Monday, January 24, 2011
ఈ రోజు మద్యాహ్నం టి.వి చూడాలనిపించి కాస్త రిమోట్ కు పని చెప్పా..రాజాం నుంచి రచ్చబండ లైవ్..అదీ సియం గారితో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం. సియం తాను ముఖ్యమంత్రినని గుర్తుకు తెచ్చుకొని హుషారుగా ప్రజా సమస్యలు తీరుస్తానని, రచ్చబండ ద్వారా రాష్ట్రాన్ని మొత్తం ఒకేసారి సుసంపన్నం చేద్దామన్నంత హుషారు కనిపించింది. అయితే ఒక్కోక్కరు అడిగే సమస్యలకు ముఖ్యమంత్రి చెప్పే సమాధానం గజాసనవాయు సామెతను గుర్తుకు తెచ్చింది. ఆ వూళ్లో ఒక విధవరాలు పించను రావట్లేదని అడిగింది వెంటనే అక్కడున్న అధికారుల సమాధానం ఏంటంటే రేషన్ కార్డులో నంబర్ తప్పుపడిందని..ఆ వెంటనే సియం సముదాయింపు..అమ్మా నీ కార్డులో నెంబర్ తప్పు పడిందట..ఆ నెంబర్ సరి చూసి మీకు పించన్ ఇస్తారని చెప్పాడు. ఆ మహిళ తడుముకోకుండా ఒకటే మాట అంది..రెండు సంవత్సరాల నుంచి ఇదే మాట అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మీరు చెబుతున్నారు. అంది..అంతే కాదు గుక్క తిప్పుకోకుండా మరో మాట కూడా జత చేసింది..మిద్దెలు మేడలు ఉన్నోళ్లకు రాని తప్పుడు నెంబరు నాకే రావాల్నా సారూ. అంది.నాకు నవ్వు ఆగలేదు.. ఎందుకంటే సియం..అక్కడ కనీసం ప్రజల మెప్పుకోసమైనా అధికారులను మందలించాల్సి ఉండేది. నెంబర్ తప్పు పడింది అంటే ఎవరి నిర్లక్ష్యం? పోనీ టెక్నికల్ మిస్టేక్ వల్ల తప్పు పడిందే అనుకో..ఆ తప్పు సరిదిద్దడానికి ఎన్నేండ్లు పడుతుంది..అడిగేవాడు లేకుంటే ఎన్నేండ్లయినా పడుతుంది..రెండేళ్లుగా ఒక నంబర్ తప్పును సరిదిద్దలేని అధికారులు ఇప్పుడు అమాంతం ప్రజలకు మేలు చేస్తారనుకోవడం కాస్త అత్యాశే కావచ్చు..కానీ పాపం ఆ అమాయకురాలు నమ్మడంలో తప్పులేదు. మళ్లీ రెండు నెలల తరువాత ఆ వూరెళ్తే గానీ అధికారులతో ఆమె ఎన్ని చివాట్లు తిన్నది..ఇంతకీ ఆ నెంబర్ మారిందీ లేనిది చెప్పదు. బౌషా అమెకి తెలియక పోవచ్చు.. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినంత ఈజీగా కార్డులో నెంబర్ మారదని. ఈ రాష్ర్టంలో సియం దృష్టికి రాని నంబర్లు ఎన్నివేలు తప్పు పడ్డాయో. ఆ పాపనికి పించన్ రాక, ఆరోగ్యశ్రీ అందుకోక, కనీసం ఉపాధి లభించక, ఆఖరుకు ఆ రెండు రూపాయల బియ్యం కూడా అందుకోలేక ఎందరు బాధపడుతున్నారో.. తరువాత మరో వికలాంగురాలైన పద్మావతి సియం గారితో తాను యం.ఏ తెలుగు, యంఇడి చదువుకున్నానని తనకు వికలాంగుల పించన్ ఐదు వందలు సరిపోదని, కష్టపడి తల్లిదండ్రులు వికలాంగురాలినైనా చదివించారని, వాళ్లరుణం తీర్చుకోవాలంటే చిన్న ఉద్యోగం ఇప్పించమని వేడుకొంది. సాలరీ ఎంతైనా ఫర్వాలేదు కనీసం కొలువిస్తే చాలని ప్రాదేయం పడింది. వెంటనే సి.యం డిఆర్డీఏ ఆఫీస్ లో ఆమెకు కాంట్రాక్ జాబ్ ఇవ్వాల్సిందిగా పి.డిని ఆదేశించారు.వేతనం 6000/- నిర్ణయించారు. ఈ సీన్ చూస్తే లీడర్ సినిమాలో ఒక సీన్ గుర్తొచ్చింది. అనాథైన ఒక మైనర్ బాలిక తన ఆకలి తీర్చుకోవడానికి కేవలం ఒక బన్నుకోసం ఒక నడివయస్కుడి కామవాంచ తీర్చడానికి సిద్దపడుతుంది. అది గమనించిన హీరో వాణ్ని మందలించి బన్ను డబ్బు తానివ్వబోతాడు. అతని ముందుకు కొన్ని వందల చేతులు వస్తాయి..నిజానికి ఏ ఒక్కరి ఆకలి తీర్చడానికో కాదు ఈ రాష్ర్ట సియం ఉన్నది. ఇలాంటి పీజిలు చేసి వికలాంగుల సర్టిఫికెట్ తీసుకొని నెలకు ఐదొందల బిక్షంతో గడిపే వికలాంగులకు సియం 6000/- వేతనం ఉండే ఉద్యోగాలు అంతటా ఇవ్వాలి. ఊరికో స్క్రోలింగ్ రావాలి. ఇది సాధ్యమయిన రోజే రచ్చబండకు విలువుంటది. అంతేందుకు కోడి రమణమ్మ రేషన్ కార్డులో నంబర్ నెలరోజుల్లో మారితే ఈ రచ్చబండ నిజంగా ప్రజలకు న్యాయం చేసేదని నమ్మవచ్చు. సియం గారూ...పాకం ముదిరిపోయింది..ఇప్పుడు నీళ్లు పోస్తే పాకం గడ్డ కడుతుంది. పిండేస్తే రాయి మాదిరిగా తయారవుతుంది. యూ ఆర్ టూ లేట్... ఎన్నిరచ్చబండలైనా నీకు గుదిబందలే...ఆల్ ద బెస్ట్...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment