ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, May 12, 2012

పార్లమెంట్‌కు అరవై ఏళ్లు.. సాధించింది సన్యాసం


అది 1952 మే13... భారత దేశంలో ఓ కొత్త శకం ఆరంభం.. ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న నేతలు ఇక్కడే కొలువు తీరారు... ప్రజలు ఏ విశ్వాసంతో తమను ఇక్కడకు పంపారో... ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొనే వేదిక ఇది. ఇప్పటిలా అప్పుడు ప్రత్యక్ష ప్రసారాలుగానీ.. బ్రేకింగ్ న్యూస్ కానీ లేవు. పార్లమెంట్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రాత్రి రేడియోలో వచ్చే వార్తల్లోనే.. అదీ సంపన్న వర్గాలకే సాధ్యం. అయినా మన నేతలు ప్రజలకేం కావాలో అవి చర్చించి మరీ సాధించుకునే వారు.. మైకులు విరిచేయడాలు.. వెల్‌లోకి దూసుకెళ్లడాలు... ప్లకార్డులు పట్టుకొని గోల చేయడాలు లేవు. ఏదైనా నిరసన తెలియజేయాల్సి వస్తే శాంతియుతంగా తెలపడం.. వాకౌట్ చేయడం.. అది కూడా చాలా అరుదగా జరిగే చర్య.. తొలినాళ్లలో పార్లమెంటు చాలా హుందాగా, పద్ధతిగా నడిచేది. పండిట్ నెహ్రూ, శాస్త్రీజి, ఆచార్య కృపలానీ, లాంటి నేతల సారధ్యంలో వాడి, వేడి చర్చలు సాగేవి. సభ అంటే ఎంతో గౌరవం వుండేది. నేతల ప్రసంగాలను అత్యంత శ్రద్ధగా వినేవారు. వాదనలన్నీ అంశాలపైనా, సమస్యలపైనా వుండేవి. అనవసర రచ్చలతో కాలయాపన ఉండేది కాదు.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బాగా అమలయ్యేది. సభ్యులు తమ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని తమ ప్రసంగాల్లో మాత్రమే చూపేవారు. తమ వ్యతిరేకతను, నిరసనలను హుందాగా ప్రకటించేవారు. కాల చక్రం గిర్రున తిరుగుతోంది.. ఆరు దశాబ్దాలు అవలీలగా గడిచిపోయాయి. పార్లమెంట్ అంటే ఫైటింగ్ స్టేజీగా మారిపోయింది. ఇప్పుడు కూడా ప్రజా సమస్యలే.. కాకుండే ప్రజల సొమ్ము ఎవరెంత కాజేశారు.. ప్రజాధనాన్ని ఏ ప్రభుత్వ హయాంలో ఎంత బొక్కేశారు.. గత ప్రభుత్వం చేసిన తప్పులేంటి.. ఇవే చర్చలు.. ప్రజలకు పనికొచ్చే చట్టాలకు జీరో అవరే గతి... ఎవరు పెద్దగా గళమెత్తి.. వీరోచితంగా ప్రవర్తిస్తే వారే పార్లమెంట్ హీరో.. ఎన్ని మైకులు విరగ్గొట్టి.. ఎన్ని సార్లు వెల్‌లోకి దూసుకెళితే ఆయనే ప్రజల పక్షాన అలుపెరగకుండా పోరాడుతున్నట్టు.. ప్రజా సమస్యల పై వీరు గొంతు చించుకుంటుంటే.. దాన్ని ప్రసార మాద్యమాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి గనుక... విపక్షాల పై దుమ్ము పోయడమే పనిగా పెట్టుకొని... దానికి పార్లమెంట్‌ను వేదికగా చేసుకుంటున్నారు. ప్రతి పక్షం, అధికార పక్షం బహిరంగ సమావేశాల్లో విమర్శలు చేసుకుంటాయి. కానీ ఎదురెదురుగా తిట్టుకునే వేదికగా పార్లమెంట్ మారింది. ఎన్నికల్లో పంచిన నోట్ల కట్టలను ప్రదర్శించే వేదిక కూడా పార్లమెంటే అయింది. ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు వేదికైన మన పార్లమెంటుకు షష్టి పూర్తి వేడుకలు జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు.. ఎన్ని సవరణలు.. ఎన్ని మలుపులు.. ఈ అరవైఏళ్ల పార్లమెంట్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లు.. పార్లమెంట్ అంటే మైకుల విరిచేసుకోవడం అనే కోణంలోనే చూడరాదు.. అది భారత పౌరుడి సగటు గళం స్పందనకు వేదిక.. ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధులు వారి సమస్యలను చర్చించి వారికో పరిష్కారాన్ని సాధించే వేదిక. ప్రభుత్వ పరమైన నిర్ణయాలు చట్టాలుగా మారే కేంద్రం. ఈ వేదిక ఎంతో ఉన్నతమైనది.. సామాన్యుడి గళం వినిపించే ఓ ప్లాట్ ఫామ్..అక్కడ చర్చలుంటాయి.. వాదోపవాదాలూ వుంటాయి.. ప్రజాసమస్యలపై అనేక కోణాల్లో చర్చలు జరుగుతాయి. ప్రభుత్వ పెద్దలకు సలహాలు, సూచనలు అందుతాయి. పార్లమెంట్ ఉభయ సభలూ రెండు కళ్ల లాంటివి.. కీలకమైన అంశాలపై చర్చలు జరిపి ఉభయ సభలు ఆమోదించాకే బిల్లు చట్ట రూపం తీసుకుంటుంది. పార్లమెంటు కొలువు దీరిన తొలినాళ్లలో చట్ట సభలను పవిత్ర దేవాలయంగా, సభాపతిని పూజారిగా భావించే వారని వృద్ధతరం నేతలంటున్నారు. పార్లమెంటు మొదలైన నాటి నుంచి నేటి వరకూ అందులో కొనసాగుతున్న వారిలో కొందరు ఇంకా వున్నారు. మణిపూర్ కు చెందిన రిషాంగ్ కీషింగ్ 1952లో ఆరంభంలో సభ్యుడిగా వున్నారు. ఇప్పటికీ ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక రేషమ్ లాల్ జంగ్డే అనే దళిత న్యాయవాది కూడా మొదటి లోక్ సభ సభ్యుడిగా వున్నారు. బిలాస్ పూర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక తొలి పార్లమెంటు సభ్యునిగా వున్న వారిలో మన తెలుగు వారు కూడా వున్నారు. పార్లమెంట్ షష్ఠి పూర్తి చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని... పార్లమెంటులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.. ఉదయం 11 గంటలకు ఉభయసభల సభ్యులు కొలువుదీరి.. మామూలు సమస్యలపై కాకుండా.. గత అరవయ్యేళ్లలో పార్లమెంటు ప్రస్థానం గురించి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గు రించి చర్చలు జరుగుతాయి. సాయంత్రం నాలుగున్నర దాకా ఈ ప్రత్యేక సెషన్ నడుస్తుంది. పార్లమెంటు సెంట్రల్‌హాలులో ఉభయసభల సభ్యులనూ ఉద్దేశించి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ప్రసంగిస్తారు. ప్రధాని మన్మోహన్ సింగ్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ తదితరులు కూడా ప్రసంగిస్తారు. పార్లమెంటు షష్టిపూర్తిని పురస్కరించుకుని రూ.5, 10 నాణేలను, పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఈ వేడుకల్లో అనాటి సభలో సభ్యులైన రిషాంగ్ కెయిషింగ్, రేషమ్‌లాల్ జంగ్డేలకు గౌరవ సత్కారం చేస్తారు.. ఈ సందర్భంగా వారిరువురూ అలనాటి సభ విశేషాల గురించి తన అనుభవాలనూ... జ్ఞాపకాలను వివరిస్తారు. రిషాంగ్.. 1952 సభలో సభ్యుడిగా ఉండి, ప్రస్తుతం మణిపూర్ నుంచి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మ ణిపూర్ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఘనత కూడా రి షాంగ్‌ సొంతం. రేషమ్‌లాల్ జంగ్డే ఒక దళిత న్యాయవాది. తొలిసభలో సభ్యుడైన ఆయన.. బిలాస్ పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే, మధ్యప్రదేశ్ అసెంబ్లీకి మూడుసార్లు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యా రు. పార్లమెంట్ అరవై సంవత్సరాల వేడుకలో పంచుకున్న అనుభవాలతోనైనా.. పార్లమెంట్‌లో హుందాతనం.. సభ్యులు ప్రవర్తించిన తీరు.. ప్రజా సమస్యల పై చిత్ర శుద్ధి లాంటి అంశాలు మన నేతలు గుర్తు చేసుకొంటే.. ఈ వేడుకలకు నిజమైన అర్ధం...

