ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Thursday, November 18, 2010

ఫ్లోరోసిస్ భూతం


ఎ.జనార్ధన్
ఫ్లోరోసిస్ నీరు.. కన్నీరు
ఇక్కడ మనకు దీనంగా కనిపిస్తున్న ఈ అభాగ్యులను ఏ వైరస్ సోకలేదు.. జన్మతః వికలాంగులు అసలే కారు.. పోలియో వంటి మహమ్మారి వీరి జోలికే రాలేదు.. మరే మయింది..మాయా మంత్రమా.. మెలితిరిగిన అవయవాలతో... పీడకలలో మాత్రమే కనిపించే వింత రూపం వీరికి ఎలా వచ్చింది.. మన చేరువలోనే గుండె చెరువయ్యే కన్నీటి గాథ ఇది.. మంచినీరు తాగడమే నేరమైన దుస్థితి..
స్పాట్
ఇప్పుడు మనం చూసిన ఈ హృదయ విదారక దృశ్యాలు నల్లగొండ జిల్లాలో చాలా ఊర్లలో కనిపిస్తాయి.. ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి కథలే..జీవధార ప్రవహించే ఈ నేలలో వీళ్లంతా జీవశ్చవాలుగా ఎందుకు మారుతున్నారు.. మూడు తరాలుగా ముప్పుతిప్పలు పడుతూ నిత్యం మరణశయ్యపై దీనంగా బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.
స్పాట్
ఇక్కడ కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతాయి.. కమ్మనైన నీరు కాలువల గుండా పారుతుంటుంది..ఆధునిక దేవాలయానికి ఆనవాలయిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టిందీ ఇక్కడే… ఈ నీరు రాష్ర్టంలో ఎందరికో దాహార్తిని తీర్చింది.. పంట పొలాలను పొత్తిళ్లల్లో హత్తుకుంది. లక్షలాధి ఎకరాలను పచ్చగా చిగురింపజేసే మహత్తున్న జలాశయమిది..కానీ తాను పుట్టిన నేల నెర్రలు బాసి గుండె పగిలిపోతున్నా నీటిమాటున కన్నీటిని దాచుకుంది. అయిన వారి కడగళ్లను తీర్చలేక పోయింది. ఈ నీరు తమ నోరు తడపాలని ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డా కోరుకుంటారు. కానీ ఎన్ని సంవత్సరాలయినా ఆ గలగలలు కలలు గానే మిగిపొయినాయి.
స్పాట్
జీవం నిలపాల్సిన జీవజలాలే, కఠిన జలాలై కసాయిగా ప్రాణాలను తోడేస్తున్నాయి.. నేలమీద పడ్డ గడియ నుంచి నేలలో కలిసే వరకు నరకయాతన.. గాజు పెంకులయిన ఎముకలు..తోలు తిత్తి లాంటి శరీరం. ఆదమరిచినా, అదుపు తప్పినా ఇక అస్థిపంజరం పై ఆశలు వదులుకోవలసిందే.. ఎవరు చేసిన పాపం ఇది. తమ నేలకు శాపంగా మారింది. పండు వెన్నెల కురిపించే నవ్వులు మసకబారిపోతున్నాయి..రాహువు మింగిన చంద్రుడిలా చీకటి మాటున చిట్లిపోతుంది. తాము తాగే తల్లిపాలే విషమని వీరికి తెలియదు.. తమ చనుబాలలో విషపు టణువులున్నాయన్న సంగతి ఆ తల్లులకు కూడా తెలియదు..కారణం.. ఇక్కడి మట్టిలో.. మట్టిమనుషుల్లో అణువణువునా ఫ్లొరిన్ అణువులు నిండిపోయినాయి.. వీరినందరినీ చుట్టు ముట్టిన ఆ విషవ్యాధి “ఆస్టియో పోరోసిస్” . తాగేనీటిలో ఫ్లోరిన్ ఎక్కువగా ఉంటే ఈ ఎముకల వ్యాధి బారిన పడుతారు. మనం తాగే నీటిలో ఫ్లోరిన లీటర్ కు ఒక మిల్లీగ్రాం కంటే తక్కువే ఉండాలని ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెబుతోంది. కానీ ఇక్కడ ప్రజలు తాగే నీటిలో లీటర్ కు 15 మిల్లీ గ్రాముల ఫ్లోరిన్ ఉంటుందంటే వీరు తాగేది మంచి నీరా లేక విషరసాయనమా అనే అనుమానం కలుగుతుంది.