ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, July 6, 2011

కాంబోడియా అంకూర్ వాట్ టెంపుల్



ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయమది... ఈ ఆలయం మొత్తం చూడాలంటే ఒకరోజు చాలదు.. రెండు కళ్లుకూడా చాలవేమోననిపిస్తది... ఆ ఆలయం పేరే ఆంకోర్ వాట్.. నిలువెత్తు విష్టుమూర్తి ప్రతిమ చతుర్భుజాలతో దర్శనమిచ్చే ఈ ఆలయం ప్రపంచంలోనే పెద్దది. ఇంత ఘనకీర్తి పొందిన హిందూ ఆలయం ఉన్నది మనదేశంలో కాదు.. కాంబోడియాలో దేశంలో ఉంది. పది శతాబ్దాల కిందటి ఆలయానికి పునర్వైభవం కల్పించే పనిలో పడ్డది కాంబోడియా ప్రభుత్వం... ఘనత వహించిన అంకోర్ వాట్ ఆలయం పై హెచ్ఎంటివి స్పెషల్ స్టోరీ...
బ్యాంగ్ (పునర్వైభవానికి అంకురార్పణ)
యాంకర్ 1
ప్రపంచంలో అనేక దేశాలు మత విశ్వాసాలకు గౌరవం ఇవ్వడం తెలిసిందే... మత సిద్ధాంతాలను పరిపాలనకు మార్గదర్శకాలుగా ఉన్న దేశాలనూ చూశాం.. కానీ దేశంలో ప్రసిద్ధి పొందిన ఆలయాన్ని .. తమ జాతీయ జెండాలో ముద్రించుకున్న ఘనత ఒక్క కాంబోడియాకే సాధ్యం... అంత ఘనత వహించిని ఆలయం నిర్లక్ష్య నీడలో శిథిలావస్థకు చేరింది. ఇంకా ఏమరుపాటుగా ఉంటే అంకోర్ వాట్ అనేది చరిత్రగానే మిగిలేది.. ఆ ప్రమాదం నుంచి కాపాడేందుకే కాంబోడియా రాజు, ప్రధాని పురాతన ఆలయానికి కొత్త సొగసులు అద్దే పనిలో తాళాలు తీయించారు. ఇంతకీ ఈ ఆలయానికున్న చరిత్ర ఏంటి.. జాతీయ చిహ్నంగా ఒక హిందూ ఆలయాన్ని ముద్రించుకో్వలసిన అవసరం ఏమొచ్చింది.. ఈ ఆలయ చరిత్రేంటో తెలుసుకుందాం...
స్మాల్ స్పాట్ ( 3సెకన్లు)
వాయిస్
అంకోర్ వాటి ఆలయం అతి పురాతన మైంది.. మూడు శతాబ్దాల పాటు వెలుగులీనిన ఆలయానికి 11వ శతాబ్దంలో తలుపులకు మూతలు పడ్డాయి.
ఆంకూర్ వాట్ ఈ భూగోళం పైనే ఒక అధ్బుత ప్రాంతం. ఈ ఆలయం కాంబోడియాలో సీమ్‌రీప్‌ నగరానికి 5.5 కిలోమీటర్ల దూరంలో బాఫౌన్‌ పట్టణం మధ్యలో ఉంది. 1113, 1150 మద్యకాలంలో ఈప్రాంతాన్ని పాలించిన రెండవ సూర్యవర్మ ఈ ఆలయాన్ని నిర్మించి విష్ణు భగవానుణ్ని ప్రతిష్టించాడు. తరువాత కొంతకాలానికి రాజు మరణించడంతో ఈ ఆలయ నిర్మాణం అసంపూర్తిగానే నిలిచిపోయింది. . 27 సంవత్సరాల తర్వాత 8వజయవర్మ ఆంకోర్‌ థోమ్‌ను రాజధానిగా చేసుకున్నాడు. తర్వాత ఆయన అల్లుడు శ్రీంద్రవర్మ రాజు అయ్యాడు. ఆయన అంతకు ముందు బౌద్ధ సన్యాసిగా ఉండడంతో దాన్ని బౌద్ధ ఆలయంగా మార్చారు. 13 వ శతాబ్దంలో బౌద్దమతం ప్రాచుర్యంలోకి వచ్చాక ఇక్కడ బౌద్దమతస్థులకు కూడా ఆశ్రయం కల్పించడంతోబాటు బౌద్దానికి సంబంధించిన వివిధ ప్రతిమలు ప్రతిష్టించబడినవి. ప్రపంచంలోనే అతిపురాతన అరుదైన నిర్మాణాలలో ఈ ఆలయమొకటి.
స్పాట్
అంకూర్ వాట్ ఆలయం నైరుతి కాంబోడియాలో అంకోర్ ప్రాంతంలో ఉంది. దక్షిణాసియాలోనే అత్యంత ప్రాచీన నాగరికత ఇక్కడ విలసిల్లింది. 2వ రాజా సూర్యవర్మన్ నిర్మించిన ఈ ఆలయం మత విశ్వాసాలకు పుట్టినిల్లు. హిందూ మతం ఇక్కడ బహుళ ప్రాచుర్యం పొందింది. తరువాత బౌద్దాన్ని కూడా ఆదరించారు. ఇది ప్రపంచంలోనే పెద్ద ధార్మికాలయం. కిమర్ రాజవంశీయుల వాస్తు, శిల్పకళానైపుణ్యంతో నిర్మించిన ఈ ఆలయం అతి పురాతన సంప్రదాయ నిర్మాణ శైలి కలిగి ఉంది. ఈ ఆలయం ఒక అద్భుత కట్టడం.. ఒక్కసారి ఈ ఆలయం మొత్తం కలియతిరిగిచూద్దాం...
స్పాట్
(Angkor Wat, Cambodia) విజువల్స్ పూర్తిగా వాడుకోగలరు.
యాంకర్ 2
ప్రపంచంలో ఎన్నో ఆలయాలున్నాయి.. కానీ అంకోర్ వాట్ ఆలయమే ప్రపంచంలో అతి గొప్ప ఆలయంగా ఎలా పేరు పొందింది. ఈ ఆలయ గొప్పతనం ఏంటి.. అసలు ఈ ఆలయంలో చూడాల్సిన విశేషాలేంటి..
స్మాల్ స్పాట్ ( 3సెకన్లు)
వాయిస్
ఆలయ గోడలపై, స్తంభాలపై రకరకాల చిత్రాలను చెక్కారు. పాలసముద్రాన్ని చిలుకుతున్న దేవతలు, రాక్షసులు. నాట్యం చేస్తున్న సుందరాంగులు, రణరంగంలో కృష్ణుడు, కౌరవులు, పాండవుల చిత్రాలు.. ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడ కొలనులు, మార్గమధ్యలో పలకరించే సింహాలు... అక్కడ ఉన్నంత సేపూ కథల్లో విన్న, సినిమాల్లో చూసిన పౌరాణికగాథలు మనముందు ప్రత్యక్షమైనట్టుంటుంది. ఆ లోకంలో విహరిస్తున్నట్టనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాకారాలు, ప్రాకారాలపై శిల్ప సంపద.. చుట్టూ ఏపుగా పెరిగిన చెట్లు.. పచ్చిక మైదానాలు.. ప్రశాంత వాతావరణానికి అచ్చమైన ఆనవాలు ఇది. ఈ ఆలయం బాహ్య ప్రాకారం 3 కిలోమీటర్లు ఉంటుందంటే లోపల ఎంత విశాలంగా ఉంటుందో అర్దం చేసుకోవచ్చు.. ఈ ఆలయానికి పురాతన చరిత్ర ఉంది. ఆలయప్రాంగణలోనే జలాశయాలు.. మద్య మద్యలో సేదతీరేందుకు రాతి బల్లలు.. అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దిన క్షేత్రమిది. సనాతన సంప్రదాయాలకు, మత విశ్వాసాలకు పురిటిగడ్డగా విలసిల్లిన దివ్యక్షేత్రమిది..
