ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Monday, October 17, 2011

పరాధీన ప్రేతాత్మలు




ఇక్కడ ఎన్ని మెదడు లేని దేహాలు
అబ్బా.. అన్నీ పరాధీన ప్రేతాత్మలే
ఒక్కడి మాటే వేదమంత్రం...
వశీకరణ కంటే బలమైనది
ఇది ఇంద్రజాలాన్ని మించిన మాయాజాలం
ఇది పశుపక్ష్యాదులు సిగ్గుపడే మూర్ఖత్వం
అమ్మను కూడా బలిచ్చే అత్యాశ పరులు
ఆడబిడ్డను కూడా ఆవిరి చేసే అజ్ఞానులు
కొమ్మను కూడా నరుక్కునే కౄరత్వం
ఒక్కడే సృష్టించాడా ఈ జాతిని..
ఒకేలా సృష్టించాడా ఈ నీతిని..
నిజంగా మెదడున్నా లేని దేహాలే..
పరాధీన ప్రేతాత్మలే

Friday, October 14, 2011

నెలరోజుల 'సమ్మె'ట

తెలంగాణ మొత్తాన్ని దిగ్భందం చేస్తే తప్ప తెలంగాణ రాదనే ఉద్దేశ్యంతో తల పెట్టిన సకల జనుల సమ్మె నేటికి నెలరోజులు కావస్తుంది. తెలంగాణలో సాగుతున్న సకల జనుల సమ్మె నిన్న మొన్నటి దాకా రాష్ట్రాన్నే ఇబ్బంది పెట్టింది. తాజాగా అది దేశ రాజదాన్నే చీకటి మయం చేసే స్థాయికి ఎదిగింది. సమ్మె ఇలానే కొనసాగితే దేశ ఆర్ధిక పునాదులే కదులుతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ తెలంగాణ సకల జనుల సమ్మెలో ఏం దాగుంది.. ఈ సమ్మె యావత్ దేశాన్ని కుదిపేయడం వెనుకున్న మూలాలేంటి.. ముప్పై రోజుల సకల జనుల సమ్మె పై ప్రత్యేక కథనం.


తెలంగాణ ఉద్యమం ఎంత తారా స్థాయికి చేరినా ప్రభుత్వం దిగిరావడం లేదనే ఉద్దేశ్యంతో... తెలంగాణ వాదులంతా ఏకమై సకల జనుల సమ్మెకు పిలుపు నిచ్చారు. ఉద్యోగ, కార్మిక, ఉపాద్యాయ సంఘాలన్నీ ఒక్కతాటి పైకి వచ్చి సకలం బంద్ చేసి తమ సత్తా ఏంటో ఢిల్లీకి చాటాలనుకున్నారు. గత నెల 13న ప్రారంభమైన సమ్మెలో ఎన్నో ఆటుపోట్లు... వదంతులు.. ప్రభుత్వ వ్యూహాలు.. ధిక్కారాలు.. అనధికారికంగా అణిచివేత ఉత్తర్వులు.. విభజించి పాలించే సూత్రాలు.. పరస్పర విరుద్ధ ప్రకటనలు.. అరెస్టులు.. కేసులు.. ఆఖరుకు వదంతులు.. ఇవన్నీ గత నెలరోజులుగా రాష్ట్ర ప్రజలకు వినిపిస్తున్న తాజా వార్తలు.. కళ్లారా చూస్తున్న కష్టాలు.. అనుభవిస్తున్న నష్టాలు. ఒక లక్ష్యం కోసం.. ఒక ఆశయం కోసం.. దశాబ్దాలుగా చేస్తున్న నిరీక్షణలో అంతిమ పోరుకు సిద్ధమైన తెలంగాణ ప్రజల సహనానికి నిలువెత్తు నిదర్శనం.. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరుగని ఒక సత్యాగ్రహ సంగ్రామం..

ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతం విముక్తి కోసం చేసే దశాబ్దాల పోరాటం అంతిమ దశకు చేరిందా అంటే అవునని... కాదని... సమాధానం చెప్పలేని దుస్థితి.. రాజ్యం తగలబడిపోతుంటే పిడేలు వాయించుకునే నీరోలను అనుసరిస్తున్న పొలిటికల్ హీరోలున్న రోజులివి.. నీకిస్తే నాకేంటనే రాజకీయ పద్దులు లెక్కగట్టే కాలమిది.. ఈ తరుణంలో తెలంగాణ అనే సున్నిత సమస్యను కఠినంగా ఎదుర్కొవాలనే దురాలోచన... దూరాలోచన... ఇటు ప్రజలను, అటు ప్రభుత్వాన్ని కాస్త ఇరుకున పెట్టేదనే మాట గత నెలరోజుల సమ్మె చెప్పకనే చెబుతుంది.

సకల జనుల సమ్మె హఠాత్తుగా రాత్రికి రాత్రే వచ్చి పడింది కాదు.. అలాగని ఏ ఒక్క రాజకీయ పార్టీయో నిర్ణయం తీసుకొని అమలు చేసింది కూడా కాదు.. తెలంగాణ పై తేల్చకుంటే సకలం స్థంబింప జేస్తామని అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా కాకున్న ఎవరికి వారైతే ప్రకటించారు. రూపాలు వేరైనా ఒకే రకంగా నినాదించారు.. సకల జనుల సమ్మెను మామూలు సమ్మెగా ఎదుర్కొడానికి ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. విశ్రాంత ఉద్యోగులను రంగంలోకి దింపాలని ప్రయత్నించింది. తాత్కాలిక ప్రాతిపదికన కొత్త వారిని విధుల్లోకి తీసుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు ఒకరంగంలో ఉన్న వారిని మరోరంగంలోకి మార్చి ఉపయోగించుకోవలనే ప్రయత్నం కూడా చేసింది.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరుకు సకల జనుల సమ్మె ముందు రాజ్యం తలవంచక తప్పలేదు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. తరిగిపోతున్న బొగ్గు నిల్వలు, ఎండిపోతున్న పంటలు, రోడ్డెక్కుతున్న రైతన్న, మండిపోతున్న నిత్యావసర సరుకుల ధరలు, పాఠశాలలను మరిచిపోయిన విద్యార్ధులు, రోడ్డెక్కని ఆర్టీసి బస్సు.. కదలని కరెంటు బిల్లు... ఒక్కటని కాదు.. అన్ని రంగాలపై సకల జనుల సమ్మెప్రభావం స్పష్టంగా కనిపించింది... ఆఖరుకు మద్యం డిపోల్లో కూడా సిబ్బంది బందు ప్రకటించడంతో మద్యం రేట్లు కూడా చుక్కలను వెక్కిరిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న మద్యాన్ని, బస్సులను ఉద్యమకారులు అడ్డుకోవడంతో... తెలంగాణలో సమ్మెకు వ్యతిరేకంగా ఏపని చేయాలన్నా ఇతర ప్రాంతాల వారు జంకుతున్నారు.

