ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, October 23, 2013

వాడుకొని వదిలేద్దమనుకున్నారా ... లోగుట్టు బయట పడింది ..


ఢిల్లీలో నిర్భయ కేసు తరహాలోనే హైదరాబాద్‌లో జరిగిన అభయ అత్యాచార ఘటన, భాగ్యనగరంలో మహిళల భద్రతను మరోసారి ప్రశ్నార్థకంగా మార్చింది. జనసమ్మర్థం ఉన్న ప్రాంతం నుంచే అభయను క్యాబ్‌ పేరుతో కారులో ఎక్కించుకుని నగర శివార్లకు తీసుకువెళ్లి అత్యంత అమానవీయంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ తీరు చూస్తే, మృగాళ్లు ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు. అమ్మాయిలు రేప్ చేస్తే పోలీసులకు చెప్పుకోరని, ఒకవేళ చెప్పుకున్నా, తమను పట్టుకోలేరన్న ధీమాతో నిందితులు ఉండడం మన వ్యవస్థాగత లోపాలను బయటపెడుతోంది. ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన దుర్మార్గులను అత్యంత దారుణంగా శిక్షించాలి. ఇక ఈ ఘటన జరగడం వెనుక లోపాలను పరిశీలిస్తే, ఎన్నో కనిపిస్తాయి. ఢిల్లీలో నిర్భయ కేసు జరిగిన తర్వాత, ఐటీ ఆఫీసులు, కాల్ సెంటర్లు ఎక్కువగా ఉన్న సైబరాబాద్ పరిధిలో సీసీ కెమెరాలు భారీగా అమర్చామని, నిర్బయలాంటి ఘటనలు తమ పరిధిలో జరగవని అప్పటి పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల నాథ్ ప్రకటించారు. కానీ, అదంతా వట్టిమాటలేనని తాజా ఘటనతో తేలిపోయింది. ఎందుకంటే, మాదాపూర్ నుంచి కొల్లూరు వెళ్లేదాకా ఒక్క సీసీ కెమెరా కూడా కారును రికార్డ్ చేయలేకపోయింది. ఇంత దారుణంగా సీసీ కెమెరాల పనితీరు ఉన్నా మన పోలీసులు పట్టించుకోవడం లేదు. అదృష్టవశాత్తూ బిర్లా స్కూల్ దగ్గర సీసీ కెమెరా పనిచేసింది కాబట్టి ఈ కేసులో చిక్కుముడి చాలావరకూ వీడిపోయింది. ఒకవేళ అక్కడ కెమెరా లేకపోతే పరిస్థితి ఏమిటి.. ఈ నిందితులు దొరికేవారా..? ఒకవేళ దొరకకపోతే మాత్రం, ఇదే తరహాలో మరెంతోమంది యువతుల జీవితాలతో చెలగాటమాడేవారన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఈ కేసును పోలీసులు త్వరగా ఛేదించినప్పటికీ, వారి నిర్లక్ష్యం వల్లే ఇంత దారుణం చోటుచేసుకుందన్నది అందరూ గుర్తించాల్సిన విషయం. ఇక త్వరగా హాస్టల్‌కు వెళ్లాలన్న తపనలో ప్రైవేట్ కార్‌లో ఎక్కడం కూడా అభయ తప్పే. నిర్భయ లాంటి ఘటనలు జరిగిన తర్వాత కూడా, ఒక్కసారి కూడా ఆమె ఆలోచించకపోవడం వల్లే ఈ దారుణం జరిగింది. కారులో ఎక్కకుండా బస్సు కోసమో, షేర్ ఆటో కోసమో కనీసం మరో పదినిమిషాలు వేచి ఉన్నా సరిపోయింది. ఒంటరిగా వెళ్లాల్సి వచ్చిప్పుడు వీలైనంతవరకూ బస్టాండ్‌ల దగ్గరకు వచ్చి ఎక్కించుకునే క్యాబ్‌లను ఆశ్రయించకపోవడమే మంచింది. ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఇలాంటి వాహనాలను ఎంచుకోవాలి. అమ్మాయిల భద్రత కోసం మనవాళ్లు కొంతకాలం ఆండ్రాయిడ్ ఆప్‌ను తయారు చేశారు. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఉంచుకోవడం మంచిది. ఇక పెప్పర్‌ స్పే లాంటివి అమ్మాయిలు బ్యాగ్‌లో ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. తాము ప్రయాణిస్తున్న వాహనం దారి మళ్లిందని గుర్తించగానే డ్రైవర్‌ను నిలదీయాలి. అతనిచ్చిన సమాధానం సరిగా లేకపోతే మాత్రం వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ 100కు డయల్ చేయాలి. ఒకవేళ ఫోన్ చేసే పరిస్థితులు లేకపోతే, మేసేజ్ పంపించినా చాలు. ఔటర్ రింగ్‌రోడ్డు టోల్‌గేట్ల దగ్గర కూడా పోలీస్‌లను డ్యూటీలో ఉంచాల్సిన అవసరం ఉంది. కార్లలో అనుమానాస్పదంగా ఉన్నవాళ్ల వివరాలను అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. మగాళ్లు కూడా ఈ విషయంలో మారాల్సిన అవసరం ఉంది. ఆడవాళ్లపై లైగింక దాడులు చేయాలన్న దురాలోచనను మానుకోవాలి.