అమ్మను గుర్తుంచుకునేందుకు ఇదా పద్దతి..


మాతృదినోత్సవం ఎందుకు అమ్మను మర్చిపోతే కదా.. కన్నీళ్లలోనూ.. కలవరపాటులోనూ గుర్తొచ్చేది అమ్మేకదా.. ఆఖరుకు బూతులు తిట్టే వెదవల నోళ్లలో నానేది కూడా తొలుత అమ్మ పదమే.. అందుకే మర్చిపోలేని అమ్మను గుర్తు చేసుకునే మాతృదినోత్సవం గురించి మీరేమంటారు.

మాతృదేవోభవ... అమృతవర్షిణి అమ్మ.. మాతృదినోత్సవం (13 మే)


మాతృదేవోభవ... అమృతవర్షిణి అమ్మ.. మాతృదినోత్సవం (13 మే) అమ్మ... భాషకు అందని భావం... తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు....కనిపించే దైవం అమ్మ........ఆదిగురువు అమ్మే....అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది....ప్రపంచీకరణ మార్పుల వెల్లువలో కూడా అమ్మ బంధం చెక్కు చెదరలేదంటే అది అమ్మ ప్రేమలోని కమ్మదనానికి ఉన్న గొప్పతనమే...మదర్స్ డే సందర్భంగా ప్రేమామృతాన్ని కురిపించే మాతృమూర్తిపై హెచ్ యం టీవి అందిస్తోన్న ప్రత్యేక కథనం.... సృష్టికి మూలం అమ్మ.. సృష్టిలో క్షేత్రం అమ్మ... దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడట... కష్టం వచ్చినా కన్నీళ్లొచ్చినా గుర్తొచ్చేది అమ్మే.. అమ్మ ప్రేమ అమృతం లాంటిది.. మనుషులకే కాదు... జంతువులకు కూడా అమ్మంటే చెప్పలేని ప్రేమ.. విశ్వరహస్యాలను ఛేదించిన వాడైనా ఓ తల్లి కొడుకే.. అమ్మ చనుబాలను అమృతంలా సృష్టించి.. మమకారాన్ని కలగలిపిన.. మమతల కోవెలగా అమ్మ ఒడిని మలిచి మనకు అందించాడు దేవుడు. అందుకే ఓ కవి అవతార పురుషుడైనా అణువంతే పుడతాడని తెలిపాడు ఈ సృష్టిలో మరో విచిత్రం ఉంది.. ఒకరు జన్మ కారకులైతే.. మరొకరు ప్రగతి కారకులు.. బరువైన కాయను మోసి పుడమి తల్లి తల్లి పొత్తిళ్లలోని వదులుతుంది మొక్క... ఆ నేల పొత్తిళ్లలోంచి పుట్టిన మొక్కకు నేలతల్లే అమ్మ.. గూడు కట్టుకోలేని కోయిలమ్మకు కాకమ్మే అమ్మ... అందుకే కంటేనే అమ్మ కాదు.. కడుపు తీపితో పెంచిన ప్రతితల్లీ అమ్మే.. అమ్మలేని సాహిత్యం లేదు.. అమ్మలాలి పాటల్లోనే తొలి సరిగమలు పురుడు పోసుకుంటాయి. అమ్మ జోల పాటను మించిన పాట లేదు. అందుకే సంగీతం కూడా అమ్మకు దాసోహమే..
యాంత్రక యుగంలో ప్రీ బర్త్ స్కూల్స్ వచ్చినా.. ప్రీ స్కూల్ గార్డెన్స్ వచ్చినా.. అమ్మ ప్రేమ పదిలమే.. ఇంటర్నెట్ యుగంలో కూడా అమ్మతనంలో కమ్మదనాన్ని మరిచిపోలేదు. . ఎందుకంటే బ్లాగులు, సోషల్ నెట్‌వర్క్ సైట్లు, ఆన్‌లైన్ కవిత్వ, సాహిత్య వెబ్‌సైట్లలో అమ్మ కవిత్వానికే అగ్ర తాంబూలం... చాలా మంది తమ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ప్రొఫైల్ ఫోటోగా తల్లీ బిడ్డల ఫోటోలనే ఎంచుకంటారు. ఎంత ఎదిగినా తల్లి ముందు పిల్లాడే... వయసు పెరిగినా, మానసిక ఎదుగుదల లేని ఎందరో పిల్లలకు సేవలు చేస్తున్న తల్లుల కథలు వింటున్నాం... వివిధ ప్రమాదాల్లో, సంఘటనల్లో గాయపడ్డ పిల్లలను ఇరవైయ్యేళ్ళు ఉన్నా రెండేళ్ళ పిల్లల్లా సేవలు చేస్తున్న తల్లులను చూశాం... ఆమె చేసే సేవను పోలిక లేనిది... ఆ రుణం తీర్చుకోలేనిది. అమ్మ ప్రేమను గుర్తు చేసుకోడానికి ఓ రోజు పెట్టుకున్నారు పాశ్చాత్యులు. దానికి ముద్దుగా మదర్స్ డే అని పెట్టుకున్నారు. మాతృదినోత్సవం.. కానీ అమ్మ గుర్తుంచుకొనే రోజెందుకు. అమ్మను మర్చిపోతే కదా.. కష్టం వచ్చినా కన్నీళ్లొచ్చినా వచ్చే తొలి మాట అమ్మే కదా..