సకల జనుల సమ్మె ప్రభావం వల్ల సింగరెణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి.. ఇటు రాష్ట్రంతో బాటు అటు దేశంలోనూ విద్యుత్పత్తి నిలిచిపోయింది. మన రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే ప్రయత్నం చేసినా అక్కడ కూడా బొగ్గు నిల్వలు లేకపోవడంతో కేటాయించిన కరెంటునే కేంద్రం వెనక్కు లాక్కుంది. ఆర్టీసి బస్సు చక్రాలు డిపోల్లోనే నిలిచిపోవడంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడింది. డ్ర్రైవర్లు, కండక్టర్లతో సహా ఆర్టీసి సిబ్బంది మొత్తం సమ్మెకు దిగడంతో రోడ్డు పై ఆర్టీసి బస్సు అనేది కనిపించక వారాలు దాటింది. బొగ్గు పెళ్లను పెకిలించింది లేదు. . ఇతర ఉద్యోగులను ప్రలోబపెట్టి పనులు చేయించుకునే ప్రభుత్వ వ్యూహాన్ని సమ్మెలో ఉన్న ఉద్యోగులు సంఘటితంగా తిప్పి కొట్టగలిగారు. సెట్విన్ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు కూడా సమ్మెకు మద్దతిచ్చి రెండు రోజుల సమ్మె చేశాయి. రైల్ రోకోలకు భయపడ్డ ప్రభుత్వం ఏకంగా రైళ్లనే నిలిపేసింది. సచివాలయంలో ఫైళ్లు కుప్పలు కుప్పలుగా పేరుకొని పోతున్నాయి. పెన్షన్లు, రిజిస్ట్రేషన్లు, ఉపాధి వేతనాలు అన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయినా ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. వందల కోట్ల నష్టంతో బాటు ప్రజల్లో రోజు రోజుకు అసహనం పెరుగుతోంది.. తెలంగాణ వచ్చేవరకు విద్యా సంవత్సరాన్ని వదులు కోవడానికి కూడా విద్యార్ధులు వెనకాడటం లేదు.. ఉద్యోగులు, కార్మికులు ఉపాద్యాయులు జీతం రాకున్నా ఓపిక పడుతున్నారు. కాబట్టి సకల జనుల సమ్మె సామాన్యుడి పై కంటే ప్రభుత్వం పైనే ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఈ నెల రోజుల సమ్మె ఎన్ని రోజులు సాగుతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తేల్చుకోవాలని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ సమస్యను తేల్చే వరకు సకల జనుల సమ్మె విరమించేది లేదని ఉద్యోగ సంఘాలు తేల్చి చెబుతున్నాయి.

Wednesday, October 12, 2011

తెలంగాణ రహస్యం ఇదా...?

అరణ్యంలో తిరిగే ఆరుద్ర పురుగులన్నీ ఒక్కటై రేపటి పొద్దు పొడుపుకు పురుడు పోస్తనంటున్నయి. చిమ్మ చీకటిలో ఎగిరే మిణుగురులన్నీ కొమ్మ కొమ్మన చేరి చీకటిని తరమేస్తమంటున్నయి. ఇక్కడి నేలకు పోరాటాల పురిటి వాసన పోలేదు. ఇక్కడి మట్టి కణాలతో ఏ వీరుడి రక్తకణాలో పెనవేసుకొని నిత్యం కణకణ మండుతుంటయి. లోకం కోసం తనలో తాను రగిలే సూర్యుడిలా మండే ధీరుల శ్వాసలు పిల్లగాలులై ప్రసరిస్తాయిక్కడ. ఈ నేలను ఓపికతో తవ్వుకుంటూ పోతే ఊరికో దదీచి ఎముక దొరుకుతుంది. పొద్దు పొడుపును పొత్తి కడుపులో దాచుకుని పురిటి నొప్పులు పడుతున్న తల్లులు గంభీరంగా ఊపిరి బిగబడతారిక్కడ.. ఎత్తిన పిడికిళ్లు నేల పొత్తిళ్లు నిండుతుంటే... కొత్త చేతులు మొలుస్తాయిక్కడ.. గన్నేరు.. మందారం.. మోదుగుపూలు ఒక్కటై వీరమాలల్లుతాయి... ఎన్ని తరాలు అంతరించినా త్యాగంలోనే తరించే జాతి మాది.. ఇది తెలంగాణ.. రుద్రావేశంతో పెఠీల్మని ఎద తంత్రులు తెంచుకున్న కోటి రతనాల వీణ..

Tuesday, October 11, 2011

సకలం బందులో పాఠశాలలు ?