స్మాల్ స్పాట్ ( 3సెకన్లు)
యాంకర్ 3
ఏ ఆలయానికైనా ముఖమంటపం.. ఆలయ శిఖరం ఉండటం చూస్తాం.. కానీ ఈ ఆలయానికి ప్రహరీ మద్యలో ఐదు శిఖరాలున్నయి. నాలుగు వైపులా నాలుగు శిఖరాలు... మద్యలో ప్రధాన శిఖరం అత్యంత శిల్ప కళా నైపుణ్యంతో చూపరులను ఆకట్టుకుంటాయి. ఆలయం ప్రాకారాలపై ఉన్న చిత్రాలు, కళా ఖండాలు, ప్రాంగణంలో ఉన్న శిల్పాలు ఎంత చూసినా తనివి తీరదు.
వాయస్
ఆలయం మధ్యలో ఉన్న ఐదు శిఖరాలు పర్వత శిఖరాలను తలపిస్తాయి. ఆలయం చుట్టూ గోడలు, వాటి చుట్టూ ఆలయాన్ని రక్షించేందుకు ఎత్తైన కోటగోడ ఉంటాయి. ఆలయం బయటి గోడలు, కొన్ని రహస్య నిర్మాణ భాగాలు తప్ప మిగతా అన్నిటినీ ఇసుకరాతితోనే నిర్మించారు. తామర మొగ్గల ఆకారంలో ఆలయ గోపురాలు, సందర్శకులు వెళ్లే మార్గాలను కలుపుతూ ప్రదర్శనశాలలు, ఎత్తైన ఆలయ శిఖరాలు మనల్ని ఎంతో ఆకర్షిస్తాయి. ఆలయ ప్రహరీ గోడ 1024 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. ప్రధాన ద్వారం చెక్క వంతెనతో ఉంటుంది. అతి ముఖ్యమైన ప్రదేశాలలో గోపురాలు ఉంటాయి. ఆలయానికి పశ్చిమాన చాలా విశాలంగా ఉంటుంది. . దక్షిణాన గల శిఖరం కింద విష్ణువు విగ్రహం ఉంటుంది. మధ్యలోని పవిత్ర మందిరంలో ఉంచారు. దీనిని 'తారీచ్‌' అంటారు. ఆలయానికి రెండు ద్వారాలు ఉంటాయి. వీటిని ఏనుగు ద్వారాలు అంటారు. వీటి మధ్య చాలా దూరం ఉంటుంది. మధ్య మధ్యలో శిఖరాలు, ప్రదర్శనశాలలు ఉంటాయి. శిఖర గోడలపై నాట్యం చేస్తున్న ఆకారాలు, జంతువులపై నాట్యం చేస్తున్న దేవుళ్లు, దేవతల రూపాలు చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి. వాయవ్య దిశగా చూస్తే ఈ ఆలయం నగరాన్ని మొత్తం ఆక్రమించినట్టుగా ఉంటుంది. దీనికి ఉత్తరాన రాజ భవనం ఉంటుంది. 350 మీటర్ల మార్గం పశ్చిమాన ఉన్న గోపురాన్ని కలుపుతుంది. ఈ మార్గంలో అక్కడక్కడా సింహాల శిల్పాలు మనల్ని పలకరిస్తాయి.
స్పాట్
వాయిస్
సుప్రసిద్ధమైన ప్రపంచంలోనే పెద్దదైన ఈ విష్ణుమందిరాన్ని కాంబోడియా ప్రభుత్వం భద్రంగా కాపాడబడుతోంది. ఈ ఆలయంలో చరిత్రతో బాటు, పురాణ గాథలు చెక్కు చెదరకుండా శిలాశాసనాల రూపంలో ఉన్నాయి. అంకోర్‌ వాట్‌ గోడలపై సంపూర్ణ రామాయణంను చిత్రీకరించారు. కాంబోడియా, లావోస్‌ భాషలు సంస్కృత పదాల ఆధారంగానే ఉన్నాయి. విజ్ఞాన, ఇతర ఉపయుక్త భాషలలోని పదాలూ సంస్కృతానికి చెందినవే. అక్కడి భాషల లిపి భారతీయ ప్రాచీన బ్రాహ్మీలిపి నుండి పుట్టినవే. చరిత్రకారులు అంకోర్‌ వాట్‌ విరాట్‌ మందిరంను పరిశోధించి, కాంబోడియా లోని సంస్కృతభాషకు చెందిన వేలాది శిలా శాసనాలను సేకరించి పుస్తక రూపంలో ప్రచురించారు. ఆలయ ద్వారాల వద్ద వున్న గ్రంథాలయాలు దీనికి సంబంధించిన చరిత్ర తెలుసుకునేందుకు వీలుగా ఉంటాయి. ఈ గ్రంథాలయాలకు ఆలయానికి మధ్య కొలనులు ఉంటాయి. ఈ కొలనులు ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసినవి. టెర్రస్‌ మీదనున్న ఆలయం.. నగరం కంటే ఎత్తులో ఉంటుంది. ఇది మూడు దీర్ఘ చతురస్రాకార ప్రాకారాలతో ఉంటుంది. ఇవి ఒకదానిని మించి మరొకటి ఎత్తులో ఉంటాయి. ఈ మూడింటిని బ్రహ్మ, చంద్రుడు, విష్ణులతో పోలుస్తారు. ఇక్కడ నాలుగు భవన ప్రాకారాలు ఉంటాయి. వీటి గోడలపై దేవతల రూపాలు విడివిడిగా, గుంపులు గుంపులుగా ఉంటాయి. లోపలి మ్యూజియమ్‌ను బాకన్‌ అంటారు. ఇది 60 మీటర్ల చతురస్రాకారంలో ఉంటుంది. దీని పైకప్పు అడుగుభాగాన పాము శరీరంతో, సింహం లేదా గద్ద తల ఉన్న ఆకారంతో వింత రూపాన్ని చెక్కారు. ఈ ప్రాకారాల గోడలపై మహాకావ్యాలైన రామాయణం, మహాభారత చిత్రాలను చెక్కారు.
స్మాల్ స్పాట్ ( 3సెకన్లు)
యాంకర్ 3
ఇంత పెద్ద ఆలయం ఇంత భారీ ఖర్చుతో నిర్మించ వలసిన అవసం సూర్యవర్మకెందుకొచ్చింది... హిందు మతం పై అభిమానం ఉండటంలో తప్పు లేదు.. కానీ తమది కాని మతాన్ని అంతగా ఎందుకు ఆదరించాడు.. ఆచరించడమే కాకుండా ప్రపంచంలో తన రాజ్యంలో ఉన్నంత పెద్ద ఆలయం మరే రాజ్యంలో కూడా ఉండకూడదన్న ఆలోచన ఎందుకొచ్చింది.. ఈ ఆలయాన్ని భక్తితోనే కట్టాడా.. గుర్తింపు కోసం కట్టాడా... అసలీ ఆలయాన్ని సూర్యవర్మ ఎందుకు నిర్మించాడు..
స్మాల్ స్పాట్ ( 3సెకన్లు)
వాయిస్
కాంబోడియా రాజ్యం.. థాయిలాండ్, లావోస్, చైనా, బర్మా, భారత్, చైనాలతో వ్యాపార లావాదేవీలు జరిపేది.. సంస్కృతి పరంగా కాంబోడియా చాలా వెనక బడిన ప్రాంతం... భారత్, థా‍య్ లాండ్ ప్రాంతాలను సందర్శించినపుడు ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను చూసి కాంబోడియన్ రాజులు ఆశ్యర్యపోయారు. ఇక్కడి శిల్ప సంపద.. ఆద్యాత్మిక పద్దతులు తమ దేశ ప్రజల చేత కూడా పాటించాలనుకున్నారు. అంతేకాదు ఇతర రాజ్యాలు గా కాంబోడియాను ఆదివాసీ రాజ్యం పరిగణించడం వీరికి నచ్చలేదు.. వెనకబడిని రాజ్యంగా అవహేళనలు పొందిన రాజులు తమను తాము నిరూపించుకోవాలని తపన పడ్డారు. ఏ దేశానికీ తాము తక్కువ కాదని.. తమ వారిలో కూడా నైపుణ్యం ఉందని రుజువు చేయదల్చుకున్నారు.. తమ రాజ్యంలో ఉన్న ఔత్సాహిక శిల్పులను, వాస్తు నిపుణులను, సరిహద్దు దేశాలకు పంపించి ఇక్కడి నిర్మాణ నైపుణ్యాలలో శిక్షణ నిప్పించారు.. అంతే కాకుండా ఆయా దేశాలలో పేరొందిన నిపుణులను కాంబోడియాకు పిలిపించుకొని శిక్షణ నిప్పించారు.. వీరందరినీ ఒక్కచోట చేర్చి ప్రపంచంలో ఉన్న హైందవ దేవాలయాలన్నిటికన్నా తామే అద్భుతమైన ఆలయాన్ని నిర్మించామని గర్వంగా చెప్పే ప్రయత్నం చేశాడు రెండవ సూర్యవర్మ... అతని కాలంలో అది పూర్తి కాకపోయినా తరువాత వచ్చిన రాజులు పూర్తి చేసి కాంబోడియా రాజుల ఆశయాన్ని సాధించారు..
స్మాల్ స్పాట్ ( 3సెకన్లు)
యాంకర్ 4
అవును... ప్రపంచంలో మారుమూలన ఉన్న తమ రాజ్యం ఇప్పుడు చరిత్ర పుటల్లో నిలిచింది.. అనాగరికులని అవహేళన చేసిన వారే అద్భుత పనితనమని పొగుడుతున్నారు.. వేలాది కార్మికుల శ్రమ ఊరికే పోలేదు.. చరిత్రలో శిలాశాసనంలా మిగిలిపోయింది... కాల గర్భంలో వచ్చిన పౌర యుద్దాలు... రాజ్యాధికార కాంక్షలు.. రాజ్య ధిక్కారాలు.. ఈ ఆలయపునరుద్దరణ కంటే .. వినాశనానికే ఎక్కువగా దారి తీశాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఆలయానికి గతవైభవం సంతరించుకోబోతోంది.
స్మాల్ స్పాట్ ( 3సెకన్లు)
వాయిస్
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన ఈ ఆలయానికి ఇన్ని వందల సంవత్సరాల తరువాత ఆలయానికి మరమ్మత్తులు చేసి పునర్ వైభవం కల్పించబోతున్నారు. .చాలా సంవత్సరాల తరువాత కాంబోడియా రాజు, ధాని ఈ పనికి పూనుకున్నారు. అత్యంత శ్రేష్టమైన, ప్రసిద్దమైన ఈ ఆలయ పరిరక్షణకు నడుం బిగించారు. ఈ ఆలయ శిఖరాలలో 3 లక్షల ఇసుక ఇటుకలున్నాయని అంచనా.. . 1970 ప్రాంతంలో జరిగిన సివిల్ వార్ లో ఆలయం పై దాడి జరిగింది. తిరుగుబాటు దారుల కళ్లు ఈ ఆలయం పై పడ్డాయి. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. కొన్ని శిల్పాలు పాక్షికంగా ధ్వంసం కాగా మరికొన్ని శిల్పాలు పూర్తిగా ఆకారాలను కోల్పోయాయి. శిధిలమయిన ఇటుకలను తిరిగి పేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆలయ ప్రాకారాలకు సంబంధించిన అనేక ఇటుకలు ఆలయ పరిసరప్రాంతాలలో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఈ ఆలయం మొత్తం రాతికట్టడమే. ఎక్కణ్నుంచి తీసిన ఇటుకలను, శిల్పాలను అక్కడే అమర్చాలంటే.... ఆలయ నమూనా క ావాలి...కానీ కిమర్ రాజులపై తిరగబడ్డ ఉద్యమకారులు 1975లోనే వాటిన ధ్వంసం చేశారు. తిరిగి1995లో ఈ ఆలయం ప్రపంచంలోనే అరుదైన ఆలయంగా గుర్తించి కాంబోడియా రాజు, ప్రధాని ఆలయ పునరుద్దరణకు పూనుకున్నారు.
స్పాట్
అశేష ప్రజల కోలాహలం మద్య పున:ప్రారంభం అవుతున్న ఈ ఆలయం పేరు అంకోర్ వాట్.. కాంబోడియా చరిత్రలో ఎంతో విషిష్టత కలిగిన ఈ ఆలయం దక్షిణ భారతదేశ సంస్కృతీ సంప్రదాయాల మేళవింపుతో, శిల్పకళా నైపుణ్యంతో నిర్మించారు. అన్ని ఆలయాలకు ప్రవేశ ద్వారం తూర్పు వైపునకు ఉంటే ఈ ఆలయానికి మాత్రం ప్రవేశ ద్వారం పశ్చిమం వైపు ఉంటుంది. నిలువెత్తు విష్ణుమూర్తి విగ్రహం నాలుగు చేతులతో దర్శనమిస్తుంది. ఈ ఆలయం కాంబోడియన్ల గుండెల్లో గుడి కట్టుంకుంది. ఈ గుడికి వీళ్లెంత గౌరవం ఇచ్చారంటే... ఆ దేశ జాతీయ పతాకంలో కూడా ఈ గుడిని గుర్తుగా పెట్టుకున్నారు.
స్పాట్
ప్రస్తుతం ఈ కట్టడాన్ని నిర్మించాలంటే 300 సంవత్సరాలు పడుతుందని ఇంజనీర్ల అభిప్రాయం. కాని అప్పుడు మాత్రం దీన్ని 40 సంవత్సరాలలోనే నిర్మించారట. రథాలను లాగుతున్న వింత జంతువులు, ఏనుగుల వెంట వెళ్తున్న సైనికులు, నాట్యం చేస్తున్న అందమైన అమ్మాయిలు.. ఆనాట ి చరిత్రను కళ్లకు కడతయి.
2004, 2005 సంవత్సరాలలో 6,77,000 మంది విదేశీ పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శించారని ప్రభుత్వ అంచనా. ఆంకోర్‌ నిర్మాణం తర్వాత కిమర్‌ రాజులు వియత్నాం, చైనాల నుంచి బే ఆఫ్‌ బెంగాల్‌ వరకు చాలా సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పటికీ చెక్కుచెదరని వందకు పైగా రాతి ఆలయాలున్నాయి. ఈ ఆలయంలో 108 హిందూ, బౌద్ధ శిఖరాలు ఉన్నాయి. . ఆంకోర్‌కు నగరదేవాలయం అని పేరు పెట్టారు.
స్మాల్ స్పాట్ ( 3సెకన్లు)
ఎండ్ యాంకర్
చరిత్రను ముందు తరాలకు అందించేవి చారిత్రక కట్టడాలే... వాటిని కాపాడుకోవడం పౌరుల, ప్రభుత్వాల భాద్యత.. దేశమేదైనా కావచ్చు.. చరిత్ర ఏదైనా కావచ్చు... దాన్ని ముందు తరాలకు అందిస్తేనే మన వైభవం తెలుస్తుంది... ఇదీ కాంబోడియా అంకూర్ వాట్ ఆలయ విశిష్టత...

Monday, July 4, 2011

సమాచార హక్కు చట్టానికి చిక్కులు ఆరేళ్లయినా వీడని బాలారిష్టాలు

సమాచార హక్కు చట్టానికి చిక్కులు
ఆరేళ్లయినా వీడని బాలారిష్టాలు
యాంకర్ పార్ట్
సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రాన్ని పాతిపెడుతున్నారు. సమాచార హక్కు చట్టం చట్టుబండలవుతోంది... అవినీతి పునాదులు కదిలిస్తుందనుకున్న సమాచారహక్కు చట్టం కొయ్యగుర్రం పై స్వారీ చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యపు నీడలో లక్ష్యం నీరుగారిపోతోంది. సమాచార కమీషనర్ ముందు ఫిర్యాదుల ఫైళ్లు గుట్టలు గుట్టలుగా పేరుకు పోతున్నా కదలిక లేదు. పౌరులు అడిగిన సమాచారాన్ని 30 రోజుల్లో కాదు కదా కనీసం మూడేళ్ల లోపు కూడా అందించలేని నిస్సహాయ స్థితికి చేరుకుంది మన సమాచార వ్యవస్థ.. ఈ జాడ్యం ఒక్క మన రాష్ట్రానికే అనుకుంటే పొరబాటు.. దేశవ్యాప్తంగా అంటువ్యాధిలా సోకి స.హ చట్టాన్ని మింగేస్తోంది. సమాచార హక్కు చట్టానికి పట్టిన చెదలు పై హెచ్ఎంటివి స్పెషల్ స్టోరీ..
బ్యాంగ్ ( సమాచార నిరాకరణ చట్టం / సమాచార చిక్కు )
వాయిస్ 1
ఆరేళ్ల కిందటి మాట... సమాచార హక్కు చట్టం వస్తే అవినీతి పాదాలకింది పునాదులు కదలాల్సిందే.. సమాచార హక్కు చట్టం కింద ఏదైనా అభ్యర్ధన వస్తే అధికారులకు చెమటలు పట్టేవి. కారణం ఇచ్చే సమాచారం పారదర్శకంగా ఉండాలి. లేదా మొదటికే మోసం వస్తుంది. ప్రాణ హాని, జీవించే హక్కుకు సంబంధించిన సమాచారమైతే 48 గంటల్లోనూ, ఇతర సమాచారమైతే 30 రోజుల్లోపు ఇవ్వాలని చట్టం చెబుతోంది. కానీ ఈ చట్టం రూపకల్పనలో ఉన్న చిన్న చిన్న లోపాలను అడ్డం పెట్టుకొని సమాచారం ఇవ్వడానికి అధికారులు తల అడ్డం ఊపుతున్నారు. సమాచారం అడిగిన వ్యక్తిని యక్ష ప్రశ్నలేసి, అవసరం లేకున్నా కాగితం నుంచి కరెంట్ బిల్లు వరకు లెక్కలేసి లక్షల రూపాయల్లో బిల్లు చెల్లించాలని అడగటంతో.... సమాచార చట్టం అంటే సంపన్నుడి చుట్టమనే అభిప్రాయం వచ్చింది సామాన్యుడికి.
స్పాట్
అభివృద్ది పథంలో దేశంలో అగ్రగామినని ఢంకా భజాయిస్తున్న ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కును అమలు చేయడంలో అట్టడుగున ఉందంటే ఇక్కడి అధికారుల నిర్వాకం ఎంత ఘనమో అర్ధం చేసుకోవచ్చు. స.హ చట్టాన్ని గొప్పగా అమలు చేస్తామని డాంబికాలు పలికిన ప్రభుత్వ వైఖరి ఆరంభ శూరత్వంగా మారింది. చట్టం అమలులోకి వచ్చి ఆరేళ్లయినా బాలారిష్టాలు దాటలేదు. చట్టం అటకెక్కడానికి కమీషనర్ల వైఖరే కారణమన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. వేలాది ఫైళ్లు రెండేళ్లుగా పెండింగులో ఉన్నాయంటే ఈ అలసత్వానికి కారణం ఎవరు...? గతంలో ప్రధాన సమాచార కమీషనర్లుగా సి.డీ అర్హ, ఆర్ దిలీప్ రెడ్డి ఉన్నపుడు ఫైళ్లకు కాళ్లుండేవనే చెప్పాలి. సమాచారం అడిగిన వాళ్లకు న్యాయం జరుగుతుందనే నమ్మకం బలంగా ఉండేది. సమాచారం ఇవ్వని అధికారుల పై చర్యలు తీసుకుంటారనే నమ్మకం ఉండేది. అదే నమ్మకంతో వేలాది రూపాయలు ఖర్చుపెట్టుకొని కార్యాలయానికి వస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సమాచారం అంటే అందని ద్రాక్ష.. సమాచారమడగటమంటే కొరవితో తల గోక్కోవడం.. సమాచారం హక్కు కాదు, పెద్ద చిక్కు... అవును ఇది ఎవరి పై అక్కసుతోనే అనే మాటలు కావు.. సమాచారం కోసం కాళ్లరిగేలా తిరిగి కడుపుమండి సామాన్యుడు అంటున్న మాటలు...
బైట్ - 1, 2, 3 ( తెప్పించాలి ) వాక్స్ పాప్
వాయిస్ 2
మండల స్థాయి కార్యాలయాల్లో సమాచారం కావాలంటే ప్రాథమిక సమాచార అధికారికి ధరఖాస్తు చేసుకోవాలి. ఆ అధికారి స్పందించకపోతే మొదటి అప్పీలేట్ అధికారికి ఫిర్యాదు చేయాలి. అక్కడ కూడా సరియైన స్పందన లేకుంటే..దరఖాస్తు దారుడు అడిగిన సమాచారం ఇవ్వకున్నా, దరఖాస్తు తిరస్కరించినా, అసమంజసమైన రుసుము కోరినా.. సమాచార హక్కు చట్టం 18 బై1 ప్రకారం రాష్ట్ర సమాచార కమీషనర్ కు అప్పీల్ చేసుకోవచ్చు. అబ్యర్ధన దాదాపు ఇక్కడి వరకు చేరదు. చేరిందంటే ఆ సమాచారం అభ్యర్ధికి చాలా విలువైందిగా భావించి కమీషనర్ వెంటనే చర్యకు పూనుకోవాలి. కానీ పరిస్థతి దీనికి పూర్తి విరుద్దంగా ఉంది. కమీషనర్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులు, కుంభకర్ణుడిలా నిద్ర పోతున్నాయి. వాటిని తట్టిలేపే నాధుడే కరువయ్యాడు. కారణం చట్టాన్ని కాపాడే కమీషనరే కఠినంగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రధాన సమాచార కమీషనర్ జన్నత్ హుస్సేన్ చట్టానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఈ అధికారా పనితీరు తెలుసుకున్న ప్రాధమిక సమాచార అధికారులు సమాచారం కోసం వచ్చిన వారిని తమ మాటలతో భయపెట్టి పంపుతున్నారు. ఎందుకంటే సమాచారం కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ శాతం అవినీతి, అక్రమాలను ప్రశ్నించేందుకు వచ్చినవే కావడం... అందులో అంచెలంచెలుగా అధికారులకు భాగస్వామ్యం ఉండటం వల్ల చట్టాన్ని అమలు చేసే వారే అధికారులకు అండగా నిలుస్తున్నారు.
బైట్ -(దరఖాస్తు దారు) తెప్పించాలి
వాయిస్ 3
మన రాష్ట్రం కంటే ఎంతో చిన్న రాష్ట్రం గోవా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడంలో ఎంతో ముందంజలో ఉంది. అక్కడి కమీషనర్ కార్యాలయం గవర్నర్ కార్యాలయాన్నే సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది... అరుణాచల్ ప్రదేశ్ లో ఆరంభం నుంచే ఆరుగురు కమీషనర్లు ఈ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయడంలో బిజీ బిజీగా ఉన్నారు. మద్యప్రదేశ్ లో ఏకంగా ఐఏయస్ ల ఆస్తులు కూడా వెల్లడించాలని సంచలన తీర్పు చెప్పి సమాచార హక్కు చట్ట చరిత్రలో ఆదర్శంగా నిలిచింది. మరి మనరాష్ట్రానికేమయింది. పని చేసే అధికారులు లేరా.. అర్హులైన వారికి కొరత ఉందా అంటే అదేం లేదు.. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసే ఐఏయస్ లు, ఐపియస్ లు, అనుభవం కల ఉన్నతాధికారులు ఉన్నారు. కానీ సమాచార కమీషన్ కు ఒక్క అధికారిని కూడా కార్యదర్శిగా నియమించలేక పోయింది ప్రభుత్వం. తిరుమల తిరుపతి దేవస్థానానికి జెఇఓగా పనిచేసిన ధర్మారెడ్డిని కమీషన్ కార్యదర్శిగా నియమించింది.. ఈ పోస్టులో కొనసాగడం ఇష్టం లేని ధర్మారెడ్డి అలిగి ఢిల్లీకి వెళ్లారు. తరువాత ఈ పోస్టుకు ఆర్ధిక శాఖలో పనిచేసే శేఖర్ బాబుని నియమించారు. ఆయన కూడా ఈ ఉద్యోగంలో చేరకుండానే దీర్ఘకాలిక సెలవు పై వెళ్లారు. ఆ తరవాత దీన్ని పట్టిచ్చుకున్న నాధుడే లేడు. ఇప్పటికే ఉన్న కమీషనర్లలో ముగ్గురు నవంబర్ 15, 16 తేదీల్లో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి కమీషన్ పూర్తిగా దిగజారిందని, ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా పెండింగులో పడుతున్నాయిని దరఖాస్తు దారులు చెబుతున్నారు. పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను పరిశీలిస్తే 2010 మే నెలలో 5వేల 8వందల 8 కేసులు, జూన్ 24 వరకు 7వేల 3వందల 17, అక్టోబర్ 28 వరకు 12వేల7వందల74, అక్టోబర్ 30 నాటికి 12వేల9వందల33 కేసులు నేటికీ విచారణకు నోచుకోలేదు. ఈ నిర్లక్ష్యం ఇలానే కొనసాగితే కమీషన్ ఆఫీసుకు రావడం కంటే అవినీతి, అక్రమాలను చూసి కళ్లు మూసుకోవడమే మంచిదన్న అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. అధికారులకు రాజకీయ నాయకులకు కూడా కావలసింది ఇదే కాబట్టి వ్యూహాత్మకంగానే చట్టాన్ని నీరుగారుస్తున్నారని సామాజిక వేత్తలు, ప్రజాస్వామిక వాదులు వాదిస్తున్నారు..
బైట్ - మాడభూషి శ్రీధర్ (తెప్పించాలి)
బైట్ - జన్నత్ హుస్సేన్, రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్
మరికొందరు సామాజిక కార్యకర్తల బైట్ లు వాడుకోవచ్చు.
వాయిస్ 4
సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రాన్ని పడగొట్టాలని చూస్తే ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి. సమాచారం కోసం అలుపెరగకుండా తిరిగే పౌరులు కోర్టు గుమ్మం మెట్లు ఎక్కి న్యాయమూర్తుల చేత చివాట్లు తినక ముందే మేలుకుంటే మంచిది.

ీ..

Tuesday, May 31, 2011

కె. బాలచందర్ స్టోరీ

ఎ.జనార్ధన్
ఇంట్రో యాంకర్
సినిమా అంటే వినోదం మాత్రమే కాదు.. సినిమా జీవితాన్ని చూపించాలి. నిజ జీవితానికి అద్దం పట్టాలి.. సగటు మనిషి రోజువారీ జీవితంలో ఎదుర్కోనే సమస్యలకు ఒక దారి చూపాలి. జీవన గమనానికి దిశా నిర్ధేశం చేయగలగాలి. అలా చేయగలిగిన సినిమా.. సినిమా మాత్రమే కాదు వర్తమానాన్ని…భావి జీవితాన్ని కళ్లముందు చూపే దృశ్యకావ్యం. ఇటువంటి వందలాది దృశ్యకావ్యాలను తన ఖాతాలో నింపుకున్న మేటి దర్శకుడు కె. బాల చందర్. రియల్ లైఫ్ ను రీళ్లలో నింపి గుండెలోతులను తడిమిన డైనమిక్ డైరక్టర్ కె. బాలచందర్.. బాలచందర్ కృషిని గుర్తిస్తూ భారత చలన చిత్ర రంగంలో అత్యున్నత అవార్డుగా భావించే దాదా సాహెబ్ పాల్కే అవార్డు కు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.
బ్యాంగ్
యాంకర్ 1
కె.బాలచందర్‌ ..ఈ పేరు వినగానే మన ముందు ఎన్నో జీవితాలు కదలాడుతాయి. అవును.. ఆయన తీసిన సినిమాలు కథలు కావు. అనుక్షణం మన కళ్ల ముందు కదులుతున్న జీవితాలు. నిజ జీవితంలో ఎదురయ్యే వాస్తవాలను ఆయన ఆవిష్కరించినట్టుగా మరే దర్శకుడూ ఆవిష్కరించలేదు. స్త్రీ అంతరంగాన్ని లోతుగా చదివిన దర్శకుడీయన. వివాహ బంధం లో వున్న పురుషాధిపత్యాన్ని తన సినిమాల్లో కళ్లకు కట్టినట్టు చూపిన యదార్థవాది బాలచందర్.
(చిన్న సీన్)
యాంకర్ 2
బాలచందర్‌ తెలుగు లో తీసిన సినిమాల లో ఇది కథ కాదు, అంతులేని కథ , 47 రోజులు , ఆకలి రాజ్యం, మరోచరిత్ర , సింధుభైరవి, ఆడవాళ్లూ మీరు జోహార్లు , మన్మథ లీల, అక్బోబర్‌ 2 , భార్యలూ జాగ్రత్త, కోటి విద్యలు కూటి కొరకే.. తొలి కోడి కూసింది సినిమాలు సినీ వినీలాకాశంలో వన్నె తరగని తారలుగా వెలుగుతున్నయి. సత్యజిత్ రే, మృణాల్ సేన్‌ , శ్యాంబెనెగళ్‌ వంటి దర్శకులు పూర్తి గా ఆర్ట్‌ సినిమా లు తీస్తున్న సమయంలో అటు కమర్షియల్ పంథాకీ, ఇటు సమాంతర చిత్రాల పంథా కీ మధ్యన సరికొత్త ట్రెండ్ లో సినిమాలు తీసిన్రు బాలచందర్‌. లేడీ ఓరియంటెడ్ మూవీ తీసినా, ప్రేమ కథా చిత్రాలు తీసినా, సందేశాత్మక చిత్రాలు తీసినా.. కె.బాలచందర్‌ భారతీయ సినిమా పై తనదైన ప్రత్యేకమైన ముద్రను వేయగలిగిండు.
సీన్/సాంగ్)
యాంకర్ 3
కె.బాలచందర్‌ తీసిన అత్యద్భుత చిత్రాల లో ఇది కథ కాదు ఒకటి. ఈ కథ ఎందరో మహిళల జీవితాలను ఆవిష్కరించింది. ప్రేమ , పెళ్లీ రెండూ విఫలమయి బాధ్యతలతో భారమైనజీవితం గడుపున్న మహిళకు మళ్లీ పాత ప్రియుడు ఎదురయితడు. మనసులో మళ్లీ ఆశ చిగురిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటది. సరిగ్గా ఇప్పుడే చెడ్డవాడైన భర్త మంచివాడి గా మళ్లీ తన జీవితం లోకి వస్తనని అంటడు. మాజీ భర్త, మాజీ ప్రియుడు..ఈ రెండింటి మధ్యా నలుగుతున్న స్త్రీ హృదయాన్ని చూపిస్తూ ..సాగుతుందీ సినిమా.
(ఇది కథ కాదు సీన్) (అటుఇటు కాని పాట)
యాంకర్ 4
కె.బాలచందర్‌ తీసిన మరో ఆణిముత్యం అంతులేని కథ. జీవితం లో ఎన్ని ఒడిదుడుగుకు ఉంటయో చూపిన చిత్రం ఇది. వ్యక్తుల వ్యక్తిత్వాలకు ప్రవర్తనలకు ఉన్న వైరుద్యాలను కళ్లకు కట్టిన సినిమా ఇది.. పైకి కఠినం గా కనిపించే జయప్రద పాత్ర మనసు ఎంత సున్నితమో చెప్తడు బాలచందర్…కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి, ఆశలను చంపేసుకుంటూ బతుకుతున్నా విధి క్షణక్షణం పరీక్షలు పెడుతూనే ఉంటది. ఈ విధి చేసే వింతలకు అంతులేదని ముగింపు పలికిన చిత్రమే అంతులేని కథ.
స్పాట్
యాంకర్ 5
దేశం లో దరిద్రాన్ని చూపిస్తూ, ఆకలి బాధ ను చెప్పే ప్రయత్నం గా తీసిన సినిమా ఆకలిరాజ్యం. ఎమ్. ఏ లు చదివినా ఏ ఉద్యోగం లేక, ఆకలి బాధ ను నీళ్ల తో తీర్చుకుంటూ గడుపుతున్న నలుగురు యువకుల విషాద గాథ ఆకలిరాజ్యం. అప్పటి దేశ పరిస్థితికి అద్దం పట్టిన సినిమా ఇది. ఆకలి రాజ్యం సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఆకలి బాధ ఎలా వుంటదో అనుభవం లోకి వస్తది. ఈ సినిమా లో శ్రీ శ్రీ కవితలు వినిపిస్తయి. మన తల్లి అన్న పూర్ణ, మన భూమి వేదభూమి అంటూనే మన కీర్తి మంచుకొండ అని చమత్కరిస్తడు. ఇట్లాంటి జీవన చమత్కారాలు బాల చందర్ సినిమా నిండా కోకొల్లలు.
(సాపాటు ఎటూ లేదు పాట)
యాంకర్ 6
కె. బాలచందర్ మలిచిన దృశ్యకావ్యాల్లో వాడిపోని వసంతం మరో చరిత్ర. ఈ సినిమా చరిత్రనే తిరగరాసి మరో చరిత్ర సృష్టించిదనుకోవచ్చు. ప్రేమికులు చనిపోయినా బీచ్‌ బండల మీద, కూలిపోతున్న గోడల మీద వాళ్ల పేర్లను రాయించి ప్రేమ బతికేవుందనీ ఇది సరికొత్త చరిత్ర అంటూ బాలచందర్‌ మలిచిన ప్రేమకథా చిత్రం ఇది.. ప్రేమకు జాతీ, భాషా, ప్రాంతం ఇవేమీ అడ్డు కావని చెప్తడు బాల చందర్.
( ఈ తీగ పువ్వును ఏ కొమ్మ తేటిని పాట)
యాంకర్ 7
కె. బాలచందర్.. ఎక్కువగా సమాజంలో స్ర్తీ ఎదుర్కొంటున్న సమస్యలు..వాటి పరిష్కారాల పైనే ఎక్కువగా దృష్టి పెట్టిండు. ఆడవాళ్లూ మీకు జోహార్లు లోనూ స్త్రీ విలువను తెలిపే ప్రయత్నం చేసిండు. ఆడవాళ్ల ఆత్మాభిమానానికి ఆకలికి ఉన్న సంబంధం.. చక్కగా కళ్లకు కడతడు. ఈ సినిమాలో హీరోయిన్ కుండలమ్ముకొనే సీనే దీనికి అచ్చమైన ఉదాహరణ.
(హీరోయిన్ కుండలమ్ముకునే సీన్)
యాంకర్ 8
కె.బాలచందర్‌ సినిమా లలో సంగీతం గురించి ప్రత్యేకం గా చెప్పుకోవాలి. సంగీత దర్శకుడు ఎమ్‌.ఎస్‌. విశ్వనాధన్‌ బాలచందర్‌ కాంబినేషన్‌ సూపర్‌ హిట్ పాటల ను అందిచ్చాయి. ఇది కథ కాదు, అంతులేని కథ, ,మరో చరిత్ర,, గుప్పెడు మనసు సినిమా ల లోని పాటలు ఎప్పుడు విన్నా మన మనసును కదిలిస్తయి.
పాట
యాంకర్ 9
కె.బాలచందర్‌ మ్యూజిక్‌ మెస్ట్రో ఇళయరాజా కాంబినేషన్‌ సైతం అద్బుతమైన పాటలను అందించిన్రు. సుహాసినీ ప్రధాన పాత్రగా బాలచందర్‌ చేసిన సంగీత భరిత చిత్రం సింధుభైరవి. ఈ సినిమా కి గాను ఇళయరాజా బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా నేషనల్ అవార్డ్‌ అందుకున్నారు. అంతేకాదు చిరంజీవి తో బాలచందర్‌ తీసిన రుద్రవీణ కు కూడా ఇళయరాజా నేషనల్ అవార్డ్‌ అందుకున్నారు. బాలచందర్‌ కమలహాసన్‌ ను చార్లీ చాప్లిన్‌ తీరు లో చూపించిన సినిమా డాన్స్‌ మాస్టర్‌. ఈ సినిమా కు ఇళయరాజా అందించిన సంగీతం చెప్పకోదగ్గది.
స్పాట్
యాంకర్ 10
కె.బాలచందర్ తన సినిమాల ద్వారా ఇద్దరు గొప్ప నటులను వెండితెరకు పరిచయం చేశారు. ఒకరు కమలహాసన్‌, ఇంకొకరు రజనీకాంత్. వీరిధ్దరినీ అపూర్వ రాగంగల్ తో ఇంట్రడ్యూస్‌ చేశారు బాలచందర్‌. వీరిధ్దరి కాంబినేషన్‌ లో ఎక్కువ సినిమాలు చేసిన దర్శకుడు కూడా కె.బాలచందరే.హీరోయిన్ లలో సైతం ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌ లు గా వెలుగొందిన తారలు జయప్రద, శ్రీదేవీల ను వెండితెరకు పరిచయం చేసింది కె.బాలచందరే.సహజనటులు గా పేరు గాంచిన సరిత, జయసుధ, సుజాత లను ఇంట్రడ్యూస్‌ చేసింది కూడా కె.బాలచందరే.
స్పాట్
యాంకర్ 11
బాలచందర్‌ ఈ మధ్య కాలం లో తీసిన సినిమా అబద్దం. ఈ సినిమా లో బాలచందర్‌ నటించారు కూడా. కె.బాలచందర్‌ దర్శకుడి గా నే కాకుండా నిర్మాత గా కూడా సినిమా లు నిర్మించారు. మణిరత్నం తీసిన రోజా సినిమా కు నిర్మాత కె.బాలచందర్‌. అలా ఎ.ఆర్‌. రెహమాన్‌ ను ఇంట్రడ్యూస్‌ చేసింది బాలచందరే. ఆ తర్వాత బాలచందర్‌ తీసిన డ్యూయెట్, పరవశం సినిమా లకు రెహమాన్‌ సంగీతాన్నందిచారు.
స్పాట్
ఎండ్ యాంకర్
భారత దేశం గర్వించదగ్గ దర్శకుడు బాలచందర్‌. కథా వస్తువు పరంగా బాలచందర్‌ చేసిన ప్రయోగాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. బాలచందర్‌ తీసిన సినిమాల లో 6 సినిమా లకి ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీ లో నేషనల్ అవార్డ్‌ లభించింది.సినిమా ద్వారా తను చేసిన కళాసేవ కు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1987 లో కె.బాలచందర్‌ ను పద్మ శ్రీ అవార్డు తో సత్కరించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు దాదాసాహెబ్ పాల్కే అవార్డు ప్రకటించడం సినీ వినీలాకాశంలో కాంతులీనే బాల చంద్రునికో నూలు పోగు వంటిది. కె. బాలచందర్ ను చూసి వర్తమాన దర్శకులు నేర్చుకోవలసింది చాలా ఉంది. దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా బాలచందర్ గార్కి కంగ్రాట్స్ చెబుతూ.. బై.. దిసీజ్… సైనింగ్ ఆఫ్..
బ్యాంగ్

ఉగాది

ఉగాది ప్యాకేజి.
బ్యాంగ్
కమ్మనైన కోయిల పాట.. తీయనైన చెరుకు గడ.. వగరులు పొంగించే ఇగురు.. ఇవన్నీ ఒక్క రుతువులోనే లభిస్తయి. ఆ నవరసాల ప్రకృతి రంగవల్లుల రుతువే వసంత రుతువు. ఇవన్నీ మత్తకోకిలలై మత్తేభంలా మందగమనంతో ముందుకు వచ్చే తెలుగింటి పండగ మన ఉగాది.
స్పాట్
ఉగాది అనగానే టక్కున గుర్తోచ్చేది షడ్రుసుల పచ్చడే కాదు రంగురంగుల పరికిణీలతో ఆలయాల్లో సందడి చేసే అమ్మాయిలు కూడా. హైటెక్ యుగంలో కూడా కాస్త అచ్చమైన తెలుగు దనం చూడాలనుకున్న కోరిక ఆ క్షణంలో తీరుతుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా తెలుగింటి పడుగకు ప్రతి ఒక్కరూ సొంతూరు పయనం కడతరు. ఎందుకంటే వసంత పరిమళాలను ఆస్వాదించాలంటే పల్లెటూరులో తప్ప పట్టణంలో అస్సలే సాధ్యం కాదు.
స్పాట్
తెల్లవారు ఝాము నుంచే సందడి చేసే కోయిల స్వరాలు. వయ్యారి నడకతో పలకరించి వెళ్లిపోయే వాగువంకలు. పండుటాకులను వదిలేసి ఇగురులతో పొగరుగా నిక్కి చూసే మామిడి మొక్కలు. మనసును మురిపించి మైమరిపించే మల్లెమొగ్గలు. ఇవన్నీ ఒక్క వసంతానికే సొంతం. ఆ వసంతం ఉగాదికే సొంతం.
స్పాట్
వసంత రుతువు..చైత్ర మాసంలో ఎన్నో కొత్త హంగులతో మనముందుకు తెస్తది. ప్రకృతి అంతా లేత చిగురులతో పచ్చని చీర చుట్టుకున్నట్టుంటది.. పక్షుల కిలకిల రావాలతో పల్లె మొత్తం సందడి చేస్తది.. వసంత రుతువు ఆరంభంతోనే మన మనసులను దోచుకుంటది.
స్పాట్
ఉగాది పండుగ రోజున గడపలను మామిడి తోరణాలతో అలంకరిస్తరు.. దీనికీ ఓ కారణముంది. బంధువులతో కిటకిటలాడే ఇండ్లల్లో సరిపడా ఆక్సీజన్ కావాలని పచ్చనాకులతో తోరణాలు కడతరని పెద్దలు చేప్తరు. ప్రతి ముంగిలి రంగురంగుల ముగ్గులతో ఇంధ్రదనస్సును మరిపిస్తది. ప్రతి ఇల్లు కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో కళకళలాడుతుంటది.
స్పాట్
తెలుగు సంవత్సరం రోజున అందరూ ఆలయాలకు వెళ్లి పూజలు, అర్చనలు చేయించుకుంటరు. రంగు, రుచి, వాసన కలగలిసిన ఏకైక పండుగ ఉగాది. ఎందుకంటే ఎటు చూసినా హయిగొల్పే పచ్చని రంగు, ఆహ్లాదకరమైన కొత్త చిగురుల వాసన, కమ్మని పచ్చి మామిడి కాయల రుచి ఇవన్నీ ఒక్క ఉగాది పండుగకే సొంతం.
స్పాట్(ఉగాది పచ్చడి విజువల్స్)
ఉగాది అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మామిడి, వేపపూత, కొత్త చింతపండు, బెల్లంలతో చేసే ఈ పచ్చడిని ఉగాది రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాలని పెద్దలు చెప్తరు.. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులను కలగలిపి చేసే ఈ పదార్థం మనకు ఒక సందేశాన్నిస్తది. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను ఒకేవిధంగా స్వీకరించాలనేది ఉగాది పచ్చడి అర్థం.
స్పాట్(ఉగాది పచ్చడి తయారీ విజువల్స్)
షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఆస్వాదించడంలో మరో విషయం దాగుంది. వేప పూతతో చేసిన ఈ పచ్చడిని సేవించడం వల్ల ఆరోగ్యంగా ఉంటరు. సంవత్సరం పొడవునా ఎటువంటి అనారోగ్యం దరిచేరకుండా హాయిగా ఉంటరని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. ఉదయాన్నే ఖాళీపొట్టతో దీన్ని సేవిస్తే మంచి ఫలితమిస్తుందట.
ఉగాది పండుగను జరుపుకోవడం గురించి రెండు గాథలు ప్రచారంలో ఉన్నయి. బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజు కాబట్టి ఉగాదిని జరుపుకుంటరని ఒకటి. మరొకటి సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను తీసుకుని పారిపోతుంటే శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడ్ని సంహరించి వేదాలను అపహరణ నుండి కాపాడిండట. ఆ రోజునే మొత్తం సృష్టి నిర్మితమైందని, అప్పటి నుంచే ఉగాది పండుగను జరుపుకోవడం మొదలైందని మరొక పురాణగాథ.
ఉగాది పండుగ రోజున ప్రతిఒక్కరూ ఎదురు చూసే ఘట్టం పంచాంగ శ్రవణం. నూతన సంవత్సరంలో తమ పేరుమీద రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నయో పంచాంగం ద్వారా తెలుసుకుంటరు. ఏవైనా దోషాలుంటే గ్రహశాంతులు జరిపించుకుని తమ జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఇది ఉపయోగ పడతదని భావిస్తరు.
స్పాట్
తెలుగువారే కాదు భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనూ ఉగాది ఉత్సవాలను జరుపుకుంటరు. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో ఈ ఉగాది వేడుకలను జరుపుకుంటరు. ఒక్కో ప్రాంతంలో ఈ పండుగను ఒక్కో పేరుతో పిలుస్తరు. మహారాష్ట్రలో గుడి పాడ్వా అని, ఆస్సాంలో బిహు, కేరళ లో కొల్లావర్షం, పంజాబ్‌లో భైసాకి, తమిళనాడులో పుత్తాండు, పశ్చిమబెంగాల్‌లో విషుప అనే పేర్లతో ఉగాది సంబరాలను జరుపుకుంటరు. కర్ణాటకలో మాత్రం ఈ పండుగను ఉగాది గానే సంబోధిస్తరు.
స్పాట్
వికృతి నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి శ్రీకర నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నం. గడచిన సంవత్సరంలో ఎన్నో జ్ఞపకాలు పదిలంగా మూట కట్టుకున్నం. అందులో మనకు ఇష్టం ఉన్నా లేకున్నా అనుభవించిన చేదు జ్ఞాపకాలెన్నో.. జీవితాంతం మరిచిపోలేని తీయని అనుభూతులూ ఎన్నో .. మనం నడిచిన ప్రతి అడుగునూ సరిచేసుకుంటూ కొత్త సంవత్సరంలో మరిన్ని విజయాలు పొందాలని కోరుకుందాం..వన్స్ అగైన్ హాపీ ఉగాది.
బ్యాంగ్

Friday, March 4, 2011

పారిజాతం కథ

పూర్వం మరాఠా దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు ఉండేవాడు. సంతానం లేని కారణంగా ఆ మహారాజు దంపతులు ఎంతో దిగులు చెందుతూండేవారు. ఆయన భార్యా సమేతంగా ఎన్నెన్నో పూజలు, వ్రతాలు, హోమాలు జరిపిస్తూ ఎన్నో సంవత్సరాలు వేచిచూసిన తరవాత ఒకానొక శుభసమయాన బంగారుబొమ్మ లాంటి కుమార్తె జన్మించింది. ఆ శిశువు జన్మించగానే ఆమె ముఖంలో కనిపించిన అద్వితీయమైన తేజస్సును చూసి రాజుగారి ఆస్థాన పండితులు ఆ పాపకు 'పారిజాతమణి ' అని నామకరణం చేశారు. తమకి లేకలేక కలిగిన పారిజాతమణిని మహారాజు దంపతులు పుట్టినప్పటి నుంచీ సకల సౌకర్యాలు కలిగిన ఒక పెద్ద మహలులో ఎండ కన్నెరగకుండా, ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. అసామాన్యమైన రూపలావణ్యాలతో మణి వలె ప్రకాశించే తమ గారాలపట్టిని చూస్తే ఏ దేవకన్యో తమ ఇంట పుట్టిపెరుగుతోందనిపించేది ఆ దంపతులకి. మరాఠా మహారాజు ఆస్థాన పండితులు, విద్వాంసులు అందరూ కూడా బాల్యం నుంచే పారిజాతమణికి విద్యాబుద్దులూ, సంగీత నాట్యాలు సమస్తం ఆ మహలుకెళ్ళి నేర్పించేవారు. ఆ విధంగా అన్ని విద్యలలోనూ ఆరితేరిన పారిజాతమణి యుక్తవయసు వచ్చేనాటికి తన సమాన సౌందర్యానికి ధీటుగా విద్యాబుద్దుల్లోనూ, గుణగణాల్లోనూ సాటి లేని మేటి అనిపించుకుంది. పారిజాతమణి అద్భుత సౌందర్యం గూర్చి, అనన్య ప్రతిభా పాటవాల గూర్చి చుట్టుపక్కల దేశాల్లోని రాజులందరూ ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. అంతటి అసమాన సౌందర్యవతి, గుణవతి అయిన పారిజాతమణి తమ దేశపు రాకుమారిగా పుట్టడం ముక్కోటి దేవతల అనుగ్రహమేనని ఆ దేశపు ప్రజలందరూ కూడా ఎంతో గర్వించేవారు.

ఆ విధంగా ఎండ కన్నెరుగకుండా అత్యంత సున్నితంగా, సుకుమారంగా పెరిగిన పారిజాతమణి పదహారో ఏట అడుగిడినాక ఒకానొక రోజున ప్రాతఃకాలాన్నే నిదురలేచి తన చెలికత్తెలెవరికీ తెలియకుండా, సఖులెవరి తోడూ లేకుండా ఒంటరిగా తను ఉండే ఆ మహలు వెనుకవైపునున్న ఉద్యానవనంలోకి నడిచింది. మహలులోంచి బయటకు రాగానే పారిజాతమణి కళ్ళబడిన మొట్టమొదటి దృశ్యం ఏమంటే.. నిశ్శబ్ద నిశీధిలో ముసురుకున్న చిమ్మచీకటి తెరలను తన ప్రభాత అరుణ కిరణాలతో చీల్చుకుంటూ, దేదీప్యమానంగా ప్రకాశిస్తూ, శ్వేతాశ్వాహనరూఢుడై తన బంగారు రధంపై పయనిస్తూ ఈ ప్రపంచానికి తన ఉషస్సుతో కొత్త అందాన్ని అద్దుతూ కనిపించిన సూర్యభగవానుడు.. తూర్పు దిక్కున ఉదయిస్తున్న భానుడిని చూసీ చూడగానే పారిజాతమణి తనువు, మనసు కూడా ఒక అవ్యక్తానుభూతికి లోనయింది. ఆ విధంగా తొలిచూపులోనే పారిజాతమణి సూర్యభగవానుణ్ణి వరించింది. ఆ రోజు మొదలు ప్రతీ రోజూ పారిజాతమణి తూర్పు నుండి పడమరకు సాగిపోయే సూర్యుడిని చూస్తూనే గడిపేది. సూర్యాస్తమయ సమయం ఆసన్నమయిందంటే చాలు, భాస్కరుని దివ్యముఖారవిందము కనుమరుగైపోతుందనీ, మరలా వేకువజాము వరకూ సూర్యదర్శన భాగ్యం ఉండదనీ ఆమె మనసు విలవిలలాడిపోయేది. అంతగా మనసా వాచా కర్మణా నిరంతరం సూర్యుణ్ణే స్మరిస్తూ ఆ భానుడి రూపాన్నే తన మనోఫలకంపై చిత్రించుకుంది పారిజాతమణి.

అలా పారిజాతమణికి ఎన్నో దినాలు భానుని నిరీక్షణలో గడిచాయి. కొంతకాలానికి తనని అత్యంత భక్తి శ్రద్ధలతో, నిష్టగా, క్రమం తప్పక ధ్యానిస్తున్న అపురూప సౌందర్య రాశి అయిన పారిజాతమణి పట్ల సూర్యుడు కూడా ఆకర్షితుడైనాడు. ఆనక వారిరువురి మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరిసి సూర్యపారిజాతాలిరువురూ ప్రణయ సాగరంలో ఓలలాడసాగారు. వారిరువురి ప్రణయానుబంధం కొద్దికాలమైనా సాగకముందే వీరి ప్రేమవార్త స్వర్గలోకం వరకూ పాకింది. దేవతాపురుషుడైన సూర్యుడు కేవలం ఒక మానవ కన్య అయిన పారిజాతమణి ప్రేమలో మునిగితేలడం దేవతల రాజైన దేవేంద్రుడికి కోపహేతువైనది. తక్షణమే భాస్కరుని తన కొలువుకి పిలిపించమని దేవలోక భటులను ఆదేశించాడు. దేవతలందరి సమక్షంలో సూర్యుణ్ణి న్యాయవిచారణ చేసి తను చేసే పని తగదనీ, ఇకపై పారిజాతమణి ప్రేమను వదులుకోకపోతే తన దైవత్వం పోగలదనీ హెచ్చరించారు. ఆనాటి తరువాత సూర్యుడు పారిజాతమణి వైపు మరి కన్నెత్తి చూడలేదు. సూర్యుని రాక కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న పారిజాతమణికి నిరాశే ఎదురయింది. తాను ప్రాణప్రదంగా ప్రేమించిన సూర్యుని నిరాదరణను, నిర్లక్ష్యాన్ని భరించలేని ఆమె ఆ మరుక్షణంలోనే సూర్యుని ఎదుటనే అగ్నికి ఆహుతై ప్రాణత్యాగం చేసింది.

పారిజాతమణి ఆహుతైపోయిన తరవాత మిగిలిన ఆమె చితాభస్మంలో నుంచి ఒక మొక్క పుట్టింది. ఆ మొక్కే పెరిగి 'పారిజాత' వృక్షమయింది. పారిజాతమణి అతివగా ఉన్నప్పటి ఆమె అద్వితీయ సౌందర్యమంతా గుభాళించే పరిమళంగా మారి ఆ చెట్టు పువ్వుల్లో ఒదిగిపోయింది. పారిజాత సుమాలు తనని, తన ప్రేమని నిర్లక్ష్యం చేసిన సూర్యకిరణాల్ని తాళలేవు. అందుకే సూర్యాస్తమయం అయ్యాక మాత్రమే పుష్పించే ఈ చెట్టు తొలివేకువనే సూర్యోదయం అయ్యీ అవకముందే సువాసనలు వెదజల్లే తన పువ్వులన్నీటినీ అశ్రువుల్లాగా రాల్చేస్తుంది. పగలంతా మౌనంగా శోకదేవతలా కనిపించే పారిజాత వృక్షాన్ని శోకవృక్షం (sad tree) అని కూడా పిలుస్తారు. పారిజాతంలోని నిష్కల్మషమైన ప్రేమనీ, సున్నితమైన మనసునీ, సుకుమార రూపాన్ని చూసి ముగ్ధుడైన శ్రీ మహావిష్ణువు ఏ పుష్పాలకీ లేని సమున్నతమైన గౌరవాన్ని పారిజాతానికి ప్రసాదించాడు. కేవలం పారిజాత పుష్పాలను మాత్రమే నేలరాలిన సుమాలను సైతం స్వామి అలంకరణకి వినియోగించవచ్చు. అంతే కాదు.. శ్రీ మహా విష్ణువుకి ప్రత్యేకంగా చేసే ధనుర్మాస పూజలు పారిజాతం లేకుండా జరగవంటే అతిశయోక్తి కాదు. అలాగే పారిజాతం తనని ప్రార్ధించినవారి పాలిట కల్పవృక్షమై ఇష్టకామ్యాదిసిద్ధులూ నెరవేర్చడమే కాకుండా తనలో ఉన్న ఔషధగుణాలతో మానవ జాతికి ఆయురారోగ్యాలనీ ప్రసాదించగలదు. ఆ విధంగా అప్పటి నుంచీ ఇప్పటి వరకూ కూడా పారిజాతం ప్రతీ ఉదయం సూర్యుని పట్ల తనకున్న ప్రేమను అశ్రుధారల్లా పుష్పరూపంలో వర్షించి దైవం పాదాలను అభిషేకిస్తోంది.


** పారిజాత వృక్షం గురించి ఎప్పటినుంచో ఒక కథ ప్రచారంలో ఉంది. సూర్యుణ్ణి వరించిన ఒక రాకుమారి ఆత్మాహుతి చేసుకోగా వచ్చిన భస్మంలో నుంచి ఈ చెట్టు పుట్టిందని. దాన్ని ఆధారంగా చేసుకుని, నా ఊహను కాస్త జోడించి ఒక కథలాగా వ్రాసే ప్రయత్నం చేసాను. మీ అభిప్రాయాలు తెలియచేయవలసిందిగా మనవి.

Sunday, February 27, 2011

కసబ్‌ ఎందుకు నవ్విండంటే???

కసబ్ పకపకా నవ్వాడు... పగలబడి నవ్వాడు...
ఈ దేశ దౌర్భాగ్యాన్ని చూసి విరగబడి నవ్వాడు...
-----
చేతికి చిక్కిన యుద్ధఖైదీకి ఇచ్చే రాచమర్యాదల్ని చూసి...
శత్రు దేశంలో కోట్ల కర్చుతో తనకిచ్చే భారీ భద్రత చూసి...
కోడి బిర్యానీలూ, మేక పులావులతో మేపే తీరు చూసి...
దేశంపైనే దాడి చేసినా యేళ్లకేళ్లు జరిగే విచారణ చూసి...
తను నిర్దోషని వాదించే ఓ సర్కారీ న్యాయవాదిని చూసి...
లక్ష కాగితాల కట్టల్లో చెదలు పడుతున్న దర్యాప్తు చూసి...
ఇప్పటికే బహిరంగ ఉరి తీయలేని ఈ వ్యవస్థ అవస్థ చూసి...
ఇక తనకు యేళ్లకేళ్ళు ఢోకా లేదంటూ ఎగతాళిగా నవ్వాడు...
----
ఇంకా సుప్రీంకోర్టు, ఆపైన ఫుల్ బెంచీ ఉండనే ఉన్నాయట...
రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుకునే చాన్సూ పదిలమేనట...
మరణ దండన ఖరారైనా పదేళ్లూ బతికే వీలుందట...
ఉరి తీసే తలారులూ రిటైరయ్యారట, కొత్తవాళ్లు లేరట...
ఉరి వరుసలో తనకన్నా సీనియర్లే నిరీక్షిస్తున్నారట...
టైముకు మైనారిటీ వోట్లు గుర్తొచ్చి పాలకులే వణకొచ్చట...
అఫ్జల్ గురూ లాగే రాజభోగాలతో బతికేసే వీలూ ఉందట...
దిక్కుమాలిన వోట్ల మంత్రాలే రాజ్యాన్ని పాలిస్తున్నాయట...
శత్రు సైనికుడికీ వర్తించే చట్టాలు చూసి పడీపడీ నవ్వాడు...
-----
ఇక్కడికి కోట్లాదిగా వలసొచ్చి డామినేట్ చేస్తూ బతకొచ్చు...
యేళ్లకేళ్లు స్లీపర్ సెల్స్ పేరిట ఎంచక్కా బతికేయవచ్చు...
లక్షల కోట్ల దొంగ కరెన్సీతోనూ దేశంపై దాడి చేయొచ్చు...
ఆత్మాహుతి దాడులతో, ఆర్డీఎక్స్ మోతలతో వణికించవచ్చు...
కాదంటే నేరుగా పార్లమెంటుపైనే దాడులు చేయొచ్చు...
అక్షరధాములూ, అయోధ్యలూ టార్గెట్ చేసుకోవచ్చు...
పట్టుబడినా లీడర్ల సాయంతో ఇట్టే విడుదల కావొచ్చు...
లేదంటే నేరుగా ఆర్థిక రాజధానిపైనే దాడి చేయొచ్చు...
నెత్తురుడిగి, ఎముకలు కుళ్ళిన దేశాన్ని ఏమైనా చేయొచ్చు...
ఎవడికీ ఏమీ కాదు, సమాజమూ ఎవరిపైనా తిరగబడదు...
పాలకుడి కాలర్ పట్టి నిలదీయదు, కనీసం ప్రశ్నించదు...
అందుకే కసబ్ నవ్వాడు... దేశాన్నే చూసి నవ్వాడు...
ఏ కసీ లేని ఈ సమాజాన్ని చూసి వెటకారంగా నవ్వాడు...!!

