ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Friday, March 4, 2011

పారిజాతం కథ

పూర్వం మరాఠా దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు ఉండేవాడు. సంతానం లేని కారణంగా ఆ మహారాజు దంపతులు ఎంతో దిగులు చెందుతూండేవారు. ఆయన భార్యా సమేతంగా ఎన్నెన్నో పూజలు, వ్రతాలు, హోమాలు జరిపిస్తూ ఎన్నో సంవత్సరాలు వేచిచూసిన తరవాత ఒకానొక శుభసమయాన బంగారుబొమ్మ లాంటి కుమార్తె జన్మించింది. ఆ శిశువు జన్మించగానే ఆమె ముఖంలో కనిపించిన అద్వితీయమైన తేజస్సును చూసి రాజుగారి ఆస్థాన పండితులు ఆ పాపకు 'పారిజాతమణి ' అని నామకరణం చేశారు. తమకి లేకలేక కలిగిన పారిజాతమణిని మహారాజు దంపతులు పుట్టినప్పటి నుంచీ సకల సౌకర్యాలు కలిగిన ఒక పెద్ద మహలులో ఎండ కన్నెరగకుండా, ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. అసామాన్యమైన రూపలావణ్యాలతో మణి వలె ప్రకాశించే తమ గారాలపట్టిని చూస్తే ఏ దేవకన్యో తమ ఇంట పుట్టిపెరుగుతోందనిపించేది ఆ దంపతులకి. మరాఠా మహారాజు ఆస్థాన పండితులు, విద్వాంసులు అందరూ కూడా బాల్యం నుంచే పారిజాతమణికి విద్యాబుద్దులూ, సంగీత నాట్యాలు సమస్తం ఆ మహలుకెళ్ళి నేర్పించేవారు. ఆ విధంగా అన్ని విద్యలలోనూ ఆరితేరిన పారిజాతమణి యుక్తవయసు వచ్చేనాటికి తన సమాన సౌందర్యానికి ధీటుగా విద్యాబుద్దుల్లోనూ, గుణగణాల్లోనూ సాటి లేని మేటి అనిపించుకుంది. పారిజాతమణి అద్భుత సౌందర్యం గూర్చి, అనన్య ప్రతిభా పాటవాల గూర్చి చుట్టుపక్కల దేశాల్లోని రాజులందరూ ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. అంతటి అసమాన సౌందర్యవతి, గుణవతి అయిన పారిజాతమణి తమ దేశపు రాకుమారిగా పుట్టడం ముక్కోటి దేవతల అనుగ్రహమేనని ఆ దేశపు ప్రజలందరూ కూడా ఎంతో గర్వించేవారు.

ఆ విధంగా ఎండ కన్నెరుగకుండా అత్యంత సున్నితంగా, సుకుమారంగా పెరిగిన పారిజాతమణి పదహారో ఏట అడుగిడినాక ఒకానొక రోజున ప్రాతఃకాలాన్నే నిదురలేచి తన చెలికత్తెలెవరికీ తెలియకుండా, సఖులెవరి తోడూ లేకుండా ఒంటరిగా తను ఉండే ఆ మహలు వెనుకవైపునున్న ఉద్యానవనంలోకి నడిచింది. మహలులోంచి బయటకు రాగానే పారిజాతమణి కళ్ళబడిన మొట్టమొదటి దృశ్యం ఏమంటే.. నిశ్శబ్ద నిశీధిలో ముసురుకున్న చిమ్మచీకటి తెరలను తన ప్రభాత అరుణ కిరణాలతో చీల్చుకుంటూ, దేదీప్యమానంగా ప్రకాశిస్తూ, శ్వేతాశ్వాహనరూఢుడై తన బంగారు రధంపై పయనిస్తూ ఈ ప్రపంచానికి తన ఉషస్సుతో కొత్త అందాన్ని అద్దుతూ కనిపించిన సూర్యభగవానుడు.. తూర్పు దిక్కున ఉదయిస్తున్న భానుడిని చూసీ చూడగానే పారిజాతమణి తనువు, మనసు కూడా ఒక అవ్యక్తానుభూతికి లోనయింది. ఆ విధంగా తొలిచూపులోనే పారిజాతమణి సూర్యభగవానుణ్ణి వరించింది. ఆ రోజు మొదలు ప్రతీ రోజూ పారిజాతమణి తూర్పు నుండి పడమరకు సాగిపోయే సూర్యుడిని చూస్తూనే గడిపేది. సూర్యాస్తమయ సమయం ఆసన్నమయిందంటే చాలు, భాస్కరుని దివ్యముఖారవిందము కనుమరుగైపోతుందనీ, మరలా వేకువజాము వరకూ సూర్యదర్శన భాగ్యం ఉండదనీ ఆమె మనసు విలవిలలాడిపోయేది. అంతగా మనసా వాచా కర్మణా నిరంతరం సూర్యుణ్ణే స్మరిస్తూ ఆ భానుడి రూపాన్నే తన మనోఫలకంపై చిత్రించుకుంది పారిజాతమణి.