సకల జనుల సమ్మె వల్ల విద్యార్ధులు నష్టపోతున్నారని... విశాలాంధ్ర మహాసభ, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సందర్భంలో తెలంగాణ వాదుల మాత్రం తెలంగాణ వస్తుందనుకుంటే విద్యాసంవత్సరం కోల్పోవడానికి కూడా సిద్ధమేనంటున్నారు... లక్షలాధిరూపాయలు ప్రైవేట్ విద్యా సంస్థలకు డొనేషన్ల రూపంలో చెల్లించేవారు విద్యా సంస్థల యాజమాన్యాన్ని , ప్రభుత్వ అసమర్ధతను ప్రశ్నిస్తున్నారు. సకల జనుల సమ్మె... తెలంగాణ మొత్తం స్థంభిచి పోవాలనే లక్ష్యంతో.. సకల జనుల సమ్మెను తలపెట్టారు.. కానీ ప్రభుత్వ సంస్థలు తప్ప ప్రైవేట్ సంస్థలేవీ ఈ సమ్మెలో పాల్గొనడం లేదని.. అన్ని రకాల కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతుంటే విద్యార్ధులను ఈ సమ్మెలోకి లాగడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి ఇటు తెలంగాణ వాదులకు అటు విద్యార్ధుల తల్లి దండ్రులకు మద్య తీవ్ర వాగ్వాదానికి దారి తీస్తోంది.
అవును.. గత రెండు రోజుల క్రితం కూకట్ పల్లిలో ‍యన్‌ ఆర్ ఐ విద్యాసంస్థ ముందు.. పాఠశాల తెరవాలని.. సకాలంలో సిలబస్ పూర్తి చేయాలని విద్యార్ధుల తల్లి దండ్రులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న తెలంగాణ వాదులు అక్కడికి రావడంతో కొంత గందరగోళ పరిస్థితి తలెత్తింది. కావాలంటే ఉద్యమాల్లోకి మేమొస్తాం.. మా పిల్లల్ని ఉద్యమాల్లోకి లాగకండని పేరెంట్స్ మీడియా సాక్షిగా వేడుకున్నారు. ఇదంతా చూస్తూ నిలబడ్డ స్కూల్ య ాజమాన్యం మాత్రం రెండు రోజుల గడువు కోరింది.
కూకట్ పల్లి అంటే సహజంగా ఆంధ్రా సెటిలర్స్ ఉండే ప్రాంతం కనుక వారిలా మాట్లాడారని తెలంగాణ వాదుల విమర్శ. తెలంగాణలో ఎక్కడా లేనిది కూకట్ పల్లిలోనే ఈ సంఘటన జరగడం యాదృచ్ఛికమో.. లేక అక్కడ విద్యావంతులు ఎక్కువగా ఉండి పిల్లల విద్య పట్ల అధికంగా శ్రద్ధ చూపడమో ఒక కారణం కావచ్చు.. కానీ అదే సమయంలో మందకృష్ణ మాదిగ కూడా అటువంటి వ్యాఖ్యలే చేశాడు. పిల్లల చదువుల జోలికి పోకూడదని.. సమ్మె వల్ల విద్యార్ధులు విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయ కారణాలేవైనా పాఠశాల బంద్ చేస్తే విద్యార్ధులు ఇంటి వద్ద ఉండి టీవీ రిమోట్ తో ఆడుకోవడం తప్ప ఒరిగేదేమీ లేదని విద్యార్ధుల తల్లిదండ్రుల అభిప్రాయం. మిగతా వ్యాపారాలన్నీ జోరుగా సాగుతుంటే విద్యాసంస్థల బంద్ దేనికని వారి ప్రశ్న. థియేటర్లు, షాపింగ్ మాల్స్, బార్ షాపులు యధేచ్చగా వ్యాపారం చేసుకుంటుంటే అడ్డుకోని వారు విద్యాసంస్థలను తెలంగాణ వచ్చేవరకు తెరవొద్దంటూ అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. లక్షల రూపాయల డొనేషన్లు కట్టి చదివించే తాము బందుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
మంగళవారం సోమాజీగూడా ప్రెస్ క్లబ్‌లో విశాలాంధ్ర మహాసభ, హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు విశాలాంధ్ర మహాసభ సభ్చుడు నలమోతు చక్రవర్తి పరుషంగా మాట్లాడటంతో సమావేశం గందరగోళానికి దారితీసింది.
తెలంగాణ సాధన కోసం తాము ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ వాదులు ఊరూరా... వాడ వాడనా చాటుతున్నారు. విద్యార్ధులే స్వచ్ఛందంగా రోడ్డెక్కి జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో దసరా సెలవులు మగిసీ ముగియడంతోనే పాఠశాలలు తెరవాలంటూ విశాలాంధ్ర మహాసభ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ అసమర్ధతను ఎత్తి చూపడంతో ... తెలంగాణ వాదుల కోపం తారా స్థాయికి చేరింది. విషయం తెలుసుకున్న తెలంగాణ వాదులు, న్యాయవాదులు ప్రెస్ క్లబ్ వైపు దూసుకు రావడంతో పోలీసులు వారిని గేటు వద్దనే అడ్డుకున్నారు. పలుమార్లు తెలంగాణ వాదులు లోపలికి దూసుకురావాలని ప్రయత్నించడంతో ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. అదే సమయంలో తమ పై దురుసుగా వ్యవహరించిన నలమోతు చక్రవర్తి, ఆయన కారు డ్రైవర్ పై చర్యతీసుకోవాలంటూ రిపోర్టర్లు నిర్వాహకుల్ని అడ్డగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో విలేకరులకు పోలీసులకు మద్య తోపులాట జరిగింది.
రాజకీయ పార్టీలు విద్యార్ధులను ఉద్యమాల కోసం వాడుకోవడం తగదని రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అభిప్రాయ పడ్డారు. రాజకీయ పార్టీలు, ఉద్యమ నాయకులు విద్యార్ధులతో సంబంధం లేకుండానే ఉద్యమాన్ని కొనసాగించ వచ్చన్నారు. విద్యార్ధులను చదువులకు దూరంగా ఉంచడం ద్వారా లక్ష్యం నెరవేరదన్నారు.
తెలంగాణ వచ్చే వరకు సంస్థలన్నిటినీ నిలిపి వేస్తామని ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించాయి. ప్రభుత్వ ఉపాద్యాయులు కూడా ఉద్యమంలో భాగస్వామ్యం కావడంతో పాఠశాలలు మూసివేయక తప్పని పరిస్థితి. అలాగని ప్రైవేటు పాఠశాలలకు అనుమతి నిస్తే రేపు ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు వెనకబడితే నష్టం ప్రభుత్వోపాధ్యాయులకు, వారిని నమ్ముకున్న విద్యార్ధులకు అందుకే అనివార్యంగా ఇటు ప్రైవేటు, అటు ప్రభుత్వ విద్యాసంస్థలు బందులో పాల్గొనాల్సివస్తోంది. పరిస్థితి ఒక కొలిక్కి వస్తుందనుకున్న సందర్భంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరూ సంయమనంతో వ్యవహరించాలని మేథావులంటున్నారు.