Friday, May 11, 2012

బ్లాక్ డే ఇప్పుడు గుర్తొచ్చిందా.. సాక్షికి జర్నలిస్టుల శాపం తగిలింది. జర్నలిస్టు నాయకులకు.. ఇప్పుడు మెలకువ వచ్చిందా..?


జర్నలిస్టు నాయకులకు.. ఇప్పుడు మెలకువ వచ్చిందా..? బ్లాక్ డే అంటూ సాక్షి పత్రిక పెద్ద అక్షరాలతో ఈ రోజు బేనర్ పెట్టుకుంది. వాస్తవానికి సాక్షికి ఈ రోజు బ్లాక్ డే కావచ్చు.. కానీ ఈ రాష్ట్ర్రంలో ఉన్న జర్నలిస్టులు వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే బ్లాక్ లిస్టులో చేరిపోయారు. చిన్న పత్రికలన్నీ చాలా వరకు కూడూ గుడ్డా లేకుండా రోడ్డున పడ్డాయి. రెండు రూపాయలకే చాటెడు చెత్త అందిస్తానని చెప్పుకొచ్చిన సాక్షికి ఈ రోజు బ్లాక్ డే కావచ్చు. కానీ వార్తా పత్రికలేమన్నా. భగవద్గీతలా.. ఖురానా.. బైబిలా వాటి అంత సత్య నిరత ఉందా... ? వార్తా పత్రికల్లో వార్త పడితే స్పందించాలా.. పత్రికలో అధికారుల అలసత్వం పై, అవినీతి పై వార్తలు రాస్తే చర్యలు తీసుకోవాలా...? అంటూ వ్యంగ్య బాణాలు విసిరిన పరమ మీడియా ద్వేషి వైయస్ రాజశేఖర్ రెడ్డి అనే విషయం ప్రతి జర్నలిస్టుకూ తెలుసు. చనిపోయి ఏ లోకంటో ఉన్నాడో గానీ.. బతికున్నపుడు చేసిన నిర్వాకం వల్ల పేద జర్నలిస్టులు చాలా మంది కూటికెల్లక కూలీ పడుతున్నారు. చిన్న పత్రికలైనా పెద్ద పత్రికలైనా.. వార్తలు రాసీ రాసీ విసుగు పుడుతుందే తప్ప ఏ ఒక్క అధికారిలో కదలిక లేదు. అతగాడి చెత్త వ్యూహం వల్ల రాష్ట్రంలో జవాబుదారీ తనంలోపించింది. అధికారులు అవినీతి పరులయ్యారు. బాహాటంగానే లంచాలు పుచ్చుకుంటున్నారు. ఎవరైనా విలేకరులు వివరణలు అడిగితే.. కావాలంటే ఫోటోలు తీసుకోండని వెకిలి నవ్వులు నవ్వుతున్నారు. ఎన్ని వార్తలు రాసినా అధికారులు పాత పద్దతిలోనే అంటే.. వార్తలు భగవద్గీతలు కావు కదా అని వైయస్ చెప్పాడని నెట్టుకొస్తున్నారు. సాక్షిలో వస్తేనే వార్త, సాక్షి చానల్‌లో ప్రసారమైందే సిసలైన వార్త.. ఇదీ వైయస్ రాజశేకర్ రెడ్డి సిద్ధాంతం. ఈ సిద్దాంతం వల్ల పత్రికలన్నీ మూసేసుకోవాలనే పన్నాగం పన్ని..రాష్ట్రంలో ఏ పత్రికకూ యాడ్స్ రాకుండా అడ్డుకున్నాడు. చిన్న పత్రికలైతే మరీ బిచ్చగాళ్లలా తిరిగినా.. కాళ్లరిగేలా తిరిగినా ఏ సమాచార అధికారీ ఒక్క యాడ్ ఇచ్చిన పాపాన పోలేదు. ఎవరికైనా కాళ్లొత్తే అలవాటు ఉంటే.. ఒకరిద్దరు బతకనేర్చి యాడ్స్ తెచ్చుకునేవారు. ఆత్మభిమానం ఉన్న వాళ్లంతా డీటీపీ ఆపరేటర్లుగానో.. డెస్ట్ ఎడిటర్లుగానో అవతారం ఎత్తారు. ఎప్పుడైతే సాక్షి తాకిడికి, వైయస్ చెత్త నిర్ణయాలకు పత్రికలు, జర్నలిస్టులు బలయ్యారో.. ఆ రోజే జర్నలిజానికి బ్లాక్ డే మొదలయింది.
ఈ రోజు సాక్షి పత్రికకు ఒక్కరోజు యాడ్స్ నిలిపేస్తే గొంతు చించుకుంటున్న సో కాల్డ్ జర్నలిస్టులు.. ఇంతకాలం ఇన్ని పత్రికల గోస తెలియదా... అమర్ లాంటి వ్యక్తి ఈ రోజు మీడియా ముండు నిలబడి అప్రజాస్వామికమని గొంతు చించుకుంటున్నాడే.. ఏపీ‍యూడబ్ల్యూజే అధ్యక్షుడయి కూడా ఏనాడన్నా చిన్న పత్రికల గోడు పట్టించుకున్నాడా.. తనకు లక్షలాధి రూపాయల జీతం ఇచ్చి... యాంకర్ గా ప్రసెంట్ చేసిన సాక్షి ఖాతాలు ఆగిపోగానే..యాడ్స్ ఆగిపోగానే..తన జీతం ఎక్కడ ఆగుతుందో అనో.. లేక జగన్ మెహర్‌బానీ కోసమో..జర్నలిస్టు విలువలు, పత్రికా స్వేచ్ఛ గుర్తొచ్చాయి. కలర్ పేపర్ మాయలో కనుమరుగయిపోయిన కరకు పత్రికల సాక్షిగా... జర్నలిస్టులు కన్నీళ్ల సాక్షిగా... ఎన్నో కుటుంబాల గోస తగిలి ఈ సాక్షి నాశనం కాక తప్పదు. పాలనా వ్యవస్థను పాడు చేసిన వ్యక్తికి పేదవారి శాపం తగలక మానదు. ఓ సోకాల్డ్ జర్నలిస్ట్ మేతావుల్లారా.. ఒక సాక్షికి యాడ్స్ ఆపినపుడు కాదు.. చిన్నపత్రికలు యాడ్స్, అక్రిడేషన్లు ఆపినపుడు కూడా మీ నోరు తెరవండి.. లేకుంటే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోండి.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.

రష్యాలో పుతినే రాజ్యాంగం.. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక.. అనైతికమట


రష్యాలో పుతినే రాజ్యాంగం.. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక.. అనైతికమట రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ప్రధానిగా ఉన్న పుతిన్ మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పుతిన్ రష్యా అధ్యక్షుడిగా పనిచేయడం ఇది మూడో సారి. పుతిన్‌ను అధ్యక్షుడిగా చేసేందుకు రష్యా రాజ్యాంగాన్ని కూడా మార్చారు. రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్‌ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు ఆయన నాలుగేళ్లపాటు దేశ ప్రధానిగా పనిచేశారు. సోమవారం దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. 2018 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. 2000-2008 సంవత్సరంలో ఆయన అధ్యక్షునిగా పని చేసి ఆ తర్వాత నాలుగేళ్లు ప్రధానిగా రష్యన్ రిపబ్లిక్‌కు సేవలు అందించారు.. రాజ్యాంగపరంగా ఒక వ్యక్తి వరుసగా రెండు సార్లు మించి అధ్యక్షునిగా పదవి చేపట్టకూడదు కనుక 2008లో బలవంతంగా ఆ పదవిని వీడారు. నాలుగేళ్ల అనంతరం తిరిగి అదే పదవికి ఎన్నికయ్యారు. రష్యా అధ్యక్షుడిగా ఇప్పటికే రెండు సార్లు విధులు నిర్వహించిన పుతిన్.. సమర్ధునిగా పేరు తెచ్చుకున్నారు. 2000 నుంచి 2008 వరకు రెండుసార్లు ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాలం రష్యాకు చాలా కీలకం. ఎందుకంటే, అప్పటికి దానికి స్థిరత్వం తెచ్చేవాళ్లు కావాలి. అందుకు పుతిన్‌ సరైనవ్యక్తి అని భావించారు. ఆయనకు అత్యంత ఎక్కువ పాపులారిటీ రావడానికి కారణం కూడా లేకపోలేదు.. తొంబైవ దశకంలో రష్యాలో ప్రజాస్వామ్యం దిశగా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దీనికి కారణం ఆయన నియంతృత్వ పాలనలోని సుస్థిరతే అని చెప్పుకోవచ్చు.దీనికి తోడు చమురు, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగిపోవడం.. రష్యా అతి పెద్ద విద్యుత్తు ఉత్పాదక దేశం కావడంతో సంపద పెరిగి, పరిస్థితి గణనీయంగా మార్పు వచ్చింది. మరోవైపు... ఆయన అధికారం చేజిక్కించుకున్న తీరు ... లిబరల్స్‌ నుంచి తీవ్ర విమర్శలకు గురైంది. రష్యన్లకు సేవ చేసే భాగ్యమే తన జీవితానికి పరమార్ధమంటూ.. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, కాపాడుతూ.. రష్యన్ల హక్కులను, స్వేచ్ఛను పరిరక్షిస్తానని పుతిన్‌ ప్రమాణం చేశారు. వ్లాదిమిర్ పుతిన్ 2000 సంవత్సరంలో తొలిసారిగా రష్యా అధ్యక్షపీఠాన్ని అధిష్టించారు.. ఆ తర్వాత నాలుగేళ్ళకు అంటే... 2008 వరకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఒకే వ్యక్తి మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు రష్యా రాజ్యాంగం అంగీకరించకపోవడంతో 2008 నుంచి ప్రధానమంత్రి పదవి అధిష్టించారు.. తనకు అత్యంత నమ్మకస్తుడైన దిమిత్రి మెద్వెదెవ్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి.. మళ్ళీ అధ్యక్షుడయ్యేందుకు, పదవీకాలాన్ని నాలుగేళ్ళ నుంచి ఆరేళ్ళకు పెంచుకోడానికి వీలుగా రాజ్యాంగాన్ని సవరించుకుని.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రష్యా అధ్యక్ష స్థానానికి తిరిగివచ్చారు. ఇప్పుడు 2018 వరకు రష్యాకు పుతినే అధ్యక్షుడు. అంతే కాదు.. మరోసారి అధ్యక్షపదవికి పోటీ చేసే అవకాశాన్ని కూడా చేతిలోపెట్టుకుని మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పూర్వపు సోవియట్‌ యూనియన్‌ అధ్యక్షుడు మిఖాయెల్‌ గోర్బచెవ్‌తో పాటు కొందరు ప్రతిపక్ష నేతలు కూడా హాజరయ్యారు. రష్యా అధ్యక్ష భవనంలోని గ్రాండ్‌ క్రెమ్లిన్‌ హాల్‌లో జరిగిన పుతిన్‌ ప్రమాణస్వీకారోత్సవానికి.. పూర్వపు సోవియట్‌ యూనియన్‌ అధ్యక్షుడు మిఖాయెల్‌ గోర్బచెవ్‌తో పాటు మూడు వేల మంది ఆహూతుల సమక్షంలో పుతిన్‌ ప్రమాణస్వీకారం చేశారు. అయితే పుతిన్ ప్రమాణ స్వీకారాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. ప్రమాణస్వీకర కార్యక్రమాన్ని కిరీటధారణ కార్యక్రమమని అభివర్ణించారు.. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అన్యాయంగా, అరాచక పద్ధతుల్లో పుతిన్ అధ్యక్షుడయ్యారని.. నైతికంగా ఆయనకు ప్రమాణస్వీకారం చేసే అర్హతేలేదని ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు ఆందోలన నిర్వహించారు.. ప్రమాణ స్వీకారం రోజున ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా మాస్కోలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ మాస్కోలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు పుతిన్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిషేధాజ్ఞలు ఉల్లంగించినందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష కార్యకర్తలను అరెస్టు చేశారు.

Monday, May 7, 2012

ప్రగతిశీల ఉద్యమ యోధుడు... రాలిన మొదుగు మొగ్గ... జార్జిరెడ్డి ఎవరు?


ప్రగతిశీల ఉద్యమ యోధుడు రాలిన మొగ్గలు జార్జిరెడ్డి ఎవరు? ఉస్మానియా క్యాంపస్‌లో హత్యకు గురైన యువకుడు. అదీ 40 ఏళ్ల కిందట. కాని నేటికీ అతడి ప్రగతిశీల ఉద్యమ పాదముద్రలు చైతన్యస్ఫోరకంగా మెరుస్తూ కనిపిస్తున్నాయి. కాలం ఒక రోడ్డురోలర్. ఆ కాలచక్రం కింద నలిగి ఎవరైనా నామరూపాల్లేకుండా పోవాల్సిందే! అణచివేయలేనంత అపారమైన ప్రతిభ ఉంటేనే- చరిత్రపుటల్లో చోటు దక్కుతుంది. నాలుగు దశాబ్దాలయినా ఇంకా జార్జి సిద్ధాంతపరంగా ఉద్యమాల రూపంలో బతికి ఉన్నాడంటే సామాన్య విషయం కాదు. జార్జిరెడ్డి కేవలం ఓ ఉద్యమ భావజాల యువనేత మాత్రమే కాడు; ‘ఇజం’ ఏదైనా, పోరుబాట ఎలాంటిదైనా, నాయకుడెవరైనా- అనుసరించదగ్గ నాయకత్వ వ్యక్తిత్వం ఉన్నవాడు. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి సరిగ్గా ఏడునెలల ముందు జన్మించాడు జార్జి- 1947 జనవరి 15న. లీలా వర్గీస్, రఘునాథరెడ్డి దంపతులకు నాల్గవ సంతానం! పుట్టింది కేరళలోని పాలక్కాడ్. తల్లి మలయాళీ. ఉపాధ్యాయురాలు. తండ్రిది చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం రొంపిచర్ల గ్రామం. ఆయన ఉద్యోగరీత్యా అనేక ఊర్లు తిరిగేవారు. జార్జిరెడ్డి అన్నయ్య కారల్‌రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్. చిన్నప్పటినుంచి జార్జిరెడ్డి పుస్తకాల పురుగు. చదువులో ఫస్ట్. నిజాం కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి ఆపై ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో చేరాడు. అప్పటికే సాంఘిక చైతన్యంతో సమకాలీన సమాజంలోని విషాదాల్ని- ఒకరు మరొకర్ని దోపిడీ చేసే వర్గదృక్కోణాన్ని అవలోకనం చేసుకుంటూ ఉన్నాడు. వామపక్షతత్వ అంశాల్ని, మార్క్సిస్ట్ ఆలోచనల్ని నీలం రామచంద్రయ్య మాస్టారి దగ్గర మరింత తెలుసుకున్నాడు జార్జిరెడ్డి. జార్జి ఆలోచనలు పదును తేలాయి. తాను పుట్టింది తన కోసం కాదని పీడిత తాడిత లోకం కోసమని తెలిసొచ్చింది. ఎమ్మెస్సీలో ఉండగా విద్యార్థుల సమస్యల్ని అర్థం చేసుకోవడం, వాటికై పోరాడటం సహజంగానే జరిగిపోయేది. ఓసారి క్యాంపస్‌లో చిన్న గొడవ జరగడంతో జార్జిరెడ్డిని ఏడాదిపాటు క్లాసులకు రాకుండా నిషేధం విధిస్తూ ‘రస్టికేట్’ చేశారు ప్రిన్సిపాల్. మరొకరెవరైనా అయితే - క్లాసులకు వెళ్లలేని ఆ ఏడాదిపాటూ అల్లరిచిల్లరగా తిరిగేవారేమో, నిరాశతో గడిపేవారేమో! కాని జార్జిరెడ్డికి ఆ సంవత్సరం బంగారంలాంటి కాలం. ఆ ఒక్క ఏడాదిలో ఎన్ని పుస్తకాలు చదివాడో అంతులేదు. అప్పటికే ఘనీభవించిన జ్ఞానమూలమైన పుస్తకమంటే పిచ్చిప్రాణం జార్జికి. తన సబ్జెక్టులయిన భౌతిక, గణిత శాస్త్ర ప్రాథమిక సూత్రాల్ని మరింత అధ్యయనం చేశాడు. మార్కోవ్ గణితశాస్త్ర పాఠ్యపుస్తకాల లెక్కల్ని ఆమూలాగ్రం సాల్వ్ చేసేవాడు. అంతేకాదు, చుట్టూ ఎప్పుడూ పది పదిహేనుమంది విద్యార్థులు. వారికి ఆయా గణితశాస్త్ర సమస్యల్ని ఇట్టే విడమరచి చెప్పేవాడు. బెర్క్‌లీ ఫిజిక్స్ పుస్తకంపై సవివరమైన నోట్స్ తయారు చేసుకున్నాడు. నోమ్ చామ్స్కీ, ‘ఎట్ వార్ విత్ ఆసియా’, ఫ్రెడరిక్ హెగెల్ ‘సైన్స్ ఆఫ్ లాజిక్’, జేమ్స్ జాల్ ‘ది అనార్కిస్ట్’, అలెక్స్ హేలీ ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కమ్ ఎక్స్’, రెజిదిబ్రె ‘రివల్యూషన్ ఇన్ రివల్యూషన్’, ఫ్రాంజ్ ఫెనన్ ‘రెచ్‌డ్ ఆఫ్ ది ఎర్త్’ లాంటి అనేకానేక పుస్తకాల్ని అధ్యయనం చేశాడు. పాతికేళ్లు కూడా లేని ఒక కుర్రాడు అన్నేసి గంటలపాటు ఇన్నేసి పుస్తకాలు చదవడం ఆశ్చర్యకరమైన విషయం. లాటిన్ అమెరికా