జపాన్ తీరానికి దూసుకొచ్చిన రాకాసి కెరటాలు వందలాది మందిని కబళించాయి. సముద్రంలో ఉన్న నావలన్నీ అల్లకల్లోలమయ్యాయి.. సమద్ర తీరంలో ఉన్న పట్టణాలన్నీ జలమయమయ్యాయి. ఈ కెరటాల దారిలో ఏది ఉన్న అది నేల మట్టం అయింది ఎన్నో బ్రిడ్జిలు.. వాహనాలు, భవంతులు, వృక్షాలు, జంతువులు.. ఇదీ అదీ అనే తేడా లేకుండా కెరటాల దారిలో ఏది వస్తే దాన్ని తమ ప్రవాహంలో కలుపుకున్నాయి. విలువైన వాహనాలు, వస్తువులు ఎన్నో నీళ్ల పాలయి, పనికి రాని వస్తువులుగా మారిపోయాయి. అణు కర్మాగారాల్లో నీరు జొరబడి రేడియో వికిరణాలు విడుదలవుతాయని అందరూ భయపడ్డారు. ఈ వికిరణాలు సముద్రం మార్గం గుండా పొరుగు దేశాల పై కూడా ప్రభావం చూపబోతున్నాయనే వదంతులు వ్యాపించాయి. సునామీ వేటుకు మృత్యువాత పడ్డవారు కాక బతికున్న వారు రేడియో ధార్మకత ప్రభావం వల్ల చర్మవ్యాధులతో నిత్య నరకం అనుభవించాలేమోనని గడగడ వణికారు. కానీ ఆ ప్రమాదం తృటిలో తప్పింది. అయినా జపాన్ లాంటి సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి సాధ్యమైనంత త్వరగా కోలుకుంది.


ఇప్పుడిప్పుడే జపాన్ ఆ పీడ కలల గుర్తుల నుంచి తేరుకుంటుంది.. ఆ విషాద ఛాయలను మర్చిపోయే ప్రయత్నం చేస్తోంది. సునామీ సుడిగుండంలో కోల్పోయిన తమ వారిని గుర్తు చేసుకొని... సముద్రజలానికి తమ కన్నీళ్లు జోడించి నివాళులర్పించారు. వీరి పుష్పగుచ్చాలు చూసి కడలి కెరటాలు గతాన్ని గుర్తు తెచ్చుకున్నాయోమో అన్నట్టు మళ్లీ కడలిగర్భం కంపించింది. అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ లో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.2 గా నమోదయింది. అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరిచిపోయిన భయం మళ్లీ గుబులు రేపింది. ఏడాది క్రితం చూసిన మృత్యు హేలను గుర్తు తెచ్చుకొని అప్రమత్తమయ్యారు. నిప్పల కుంపటి పై నిలుచున్న ఈ నిప్పన్ ల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని జపాన్ వాసులు భీతిల్లుతున్నారు. సునామీ రాకను ముందే గుర్తించి అధికారులు చెబుతున్నా ఏమరుపాటున ఏ రోజైనా కడలి గుప్పిట్లో కలిసిపోవలి వస్తుందేమో నని హడలిపోతున్నారు.

Wednesday, March 14, 2012

రైల్వే మంత్రి దినేశ్‌కు మమతా బెనర్జీకి ఎందుకు చెడింది..?


దినేశ్ త్రివేది... ఇప్పుడీ పేరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దినేశ్ త్రివేది అంటే రైల్వే మినిస్టర్ గానే తెలుసు. పార్లమెంట్ లో ఆయన మార్కు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టగానే మమత ఒక్కసారి కస్సుమంది. దీంతో జాతి యావత్తూ ఒక్కసారి దినేశ్ వైపు చూశారు. సొంత పార్టీ మంత్రి పై మమత బహిరంగంగా విమర్శలు చేయడం వెనుక మతలబు ఏంటనేది భేతాళ ప్రశ్న. దినేశ్ త్రివేది దీదీకి కొరకరాని కొయ్యగా మారారన్నవార్తల్లో నిజమెంత... ఇంతకీ త్రివేది ప్రస్థానమేంటి...
ఇప్పుడు రైల్వే శాఖ మంత్రిగా ఉన్న దినేశ్ త్రివేదికి... మొదటి నుంచి భిన్నమైన వ్యక్తిగానే పేరుంది.. పశ్చిమ బెంగాల్,, బరాక్‌పూర్ నియోజక వర్గం నుంచిప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్రివేది వివిధ రకాల పదవుల్లో కొనసాగారు. 1974లో ఎంబీఏ పూర్తి చేసి చికాగోలో డిటెక్స్ కంపెనీలో ఉద్యోగం చేశారు. తరువాత ఉద్యోగానికిరాజీనామా చేసి సొంత వ్యాపారంలోకి దిగారు. దీంతో బాటు వినియోగదారుల రక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా కోర్టుల్లో ఎన్నో పిటీషన్లు వేసేవారు. సమాచార హక్కు చట్టం రూపుదాల్చడం వెనుకు దినేశ్ త్రివేది పిటీషన్లు కూడా ఊతమిచ్చాయి.
త్రివేది 1980లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరినా తరువాత 1990లో జనతాదళ్ లో చేరారు. మమతా బెనర్జీ 1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించగానే టీఎమ్సీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ తొలి ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 1990 నుంచి2008 వరకు ఎగువ సభలో సభ్యులుగా ఉన్నారు. రాజ్యసభ వైస్ చైర్మన్ గా పనిచేశారు. 2009 ఎన్నికల్లో బరాక్‌పూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009 నుంచి వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో అన్నా హజారేకి మద్దతుగా మంత్రిపదవికి రాజీనామా చేయాలని
రైల్వే మంత్రిగా దినేశ్ త్రివేదికి తనకంటూ కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. రైల్వేలను పురాతన కాలపు పద్దతుల నుంచి తప్పించి ఆధునికీకరించాలనేది ఆయన అభిప్రాయం. రైల్వేలను ఆధునికీకరించ కుంటే ప్రమాదాలు నివారించలేమని ఆయన విశ్వాసం. కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రైల్వే చార్జీలు పెంచడానికి పూర్తి వ్యతిరేకమని చెబుతోంది. రైల్వేలను ఆధునికీకరించాలంటే కావలసిన నిధులను చార్జీల ధర పెంచడం ద్వారానే పొందాలని త్రివేది భావించారు. అందుకు అనుగుణంగానే పార్టీ నిర్ణయాన్ని పక్కన పెట్టి స్వల్పంగా రైల్వే చార్జీలు పెంచారు. త్రివేది తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీ అగ్రనేతకు ఆగ్రహాన్ని తెప్పించింది. మాటమాత్రం కూడా చెప్పకుండా చార్జీలు పెంచడం పట్ల భగ్గుమంది. మంత్రి చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి లేదా రాజీనామా చేయాలన్న వాదన తెరపైకి వచ్చింది. అయితే ఇది హైడ్రామానా.. లేక మమత మాటను త్రివేది పెడచెవిన పెట్టారన్న అన్న కోపమా అనే చర్చ సాగుతోంది.