ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, July 31, 2010

బోనాలు పుట్టు పూర్వోత్తరాలు

తెలంగాణ పండగలు, జాతరలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు, ఆచారవ్యవహారాలకు అద్దం పడతయి. వీటిని ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అటువంటి ఒక ముఖ్యమైన పంఢగ బోనాలు. తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకునే పండగ బోనాల పండగ. బోనాల పండగ అనగానే కోలాహలం, ఉరకలెత్తే సంతోషం, కొత్తబట్టలు, పసుపు కుంకుమలు, వేపాకు తోరణాలు . ప్రతీ వీధిలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటయి. ఎవరికి వారు ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు అందరూ కలిసి అమ్మవారి గుడికి వెళతరు. బోనాల పండగరోజు ఆలయాల దగ్గర వినిపించే తెలంగాణ జానపద పాటలుకూడా అమ్మను కొలిచి భక్తి పారవశ్యంలో ముంచేలా ఉంటయి.
బోనాలు పుట్టు పూర్వోత్తరాలు
అమ్మ తన బిడ్డలందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది. అలాగే తప్పు చేస్తే మందలిస్తుంది. అయినా సరే వినకుంటే దండిస్తుంది. అప్పుడు ఆ బిడ్డ తన తప్పు తెలుసుకుని సరియైన మార్గంలో పయనిస్తాడు. అదే అమ్మకు పిల్లలకు ఉన్న అనుబంధం. అదే విధంగా ప్రకృతిమాత లేదా ఆ అమ్మలగన్నయమ్మకు కోపం వస్తే కూడా మనని దండిస్తుంది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది. ఎన్నో అనర్ధాలు జరుగుతయి. అంటురోగాలు ప్రబలుతయి. 1869 సంవత్సరంలో హైదరాబాదు, సికిందరాబాదు జంటనగరాలలో ఇలాగే మలేరియా వ్యాధి ప్రబలి తీవ్ర జననష్టం జరిగింది. అమ్మకు కోపం వచ్చిందని భావించిన ప్రజలు ఆమెను ప్రసన్నపరచడానికి ఉత్సవాలు , జాతర జరిపించాలని నిర్ణయించారు. అదే బోనాలు. ఈ పండగను ఆషాడ మాసంలో జరుపుకుంటారు. హైదరాబాదు, సికిందరాబాదులోనే కాక మరికొన్ని తెలంగాణా ప్రాంతాలలో ఈ పండగ చాలా వైభవంగా జరుపుకుంటరు. ఈ పండగ ముఖ్య ఉద్ధేశ్యం కలరా, ప్లేగు, మశూచి వంటి అంటు వ్యాధులు ప్రబలకుండా, ప్రకృతి బీభత్సాలు జరగకుండా, పాడిపంటలను, తమ పిల్లలను చల్లగా చూడమని ఆమెకు బోనం సమర్పిస్తరు భక్తులు. ఉగాది తర్వాత చాలా రొజులకు వచ్చే మొదటిపండగ ఇదే.
భోనం గురించి
బోనం అంటే భోజనం. శుచిగా అన్నం వండుకుని దానిని ఘటంలో అంటే మట్టికుంఢ లేదా ఇత్తడి గుండిగలో వుంచి దానికి పసుపు, కుంకుమలతో అలంకరించి, వేపాకు తోరణాలు కడతరు. అన్నంలో పసుపు లేదా పాలు చక్కెర కలిపి నైవేద్యం తయారు చేస్తరు. ఆ పాత్ర పైన ఒక ప్రమిదలో దీపం పెట్టి ఇంటి ఇల్లాలు లేదా ఆడపడుచు పట్టుబట్టలు కట్టుకుని, పూలు,నగలు అలంకరించుకుని సంతోషంగా ఆ బోనాన్ని తమ తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలు, డప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మకు సమర్పిస్తరు. ఈ ఊరేగింపులో సంప్రదాయిక నృత్యాలు చేస్తరు. ప్రతీ సమూహం వెదురుబద్దలు, రంగు కాగితాలతో తయారుచెసిన తొట్టేలను(ఊయల) కూడా అమ్మవారికి సమర్పిస్తరు. అమ్మకు బోనాలు, తొట్టెలు సమర్పిస్తే అమ్మ శాంతించి తమను, తమ పిల్లలను చల్లగా చూస్తదని భక్తుల నమ్మకం. ఎందుకంటే అప్పుడే వానాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణ మార్పు వల్ల కూడా అంటురోగాలు వచ్చే ఉంది.
బోనాన్ని తలకెత్తుకున్న మహిళలు ఆ అమ్మయొక్క శక్తి , అంశ అని గౌరవిస్తూ ప్రజలు ఆ మహిళ కాళ్ల మీద నీళ్లు పోస్తారు. అలా చేస్తే అమ్మవారు శాంతిస్తుందని వాళ్ల నమ్మకం.
అదే కాక మరో నమ్మకం కూడా ఉంది. ఆషాడ మాసంలో అమ్మ తన పుట్టింటికి వస్తుంది. తమ కూతుళ్లు పుట్టింటికి వస్తే ప్రత్యేకంగా చూసుకున్నట్టే ప్రజలందరూ వెళ్లి ఆమెను దర్శించి భక్తితో భోనం వడ్డిస్తరు. తెలంగాణా ప్రజలు అమ్మవారిని తమ తల్లిగా, ఇంటి ఆడపడుచుగా భావించి పూజిస్తరు.
అమ్మవారి సోదరుడైన పోతురాజుది ఈ సంబరాలలో ముఖ్య పాత్ర. బలిష్టుడైన వ్యక్తి ఒళ్లంతా పసుపు రాసుకుని , వేపాకు మండలు కట్టుకుని , నుదుల పెద్ద కుంకుమ బొట్టుతో , కాలికి గజ్జెలతో కొరడా ఝలిపిస్తూ పూనకం వచ్చినట్టు వీరంగం ఆడుతూ ఉంటడు. అమ్మవారికి సమర్పించే ఫలహారపు బళ్ళను అతనే ముందుండి నడిపిస్తడు.
జంటనగరాల జాతర