దేశాల్లో ప్రజల విముక్తి కోసం విప్లవ సాయుధ గెరిల్లా పోరాటం సాగించిన చే గువేరా - జార్జిని అమితంగా ఆకర్షించాడు. చే రచించిన ‘గెరిల్లా వార్‌ఫేర్’, ‘ఆన్ రివల్యూషన్’. ‘వెన్ సెరిమోస్, ‘బొవీలియన్ డైరీ’ లాంటి గ్రంథాలు జార్జిని విశేషంగా ప్రభావితం చేశాయి. అంతేకాదు, ట్రాట్స్కీ, ప్లేటో, సిగ్మండ్ ఫ్రాయిడ్ రచనల్ని సైతం అక్షరమక్షరమూ ఔపోసన పట్టాడు జార్జిరెడ్డి. మార్క్సిజాన్ని, ఆ తత్త్వంతో మానవ సమాజ పరిణామాన్ని, పీడన సాగే విధానాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాడు. ఏడాది అజ్ఞాతవాసం లాంటి ‘రస్టికేషన్’ ముగిసింది. ఎమ్మెస్సీ పరీక్షలు జరిగాయి. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాడు. గోల్డ్‌మెడల్ పొందాడు. ఓ పక్క సబ్జెక్ట్, మరోపక్క గ్రంథపఠనం- అసలైన విద్యను అందుకున్నాడన్నమాట. విస్తృత అధ్యయనం వల్ల జార్జిరెడ్డిలో మార్క్సిస్టు సైద్ధాంతిక విశ్వాసాలు, విప్లవభావాలు, స్పష్టమైన రూపు కట్టాయి. శాస్త్రీయ సోషలిస్ట్ సిద్ధాంతాల అన్వేషణ అతనిలో ప్రారంభమైంది. ఆంధ్రదేశంలోనే కాదు, దేశంలోనూ, ప్రపంచంలోనూ 1960 దశకంలో జరిగిన అనేకానేక పరిణామాలు జార్జిలోని ప్రశ్నించే తత్వాన్ని తట్టిలేపాయి. ఆలోచనను మరింత చురకత్తిని చేశాయి. 1967 నాటి పశ్చిమబెంగాల్ నక్సల్బరీ పోరాటం, తెలంగాణలోని అశాంతి, నిరుద్యోగం, శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటం, వియత్నాం యుద్ధం... అన్నీ జార్జిరెడ్డిని అవ్యక్తపుటూహలతో కుదిపేసేవి. 1968 మేలో ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డిగిలె ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మంది కార్మికులు ఏకమై చేసిన విద్యార్థి ఉద్యమం కావచ్చు; దక్షిణాఫ్రికాలో సొవెటో ప్రాంతంలో చెలరేగిన విద్యార్థి ఉద్యమం కావచ్చు; వర్ణవివక్షకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన పోరాటం కావచ్చు; అమెరికాలో 1966లో ఆఫ్రో అమెరికన్ విప్లవ వామపక్షవాదులు తీసుకొచ్చిన బ్లాక్ పాంథర్స్ ఉద్యమం కావచ్చు; అమెరికా సామ్రాజ్యవాదంపై ఎక్కుపెట్టిన వియత్నాం ప్రజాపోరాటాలు కావచ్చు... అన్నీ జార్జిరెడ్డిపై తీవ్ర ప్రభావం చూపాయి. ఒక మార్క్స్, ఒక హెగెల్, ఒక చేగువేరా, ఒక మిఖాయిల్ బుకునిన్ అందించిన దార్శనికతతో ఆయా విప్లవ పోరాటాల్ని సశాస్త్రీయ హేతువాద దృష్టితో అవలోకనం చేసుకున్నాడు. ప్రపంచమేమిటో, బలవంతులు బలహీనులను దోపిడీ చేసే ప్రక్రియ ఏమిటో, లోకపుటన్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలూ, దౌర్జన్యాలూ ఏమిటో అర్థమైంది జార్జిరెడ్డికి. వెరసి ఒక ఆకర్షణీయమైన, ఆదర్శనీయమైన వ్యక్తిత్వం సంతరించుకుంది జార్జిలో! దరిమిలా జార్జిరెడ్డి క్యాంపస్‌లో ఓ ‘హీరో’అయ్యాడు. అయిదడుగుల ఆరంగుళాల ఎత్తు, గోధుమవన్నె రంగు, కొద్దిగా గడ్డం, సన్నటిమీసం, దృఢకాయం, ఎడమపాపిట, పొట్టిచేతులతో కూడిన బుష్‌షర్ట్‌తో అప్పుడప్పుడు; ఆపై వెడల్పాటి జేబులు, పొడుగు చేతుల ఆలివ్‌గ్రీన్ చొక్కా, కాటన్ జీన్స్‌తో నడుస్తుంటే జార్జిరెడ్డి ఆత్మవిశ్వాసం నడుస్తున్నట్లుగా ఉండేది. చెదరని చిరునవ్వు, కాంతిపుంజాల్లా కళ్లు, రోజూ గంటపాటు జిమ్‌లో బస్కీలు, గుంజీలు, బ్యాక్ బెండింగ్, పొత్తికడుపు వ్యాయామాలు, మల్లయుద్ధం ప్రాక్టీస్ చేసేవాడు. స్వతహాగా జార్జి బాక్సర్, బ్లేడ్ ఫైటర్. అడిగినవారికీ అడగనివారికీ సహాయం చేసేవాడు జార్జిరెడ్డి. ఫీజులు, మెస్సులు, పుస్తకాలు, అణచివేతలు, అవమానాలు, దుఃఖాలు, ఆత్మన్యూనతలు... ఇలా