ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Thursday, December 5, 2019

జార్జ్ రెడ్డి సినిమా


"సభ ముగిసింది, ఇంక చరిత్ర మొదలవుతుంది’(ది మీటింగ్ ఈజ్ ఓవర్, నవ్ ద హిస్టరీ బిగిన్స్) అనే ఒక చారిత్రక మాట తో జార్జ్ రెడ్డి సంస్మరణ సభ ముగిసింది. ఇది జరిగి నలభై ఆరు ఏళ్ళు అయ్యింది. జార్జ్ రెడ్డి సినిమా విడుదలకు ముందే స్పెషల్ షో ఉంటె కొంత మంది మిత్రులతో చూసా. ఎటువంటి అంచనాలు లేకుండానే పోయా. ఇటీవల వచ్చిన కొన్ని బయోపిక్ లు కొన్ని వాస్తవ జీవితాలను చంపేసాయి మరికొన్ని శిలాజాలకు జీవం పోశాయి. జార్జ్ రెడ్డి సినిమా పైనున్న యే రెండు పనులూ చేయలేదు. కాకుంటే ఈ సందర్భంగా ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. ఒకడు ఒక టైలర్ దగ్గర ఇప్పుడు ఉన్న ట్రెండ్ లకు భిన్నంగా కొత్త చొక్కా కుట్టించుకున్నాడు. షాప్ లో అది తీసుకొని పరుగే పరుగు ఏం జరిగిందా అని అందరూ వాణ్ని వెంబడించారు. ఇంటికి వెళ్లి హడావుడిగా కవర్ విప్పి చొక్కా తొడుక్కునాడు. అరె ఏమయిందిరా అలా హడావుడి చేసావు అని పక్కవాళ్ళు అడిగితే ‘నేను ఈ చొక్కా వేసుకోవడం ఆలశ్యం అయితే ఈ మోడల్ కాపీ కొట్టి అందరూ కుట్టించు కుంటారు. నేనే ముందు వేసుకోవాలి కనుక ఇలా చేశా’.అని చల్లగా అన్నాడు. జార్జ్ రెడ్డి సినిమా తీసిన దర్శకుడు మానసిక స్థితి అచ్చంగా ఆ కొత్త చొక్కా కోసం ఉరికిన ఎర్రి బాపతు లాంటిది అనిపించింది. నాకయితే సినిమా ముగిసింది,’చరిత్ర కూడా ముగిసింది’ అనిపించింది. జార్జ్ తల్లి లీలా వర్గీస్ ట్రావెన్కూర్, తండ్రి చల్లా రఘునాథ రెడ్డి రాయల సీమ. ఈ దేశం స్వతంత్ర గాలి పీల్చేనాటికి జార్జి కి ఏడు నెలలు . ప్రాధమిక విద్య వరంగల్ సెయింట్ గాబ్రియల్ లో చదివాడు (61-62) తర్వాత సికింద్రాబాద్ సెయింట్ పాల్స్. నాడు కొండపల్లి సీతారామయ్య,శివసాగర్ సెయింట్ గాబ్రియల్ లో అధ్యాపకులు. జార్జ్ కి ఆ ఇద్దరూ ఆ నాటికి తెలిసే అవకాశం లేదు, తెలుసుకునే అవకాశం వచ్చేనాటికి వాళ్ళు ఇద్దరూ అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. కనుక ఆయనకు లేని వీరత్వాన్ని ఆపాదించడమూ సరికాదు. ఆయన విప్లవ నాయ కత్వం తో చర్చలు చేసాడు అంటున్నారు నిజమా ? జార్జ్ అన్నలు డాన్, కార్ల్ ఐఏఎస్, సిరిల్ వ్యారం లో చెల్లి జాయ్ మైసూర్ CIL లో పనిచేసారు. దాదాపు అందరూ చనిపోయారు గొప్పగా చదువుకున్నారు సామాజిక స్పృహ తో