మారన్ కథ జైలుకేనా...?


2జి స్పెక్ట్రమ్ కేసులో దయానిధి మారన్ పై సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఇటు కళానిధి మారన్ ఇంట్లో కూడా సిబిఐ సోదాలు నిర్వహించింది. ఎయిర్ సెల్, మ్యాక్సిన్ ఒప్పందంలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలకు సంబంధించి మారన్ సోదరుల పై ఈ సోదాలునిర్వహించారు. మరోవైపు హైదారబాద్ లో అపోలో గ్రూప్ డైరెక్టర్ సునితా రెడ్డి కార్యాలయంలో కూడా సిబిఐ సోదాలు నిర్వహించింది. దీంతో 2జి కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇంతకీ 2జి కుంభకోణం అంటే ఏంటి.. 2జి స్పెక్ట్రం కేసులో ఎవరెవరి పై ఆరోపణలొచ్చాయి. అసలేంటీ 2జి కథ.. ఒకసారి అవలోకిద్దాం..
దేశరాజకీయాలను ఓ కుదుపు కుదిపిన 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం డొంక కదులుతూనే ఉంది. ఈ కుంభకోణానికి సంబంధం ఉన్న ప్రజాప్రతినిధులంతా ఒక్కొక్కరే చెరసాల చెంతకు చేరుకుంటున్నారు. ఇప్పటికే రాజా, కనిమొళిలు జైలు భోగాలు అనుభవిస్తుంటే ఆ జాబితాలోకి మారన్ సోదరులు కూడా చేరనున్నట్టు వార్తలొస్తున్నాయి. మారన్ సోదరులను ఇప్పటి వరకు అరెస్టు చేయనప్పటికీ ఇరువురు సోదరుల పై సిబిఐ కేసులు నమోదు చేసింది.
రాజా, కనిమొళితోనే ఈ కథ కంచికి చేరిందనుకున్నారంతా.. ఆ మధ్య మారన్ కు క్లీన్ చిట్ ఇచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆ వెంటనే ఆ వార్తలను సిబిఐ ఖండించడం వెనుక అంతరార్ధం ిఇప్పుడు భోదపడుతోంది. దయానిధి మారన్ కమ్యునికేషన్ల శాఖ మంత్రిగా ఉన్నపుడు ఎయిర్ సెల్, మాక్సిన్ సంస్థల లైసెన్స్ వ్యవహారంలో పక్షపాతంగా వ్యవహరించారనే అపవాదు మూట గట్టుకున్నారు. టెలికామ్‌ అధికారుల నుంచి ఏకగ్రీవ సిఫారసులు ఉన్నప్పటికీ, మారన్‌ ఎయిర్‌సెల్‌ ఫైల్‌ను తొక్కిపెట్టినట్లు సీబీఐ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ఎయిర్‌సెట్‌ పట్ల ఒత్తిడి తెచ్చే వైఖరిని మారన్‌ అనుసరించినట్లు కూడా నివేదికలో పేర్కొంది. కంపెనీలో కొంత వాటాను మాక్సిస్‌ సంస్థకు విక్రయిం చాల్సిందిగా ఎయిర్‌సెల్‌ చీఫ్‌పై మారన్‌ ఒత్తిడి తీసుకు వచ్చినట్లుగా తమ విచారణలో తేలినట్టు సీబీఐ తన నివేదికలో తెలిపింది. దయానిధి మారన్‌ వ్యూహాల వల్లనే ఆయన సోదరుడు కళానిధికి చెందిన సన్‌ టీవీ రూ.750 కోట్ల మేరకు లబ్ధి పొందినట్లు సీబీఐ వర్గాలు గతంలోనే వెల్లడించాయి. ఎయిర్‌సెల్‌లో తన వాటాను కళానిధికి విక్రయించాల్సిందిగా దయానిధి తనపై ఒత్తిడి తీసుకువచ్చి నట్లు ఎయిర్‌ సెల్‌ వ్యవస్థాపకుడు శివశంకరన్‌ గతంలోనే ఆరోపించారు.
ఈ కుంభకోణంలో చిదంబరం పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వచ్చిన నేపద్యంలో 2జి కేసు పై మరింత ఆసక్తి నెలకొంది. వివిధ కారణాల వల్ల కాస్త జాప్యం జరిగినా తిరిగి తెర పైకి వచ్చింది. తాజాగా మారన్ సోదరుల పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో మారన్ సోదరుల పై అరెస్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. హైదరాబాద్ అపోలో డైరెక్టర్ సునితా రెడ్డి కార్యాలయాల పై సిబిఐ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ఉచ్చు ఇంకా ఎందరు ప్రముఖుల మెడుకు చుట్టుకోనుందోనన్న ఆసక్తి నెలకొంది.

Saturday, October 1, 2011

బతుకమ్మ పేదోళ్లదా...? పెద్దోళ్లదా..? నిజాలేంటి..?