విద్యార్థుల్లో ఎలాంటి కష్టాలున్నా వెంటనే హాజరయ్యేవాడు. క్యాంపస్ వాతావరణంపై అనవసర పట్టు సాధించాలని ప్రయత్నించే స్వార్థపు శక్తులతో పోరాడేవాడు. ఆ క్రమంలో అనేకసార్లు భౌతికంగా దాడులు జరిగాయి జార్జిపై. అందుకే ఎప్పుడూ తనతోపాటు ఆరంగుళాల కత్తి సిద్ధంగా ఉండేది. ఇదంతా ఒక ఎత్తు, విద్యార్థులలో సాంఘిక స్పృహ, ప్రగతిశీల భావాల్ని పెంచేందుకు జార్జి చేసిన కృషి ఒకటీ ఒక ఎత్తు. సైన్స్ కాలేజీకి, ఆస్ట్రానమీ డిపార్ట్‌మెంటుకీ ఆనుకొని ఉన్న క్యాంటీన్ వారందరికీ అడ్డా. క్యాంటీన్‌ని ఆనుకుని ఉన్న వేపచెట్టు, దానికింద నాలుగైదు బండరాళ్లు, వాటిపై కూచొని కబురులు... రాత్రిళ్లు, అందునా వర్షం కురుస్తున్న రాత్రిళ్లు, వెన్నెల రాత్రిళ్లు... నలభై ఏభై మంది చుట్టూ... మధ్యలో జార్జి... అంతగా రాని తెలుగులో, హైదరాబాదీ హిందీలో, చక్కటి ఇంగ్లిష్‌లో జార్జిరెడ్డి ప్రసంగాల్లాంటి ప్రసారాలు... బండక్యాంటీన్ దగ్గర.. స్పష్టమైన మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథంతో పాలస్తీనా సమస్య, గ్వాటెమాలా సంఘటనలు, ఫోకోసిద్ధాంతం, గెరిల్లా పోరాటం, ఆఫ్రికా ప్రజల విముక్తి ఉద్యమాలు.. ఇలా ఎన్నెన్ని అంశాలపై జార్జిరెడ్డి ఉపన్యాస ధార సాగేదో అంతులేదు. కేవలం భావజాలమే కాదు, ఆచరణ కూడా జార్జిరెడ్డిలో కనిపించే తత్త్వం. స్లిప్పర్లే వేసుకునేవాడు. బట్టలు ఎక్కువ ఉండేవి కావు. రెండే రెండు జతలు. కొనుక్కోలేక కాదు. కొనుక్కోవడానికి ఆస్కారం లేని లక్షలాది పేదల్లా తానూ బతకాలని! ఒక పూటే తినేవాడు. ఆకలితో మలమల్లాడుతున్న నిర్భాగ్య అన్నార్తుల ఆకలి కేకలేంటో తానూ అనుభవించాలని! కాగితమ్మీద రాస్తే... మొత్తమంతా ఎక్కడా ఖాళీలేకుండా రాసేవాడు. దేన్నయినా మితంగా, పొదుపుగా ఉపయోగించేవాడు. నిర్లక్ష్యం, అహంకారం అతగాడికి తెలీవ్. ఎప్పుడూ సిటీబస్సుల్లోనే తిరిగేవాడు.
అతని మాటల్లో తీవ్రత, నిజాయతీ, స్పష్టత ఉండేవి. తనకు వచ్చే స్కాలర్‌షిప్ డబ్బుల్ని ఏ ఆధారం లేని ఓ బాల్యమిత్రుడికి వ్యాపారం పెట్టుకోమని ఇచ్చేశాడు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృష్టిని, విషయ పరిజ్ఞానాన్ని పెంచేందుకు అనేకానేక సెమినార్లు నిర్వహించాడు. రిక్షా కార్మికులతో కలసి భోజనం చేసేవాడు. అయితే అదే సమయంలో క్యాంపస్‌లోని సమస్యలపై పోరాడేవాడు. ఫలితంగా శత్రువులు పెరిగారు. సోషలిస్టు భావాల్ని, ఆద ర్శాల్ని వ్యాప్తి చెయ్యాలన్న లక్ష్యంతో స్టడీసర్కిల్‌ను ఏర్పాటు చేశాడు. జార్జిరెడ్డి అప్రతిహతంగా సాగిస్తున్న ఉద్యమబాటను నిరోధించాలన్న కుట్రతో 1972 ఫిబ్రవరిలో జార్జిపై డీడీ కాలనీలోని అతని ఇంటి సమీపంలో దాడి జరిగింది. గాయాలపాలయ్యాడు. ఒంటరిగా తిరగడం మంచిది కాదని మిత్రులు సూచించారు. ‘చావు అంత తేలికగా తన దగ్గరకు రాదని’ నవ్వుతూ అనేవాడు. అలా అన్న వారానికే- ఏప్రిల్ 14న సాయంత్రం ఇంజినీరింగ్ కాలేజీ భవనం దగ్గర ప్రత్యర్థుల చేతిలో హతుడయ్యాడు. తాను మరణించి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి పునాది అయ్యాడు. విద్యార్థి నాయకుడు- జ్ఞానం, ప్రేమ, మానవతల విషయంలో ఎలా ఉండాలో నేర్పాడు. తాను పుట్టిపెరిగిన సహజ జీవన స్థితినుంచి పేదల జీవిత స్థితికి మారాలనుకున్న తత్త్వం జార్జిలో విశేషమైంది. జీవన విధానాన్ని కింది వర్గాలకు అనుగుణంగా మార్చుకునే డీ క్లాసిఫై తత్త్వమే - జార్జిని అమరుణ్ని చేసింది. అతడు బతికుంటే.. ఇండియన్ చే గువేరా అయి ఉండేవాడు. సందేహం లేదు.