తెలంగాణలో సహాయనిరాక"రణం"


ఎ. జనార్ధన్

ఏ దేశచరిత్ర చూసినా ఏముంది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. అణిచివేత ఆక్రమణలు ప్రపంచానికి కొత్త కాదు. కానీ తెలంగాణలో సాగుతున్న దోపిడీ తీరే కొత్త. ఒక జాతి మరొక జాతిని, ఒక తెగ మరొక తెగను దాడి చేయడం చూశాం.. లేదా ఒకే ప్రాంతంలో తన జాతి ప్రజలను చెప్పుచేతల్లో ఉంచుకోవడం చూశాం.. అనాగరిక శతాబ్దంలో దేశాన్ని దేశం, రాజ్యాన్ని రాజ్యం ఆక్రమించుకోవడం చూశాం..కానీ హైటెక్ యుగంలో కూడా ఒక ప్రాంతాన్ని మరో ప్రాంతం నిలువు దోపిడీ చేయడం ఒక్క తెలంగాణలోనే చూస్తున్నం..
ఎక్కడ అణిచివేత, ఆక్రమణలు విశృంకలంగా జడలు విప్పుకుంటయో..అక్కడ తిరుగు బాటు మొదలవుతది. ఇది చరిత్ర చెప్పిన నిజం.. ఆ నిజమే మరోసారి నిప్పులు కక్కుతోంది.
సరిగ్గా రెండు వందల ఏండ్లకు ముందు భారతదేశంలో తెల్లదొరలు మంచి మాటలతో మాటువేసిన్రు.. చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఏకంగా రాజ్యాధికారాన్నే హస్తగతం చేసుకున్నరు. దేశాన్ని అందిన కాడికి దోచుకోవడమే కాకుండా భారతీయులను బానిసలను చేసిన్రు. ఎదిరించిన వారిని తూటాలతో పేల్చి పడేసిన్రు ఆడా మగా తేడాలేకుండా చిత్రహింసలు పెట్టిన్రు. వందేమాతరం అన్న నోళ్లను శాశ్వతంగా మూసేసిన్రు. నిరాటంక దోపిడీ కోసం లక్షలాధిమంది ప్రజలను పొట్టన బెట్టుకున్నరు. అయినా పోరాటం ఆగలేదు.. తిరుగుబాటు తప్పలేదు.. ఆ తిరుగుబాటులో పూసిన పువ్వులే సహాయనిరాకరణ విదేశీవస్తు బహిష్కరణ..
ఇప్పుడు మనం చూసిన ఈ స్వాతంత్ర్య పోరాటాలేవీ తెలంగాణకు అప్పుడు తెలియవు. ఎందుకంటే యావత్ భారత దేశం పరాయి దేశ పాలకుల కబంధ హస్తాల్లో చిక్కినా తెలంగాణ మాత్రం ఒక స్వతంత్ర రాజ్యంగానే విలసిల్లింది. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం, తెలంగాణ గడ్డపై ఉదయించడానికే గడగడ లాడింది. ఎందుకంటే ఇక్కడి నెత్తురు అటువంటిది.. ఈ నేల పౌరుషం అంతటిది. కాస్త కాలు మోపుదామనుకున్నపుడే కొమరం భీం ఉరుములకు నాలుగడుగులు వెనక్కి వేసింది బ్రిటీష్ సైన్యం. మట్టి కణాలు నిప్పుకణాల్లా నిగనిగలాడం చూసి భయపడ్డరు తెల్లదొరలు. అందుకే అప్పుడు తెలంగాణ ప్రజలకు సహాయనిరాకరణ అవసరం రాలేదు.
దేశం మొత్తానికి స్వతంత్రం సిద్దించిందట.. సరిగ్గా అప్పుడే తెలంగాణకు పరతంత్రం దాపురించింది. బ్రిటీష్ పాలకుల కుతంత్రాలను నేర్చుకున్న సీమాంధ్రులు.. వాటన్నిటినీ తెలంగాణ బిడ్డలపై ప్రయోగించిన్రు. మెత్తటి మాటలతో తిష్టవేసి గుడిని, బడిని ఏకంగా రాజధానిని దోచేసిన్రు. తెలంగాణ ప్రజలు కళ్లు తెరిచే సరికే ఇది మా సొత్తు అని ఎగబడుతున్నరు. ఇది బ్రిటీషోణ్ని మించిన సంకర జాతి పాలన. విదేశీయులైనా తెల్లదొరలు దేశాన్ని అభివృద్ది చేసే పనులు చేసి తమ పబ్బం గడుపుకున్నరు. కానీ సీమాంధ్రులు మాత్రం ఇక్కడి నాగరికతను నేర్చుకొని, రెంట్ కంట్రోల్ యాక్ట్ పుట్టించుకొని పావలాకూ బేడాకు తిష్టవేసిన్రు. ఇది మా రాజ్యమని బొంకుతున్నరు.
ఆనాడు బ్రిటీష్ వాడి ఉక్కు పాదాలకింద నలిగిపోయిన భారతీయులకు గాంధీజీ ఇచ్చిన ఆయుధాలు అహింస, సత్యాగ్రహం, సహాయనిరాకరణ. తెల్లదొరలు దేశాన్ని వదిలిపోయేలా తరిమి తరిమి కొట్టింది ఈ ఆయుధాలతోనే. యావత్ ప్రపంచానికి రక్తపాత రహిత ఉద్యమం నేర్పింది భారతదేశమే. తెలంగాణకు అప్పుడు లేని..రాని అవసరం ఇప్పుడొచ్చింది.. అందుకే గాంధీజీ ఇచ్చిన ఆ ఆయుధాలకు పదును పెట్టి ప్రయోగిస్తొంది తెలంగాణ. రక్తపాత రహిత ఉద్యమం. సహాయనిరాకరణం. సంపూర్ణ సహాయ నిరాకరణం. ది పవర్ఫుల్ వెపన్..నో పే..నో బిల్..నో వర్క్.. నో కోఆపరేషన్ ..
చరిత్ర పునరావృతమయింది. నియంతృత్యం నిద్దురలేచింది. ఆనాడు తెల్లదొరల నీతే ఈనాడు నల్లదొరలు పాటిస్తున్నరు..ఏనాడైతే తెల్లదొరలు ఈ దేశాన్ని ఆక్రమించిన్రో ఆనాడే మన భారతీయుల బాషలో ఇంగ్లీష్ ఇమిడిపోయింది. దేశబాష సంకరమై సంకటాల పాలయింది. సంస్కృతి చట్టుబండలయింది.. మతం మైలబడ్డది.. ఆనాడు బాష మీద, సంస్కృతి మీదా, చరిత్ర మీద, జరిగిన దాడే తెలంగాణలోనూ జరిగింది. అందుకే భారత దేశంలో మరో స్వాతంత్ర్య సమరం మొదలయింది...మా బాష, మా యాసలను గౌరవించాలే.. మా నీళ్లు, నిధులు, నియామకాలు మాకే కావాలే అన్ననినాదం గల్లీ నుంచి ఢీల్లీకి పాకింది. నాడు అస్తమించిన నెత్తుటి పొద్దు మళ్లీ ఉదయించింది. ఉక్కు తుపాకులు తుప్పు వదిలించుకుంటున్నయి. అమాయకుల దేహాలపై రబ్బరు బుల్లెట్లు, పెల్లెట్లు సవారి చేస్తున్నయి. స్వాతంత్ర్య పోరాటంలో నాడు డయ్యర్ మించిన దాష్టికానికి తెగబడుతున్నరు ఆంధ్రపాలకులు. ఆడా మగా, పిల్లా పాపా అన్న తేడా లేక ఉసురు గొట్టుకుంటున్నరు. అయినా తెలంగాణ బిడ్డల సహనం చూసి పెల్లెట్లు బుల్లెట్లు కూడా తలదించుకుంటున్నయి. మెద్దుబారిన కేంద్రం మెదడులో కూడా కదలిక వస్తంది. ఇదే స్పూర్తి , ఇదే పోరాటం..ఇదే సహాయ నిరాకరణం..తెలంగాణ వచ్చేదాకా..ఇదే బాట ఇదే బాసట...ది అల్టిమేట్ పవర్ ఫుల్ వెపన్..నాన్ కోఆపరేషన్..