బ్రతికారు. డెబ్బై లలో ఉస్మానియా తన రాజకీయ కార్య క్షేత్రం అయ్యింది. జార్జ్ ఎవరి కోసం కొట్లాడాడో ఎవరు చంపారో ఉస్మానియా లో గడ్డి పరకను అడిగినా ఆ నెత్తుటి మరకల ఆనవాళ్ళు చెబుతాయి. ఎటుకూడి దర్శకుడు జీవన్ రెడ్డి కి మాత్రం బ్లేడ్ జార్జ్ మాత్రమే కనబడ్డాడు. ఆయనతో కలిసి తిరిగిన గద్దర్. రాజన్న, తమ్మారెడ్డి, ప్రదీప్,ప్రొ.మామిడాల రాములు సర్ బ్రతికి ఉండగానే ‘సినిమా ముగిసింది.’ అదే విషాదం. ధూల్ పేట లఖన్ సింగ్ క్రౌర్యం సంఘీయుల కాటిన్యం కలిసి ఒక గొప్ప విప్లవ స్వాప్నికుణ్ణి మట్టు బెట్టాయి. 72 జూలైలో సృజన జార్జ్ ముఖచిత్రం తో వేసినా ఆ హత్య కార్య కారణ సంబంధాలు ఏమాత్రం రాయక పోవడం ఆశ్చర్యం వేసింది. కనీస నిజ నిర్ధారణ రిపోర్ట్ వేయనంత సాధారణ చావుగా కుదించబడిన జీవితం జార్జ్. జార్జ్ కు మూడుతరాల మేథోజీర ఉంది. గొప్ప గొప్ప అధికారుల మంత్రులు సాంగత్యం ఉంది. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ మనిషి. ఆయన తో కలిసి రాజకీయీయాలు చేసిన జావేద్ మీర్జా తమ్మారెడ్డి రాతల్లో అర్థం అవుతోంది .ఎవరు ఏమనుకున్నా ఒకటి నిజం యర్రం రెడ్డి సంతోష్ రెడ్డి,ఒక కూర రాజన్న గద్దర్, మారోజు లాగా కడుపు మండి చేసిన పోరాటం కాదు. ఎవరు ఏమనుకున్నా కడుపులో చల్ల కదలని, పాలకవర్గ కరస్పర్శ జార్జ్ కి ఉంది.జార్జ్ చనిపోగానే ఢిల్లీ పర్యటన లో ఉన్న ముఖ్యమంత్రి పివి నర్సింహా రావు ఇంటికి వచ్చే అంత దగ్గరితనం ఉంది. ఈ మాట చెప్పడం ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడం మాత్రం కాదు విచక్షణ తో కూడిన ఆగ్రహ ప్రకటన ఆయనది. వివేచన తో కూడిన రాజకీయాలు నడిపిన నిక్కచ్చి తనం ఆయన సొంతం. ఆయన కార్యాచరణ ఆగ్రహం వెనక ముప్పును రాజ్యం ముందుగానే పసిగట్టింది ఆయన ఉనికి గిట్టని వారికి ముప్పు అని కూడా భావించి ఉంటారు . పాతికేళ్లకే అసువులు బాసిన మరో చే అతను. నాలుగేళ్ల లో ఆ కోపం ఉస్మానియా ను పోరాట క్షేత్రం చేసే అవకాశం ఉందని ఆయనను మట్టు బెట్టారు.ఆత్యాగాన్ని అపహాశ్యం చేసి చరిత్ర హీనుణ్ణి కాను , కానీ జార్జ్ కన్నా గొప్ప త్యాగమయ జీవితాలు చరిత్ర లో విస్తాపితులుగా మిగిలారు. కానీ చరిత్ర ఎవరి త్యాగాన్నీ మరచిపోదు. ముందూ వెనకా అవి రాసే చేతులకోసం ఎదురు చూస్తూ ఉంటది. సరైన చేతిలో పడితే .