బతుకమ్మ పండుగకు మూలాలెక్కడ.. బతుకమ్మకు జీవం పోసిందెవరు... ఇప్పుడైతే అన్ని వర్గాల ప్రజలు బతుకమ్మను ఆడుతున్నారు. గతంలో కూడా బతుకమ్మ అందరి బతుకమ్మేనా.. బతుకమ్మకు పూలకు సంబంధం ఏమిటి.. బతుకమ్మ కథల్లో నిజమెంత.. స్పెషల్ స్టోరీ..
బతుకమ్మ.. వెల్లివిరిసిన పూల సంబరం. నడిచొచ్చిచ్చే పూవనం.. మంచు తడికి మురిసిపోయే పూల కొమ్మలు పడుచుల కొనగోటిని తాకే తరుణం.. తడిగాలుల్లో తేనె పరిమళం పరుచుకునే పూలరుతువు.. మత్తడి దునికే నీళ్లతో చిత్తడిగా మారిన నేల పొత్తిళ్లను పొదివి పట్టుకునే పూరెమ్మల గారాబం.. వర్షరుతువుకు.. శీతాకాలానికి నడుమ ఆహ్లాదబరిత పరిమళాలు వెదజల్లే సుమస్మమ్మోహనం.. ఈ రుతువులోనే ఎన్నో ప్రకృతి కార్యాలకు పునాదులు పడతాయి. ఈ రుతువే ఎన్నో వాతావరణ మార్పులకు బీజం వేస్తుంది.. ఈ వాతావరణమే ఎన్నో ఉత్పరివర్తనాలకు పునాది వేస్తుంది.. చంటిపిల్లను చంకనెత్తుకున్న చందంగా పూలుగుత్తులను ఎత్తుకున్న తంగేడు మొక్కలు.. అడవి పడుచు శిగలో తురుముకున్న కొండ మల్లెల్లా... కొండకోనల్లో వయ్యారంగా నడుస్తున్న కోయ పడుచుల్లా... గాలికి ఊగుతున్న గునుగు పూలు.. ఎంత వర్ణించాలన్నా ఈ రుతువులో కనిపించే ప్రకృతి అందం మాటలకు చాలదు. ఈ సుమతాడన స్పర్శతో మగువ మునివేళ్లు కొత్త అనుభూతితో పొంగిపోతాయి.
మనుషులకు కులాలు మతాలు, కట్టుబాట్లు ఉంటాయి.. నింగి, నేల, ఆకాశం అగ్ని, వాయువు పంచభూతాలకు ఏ కట్టుబాట్లు తారతమ్యాలు లేవు. అలా అని చాటి చెప్పేందుకే బతుకమ్మ పండుగలో పదం పదం.. పాదం పాదం కలిపి ఆటపాటల్లో పాల్గొంటారు. అయితే ఈ పండుగను తెలంగాణ జాతి మొత్తం జాతీయ పండుగలా జరుపుకుంటున్నా.. ఒకప్పుడు ఇది కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమనే వాదనలు కూడా ఉన్నాయి. . బతుకమ్మ పుట్టుకకు కారణమైన పురాణగాథలు చాలానే ఉన్నా.. అసలు కారణం మాత్రం ఒక్కటేనని పరిశోధకులు అభిప్రాయం.. విజ్ఞానం అంతగా అభివృద్ది చెందని రోజుల్లో ప్రసూతి మరణాలు అధికంగా జరిగేవి.. వివిధ రకాల కారణాల వల్ల పిల్లలు పురుటిలోనే చనిపోయేవారు.. పుట్టిన పిల్లలు వరసగా చనిపోతుంటే.. తర్వాత పుట్టిన సంతానం తమది కాదన్నట్టు.. పెంటకుప్ప పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.. అలా పెంటకుప్ప పై శిశువును వదిలితే ఆ తమది కాదని దుష్టశక్తులు వదిలేస్తాయని పూర్వికుల నమ్మకం. పెంటకుప్ప పై చాటలో పెట్టిన శిశువులు కొందరు కాకతాళీయంగా బతికారు.. అటువంటి వాళ్లకు పెంటయ్య, పెంటమ్మ అనే పేర్లు కూడా పెట్టారు. కాస్త సంపన్న వర్గమైతే మరీ పెట్టకుప్పమీద పెట్టకుండా కాసిన్ని పూలు, ఆకులు ఒక్కచోట చేర్చి దాన్నే చెత్త కుప్పగా భావించి శిశువును పూలదిబ్బ పై పడుకోబెట్టేవారు. పూలదిబ్బ పై పడుకోబెట్టిన శిశువు అదృష్టవశాత్తూ బతికినందువల్ల.. ఆ పూల దిబ్బనే బతుకమ్మ అన్నారు.. అంతేకాదు. పూలదిబ్బ పై పడుకోబెట్టిన శిశువు ఏడుస్తుంటే మహిళలంతా చుట్టూ చేరి ఊయల పాటలు పాడేవారు.. తమ శిశువును కాపాడినందు వల్ల ఆ పూలదిబ్బకు మహిహలున్నాయని.. ఆ పూలకుప్పే తమ ఇలవేల్పని భావించి గౌరమ్మను చేర్చి పూజించడం అనాదిగా ఆనవాయితీగా వస్తోంది..
ఇంతకీ బతుకమ్మ పేదల పండుగా.. పెద్దోళ్ల పండుగా.. అనే వాదన ఎదురయినపుడు దీన్ని పేదల పండుగ అనే ఎక్కువ మంది వాదిస్తారు. ఎందుకంటే ఈ పండుగ పుట్టుకలోనే పేదతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. బతుకమ్మ కోసం బొడ్డెమ్మను పుట్టమన్నుతో చేస్తారు. బతుకమ్మను అడవిపూలతో పేరుస్తారు.. కాబట్టి ఏ ఖర్చూ ఉండదు.. అంతేకాకుండా.. గౌరమ్మను పూజిచేందుకు ఏ మంత్ర తంత్రాలూ వాడరు.. కేవలం పాటలతోనే ఆదిశక్తిని స్తుతిస్తారు. ముగ్గులు, పూలు, పాటలే ఈ బతుకమ్మ ఖర్చులు.. బతుకమ్మకు పెట్టే ప్రసాదం కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకొన్నది.. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇంట్లో ఉన్న నానబెట్టిన బియ్యం, పాలు, అటుకులు, బెల్లం ఇవే ప్రసాదాలు.. సంపన్న వర్గం చేసుకునే వేడుకలకు చక్కర పొంగలి, నూనెతో చేసే పిండి వంటలు, దేవుడి కళ్యాణం, ఆ కళ్యాణానికి మంత్రాలు, వంటి రకరకాల తంతులుంటాయి.. బతుకమ్మ వేడుకల్లో ఇవేవీ ఉండవు. అందుకే బతుకమ్మ పేదల పండుగ అని చాలా మంది వాదిస్తారు.
బతుకమ్మ పండుగకున్న విశిష్టత మరోటి ఉంది.. వర్షరుతువులో కురిసిన వానలన్నీ చెరువుల్లో చేరుతాయి. ఆ నీటిలో రకరకాల మలినాలు చేరి కలుషితంగా తయారవుతాయి. ఈ కలుషిత నీటిని తంగేడు పూలు శుద్ధి చేస్తాయి. తరువాత కలరా వంటి వ్యాధులు వ్యాపించకుండా గునుగు పూలు అరికడతాయి. పూర్వకాలంలో సంపన్న వర్గాలకు ఇళ్లలో బావులుండేవి.. వాటిలో పంచాయితీ బ్లీచింగ్ పౌడర్ వేసేవారు. కానీ పేద ప్రజలకు బావుల్లో నీటికి ప్రవేశం లేదు. అందుకే వారు మంచినీటికోెసం కుంటలు, చెరువులను ఆశ్రయించాల్సి వచ్చింది. తాము మంచినీటి కోసం వాడే చెరువులు కాబట్టి వారే వాటిని శుద్ధి చేసుకునేవారు. వాడవాడంతా కలిసి తంగేడు గునుగు పూలతో బాటు గౌరమ్మగా పేర్చిన పసుపును కుంటలు చెరువుల్లో కలపడం ద్వారా నీరు శుద్ది అవుతుంది..
కాలక్రమంలో పూలకుప్పగా పూజలందుకున్న బతుకమ్మ కాస్త అనేక రూపాలు మార్చుకొని ఇప్పుడు తెలంగాణ జాతి యావత్తూ జరుపుకునే సంబరంగా మారింది. పుక్కిటి పురాణాలను పక్కన బెట్టి బతుకమ్మ పండుగలో ఉన్న ఔచిత్యాన్ని చూడాలి.. పదిమందిని ఒక్కటి చేసే పూలజాతరను ప్రోత్సహించాలి.. ఆడపడుచులకు అనధికార కౌన్సిలింగ్ కేంద్రాలుగా మారిన బతుకమ్మలను పేర్చే ఇళ్లు సంసారాలను చక్కబరుస్తున్నాయి.. వాదాలు వివాదాలు మాని బతుకమ్మ సంస్కృతిని దేశం మొత్తం ఆచరించే విధంగా తీర్చిదిద్దాలి..