Friday, August 9, 2013

ఖమ్మం లో tv5 రిపోర్టర్ నిర్వాకం


ఖమ్మం లో జీ తెలుగు రిపోర్టర్ నిర్వాకం


Tuesday, August 6, 2013

వేటూరి కలం చెప్పిన రహస్యం

Friday, June 21, 2013

యువక ఇలా చావకూడదు

యువక ఇలా చావకూడదు.
ఈ మాట నా మనసు నాతో అనుకున్నప్పుడు 20 ఏళ్ళ సావాసంలోంచి కారణాలు అనేకం ముసురుకున్నాయి. ఒకే ఒక ముక్క పదే పదే చెప్పి నాకు నిమ్మళం కలిగించేందుకు నా మనసు ఇలా పలుకుడుబండయిపోయింది. “యువక ఇలా బతికి వుండకూడదు. యువక ఇప్పుడు జీవించి వుండకూడదు. యువక అసలు ఇక్కడ పుట్టి వుండకూడదు.” @ ఎందుకో అతను కొనసాగిన ఆత్మహత్యలా బతికాడు. మరీ ప్రత్యేకించి తన ప్రయాణపు చివరి రోజుల్లో. అతను తీవ్ర ప్రేమి లేమితో జీవించాడు. అతను మాల కుటుంబంలో పుట్టాడు. మగవాడిగా పుట్టాడు. @ యువకది అసహజ మరణం. అతని స్వప్నం ప్రౌఢ. కాంక్ష ఎరుక కలిగినది. పుట్టుకకే మాల కానీ అతను నడిచిన దారి కదంబమే. ఇలాంటి చావులు ఒక మేధోపరమైన ఖాళీ నుంచి పుడతాయేమో! ఈ మేధోపరమైన ఖాళీ యువకలాంటి వ్యక్తుల వ్యక్తిగతమైనది కాదేమో! ఒక తరానిదేమో! ఏమో కానీ యవకది కూడా అకాల మరణమే. ఎందుకంటే అతన్ని ఈ కాలం afford చేయలేక పోయింది. అతని సకల ఒంటరితనాలనీ, అందులోంచి వచ్చిన విపరీతమైన సంచారతనీ, దాని ప్రతిఫలనమైన విచ్చల’విడి’ తనాన్నీ, అంతర్ముఖతనీ, సదా మత్తులోమనుగడనీ, అనిబద్ధతనీ, అసంబద్ధతలనీ ఈ కాలం భరించలేకపోయింది. వ్యక్తి స్వేచ్ఛ పేరుతో సమూహంనుంచీ, కలివిడి నుంచీ, గుంపులనుంచి, సంఘటితం నుంచీ చాలా వేగంగా, స్వచ్ఛందంగా తప్పుకుంటున్న ఈ ఏకాకుల కాలం యువకని భరించడం చాలా కష్టం అయిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ‘కృత్రిమ’ మార్పులను మనపై రుద్దుతూ, ఈ ‘సామాజిక’ మార్పులపై చర్చనే ప్రధాన అజెండాగా మార్చుతున్న ఈ అస్థిత్వ కాలం యువక లాంటి పరిత్యాగ జీవన శైలినీ, నిలకడలేని తనాలను, ఆర్జనపై(ధన, జ్ఞాన) ఆకాంక్ష లేమినీ, ఎక్కడా ఇమడలేని తనాలనీ అక్కున చేర్చుకోలేక పోయింది. Central Processing Units ను ఆదమరచిన ఈ Screen Savers' times యువకను కొనసాగిన ఆత్మహత్యకు పురికొల్పాయనిపిస్తుంది. అతని బతికిన జీవితానికి ఈ నడుస్తున్న కాలానికీ మేధో పరమైన ఖాళీ ఏర్పడింది. అతని మేధ ఎదుర్కోలేని, నిలబడలేని, గ్రహించలేని, పరిష్కరించలేని, అవగతం