ఈ పండగ హైదరాబాదు, సికిందరాబాదులో వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు రోజులలో జరుగుతుంటది. బోనాల పండగ ఆషాడ మాసంలోని ఆదివారం రోజే జరుపుకుంటారు. ఈ పండగ ఆషాడ మాసం మొదటి ఆదివారం రోజు గోల్కొండ కోటలోని జగదంబ ఆలయంలో మొదలవుతుంది. నిజాం నవాబుల కాలం నుండి ఈ ఆనవాయితి కొనసాగుతూ వస్తుంది. రెండో ఆదివారం సికిందరాబాదులోని ఉజ్జయినీ మహంకాళీ మందిరంలో జరుగుతది. అప్పుడు సికిందరబాదు వాసులందరూ ఈ పండగ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొంటరు. మూడవ ఆదివారం హైదరాబాదులోని అన్ని ప్రాంతాలలో ఈ పండగ ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతీ వీధి తోరణాలతో కళకళ లాడిపోతుంటది. చివరి ఆదివారం గన్ ఫౌండ్రిలో ఈ పండగ జరుపుకుంటారు. దీనితో బోనాల పండగకు తెర పడుతది. ఏ పండగైనా ప్రజలంతా ఒకేరోజు జరుపుకుంటరు. కాని బోనాల పండగను మాత్రం వారానికో ప్రాంతంలో నెలంతా కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటరు.

జాతర జరిగే విధానం
అమ్మవారిని ఎన్నో పేర్లతో కొలుస్తారు. మైసమ్మ, పోచమ్మ, యెల్లమ్మ, పెద్దమ్మ, డొక్కలమ్మ, అంకాలమ్మా, పోలేరమ్మ, మారెమ్మ, యెల్లమ్మ .. అమ్మే కదా యే పేరుతో పిలిచినా పలుకుతది , తమని ఆదుకుంటుంది అని ప్రజల ప్రగాఢ విశ్వాసం.. ఆదివారం బోనాలు సమర్పిస్తరు. ఇంతటితో పండగ అయిపోలేదు. మరునాడు ఉదయం రంగం అనే కార్యక్రమం ఉంటది. రంగం చెప్పడమంటే అమ్మవారు ఒక అవివాహిత శరీరాన్ని ఆవహించి ఆమె ద్వారా నగర ప్రజలకు రాబోయే ఏడాదిలో జరగబోయే మంచిచెడులను చెబుతుంది. రంగం చెప్పే మహిళ గర్భాలయం ముందు ఒక పచ్చికుండపై నిలబడి, పూనకంతో ఊగిపోతూ భవిష్యత్తు చెబుతది. అలాగే ప్రజలు అడిగే ప్రశ్నలకు కూడా జవాబిస్తది. వేలాదిమంది భక్తులు ఈ భవిష్యవాణి వినడానికి గుంపు కడతరు.

బోనాల సంబరాలలో చివరి అంకం ఘటం ఊరేగింపు. రంగం తర్వాత సాయంత్రం ప్రతీ ప్రాంతం నుండి వేర్వేరు ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుంది . హైదరాబాదులోని పాతబస్తీలో వీధులన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. అలంకరించిన వాహనాలపై అమ్మవారిని ఘటం రూపంలో ఉంచుతారు. ఊరేగింపుగా వెళ్తారు. ఒక్కటొక్కటిగా అన్ని ఘటాల ఊరేగింపులు కలిసిపోయి ఒక్కటిగా సాగుతాయి. ఈ ఊరేగింపులో వివిధ వేషధారణలు, పాటలు, నాట్యాలు, గుర్రాలు కూడా కోలాహలం సృష్టిస్తయి. ఈ రెండు రోజులు ఎంతో సందడిగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ జానపద గీతాలు ప్రముఖమైనవి. విన్నవారందరిని చిందులేయించే పాటలు ఎన్నో . డప్పుల దరువుతో సాగిపోయే అమ్మ బయలెల్లినాదే... ఆటపాటలతో సాగిపోయిన ఈ ఘటాలన్నింటిని నయాపుల్ లోని మూసీ నదిలో నిమజ్జనం చేయడంతో బోనాల పండగ సంబరం ముగుస్తుంది. ఇక సంవత్సరమంతా తమ పంటలను , పిల్లలను చల్లగా ఆ అమ్మ చల్లగా చూసుకుంటుంది అని నిశ్చింతగా ఇళ్లకు తిరిగి వెళతారు భక్తులు..

No comments:

Post a Comment