ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, September 7, 2011

హర్కత్ ఉల్ జీహాద్ అల్ ఇస్లామీ... (హుజీ) రక్త చరిత్ర



పట్టపగలు ఢిల్లీ హైకోర్టు వద్ద కారు బాంబును పేల్చింది తమ సంస్థ సభ్యులేనని హర్కత్‌ ఉల్‌ జిహాద్‌ అల్‌ ఇస్లామీ (హుజీ) సంస్థ దేశంలోని పత్రికలు, న్యూస్‌ చానల్స్‌ కార్యాలయాలకు ఫ్యాక్స్‌లో పంపిన లేఖలో ప్రకటించింది.పాకిస్తాన్‌ కి చెందిన ఈ సంస్థ సభ్యులు బంగ్లాదేశ్‌ ద్వారా మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సంస్థకు మన దేశంలోని అన్ని నగరాల్లో స్లీపర్‌ సెల్స్‌ ఉన్నాయి. స్థానికులు ఇచ్చే ఆశ్రయం, అందించే సహాయ సహకారాలోతేనే ఈ సంస్థ తన కార్యకలాపాలను నిరాటంకంగా సాగిస్తోంది. హుజీ ఎప్పుడు పుట్టిందో ఖచ్చితమైన సమాచారం ఏదీ లేకపోయినప్పటికీ, సోవియట్‌ ఆఫ్ఘన్‌ యుద్ధ సమయంలో ఈ సంస్థ ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థకు ఖ్వాజీ సైఫుల్లా అఖ్తర్‌, ఆయన అనుచరులు మౌలానా ఇర్షాద్‌ అహ్మద్‌,మౌలానా అబ్దుస్‌ సమద్‌ సియాల్‌లు పునాదులు వేశారు.వీరంతా పాక్‌లోని కరాచీకి చెందిన వారు. అప్పట్లో ఈ సంస్థను జామియాత్‌ అన్సరుల్‌ ఆఫ్ఘనీన్‌ అనే పేరుతో పిలిచేవారు. ఆఫ్ఘన్‌ యుద్ధానంతరం అది హుజీగా పేరు మార్చుకుంది.భారత్‌లోని జమ్ము కాశ్మీర్‌ లోని ముస్లింలు జరిపే పవిత్ర యుద్ధానికి (జిహాద్‌కి) మద్దతు ఇవ్వడం ప్రధాన లక్ష్యంగా ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
1989లో ఆఫ్ఘన్‌ నుంచి సోవియట్‌ దళాలు ఉపసంహరణ తరువాత పాకిస్తాన్‌కే చెందిన మరో ఉగ్రవాద సంస్థ హర్కత్‌ ఉల్‌ ముజాహిద్దీన్‌తో కలిసి కార్యకలాపాలను ముమ్మరం చేసింది. జమ్ము,కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించేందుకు హర్కత్‌ ఉల్‌ అన్సార్‌ అనే సంస్థను ఇవి ప్రారంభించాయి. ఈ సంస్థను 1997లోనే అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.కొన్ని ప్రాంతాల్లో ఈ సంస్థ హర్కత్‌ ఉల్‌ ముజాహిద్దీన్‌ పేరిట పని చేస్తూ వచ్చింది. బంగ్లాదేశ్‌ కేంద్రంగా హుజీ-బి ఏర్పడింది. హుజీ సంస్థ ఇస్లాంలో దేవబంద్‌ ఆలోచనా విధానానికి చెందిన తీవ్ర వాద సంస్థ. ఇస్లాం ధర్మ పరిరక్షణ కోసం పవిత్ర యుద్ధం సాగించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ నుంచి ఈ సంస్థ సభ్యులు ఉత్తేజాన్ని పొంది తమ కార్యకలాపాలను విస్తృతం చేశారు. భారత్‌లో హుజీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా నిమితులైన బషీర్‌ అహ్మద్‌ మీర్‌ 2008 జనవరి 25వ తేదీన జమ్ము కాశ్మీర్‌లోన దోడా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.అంతకుముందు సంవత్సరం అతడు ఉత్తర, ఆగ్నేయ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులకు పిలుపు ఇచ్చాడు. పర్యవసానంగానే రాజస్థాన్‌లోని ఆజ్మీర్‌ షరీఫ్‌పైనా,ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ బాంబు దాడులు జరిగాయి. అలాగే,హుజీ సంస్థకు చందిన షాహిద్‌ బిలాల్‌ అనే పాక్‌ జాతీయుడు కూడా భారత్‌లో పెక్కు దాడులను పురికొల్పాడు.2007 ఆగస్టు 30వ తేదీన కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో అతడు మరణించాడు.అయితే, అతడు బతికే ఉన్నాడానీ, కరాచీ, ఢాకాల మధ్య తిరుగుతూ హుజీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. హైదరాబాద్‌కి చెందిన బిలాల్‌ 2002లో బంగ్లాదేశ్‌కి పారిపోయాడు. హైదరాబాద్‌కి చెందిన అనేక మంది యువకులను అతడు తమ సంస్థలో చేర్పించాడు.మక్కా మసీదు పేలుళ్ళకేసులో అతడి పేరు కూడా ప్రస్తావనకు వచ్చిందిత. అతడు 2002-03లో సౌదీ అరేబియా వెళ్ళి అక్కడ శిక్షణ పొందాడు.హైదరాబాద్‌లోని మూసారాం బాగ్‌కి చెందిన బిలాల్‌ 2005లో హైదరాబాద్‌ తిరిగి వచ్చాడు. గుజరాత్‌ హోం మంత్రి హరేన్‌ పాండ్య హత్యకేసులో నిందితులతో అతడికి సంబంధాలు ఉన్నాయి. అలాగే, ఈ సంస్థకు చెందిన ఇతర నాయకులకు భారత్‌లోని వివిధ నగరాల్లో ఆశ్రయం ఇచ్చే వారు ఉన్నారు. స్థానిక యువకులకు మంచి ఆదాయం ఆశ జూపి హుజీ సంస్థలోకి రిక్రూట్‌ చేయించడం వీరి కార్యకలాపాల్లో ముఖ్యమైనది.
20 దేశాలకు విస్తరణ
హుజీ సంస్థ కార్యకలాపాలు 20 పైగా దేశాలకు విస్తరించాయి. 2005లోనే ఈ సంస్థ కార్యకలాపాలు భారత్‌, చెచెన్యా, ఉజ్బెకిస్థాన్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, తజికిస్తాన్‌, ఇరాన్‌, మలేసియా, ఫిజీ, అమెరికా, ఇంగ్లాండ్‌లతో సహా 24 దేశాలకు విస్తరించినట్టు సమాచారం ఉంది. 2007 ఫిబ్రవరిలో జరిగిన సంర&°తా ఎక్స్‌ప్రెస్‌ పేలుడు సంఘటనలో కూడా హుజీ పాత్ర ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సంవత్సరం మే 25వతేదీన హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్‌లోనూ, కోఠీలోని గోకుల్‌ చాట్‌లోనూ సంభవించిన పేలుళ్ల వెనుక కూడా హుజీ హస్తం ఉంది. అలాగే, 2008 మే 13వ తేదీన జైపూర్‌లో వరుస పేలుళ్ళ సంఘటనతో కూడా హుజీకి ప్రమేయం ఉంది.2007 మే 18వ తేదీన హైదరాబాద్‌లోని మక్కా మసీదు పేలుళ్ళ కేసులో కూడా హుజీ పాత్ర ఉంది.2007 వారణాసి, ఫైజాబాద్‌, లక్నోలలో జరిగిన పేలుళ్లలో హుజీకి సంబంధాలు ఉన్నాయి. హుజీకి చెందిన స్లీపర్‌ సెల్స్‌ ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లతో సహా పెక్కు రాష్ట్రాల్లో పని చేస్తున్నాయి. పాకిస్తాన్‌ రహస్య గూఢచార సంస్థ ఐఎస్‌ఐతోనూ, తాలిబన్‌, అల్‌ ఖైదా వర్గాలతోనూ హుజీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే, పాక్‌ కేంద్రంగా పని చేసే లష్కర్‌ ఎ తోయిబా, జైష్‌ ఎ మహ్మద్‌ తదితర సంస్థలతో కూడా సంబంధాలు ఉన్నాయి. హుజీని అమెరికా విదేశాంగ శాఖ 2008 మార్చిలో ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.ఆ సంస్థకు వివిధ బ్యాంకుల్లోని ఖాతాల్లోని నిధులను స్తంభింపజేయాల్సి ఉంది. కానీ, ఎక్కడికక్కడ స్థానికుల సహాయంతో ఆ సంస్థ తన కార్యకలాపాలను నిరాఘాటంగా కొనసాగిస్తోంది.

Monday, September 5, 2011

గాలి కేసులు ఇవే...!


అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారంటూ అరెస్టు చేసిన గాలి సోదరుల పై 8 రకాల కేసులు నమోదు చేసింది.. నేరపూరితంగా కుట్ర చేయడం, మోసం చేయడం, అటవీ సొమ్మును ధ్వంసం చేయడం వంటి పలు కేసుల్లో అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. మైనింగ్ మాఫియా గాలి జనార్దన్ రెడ్డి పై ఓబుళా పురం అక్రమాలకు సంబంధించన ఆరోపణల నేపద్యంలో సిిబిఐ మొత్తం 8 రకాల కేసులు నమోదు చేశారు.
ఐపిసి సెక్షన్ 120బి కింద నేరపూరిత కుట్ర కేసు చేసినట్టగా కేసు నమోదు చేశారు.. దీంతో బాటు మోసం చేసినందుకు ఐపిసి 420... చోరీ సొమ్మును స్వీకరించినందుకు ఐపిసి 411 కింద, ప్రభుత్వాస్తులను ధ్వసం చేసినందుకు గానీ ఐపీసి 427.. ఇతరులకు చెందిన ఆస్తుల్లోకి అక్రమంగా ప్రవేశించిన నేరానికి ఐపిసి 448 లు నమోదు చేశారు.. వీటితో బాటు.. అటవీ చట్టం ప్రకారం నిషిద్ద ప్రాంతంలో ప్రవేశించి అటవీ సంపదను ధ్వంసం చేసినందుకు గానూ సెక్షన్ 26 కూడా నమోదు చేశారు.. అక్రమాలకు సహకరించిన అధికారుల పై అవినీతి నిరోదక చట్టం 13బై1 కూడా చేర్చింది.. వీటితో బాటు మినరల్స్, మైనింగ్ చట్టాలకు సంబధించిన కేసులను కూడా అన్వయిస్తారు.
ఈ కేసులను 2009లోనే నమోదు చేసినా గాలి జనార్దన్ రెడ్డి కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడంతో.. అప్పటికి తాత్కాలికంగా తెరపడింది. తాజాగా లోకాయుక్త నివేదికను అనుసరించి సిబిఐ స్టేను వెకేట్ చేయించి గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసింది..

Sunday, September 4, 2011

ఎవరీ గాలి సోదరులు..? గాలివాటం...


అక్రమ గనుల తవ్వకంలో అరెస్టయిన గాలి సోదరుల మైనింగ్ మాఫియా గా ఎలా ఎదిగారు.. అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టిన గాలి సోదరులు కోట్లకు ఎలా పడగలెత్తారు... చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి దివాళా తీసిన గాలి సోదరులు కర్నాటక రాజకీయాల్లో కింగ్‌మేకర్ లా ఎలా మారారు. తమను పొలిటికల్‌గా జన్మనిచ్చిన పార్టీ ఇబ్బంది పడే పరిస్థితులెందుకొచ్చాయి... ఇంతకీ గాలి సోదరుల పొలిటికల్ ప్రొఫైల్ పై హెచ్ ఎం టీవీ స్పెషల్ స్టోరీ.
గాలి సోదరులు... తక్కువ కాలంలో గల్లీ రాజకీయల నుంచి ఢిల్లీ రాజకీయలను శాసించే స్థాయికి ఎదిగిన నేతలు.. రెండు రాష్ట్రాల రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్న గాలి బ్రదర్స్ ప్రస్థానంలో ఎన్నో మలుపులు.. వారికి ఈ లైమ్ లైట్ ఓవర్ నైట్ లో ఆయాచితంగా వచ్చింది కాదు..
సాధారణ కానిస్టేబుల్ కుటుంబం నుంచి పుట్టిన గాలిసోదరులు.. వీరిలో పెద్ద సోదరుడి పేరు గాలి కరుణాకర్, రెండవ వాడు జనార్దన్ రెడ్డి, ఆఖరు వాడు సోమశేఖరురెడ్డి. వీరు బతుకు దెరువు కోసం బళ్ళారి రోడ్ల పై తిరిగిన రోజులే ఎక్కువ.. టూ వీలర్ పై తిరుగుతూ బతుకుదెరువు కోసం వెతుకులాటలో ఎన్ని గడపలో ఎక్కి దిగారు... 1998లో లో ఎన్నోబుల్ సేవింగ్ అండ్ ఇన్వేస్ట్‌మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి ఇబ్బందులు పడ్డారు. ఈ కంపెనీ పెట్టి 200 కోట్లకు మోసం చేశారన్న ఆరోపణలు రావడంతో మళ్లీ ఇబ్బందులెదుయ్యాయి.. 1999లో మైనింగ్ రంగంలో అడుగు పెట్టిన గాలి సోదరులకు కాస్త కలిసొచ్చే రోజులు వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో.. బళ్లారిలో సోనియా గాంధీ తన ప్రాభవాన్ని చాటుకుంటున్న తరుణంలో ఎప్పటికపుడు సుష్మాస్వరాజ్ సోనియాకు చెక్ పెడుతూ వచ్చింది. సరిగ్గా అదే సమయంలో సుష్మా స్వరాజ్ దత్తపుత్రుడిగా పిలుచుకొనే శ్రీరాములు గాలి బ్రదర్స్ ను పొలిటికల్ స్క్రీన్ పైకి తెచ్సారు. సుష్మా స్వరాజ్ అండ దండలతో బిజేపీ పార్టీ పటిష్టతకు గాలి బ్రదర్స్ సర్వశక్తులు ఒడ్డారు. దీంతో కర్నాటక రాజకీయాల పై గట్టి పట్టు తెచ్చుకోగలిగారు..
కర్నాటక రాజకీయాల పై గాలి సోదరుల తొలి ప్రభావం బళ్లారి మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలతో ప్రారంభమయింది. ఈ ఎన్నికల్లో బిజేపీ ఘన విజయం సాధించింది. ఈ విజయం వెనుక గాలి సోదరుల ప్రభావాన్ని అధిష్టానం గుర్తించింది. ఆ తరువాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గాలి సోదరుల ప్రభావం కనిపించింది.. బళ్లారి లోక్ సభ స్థానంలో 1952 నుంచి గెలుస్తూ వస్తున్న అభ్యర్థి పైగాలి కరుణాకర్ రెడ్డి గెలిచారు.. గాలి సోదరుల రాజకీయ వ్యూహాలతో కర్నాటకలో భారతీయ జనతా పార్టీకి కొత్త జీవం వచ్చింది. కర్నాటకలో జిల్లాల నుంచి గల్లీల వరకు గాలి ప్రభావం పాకింది.. రాజకీయంగా తమకంటూ బలమైన పునాదులు వేసుకున్నారు.
ఒకపక్క రాజకీయంగా ఎదుగుతూనే మరో పక్క అదే పలుకుబడిని ఉపయోగించుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించ సాగారు.. అంతర్జాతీయంగా ఇనుప ఖనిజం ఎగుమతుల్లో గాలి సోదరులు తమ కంటూ ప్రత్యేక స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఓబుళాపురం మైనింగ్ అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించింది.. ఇది బళ్లారి సరిహద్దుల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోకి కూడా చొచ్చుకొచ్చింది. ఈ కంపెనీకి శ్రీరాములు మేనేజింగ్ డైరక్టర్. చైనా తన ఇన్‌ఫ్రా స్టక్చర్ కోసం గాలి సోదరుల ఐరన్ ఓర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడంతో.. ఓబుళాపురం తవ్వకాలు ఊపందుకున్నాయి. లక్షల్లో ఉన్న వ్యాపారం వందల కోట్లకు చేరింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం గాలి బ్రదర్స్‌కు కావలసిన సహాయ సహకారాలు అందించడంతో రెండు రాష్ట్రాల్లో ఐరన్ ఓర్ వ్యాపార సామ్రాజ్యానికి ఎదురులేని నేతలుగా ఎదిగారు.. తమకంటూ సొంత హెలికాప్టర్ కొనుగోలు చేశారు. ఈ హెలికాప్టర్ తరచూ పార్టీ కార్యకలాపాలకు కూడా వాడేవారు.
గాలి సోదరుల మైనింగ్ పై అనేక ఆరోపణలు వచ్చాయి... అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారని రాజకీయ పార్టీలు దుమారం రేపాయి. మైనింగ్ వ్యాపారం నుంచి మైనింగ్ మాఫియాగా ఎదిగిన వ్యాపార సామ్రాట్టులను కదిలిస్తే రెండు రాష్ట్రాల రాజకీయ పునాదులే కదిలేలా పాతుకుపోయారు. కర్నాటకలో బిజేపీ పార్టీలో ఉంటూనే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉండటం గాలి బ్రదర్స్ కే చెల్లింది.. పేద కుటుంబం నుంచి రాజకుటుంబం స్థాయికి ఎదిగిన బళ్లారి సోదరుల జీవతం బంగారు మయంగా మారింది.
గాలి అక్రమ గనుల వ్యవహారం వల్ల కర్నాటకలో ప్రభుత్వాలే ఒడిదుడుకుల్లో పడాల్సి వచ్చింది.. గాలి వ్యాపారం యడ్యూరప్ప పదవికి ఎసరు పెట్టింది. అక్రమాల పై వేసిన లోకాయుక్త కమిటీ గాలి వ్యవహారం పై పూర్తిస్థాయి వివరాలు సేకరించి తన నివేదికలో పొందుపరిచింది. లోకాయుక్త నివేదికలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి.
గాలి జనార్దన్ రెడ్డి బంగారం కుర్చీలోనే కూర్చుంటారు. దాని ఖరీదు 2.2 కోట్ల రూపాయలు. బంగారంతో తయారు చేసిన విగ్రహాలకు పూజలు చేస్తారు. వాటి విలువ రూ. 2.28 కోట్లు. రూ. 13.15 లక్షల విలువ చేసే బెల్టు ధరిస్తారు. గాలి జనార్దన్ రెడ్డి జీవితమంతా స్వర్ణమయమే. బంగారు పళ్లెంలోనే తింటారు. గిన్నెలు, చెంచా, ఫోర్కు, కత్తి అన్నీ బంగారంతో చేసిన వాటినే ఉపయోగిస్తారు.. వీటి విలువ లక్షల్లో ఉంటుందని అంచనా
సాదాసీదా జీవితం నుంచి వేల కోట్ల రూపాయలకు పడగలెత్తిన గాలి సోదరుల పై ఎన్నో సార్లు ఐటి దాడులు జరిగాయి.. తాజాగా సిబిఐ దాడితో గాలి వ్యాపార సామ్రాజ్య లోగుట్టు మరింత తెలిసే అవకాశం ఉంది..

Saturday, September 3, 2011

ఇక్కడ ప్రశ్నిస్తే... చంపేస్తారు..


మనది ప్రజల చేత.. ప్రజల వలన.. ప్రజల కొరకు ఏర్పడ్డ ప్రజాస్వామ్యం.. ఇది కేవలం ప్రజాశ్రేయస్సుకే పనిచేస్తుంది.. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.. ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛకు గౌరవం ఉంది.. అందరికీ సమాన హక్కులు కల్పించే అతిపెద్ద రాజ్యాంగం.. కానీ ఇవన్నీ మనం చదువున్న పాఠ్య పుస్తకాల్లోనే.. నిజ జీవితంలోకి అడుగు పెట్టామా.. లేదా ఒక్కసారి భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారా.. అప్పుడు తెలసుస్తుంది అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం యొక్క నిజస్వరూపం.. దానికి రుజువులివిగో
మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.. ఎవరు ఎక్కడైనా బతకొచ్చు. ఎక్కడైనా అడుక్కోవచ్చు.. కావాలంటే స్మగ్లింగ్ చేసి బతకొచ్చు.. హత్యలు చేసి బయటకు రావచ్చు.. నేర చరిత్ర ఉన్నా చట్ట సభల్లో కుర్చీలిరగ్గొట్టొచ్చు. కానీ పాలక పక్షాన్ని పల్లెత్తు మాట అన్నారా.. హక్కుల పేరుతో గళమెత్తారా.. లేదా అవినీతి అంటూ జబ్బలు చరిచారా.. ఇక మీకు నూకలు చెల్లినట్టే.. అయితే ఈ వైకరి స్వాతంత్ర్యం రాక మునుపు నుంచి, స్వాతంత్ర్యంలాంటిది వచ్చాక కొనసాగి, గత దశాబ్ద కాలంగా వేగంగా జరుగుతున్న విపరీత పరిణామాలే దీనికి సాక్ష్యం..
పేరు ఏదైనా కావచ్చు.. బినాయక్ సేన్.. జితేన్ మరాండీ.. రాందేవ్ బాబా.. కేజ్రీవాల్.... ఈ పేర్లు ఈ మద్యకాలంలో తరచూ పత్రికల్లో వినిపింస్తున్నాయి.. వీళ్లందరి సిద్ధాంతాలు వైరైనా... దారులు వేరైనా లక్ష్యం ఒకటే.. దోపిడిని నివారించడం. కాగితాల్లో ఉన్న ప్రజాసంక్షేమం సామాన్యుడి గుమ్మం ముందుకు రావలన్నదే ధ్యేయం.. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుబాటులో ఉండాలనేదే వీరి వాదన.. ఇందులో కొందరికి సిద్ధాంతాలతో పనిలేదు.. రాద్దాంతాలతో పనిలేదు.. వారిపని వారు చేసుకుపోతారు.. బినాయక్ సేన్ లాంటి వాళ్లు కేవలం వైద్య సహాయంతోనే ప్రజలకు చేరువవుతారు.. జితేన్ మరాండి లాంటి వ్యక్తులు తమ గళంతో ప్రజలకు దగ్గరవుతారు.. రాందేవ్ బాబా, హజారే, కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు జాతి ప్రయోజనాలు కాపాడే వాక్పటిమతో దగ్గరవుతారు.. కానీ వీరందరూ ప్రజలతో మమేకమై ప్రజాభిమానం చూరగొంటే తప్పులేదు.. ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవాలే గానీ ప్రజల్ని ప్రభుత్వం మీదకు ఉసిగొల్పకూడదు. తీవ్రవాదం పేరుతో గిరిజనుల పై జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించకూడదు.. ప్రభుత్వం నియమించిన ప్రైవేట్ గూండాలను వ్యతిరేకించ కూడదు.. అభివృద్ది పేరుతో అడవులను నరికి గిరిజనుల కాళ్లకింద పొదగి ఉన్న ఖనిజాలను కొల్ల గొట్టడాన్ని ప్రశ్నించకూడదు.. ప్రపంచ దేశాలనే ఆశ్చర్యంలో ముంచేంతగా పెరిగిపోతున్న నల్లధనం నిల్వలను వేలెత్తి చూపకూడదు. ఆ నిల్వలను పెంచుతున్న అవినీతిని ప్రశ్నించకూడదు.. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. అగ్రరాజ్య ఆదేశాలను ప్రత్యక్షంగా అమలు చేస్తున్న ప్రభుత్వ వైఖరిని పల్లెత్తు మాట కూడా అనకూడదు... ప్రశ్నించడం కాదు కదా.. ప్రశ్నిస్తారన్న అనుమానం వచ్చినా.. వారి శేష జీవితం కారగారవాసమే.. కాస్త గట్టిగా మాట్లాడే వాళ్లయితే.. ఏదో ఒక తీవ్రవాదసంస్థ కార్యకర్త పేరుతో ఉరికంభం ఎక్కితీరాల్సిందే. ఇదే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలవబడే భారతదేశంలో పౌర స్వేచ్ఛ, పౌర హక్కులు.. ప్రజా సంక్షేమం పై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వాలు ప్రజల తరుపున పోరాడుతున్న వారి పై కక్ష సాధింపు చర్యలెందుకు.. బినాయక్ సేన్ కు కారాగారవాస మెందుకు.. షర్మిలా ఛానూకు నిరాహార దీక్ష పదేళ్లుగా కారాగారంలోనే చేయాల్సిరావడమెందుకు.. ప్రచారానికి పాటను ఎన్నుకున్నందుకు జితేన్ మరాండీకి తన పేరే తనకు శాపంగా ఎందుకు మారింది.. నిన్నగాక మొన్న అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్లు తీసుకురావాలని హజారేను వెనకుండి నడిపించిన మేథావులకు ఇన్నేళ్లనుంచి పోని నోటీసులు ఇప్పుడే ఎందుకు పోస్టవుతున్నాయి.. వీటన్నిటికీ ఒకటే కారణం.. రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడటమే.. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించడమే... ప్రజల పక్షాన నిలవడమే వీరు చేసిన పాపం..

తిరుమల తిరుపతి పాలక మండలి.. గోవిందా..గోవిందా..



టిడిడి కొత్తగా ఏర్పాటు చేసిన పాలక మండిలి వివాదాస్పదమవుతోంది.. 7గురి సభ్యులతో మాత్రమే వేసిన ఈ కమిటీ పదవీ కాలాన్ని కేవలం సంవత్సరానికే పరిమితం చేయడం వివదానికి తెరలేపింది. అయితే అధికారుల మాత్రం గతంలో జరిగిన తప్పులు పునారవృతం కాకుండా ఉండేందుకే మార్పులకు శ్రీకారం చుట్టామని చెబుతున్నారు.ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన టిటిడి పాలక మండలి వివాదాస్పదమవుతోంది.. రెండు సంవత్సరాల పదవీకాలానికి వేయాల్సిన కమిటీని కేవలం సంవత్సరకాలానికి వేయడం ఒక కారణమైతే.. 15 మంది సభ్యులుండాల్సిన స్థానంలో కేవలం 7గురితో సరిపుచ్చడం వివాదానికి మరోకారణం. ఎండోమెంట్ నిబంధనల ప్రకారం 6ఎ గ్రేడ్ కు చెందిన అన్ని ఆలయాల్లో పాలక మండలి తప్పకుండా 15 మంది సభ్యులు ఉండి తీరాలి. వీరిలో 11 మంది అఫిషియల్స్ ఉండగా మిగిలిన నలుగురు అఫిషియల్ సభ్యులు. కానీ ఇప్పుడు 7గురు సభ్యులతో ఏర్పాటు చేసిన పాలక మండలిలో చైర్మన్ తో కలిపి నలుగురు అఫిషియల్ సభ్యుల మిగతా ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు.. ఎక్స్ అఫిషియో మెంబర్లకు ఓటింగ్ ఉండదు కాబట్టి ఉన్న నలుగురిలో ఇద్దరు ఏ ఇద్దరు నిర్ణయాన్ని వ్యతిరేకించినా ఆ నిర్ణయం ఆమోదం కాదు. అపీషియో మెంబర్లు బేసి సంఖ్యలో ఉంటే ఓటింగ్ ఒక్క ఓటుతో నెగ్గే అవకాశం ఉంటుంది.. కానీ ఇప్పుడు పాలక మండలి ప్రకారం అది సాధ్యం కాదు.. అధికారుల మాటలు పెడ చెవిన పెట్టి ప్రభుత్వం వేసిన ఈ పాలక మండలికి వ్యతిరేకంగా టిటిడి సిబ్బంది కోర్టుకెక్కనున్నారు..మరోవైపు టిటిడి పాలక మండిలి నియామకం పై వస్తున్న ఆరోపణలకు ఎండోమెంట్ ప్రిన్స్‌పుల్ సెక్రటరీ సమాధానమిచ్చారు. గతంలో ముగ్గురు అధికారులతో పాలక మండలి నడిపించామని.. ఇప్పుడు 7గురితో నడపడం ఎందుకు సాద్యం కాదని ప్రశ్నిస్తున్నారు. దేవాదయ నిబంధనల ప్రకారం 3 నుంచి 11 మంది సభ్యులను నియమించ వచ్చని అయితే ప్రస్తుతానికి కేవలం 7గురిని నియమించామన్నారు. దీనితో బాటు దేవాలయాల్లో ఎటువంటి పాలక మండలి ఉండాలనే విషయం పై దేవాదయ శాఖ ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘ ఈ నెల 9వ తేదీన నివేదిక ఇస్తుంది. నివేదికను బట్టి ఎంత మందిని నియమించాలి.. నియమించే వారిలో.. రాజకీయ వ్యక్తులకు ప్రాధాన్యమివ్వాలా లేక అధికారులకు ప్రాధాన్యమివ్వాలా అనే అంశంలో ఒక నిర్ణయానికి వస్తామని పి.యస్ చెబుతున్నారు. గతంలో పాలక మండలి పదవీకాలాన్ని రెండు సంవత్సరాలు ఉంచబట్టి అరాచకాలు పెరిగాయని.. ఇప్పుడు కేవలం సంవత్సరకాలం పెట్టి ఎటువంటి వివాదాలు లేకుంటే మరో సంవత్సరం పొడిగించే అవకాశముందన్నారు. గతంలో టిటిడిలో వచ్చిన వివాదాలు పునరావృతం కాకూడదనే సి.యం ఈ విధానానికి శ్రీకారం చుట్టారని ప్రిన్స్‌పుట్ సెక్రటరీ రమణాచారి చెబుతున్నారు.



నేతలు ఆస్తులు తక్కువచేసి చెప్పటమెట్లా...

నేతలు ఆస్తులు తక్కువచేసి చెప్పటమెట్లా...


చంద్రబాబు నాయుడు తన ఆస్తుల వివరాలు ప్రకటించడంతో... మిగతా నేతలు కూడా తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలనే డిమాండ్ ఊపందుకుంది... ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ తమ ఆస్తులను వెల్లడించక తప్పని పరిస్తితి.. బినామీ ఆస్తులను కప్పిపెట్టి కొసర ఆస్తులను చూపించడానికి నేతలు కసరత్తు చేస్తున్నారు.
ఆస్తుల విషయంలో పారదర్శకత అవసరమంటూ చంద్రబాబు తన ఆస్తుల చిట్టా విప్పాడు.. తాను.. తన కుటుంబం... తన ఆస్తి అంటూ.. మీడియా ముందు పద్దులు అప్పజెప్పారు.. బాబు లెక్కలన్నీ తప్పుల తడక.. అబద్దాల కుప్ప అంటూనే.. తమ లెక్కలను ఎలా తప్పించాలా.. అని నేతలు హైరానా పడుతున్నారు.. అసలు ఆస్తులను దాచిపెట్టి బీదవాణ్ణని చెప్పుకోవడమెలా అని ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆస్తి వివరాలను తక్కువ చేసి చెబితే దాచిన ఆస్తులకు ఎక్కడ ఎసరు వస్తుందో నని నేతలు వణుకుతున్నారు... అలా కాదని బినామీలను నమ్ముకుంటే.. వారెక్కడ హ్యాండిస్తారోననే బెంగ వెంటాడుతుంది.. ఉన్న ఆస్తులను తక్కువ చేసి చూపడానికి సీనియర్ అకౌంటెంట్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ కు మాంచి గిరాకీ వచ్చింది. చంద్రబాబుకున్న వేలాది కోట్లను దాచి పదుల సంఖ్యలో చూపగలిగిన చతురత వెనుక సూత్రదారి ఎవరోనని ఆరాతీస్తున్నట్టు సమాచారం. ఆ లెక్కన తమ ఆస్తిని సింగిల్ డిజిట్ మించకుండా చెప్పేందుకు సాధ్యమైనంత వరకు కుక్కి కుక్కి కుదించేపనిలో నేతలు బిజీ బిజీగా ఉన్నారు. నేతలు కనీసం ఆ విధంగా ఆస్తులు వెల్లడించినా మిగిలిన ఆస్తుల పని ప్రతిపక్షాలు, ప్రజలు చూసుకుంటారని మేథావులు విశ్లేషిస్తున్నారు.

Friday, September 2, 2011

నండూరి... ఇకలేరు..

నండూరి రామ్మోహన్ రావు

విశ్వరహస్యాలను విప్పి చెప్పిన కలం ఆగిపోయింది... సాహితీ లోకంలో తనదైన ముద్ర వేసుకున్న అపర మేథావి నండూరి రామ్మోహన్ రావు... మనల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన విజయవాడ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.. వివిధ పత్రికల్లో సంపాదకుడిగా.. రచయితగా నండూరి సుపరిచితులు.. ఆయన రాసిన నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం ప్రజాదరణ పొందిన రచనలు. నండూరి మరణ వార్త సాహితీ అభిమానులను విషాదంలో ముంచింది.. పాశ్యాత్య తత్వవేత్తల జీవితాన్ని, భారతీయ తత్వవేత్తల జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన పరిశోధకుడు.. జీవితంలో ఎక్కువ కాలం సత్యశోధనకే తన జీవితాన్ని అంకితం చేసిన సునిశిత మేథావి..