అలా పారిజాతమణికి ఎన్నో దినాలు భానుని నిరీక్షణలో గడిచాయి. కొంతకాలానికి తనని అత్యంత భక్తి శ్రద్ధలతో, నిష్టగా, క్రమం తప్పక ధ్యానిస్తున్న అపురూప సౌందర్య రాశి అయిన పారిజాతమణి పట్ల సూర్యుడు కూడా ఆకర్షితుడైనాడు. ఆనక వారిరువురి మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరిసి సూర్యపారిజాతాలిరువురూ ప్రణయ సాగరంలో ఓలలాడసాగారు. వారిరువురి ప్రణయానుబంధం కొద్దికాలమైనా సాగకముందే వీరి ప్రేమవార్త స్వర్గలోకం వరకూ పాకింది. దేవతాపురుషుడైన సూర్యుడు కేవలం ఒక మానవ కన్య అయిన పారిజాతమణి ప్రేమలో మునిగితేలడం దేవతల రాజైన దేవేంద్రుడికి కోపహేతువైనది. తక్షణమే భాస్కరుని తన కొలువుకి పిలిపించమని దేవలోక భటులను ఆదేశించాడు. దేవతలందరి సమక్షంలో సూర్యుణ్ణి న్యాయవిచారణ చేసి తను చేసే పని తగదనీ, ఇకపై పారిజాతమణి ప్రేమను వదులుకోకపోతే తన దైవత్వం పోగలదనీ హెచ్చరించారు. ఆనాటి తరువాత సూర్యుడు పారిజాతమణి వైపు మరి కన్నెత్తి చూడలేదు. సూర్యుని రాక కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న పారిజాతమణికి నిరాశే ఎదురయింది. తాను ప్రాణప్రదంగా ప్రేమించిన సూర్యుని నిరాదరణను, నిర్లక్ష్యాన్ని భరించలేని ఆమె ఆ మరుక్షణంలోనే సూర్యుని ఎదుటనే అగ్నికి ఆహుతై ప్రాణత్యాగం చేసింది.

పారిజాతమణి ఆహుతైపోయిన తరవాత మిగిలిన ఆమె చితాభస్మంలో నుంచి ఒక మొక్క పుట్టింది. ఆ మొక్కే పెరిగి 'పారిజాత' వృక్షమయింది. పారిజాతమణి అతివగా ఉన్నప్పటి ఆమె అద్వితీయ సౌందర్యమంతా గుభాళించే పరిమళంగా మారి ఆ చెట్టు పువ్వుల్లో ఒదిగిపోయింది. పారిజాత సుమాలు తనని, తన ప్రేమని నిర్లక్ష్యం చేసిన సూర్యకిరణాల్ని తాళలేవు. అందుకే సూర్యాస్తమయం అయ్యాక మాత్రమే పుష్పించే ఈ చెట్టు తొలివేకువనే సూర్యోదయం అయ్యీ అవకముందే సువాసనలు వెదజల్లే తన పువ్వులన్నీటినీ అశ్రువుల్లాగా రాల్చేస్తుంది. పగలంతా మౌనంగా శోకదేవతలా కనిపించే పారిజాత వృక్షాన్ని శోకవృక్షం (sad tree) అని కూడా పిలుస్తారు. పారిజాతంలోని నిష్కల్మషమైన ప్రేమనీ, సున్నితమైన మనసునీ, సుకుమార రూపాన్ని చూసి ముగ్ధుడైన శ్రీ మహావిష్ణువు ఏ పుష్పాలకీ లేని సమున్నతమైన గౌరవాన్ని పారిజాతానికి ప్రసాదించాడు. కేవలం పారిజాత పుష్పాలను మాత్రమే నేలరాలిన సుమాలను సైతం స్వామి అలంకరణకి వినియోగించవచ్చు. అంతే కాదు.. శ్రీ మహా విష్ణువుకి ప్రత్యేకంగా చేసే ధనుర్మాస పూజలు పారిజాతం లేకుండా జరగవంటే అతిశయోక్తి కాదు. అలాగే పారిజాతం తనని ప్రార్ధించినవారి పాలిట కల్పవృక్షమై ఇష్టకామ్యాదిసిద్ధులూ నెరవేర్చడమే కాకుండా తనలో ఉన్న ఔషధగుణాలతో మానవ జాతికి ఆయురారోగ్యాలనీ ప్రసాదించగలదు. ఆ విధంగా అప్పటి నుంచీ ఇప్పటి వరకూ కూడా పారిజాతం ప్రతీ ఉదయం సూర్యుని పట్ల తనకున్న ప్రేమను అశ్రుధారల్లా పుష్పరూపంలో వర్షించి దైవం పాదాలను అభిషేకిస్తోంది.


** పారిజాత వృక్షం గురించి ఎప్పటినుంచో ఒక కథ ప్రచారంలో ఉంది. సూర్యుణ్ణి వరించిన ఒక రాకుమారి ఆత్మాహుతి చేసుకోగా వచ్చిన భస్మంలో నుంచి ఈ చెట్టు పుట్టిందని. దాన్ని ఆధారంగా చేసుకుని, నా ఊహను కాస్త జోడించి ఒక కథలాగా వ్రాసే ప్రయత్నం చేసాను. మీ అభిప్రాయాలు తెలియచేయవలసిందిగా మనవి.

2 comments:

  1. జనార్ధన్ గారూ,
    నా బ్లాగులో నేను రాసుకున్న ఈ కథని మీరు మీ బ్లాగులో పెట్టేసుకున్నారేంటండీ??

    ReplyDelete
  2. ఆయ్.. నాకు బాగా నచ్చిందండీ.. సారీ.. మీ పర్మిషన్ లేకుండా పెట్టాను.. బట్ మంచి ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందివ్వడంలో తప్పు లేదనుకుంటా.. ఒక సందర్భంలో స్టోరీ కోసం వెదికితే దొరికింది.. అప్పుడు మీ బ్లాగు మళ్లీ గుర్తుంటుందో లేదోనని కాపీ చేసుకున్నాను. థాంక్యూ

    ReplyDelete