చేసుకోలేని అనేక ప్రశ్నలను శరపరంపరగా వ్యక్తులపైకి ఎక్కుపెట్టిన సంక్షోభ కాలం ఇది. ఈ పెను సవాళ్ళ, అపార క్షుభిత కాలంలో కనీసం బతకడం కూడా చాలా సాహసమే. అయితే అతని మేధలోని ఈ ఖాళీ అతనిది మాత్రమే కాదని సవినయంగా ఒప్పుకునేందుకు వెనకాడుతున్న ఈ కాలం అతడిని ఆత్మహత్యకు వదిలేసిందేమో! ఈ ఖాళీ ఒక కాలానిదీ, ఒక తరానిదీ. అందుకే యువకది అకాల మరణం. అదుకే అతనిది కొనసాగిన ఆత్మహత్య. యువక ఇప్పుడు మనముందు కనిపించ కుండా పోయినందుకు మరణించాడని నిర్ధారించుకుంటున్నాం. కానీ మన మధ్యలో బతుకుతున్న చాలా మంది ఇదివరకే మరణించారన్న వార్త మనకింకా చేరడం లేదు. అంతే. @ యువక ఇలా చనిపోవడం పట్ల నాకు ప్రత్యేకమైన జాలి లేదు. విపరీతమైన కోపమూ లేదు. కుంగిపోయేంత నిరాశా రాదు. నా లోన ఇన్నాళ్ళూ యువక రగిలించిన ఆశా కొండెక్కదు. ఈ నా లోపలి ఉక్రోశం బహుశా మా సహచర్య స్వార్థంలోంచో, లేదా నా మృత్యుభయంలోంచో ధ్వనించిందంతే. @ నిష్కామకర్మ తో జీవించడం చాలా ఆదర్శం. కానీ మరణంలో ఇదే సూత్రం మాత్రం కంపితమనాన్ని మరింత రగిలిస్తుందని యువక మరణం గురిచేసిన గగుర్పాటు నాకు గుర్తుచేస్తోంది. కేవలం గ్యాలరీల కోసం ఆదర్శంగా బతకాలని తెగ ప్రయత్నించడం కన్నా దర్జాగా చావడం మేలు. అలా అని యువక ఆత్మహత్యను వెనకేసుకురాడం లేదు. మన ముందుకు తోస్తున్నానంతే. అయినా మనలోని యువకలో, యువకలోని మన నేనులో, ఇలా యువకలా మరణించడం పట్ల మనకు విపరీత భయం, వ్యతిరేకత, ఆందోళన, అసహ్యం, కోపం. ఇందుకే యువకలానే అతని మరణాన్నీ చాలా తక్కువ మందే అక్కున చేర్చుకున్నారు. కానీ అతను ఇలా, ఇప్పుడు, ఇక్కడ మరణించి వుండాల్సిందేనా? @ యువక చెప్పాల్సింది చెప్పకుండానే చని పోయాడు. రాయాల్సింది రాయకుండానే మరణించాడు. చేయాల్సింది చేయకుండానే అర్థంతరంగా నిష్క్రమించాడు. వుండటమే పోరాటం అయిన కాలంలో చెప్పాపెట్టకుండా లేకుండా పోయాడు. చెప్పడానికీ, రాయడానికీ, చేయడానికీ, వుండటానికీ కనీస శక్తిని కూడా లేకుండా చేసేసుకుంటూ ఎటో మాయమైపోయాడు. ఎవరి మీదో తెలియని కోపంతో, అలకతో తనను తాను నిరాకరించుకుంటూ అస్తమించాడు యువక. మంచి మనసున్న, మనకున్న కొద్ది మంది ఒరిజినల్ థింకర్స్ లో వాడూ వుండిపోయాడో? మిగిలిపోయాడో ? యువకది కేవలం అకాల, అసహజ మరణమే కాదు…. అనవసర మరణం కూడా.