అసురన్, సినిమా లాగా అజ్ఞానుల చేతిలో ‘జార్జ్ రెడ్డి’ సినిమా లాగా ఒక మరక మిగులుద్ది. అయినా మరక మంచిదే కదా. ఇటువంటి పిరియాడికల్ సినిమా తీసేటప్పుడు జుట్టు,చొక్కాలు ఒక్కటే మారిస్తే సరిపోదు. ఆ నాటి రాజకీయ వాతావరణం రావాలి. అది రావాలి అంటే అరవై తొమ్మిది మొదలు జార్జ్ పోయేనాటికి కనీస రాజకీయ పరిజ్ఞానం ఉండాలి. పేలవమైన టేకింగ్, పేలవమైన ఫ్రేమింగ్, దరిద్రమైన రి రికార్డింగ్, ఎవడు ఎవరిని ఎందుకు కొడుతున్నారో తెలియదు. బస్తీల ల లో దొమ్మీ లాగా తీసారు కొన్ని సీన్లు. జార్జ్ వాడిన ఆయుధాన్ని హుస్సేన్ సాగర్ లో బుద్దుని సాక్షిగా నిమజ్జనం చేయడం తోనే దర్శకుని పరిణితి అర్ధం చేసుకోవచ్చు. జార్జ్ అంటే నిప్పు రవ్వ. నాకయితే మైక్ టైసన్ బయో పిక్ అక్కినేని నాగేశ్వరరావు తో వేయించి నట్టు అనిపించింది. జార్జ్ దూకుడు మనిషి కాదనను కానీ కారణం లేకుండా ఎవరి మీదా అడ్డగోలుగా చేయి ఎత్తని మనిషి. ఆయన చేయి చేసుకునే అంత గ్రావిటీ నాకు ఎక్కడా కనబడ లేదు. దానికి తోడు ఒక తెల్ల తోలు అమ్మాయి కుప్పిగంతులు ఇవి అవసరమా ? ఎవరు ఏమన్నా వందేమాతరం తరం నుండి జనతన సర్కార్ దాకా ఒక ప్రత్యామ్నాయ ఆలోచనకు ఉస్మానియా కేంద్రం. ఎన్నో గొప్ప సాహిత్య సాంస్కృతిక ఆలోచనలు అక్కడ పురుడు పోసుకున్నాయి. ఒక పోరాట పరంపర విప్లవ స్ఫూర్తి ఇంకా అక్కడ బ్రతికే ఉంది. జార్జ్ ప్రత్యామ్నాయ ఆలోచనలు తన చూపు నక్సల్బరీ దిశగా ఉంది మిత్రుల రాతల్లో చదివా. అసలు ఆయన తుపాకీ పెట్టె అవసరం ఎందుకు వచ్చింది. సినిమాలో తుపాకీ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసే అవసరం దర్శకునికి ఎందుకు కలిగింది ? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు . మీ మార్కెట్ కోసం, మీ ప్రవర కోసం ఆ పరంపరను ఆబాసు పాలు చేయకండి . పోరాట వీరులను బ్లేడు బాబ్జిలను, బుల్లెట్ జులాయిలుగా డ్యూయెట్ ఆటలతో పెప్సీ, పల్సర్ ,పిజ్జా కాక్టెయిల్ చేయకండి. జార్జ్ మీద ప్రేమ ఉంటె సినిమా చూడండి. లేకుంటే చూపు కాత్యాయని రాసిన ‘జీనా హైతో మర్నా సీకో’ పుస్తకాన్ని చదివి ఆ సజీవ జ్ఞాపకాలను మదిలో ఉంచుకోండి. అంతకు మించి చెప్పేది ఏమీ లేదు. మూడు పదులు దాటని ఒక గొప్ప విప్లవ శ్వాప్నికుణ్ణి సజీవంగా ఉంచుకోలేక పోయాం ఇది ఈ తరం మేథో వైఫల్యం ఈ నాటికీ ఆయన హత్యా మీద సమగ్ర సమాచారం రాసుకోలేక పోయాం ఆయన తో సన్నిహితంగా ఉన్న మిత్రులు పోక ముందే ఆ విస్మృత చరిత్ర నిర్మాణం తక్షణ అవసరం నా సహకారం ఎలాగో ఉంటది

No comments:

Post a Comment