విజృంభిస్తున్న మావోలు... విస్తరిస్తున్న వసంత మేఘం


విజృంభిస్తున్న మావోలు విస్తరిస్తున్న వసంత మేఘం ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లలో వీరంగం ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న నక్సల్స్ కేంద్రం చెలగాటం రాష్ట్రాలకు ప్రాణ సంకటం విచ్చల విడిగా గిరిజనులను అరెస్ట్ చేయడమే కారణం దేశంలో మావోయిస్టులు బలపడుతున్నారు. కేంద్రం అనుసరించే విధానాలు... ఏజన్సీలో తవ్వకాలు గిరిజనుల మనుగడకు ముప్పుగా మారాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో తమ మనుగడ కెోసం గిరిజనులు మావోయిస్టుల మార్గాన్ని అనుసరిస్తున్నారు. మావోయిస్టుల్లో గిరిజనులే ఎక్కువగా ఉన్నారనేది బహిరంగ రహస్యం. ఏజన్సీ ప్రాంతంలో గిరిజనులు మావోయిస్టులకు సహకరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున గిరిజనులను అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు. వాస్తవానికి గిరిజనుల సహకరించడం కాదు.. గిరిజనులే మావోయిస్టులన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిపోతోంది. తమ మనుగడకు ముప్పు వాటిల్లే నిర్ణయాలు తీసుకొని దాన్ని వ్యతిరేకించిన వారిని మావోయిస్టులుగా చిత్రీకరించడంతో.. ఇదే అదనుగా మావోయిస్టులు తమ భావజాలాన్ని, సమస్యకు పరిష్కారాన్ని గిరిజనులకు వివరిస్తున్నారు. పోరాడితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందిని చెప్పడంతో గిరిజనులు ఆ దిశగా మొగ్గు చూపుతున్నారు. తరువాత వారే దళపతులుగా మారి తమ వర్గాన్ని అందులో చేర్చుకొని బలపడుతున్నారు. వాస్తవానికి ఛత్తీస్‌గడ‌, ఒరిస్సా రాష్ట్రాల్లో గిరిజనులకు ఇంతకు మించిన మార్గం లేదు. ఎందుకంటే దండకారణ్యంలో అపారమైన ఖనిజ వనరులున్నాయి. వీటి పై కేంద్ర ప్రభుత్వం కన్నుపడింది. ప్రభుత్వం కన్ను అనేదానికంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల కన్ను పడింది. ఎలాగైనా అధికారంలో ఉన్నపుడే వాటిని స్వాహా చేయాలనేది పన్నాగం.. అందుకోసం అధికారం అడ్డం పెట్టుకొని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులను రూపు మాపేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. నల్లమల అడవిని జల్లెడ పట్టాడు. దాదాపు మావోయిస్టు పార్టీ రాష్ట్రంలో అంతరించిపోయిందనే పరిస్థితికి తెచ్చాడు. అందుకే తనకు ఎదురు లేని నిర‌్ణయాలు తీసుకొని రాష్ట్రం మొత్తాన్ని తన తనయుడి జగన్ కు కట్టబెట్టాడు. మరోవైపు ఓబుళాపురం గనులను పూర్తిగా కొడుక్కి, కొడుకు లాంటి గాలి జనార్ధన్ రెడ్డికి అప్పజెప్పాడు. మావోయిస్టులు బలంగా ఉంటే ఈ దోపిడి సాద్యమయ్యే పని కాదు. ఏదో ఒక సందర్భంలో ఎదరుతిరిగే వారు. ఇప్పుడు శ్రీకాకుంళంలో కూడా ప్రభుత్వానికి తమ భూములను కబళించొద్దంటూ ప్రజలే ఎదురు తిరగుతున్న పరిస్థితి వచ్చింది. విప్లవ పోరాటాలకు పుట్టినిల్లయిన శ్రీకాకుళంలో మళ్లీ మావోయిస్టు దళాలను పెంచి పోషించే పరిస్థితి ప్రభుత్వమే కొని తెచ్చుకుంటుంది. ఎక్కడైతే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందో.. ఆ విధానాలు తమ మనుగడకే ముప్పు వాటిల్లేలా చేస్తాయని ప్రజలు భావించినపుడు.. ప్రాణత్యాగానికి మించిని మార్గం లేదని భావించినపుడు.. తెగిస్తారు. ఆ తెగింపే ప్రజలను నిషిద్ద వామపక్ష ఉద్యమాల వైపు మళ్లిస్తుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా మావోయిస్టు పార్టీ బలపడుతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాయి. దండకారణ్యం మీదుగా నల్లమలలోకి మెల్లగా విస్తరిస్తున్నాయని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటు ఛత్తీస్‌గఢ్, భద్రాచలం సరిహద్దుల్లో, ఒరిస్సా, శ్రీకాకుళం బెల్టులో మావోయిస్టుల కదలికలు చురుకుగా సాగుతున్నాయి. రిక్రూట్ మెంట్ వైపు కూడా గిరిజనులతో బాటు మైదాన ప్రాంత ప్రజలు కూడా మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం ప్రజా సంపదను కార్పోరేట్ పెట్టుబడి దారుల చేతుల్లో పెట్టి ఉన్న ఐదేళ్లూ నాలుగు రాళ్లు సంపాదించుకోవాలన్న ప్రభుత్వ పెద్దల స్వార్ధమే... ఇటు గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తుంది. పచ్చిన పంట పొలాల్లో చిచ్చురేపి తమ ఉనికికే ప్రమాదం తెచ్చి నిలువ నీడ లేకుండా చేసే ప్రభుత్వాలను ఎదిరించకుండా ఎవరుంటారు. శ్రీకాకుంళం జిల్లాల్లో తమ ప్రాంతాలను కబళించ వద్దని నెలల తరబడి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టిచ్చుకున్న ప్రభుత్వ పెద్ద లేడు. అటువంటి సందర్బాలలో విప్లవ శక్తులు చెప్పే మాటలు ప్రజలకు సహజంగానే స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. యువకులు కూడా అవలీలగా వీరి నినాదాలకు ఆకర్షితులైతారు. తమ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం మొదలైన ఉద్యమం.. రాష్ట్రానికి, దేశానికి ఆ తరువాత అమరత్వానికి దారి తీస్తుంది. అనుకున్న లక్ష్యం చేరుతారో లేదో తెలియదు.. ఆశయం నెరవేరుతుందో తెలియదు.. రాజ్యాధికారమనే ఒక స్నప్నం నిజంగా సాకారమవుతుందో లేదో తెలియదు.. కానీ ప్రతిరోజూ అడవిని నమ్ముకున్న బిడ్డలు అడవి ఒడిలోనే అనాధల్లో తూటాల వేటుకు బలి అవుతున్నారు. పచ్చని ఇగుళ్ళ పొదలకు వెచ్చటి నెత్తురును తడుపుతున్నారు. వరుసగా సాగే నరమేథాన్ని ఆపేందుకు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మావోయిస్టులు గిరిజనులకు అండగా నిలిచారు. తమకు ఆసరాగా నిలిచిన గిరిజనులను అరెస్టులు చేసి జైళ్లలో హింసలు పెట్టడం, తమ వార్తలను ప్రచురించిన జర్నలిస్టులను కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేయడం మావోయిస్టులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ కోపం తోటే ఒరిస్సాలో.. ఇటలీ పర్యాటకులను, ఎమ్మెల్యే హికాకను కిడ్నాప్ చేసేదాకా చేరింది. అయితే ప్రజాకోర్టులోనే వారిని శిక్షిస్తామని మావోయిస్టులు చెప్పినప్పటికీ అరెస్టు చేసిన వ్యక్తులు పర్యాటకులు కావడంతో వారిని చంపడం సాధ్యం కాని పని.. వారిని చంపితే.. ప్రభుత్వం పర్యాటకులను రక్షించుకోలేక పోయిందనే అపప్రద తప్ప మావోయిస్టులు సాధించేదేమీ లేకపోగా.. దేశం చూడ్డానికి వచ్చిన విదేశీ పర్యాటకులను పొట్టన బెట్టుకున్నారన్న విమర్శలు వస్తాయి. ఇక హికాక గిరిజన ఎమ్మెల్యే. ఆయనకు ఏదైనా అపాయం తల పెడితే.. గిరిజనులు భయపడి తమకు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. దీనికి తోడు హికాకను కిడ్నాప్ చేసి కొంత కాలం తమ వద్ద ఉంచుకొంటే ప్రభుత్వ పెద్దల గుట్టు మట్లు తెలుసుకున్నట్టవుతుంది. దాంతో బాటు గిరిజన ఎమ్మెల్యేను విడిపించేందుకు ప్రభుత్వం ఏమేరకు చొరవ తీసుకుందో తెలిపేందుకు ఇదే సమయమని భావించారు మావోయిస్టులు. వాళ్ల వ్యూహం సఫలమైంది. ప్రభుత్వం హికాక విడుదల పై సరిగ్గా స్పందించకపోవడంతో అది మావోయిస్టులకు కలిసి వచ్చింది. గిరిజనుల పట్ల ప్రభుత్వానికి ఉన్న దమన నీతిని ఎండగట్టారు. దీన్నే ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్‌ను కిడ్నాప్ చేయడం... అరెస్టై జైళ్లోలో మగ్గుతున్న మావోయిస్టు సానుభూతి పరులను విడుదల చేయాలంటూ డిమాండ్ చేయడం.. గిరిజనులకు మరింత బలాన్నిచ్చినట్టయింది. దీనికి తోడు మావోయిస్టుల పై విశ్వాసం పెరగడానికి హేతువయింది. పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామన్న మావోయిస్టు పార్టీ తమ కోసం ఎంతటి త్యాగాల కైనా సిద్ధంగా ఉందనేందుకు ఇదే తార్కాణమని వారు భావించారు. ఇదే అదనుగా.. ఇదే విజయోత్సాహంతో తమ పాత కారిడార్‌లో తిరిగి పుంజుకునేందుకు మావోయిస్టులు పావులు కదుపుతున్నారు. మావోయిస్టులు విజృంభిస్తే.. మందు పాతరలు మళ్లీ సందడి చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే జరిగితే వసంత మేఘం గర్జించి రుధిర వర్షం కురవక మానదు.