Saturday, May 12, 2012

పార్లమెంట్‌కు అరవై ఏళ్లు.. సాధించింది సన్యాసం


అది 1952 మే13... భారత దేశంలో ఓ కొత్త శకం ఆరంభం.. ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న నేతలు ఇక్కడే కొలువు తీరారు... ప్రజలు ఏ విశ్వాసంతో తమను ఇక్కడకు పంపారో... ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొనే వేదిక ఇది. ఇప్పటిలా అప్పుడు ప్రత్యక్ష ప్రసారాలుగానీ.. బ్రేకింగ్ న్యూస్ కానీ లేవు. పార్లమెంట్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రాత్రి రేడియోలో వచ్చే వార్తల్లోనే.. అదీ సంపన్న వర్గాలకే సాధ్యం. అయినా మన నేతలు ప్రజలకేం కావాలో అవి చర్చించి మరీ సాధించుకునే వారు.. మైకులు విరిచేయడాలు.. వెల్‌లోకి దూసుకెళ్లడాలు... ప్లకార్డులు పట్టుకొని గోల చేయడాలు లేవు. ఏదైనా నిరసన తెలియజేయాల్సి వస్తే శాంతియుతంగా తెలపడం.. వాకౌట్ చేయడం.. అది కూడా చాలా అరుదగా జరిగే చర్య.. తొలినాళ్లలో పార్లమెంటు చాలా హుందాగా, పద్ధతిగా నడిచేది. పండిట్ నెహ్రూ, శాస్త్రీజి, ఆచార్య కృపలానీ, లాంటి నేతల సారధ్యంలో వాడి, వేడి చర్చలు సాగేవి. సభ అంటే ఎంతో గౌరవం వుండేది. నేతల ప్రసంగాలను అత్యంత శ్రద్ధగా వినేవారు. వాదనలన్నీ అంశాలపైనా, సమస్యలపైనా వుండేవి. అనవసర రచ్చలతో కాలయాపన ఉండేది కాదు.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బాగా అమలయ్యేది. సభ్యులు తమ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని తమ ప్రసంగాల్లో మాత్రమే చూపేవారు. తమ వ్యతిరేకతను, నిరసనలను హుందాగా ప్రకటించేవారు. కాల చక్రం గిర్రున తిరుగుతోంది.. ఆరు దశాబ్దాలు అవలీలగా గడిచిపోయాయి. పార్లమెంట్ అంటే ఫైటింగ్ స్టేజీగా మారిపోయింది. ఇప్పుడు కూడా ప్రజా సమస్యలే.. కాకుండే ప్రజల సొమ్ము ఎవరెంత కాజేశారు.. ప్రజాధనాన్ని ఏ ప్రభుత్వ హయాంలో ఎంత బొక్కేశారు.. గత ప్రభుత్వం చేసిన తప్పులేంటి.. ఇవే చర్చలు.. ప్రజలకు పనికొచ్చే చట్టాలకు జీరో అవరే గతి... ఎవరు పెద్దగా గళమెత్తి.. వీరోచితంగా ప్రవర్తిస్తే వారే పార్లమెంట్ హీరో.. ఎన్ని మైకులు విరగ్గొట్టి.. ఎన్ని సార్లు వెల్‌లోకి దూసుకెళితే ఆయనే ప్రజల పక్షాన అలుపెరగకుండా పోరాడుతున్నట్టు.. ప్రజా సమస్యల పై వీరు గొంతు చించుకుంటుంటే.. దాన్ని ప్రసార మాద్యమాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి గనుక... విపక్షాల పై దుమ్ము పోయడమే పనిగా పెట్టుకొని... దానికి పార్లమెంట్‌ను వేదికగా చేసుకుంటున్నారు. ప్రతి పక్షం, అధికార పక్షం బహిరంగ సమావేశాల్లో విమర్శలు చేసుకుంటాయి. కానీ ఎదురెదురుగా తిట్టుకునే వేదికగా పార్లమెంట్ మారింది. ఎన్నికల్లో పంచిన నోట్ల కట్టలను ప్రదర్శించే వేదిక కూడా పార్లమెంటే అయింది. ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు వేదికైన మన పార్లమెంటుకు షష్టి పూర్తి వేడుకలు జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు.. ఎన్ని సవరణలు.. ఎన్ని మలుపులు.. ఈ అరవైఏళ్ల పార్లమెంట్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లు.. పార్లమెంట్ అంటే మైకుల విరిచేసుకోవడం అనే కోణంలోనే చూడరాదు.. అది భారత పౌరుడి సగటు గళం స్పందనకు వేదిక.. ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధులు వారి సమస్యలను చర్చించి వారికో పరిష్కారాన్ని సాధించే వేదిక. ప్రభుత్వ పరమైన నిర్ణయాలు చట్టాలుగా మారే కేంద్రం. ఈ వేదిక ఎంతో ఉన్నతమైనది.. సామాన్యుడి గళం వినిపించే ఓ ప్లాట్ ఫామ్..అక్కడ చర్చలుంటాయి.. వాదోపవాదాలూ వుంటాయి.. ప్రజాసమస్యలపై అనేక కోణాల్లో చర్చలు జరుగుతాయి. ప్రభుత్వ పెద్దలకు సలహాలు, సూచనలు అందుతాయి. పార్లమెంట్ ఉభయ సభలూ రెండు కళ్ల లాంటివి.. కీలకమైన అంశాలపై చర్చలు జరిపి ఉభయ సభలు ఆమోదించాకే బిల్లు చట్ట రూపం తీసుకుంటుంది. పార్లమెంటు కొలువు దీరిన తొలినాళ్లలో చట్ట సభలను పవిత్ర దేవాలయంగా, సభాపతిని పూజారిగా భావించే వారని వృద్ధతరం నేతలంటున్నారు. పార్లమెంటు మొదలైన నాటి నుంచి నేటి వరకూ అందులో కొనసాగుతున్న వారిలో కొందరు ఇంకా వున్నారు. మణిపూర్ కు చెందిన రిషాంగ్ కీషింగ్ 1952లో ఆరంభంలో సభ్యుడిగా వున్నారు. ఇప్పటికీ ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక రేషమ్ లాల్ జంగ్డే అనే దళిత న్యాయవాది కూడా మొదటి లోక్ సభ సభ్యుడిగా వున్నారు. బిలాస్ పూర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక తొలి పార్లమెంటు సభ్యునిగా వున్న వారిలో మన తెలుగు వారు కూడా వున్నారు. పార్లమెంట్ షష్ఠి పూర్తి చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని... పార్లమెంటులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.. ఉదయం 11 గంటలకు ఉభయసభల సభ్యులు కొలువుదీరి.. మామూలు సమస్యలపై కాకుండా.. గత అరవయ్యేళ్లలో పార్లమెంటు ప్రస్థానం గురించి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గు రించి చర్చలు జరుగుతాయి. సాయంత్రం నాలుగున్నర దాకా ఈ ప్రత్యేక సెషన్ నడుస్తుంది. పార్లమెంటు సెంట్రల్‌హాలులో ఉభయసభల సభ్యులనూ ఉద్దేశించి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ప్రసంగిస్తారు. ప్రధాని మన్మోహన్ సింగ్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ తదితరులు కూడా ప్రసంగిస్తారు. పార్లమెంటు షష్టిపూర్తిని పురస్కరించుకుని రూ.5, 10 నాణేలను, పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఈ వేడుకల్లో అనాటి సభలో సభ్యులైన రిషాంగ్ కెయిషింగ్, రేషమ్‌లాల్ జంగ్డేలకు గౌరవ సత్కారం చేస్తారు.. ఈ సందర్భంగా వారిరువురూ అలనాటి సభ విశేషాల గురించి తన అనుభవాలనూ... జ్ఞాపకాలను వివరిస్తారు. రిషాంగ్.. 1952 సభలో సభ్యుడిగా ఉండి, ప్రస్తుతం మణిపూర్ నుంచి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మ ణిపూర్ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఘనత కూడా రి షాంగ్‌ సొంతం. రేషమ్‌లాల్ జంగ్డే ఒక దళిత న్యాయవాది. తొలిసభలో సభ్యుడైన ఆయన.. బిలాస్ పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే, మధ్యప్రదేశ్ అసెంబ్లీకి మూడుసార్లు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యా రు. పార్లమెంట్ అరవై సంవత్సరాల వేడుకలో పంచుకున్న అనుభవాలతోనైనా.. పార్లమెంట్‌లో హుందాతనం.. సభ్యులు ప్రవర్తించిన తీరు.. ప్రజా సమస్యల పై చిత్ర శుద్ధి లాంటి అంశాలు మన నేతలు గుర్తు చేసుకొంటే.. ఈ వేడుకలకు నిజమైన అర్ధం...

అమ్మను గుర్తుంచుకునేందుకు ఇదా పద్దతి..


మాతృదినోత్సవం ఎందుకు అమ్మను మర్చిపోతే కదా.. కన్నీళ్లలోనూ.. కలవరపాటులోనూ గుర్తొచ్చేది అమ్మేకదా.. ఆఖరుకు బూతులు తిట్టే వెదవల నోళ్లలో నానేది కూడా తొలుత అమ్మ పదమే.. అందుకే మర్చిపోలేని అమ్మను గుర్తు చేసుకునే మాతృదినోత్సవం గురించి మీరేమంటారు.